You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఊబకాయం సమస్యను ఐదేళ్ల వయసులోనే గుర్తించవచ్చా? 50 లక్షల మంది జన్యు విశ్లేషణలో ఏం తేలిందంటే..
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మీరు పెద్దయ్యాక ఊబకాయం బారిన పడతారా? అంటే ఎవరూ సరైన సమాధానం చెప్పలేరు.
కానీ, అలా తెలుసుకోవడం సులభమేనని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. చిన్నతనంలో చేసే కొన్ని జన్యు పరీక్షలతో ఈ ముప్పును ముందుగానే గ్రహించవచ్చని అంటున్నారు.
అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఊబకాయంతో ఇతర వ్యాధులు
ఊబకాయం అనేది ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారుతోంది.
పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు... అన్ని వయసులవారూ ఊబకాయం బారిన పడుతున్నారు.
ఊబకాయం దీర్ఘకాలంలో మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, ఎముకల పటుత్వం తగ్గడం, సంతానోత్పత్తి సమస్యలు, క్యాన్సర్ వంటి రోగాలకు దారి తీస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
''ఊబకాయం వల్ల దీర్ఘకాలంలో నాన్ కమ్యూనికబుల్ (సంక్రమణేతర) వ్యాధులకు దారితీసే వీలుందని గత అధ్యయనాల్లో తేలింది'' అని హైదరాబాద్‌లోని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ గిరిరాజ్ రతన్ చందక్ చెప్పారు.
ప్రపంచ ఊబకాయ సమాఖ్య అంచనా మేరకు 2035 నాటికి ప్రపంచంలో 51 శాతం అధిక బరువుతో బాధపడుతుంటారని అంచనా.
ఈ నేపథ్యంలో, ఊబకాయంపై ముందే అవగాహన వస్తే, జీవనశైలి మార్పులతో ఈ ముప్పును అధిగమించవచ్చనేది శాస్త్రవేత్తల అభిప్రాయం.
500 సంస్థలు.. 600 మంది పరిశోధకులు..
అంతర్జాతీయంగా 500 సంస్థలకు చెందిన 600 మంది పరిశోధకులు ఒకే గొడుగు కిందకు వచ్చి వివిధ దేశాలలోని వ్యక్తుల జన్యు సంబంధ విశ్లేషణ చేశారు.
ఈ విశ్లేషణకు జెయింట్ (జెనిటిక్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అంత్రోపోమెట్రిక్ ట్రైట్స్) కన్సార్షియం, డీఎన్ఏ టెస్టింగ్ సంస్థ నుంచి సమాచారం తీసుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మందికి సంబంధించిన జన్యు నమూనాలను విశ్లేషించారు. ఇందులో భారతీయులు కూడా ఉన్నారు.
ఈ పరిశోధనలో సీసీఎంబీ నుంచి డాక్టర్ గిరిరాజ్ రతన్ చందక్ బృందం భాగస్వామ్యమైంది.
భారత్ నుంచి 2700 నమూనాలు విశ్లేషించామని రతన్ చందక్ చెప్పారు. మొత్తం 15 ఏళ్లపాటు ఈ అధ్యయనం కొనసాగిందని ఆయన వివరించారు.
పాలీజెనిక్ రిస్క్ స్కోర్ కీలకం
జన్యు విశ్లేషణలో వివిధ రకాల జెనెటిక్ వేరియంట్లపై అధ్యయనం చేశారు. బాడీ మాస్ ఇండెక్స్ పరంగా జీనోమ్ వైడ్ అసోసియేషన్ స్టడీ (గ్వాస్) నిర్వహించారు.
దీని ఆధారంగా 'పాలిజెనిక్ రిస్క్ స్కోర్' (పీఆర్ఎస్) తయారు చేశారు. ఈ పాలిజెనిక్ రిస్క్ స్కోర్ ఆధారంగా పెద్ద వయసులో వచ్చే ఊబకాయం ముప్పును చిన్న వయసులోనే గుర్తించే వీలుంటుందని చెబుతున్నారు.
పెద్దయ్యాక ఆ వ్యక్తి ఊబకాయం బారిన పడతారా లేదా.. అన్నది చిన్న వయసులో ఉన్నప్పుడే పాలిజెనిక్ రిస్క్ స్కోర్ ఆధారంగా తెలుసుకునేందుకు వీలవుతుందని డెన్మార్క్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగెన్ ఎన్ఎన్ఎఫ్ సెంటర్ ఫర్ బేసిక్ మెటబాలిక్ రీసర్చ్ (సీబీఎంఆర్) అసిస్టెంట్ ప్రొఫెసర్ రౌలఫ్ స్మిత్ చెప్పారు.
''పాలీ జెనిక్ రిస్క్ స్కోర్ టెస్ట్ సాయంతో ఐదేళ్ల వయసుకే ఊబకాయం ముప్పు అంచనా వేయవచ్చు'' అని స్మిత్ అన్నారు.
ఈ పరిశోధన ఫలితాలు నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
అయితే, ఊబకాయం అనేది యూరప్ దేశాలతో పోల్చితే భారత్‌లో భిన్నంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
''యూరప్ దేశాల్లో ఊబకాయం శరీరమంతా కనిపిస్తుంది. భారత్‌లో సెంట్రల్ ఒబేసిటీ (పొట్ట భాగంలో ఊబకాయం) ఎక్కువగా కనిపిస్తుంటుంది'' అని గిరిరాజ్ రతన్ చందక్ బీబీసీతో చెప్పారు.
'జన్యువుల్లో యూరోపియన్లకు, భారతీయులకు మధ్య తేడా'
ఊబకాయానికి కారణమవుతున్న జన్యు వేరియంట్లు యూరోపియన్ జనాభాలోను, భారతీయులలోను వేరుగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.
''ఇందుకు వేర్వేరు కారణాలు ఉండొచ్చు. జీవనశైలి, పర్యావరణ ప్రభావంతో జన్యువుల్లో మార్పులు వచ్చి ఉండవచ్చు'' అని చందక్ చెప్పారు.
ఊబకాయాన్ని అంచనా వేయడానికి పాలిజెనిక్ రిస్క్ స్కోర్ గతంలోనూ ఉన్నప్పటికీ, తాజాగా చేపట్టిన అధ్యయనంలో మరింత మెరుగైన ఫలితాలు వచ్చాయని అంటున్నారు శాస్త్రవేత్తలు.
భారతీయులకు పీఆర్ఎస్ అభివృద్ధి చేయడానికి ఊబకాయం అనుబంధ జన్యుమార్పులు గుర్తించామని చెప్పారు.
భారత్‌తో పాటు దక్షిణాసియా ప్రజలకు ఒకే రకమైన పీఆర్ఎస్ తయారు చేయడానికి ఈ డేటా ఉపయోగపడిందని చెప్పారు చందక్.
ఎవరైనా గుర్తించవచ్చా?
ఊబకాయం ముప్పును యుక్త వయసులోనే నియంత్రించవచ్చని హైదరాబాద్‌కు చెందిన వైద్యుడు డాక్టర్ బి.సుజీత్ కుమార్ బీబీసీతో చెప్పారు.
''యుక్త వయసులో జీవన శైలి మార్పులు చేయడం ద్వారా ఊబకాయం ముప్పును అధిగమించే వీలుంది. ఆహారపు అలవాట్లు, సమయానికి తినడం, మద్యానికి దూరంగా ఉండటం, అధిక కొవ్వు పదార్థాలు కలిగిన ఆహారానికి దూరంగా ఉండడం ద్వారా సమస్యను చాలావరకు అధిగమించవచ్చు'' అని చెప్పారు.
జీవనశైలిలో మళ్లీ మార్పులు చేస్తే తిరిగి ఊబకాయం బారినపడే అవకాశం ఉందని సీసీఎంబీ శాస్త్రవేత్త చందక్ తెలిపారు.
''బరువు తగ్గడానికి జీవనశైలి మార్పులు చేసుకుని, తర్వాత వాటిని నిలిపివేస్తే వెంటనే బరువు పెరిగే అవకాశముంది'' అని చెప్పారు.
పాలిజెనిక్ రిస్క్ స్కోర్ ఆధారంగా ఎవరైనా ఊబకాయం ముప్పును ముందుగానే గుర్తించే వీలుంటుందా? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు చందక్.
''ఇది ప్రయోగాత్మకంగా జరిగిన అధ్యయనం. మా అధ్యయన ఫలితాలపై మరింత విశ్లేషణ జరగాల్సి ఉంది. ముఖ్యంగా భారతీయుల విషయంలో మరింత అధ్యయనం అవసరం.
పాలీజెనిక్ రిస్క్ స్కోర్ సాయంతో సాధారణ ప్రజలు కూడా ఊబకాయం ముప్పు తెలుసుకోవడానికి మరికొంత సమయం పడుతుంది. సాధారణ ప్రజలు కూడా ఈ రిస్క్ స్కోర్ తెలుసుకోవడానికి మరో ఆరు నెలల సమయం పట్టవచ్చు'' అని ఆయన వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)