మహువా మొయిత్ర: ‘‘ఇప్పుడు చెప్పండి.. ‘పప్పూ’ ఎవరు?’’

వీడియో క్యాప్షన్, ‘పప్పు’ ఎవరో ఇప్పుడు తెలుస్తోంది: మహువా మొయిత్ర
మహువా మొయిత్ర: ‘‘ఇప్పుడు చెప్పండి.. ‘పప్పూ’ ఎవరు?’’

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి అంశాలపై ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. తన ప్రసంగంలో ‘పప్పూ’ అనే మాటపై ఫోకస్ చేశారు. మాటల దాడి చేశారు.

‘‘ప్రభుత్వం ప్రతి ఏటా ఫిబ్రవరిలో దేశ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. మనది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని చెబుతోంది. అందరికీ ఉద్యోగాలు, గ్యాస్ సిలిండర్లు, విద్యుత్, పక్కా ఇళ్లు లభిస్తున్నాయని అంటోంది. ఈ అబద్ధాలు 8-10 నెలల వరకు నడుస్తాయి. తర్వాత నిజాలు వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు మనం డిసెంబర్‌లో ఉన్నాం. ప్రభుత్వం ఏమో తమకు బడ్జెట్ అంచనాల కంటే 3.26 లక్షల కోట్ల అదనపు నిధులు కావాలని చెబుతోంది. ప్రభుత్వం, అధికార పార్టీ ‘పప్పూ’ అనే పదాన్ని జోరుగా వాడుతోంది. అసమర్థతను సూచించడానికి, వారిని అవమానించడానికి దానిని ఉపయోగిస్తున్నాయి. అసలు ‘పప్పూ’ ఎవరని గణాంకాలు చెబుతున్నాయో వివరించడానికి నాకు కాస్త సమయం ఇవ్వండి’’ అని మహువా మొయిత్రా పేర్కొన్నారు.

మహువా మొయిత్ర

ఫొటో సోర్స్, Sansad TV Screen Grab

‘‘దేశ పారిశ్రామిక ఉత్పత్తి అక్టోబర్‌లో నాలుగు శాతం తగ్గి 26 నెలల కనిష్టానికి పడిపోయినట్లు ఎన్ఎస్ఓ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటికీ ఉద్యోగాలు సృష్టించే అతిపెద్ద రంగం తయారీ రంగం. ఇది 5.6 శాతానికి కుదించుకుపోయింది. పారిశ్రామిక ఉత్పత్తి ఇండెక్స్‌లో ఉండే 17 పారిశ్రామిక రంగాలు ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేశాయి. ఫారెక్స్ నిల్వలు ఏడాదిలోపే 72 బిలియన్ డాలర్లు తగ్గిపోయాయి’’ అని ఆమె వివరించారు.

‘‘వృద్ధి చెందుతున్న మార్కెట్లలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 50 శాతం భారత్‌లోకే వస్తున్నాయని ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్థికమంత్రి చెప్పారు. అద్భుతం. కానీ దాదాపు రెండు లక్షల మంది అంటే లక్షా 83,741 మంది భారత పౌరసత్వన్ని వదులుకున్నారని ఇదే సభలో గత శుక్రవారం విదేశాంగ సహాయ మంత్రి చెప్పారు. 2022 మొదటి పది నెలల్లోనే ఇంత మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2014 నుంచి గత 9 ఏళ్లలో ఈ ప్రభుత్వ హయాంలో భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్య 12.5 లక్షలకు చేరింది. ఈ ఏడాది ఇప్పటికే ఎప్పుడూ ఎప్పుడూలేనంత మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. పోర్చుగల్, గ్రీస్ పౌరసత్వాన్ని పొందడానికి అధిక ఆదాయం ఉన్న భారతీయులు పది లక్షల డాలర్లు చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది ఆరోగ్యకరమైన ఆర్థిక వాతావరణాన్ని చూపిస్తోందా? ఆరోగ్యకరమైన టాక్స్ వాతావరణాన్ని చూపిస్తోందా? ఇప్పుడు పప్పూ ఎవరు?’’ అని ఆమె ప్రశ్నించారు.

వీడియో క్యాప్షన్, కరెన్సీ నోట్లపై దేవతల బొమ్మలు ముద్రిస్తారా?

‘‘అధికార పార్టీ సభ్యులు అసలు డేటాతో సంబంధం లేకుండా నోట్ల రద్దు ప్రయోజనాల గురించి అబద్ధాలు చెబుతూ వస్తున్నారు. క్యాష్‌లెస్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలను అందుకోలేదు. ఆ ప్రకటన చేసి ఆరేళ్లవుతున్నా నకిలీ కరెన్సీ లేకుండా చేస్తామనే లక్ష్యాన్ని అందుకోలేదు. 2016 నవంబర్లో నోట్ల చలామణి 18 లక్షల కోట్లు ఉంటే, ఇప్పుడు 2022 నవంబర్లో 32 లక్షల కోట్లు చెలామణి ఉంది. కరెన్సీ చలామణి రెట్టింపు అయింది. ఈ దీపావళికి ఎంటీఎంలలో క్యాష్ ఇండెక్స్ అత్యంత దిగువ స్థాయిలో ఉందని క్యాష్ మేనేజ్‌మెంట్ కంపెనీ సీఎంఎస్ఎస్ చెప్పింది. ఇప్పటికీ క్యాషే కింగ్. నోట్ల రద్దు ఈ మూడింటిలో ఏ లక్ష్యాన్నీ అందుకోలేదు. చెప్పండి పప్పూ ఎవరు?’’ అని ఎద్దేవా చేశారు.

‘‘ఆర్థిక వ్యవస్థను నియంత్రించాలని ఈ ప్రభుత్వాన్ని, ఆర్థిక మంత్రిని కోరుతున్నాను. ఈ దేశం పగ్గాలను ఎవరికి అప్పగించారో ఆలోచించాలని ఈ దేశ ప్రజలను కోరుతున్నాను. ఇళ్లు ఎవరు తగలబెట్టారనేది కాదు ప్రశ్న. పిచ్చివాడి చేతికి అగ్గిపెట్టె ఎవరిచ్చారనేదే అసలు ప్రశ్న. దేశానికి సమాధానం అవసరమైన ప్రశ్న ఇదే’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)