You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తమిళనాడు: రోజుకు 12 గంటల పని, వారానికి మూడు రోజులు సెలవులు... ఈ కొత్త చట్టాన్ని కొందరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తమిళనాడులో ప్రైవేట్ కంపెనీల్లో కార్మికుల పనివేళలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచుతూ చేసిన చట్ట సవరణను శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. తీవ్ర నిరసనల మధ్య ఈ సవరణ ఆమోదం పొందింది.
అయితే, దీని వలన కార్మికుల పరిస్థితి మరింత దిగజారుతుందని డీఎంకే మిత్రపక్షాలు భావిస్తున్నాయి.
కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ, ఎండీఎంకే, వీసీకే వంటి పార్టీలు నిరసన తెలిపాయి. కానీ, మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది.
కొత్త సవరణలో ఏముంది?
ఈ చట్టం పేరు 'ఫ్యాక్టరీల (తమిళనాడు సవరణ) చట్టం, 2023'.
కేంద్ర ప్రభుత్వ 'ఫ్యాక్టరీల చట్టం, 1948' ఆధారంగా దీన్ని రూపొందించారు.
1948 చట్టంలో 'సెక్షన్ 65-ఏ' సవరణను తమిళనాడు ప్రభుత్వం కొత్తగా జోడించింది.
సెక్షన్ 65-ఏ ప్రకారం, ప్రత్యేక సందర్భాలలో 1948 చట్టంలోని నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి ఉంటుంది.
దీనిని అనుసరించి, 1948 చట్టంలోని సెక్షన్లు 51, 52, 54, 56, 59లలో కొన్ని లేదా అన్ని నిబంధనల నుంచి రాష్ట్రం మినహాయింపు ఇవ్వగలదు.
పై విభాగాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
సెక్షన్ 51 కార్మికుల పని గంటలను నిర్వచిస్తుంది. ఒక వారంలో ఏ ఉద్యోగీ 48 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు.
సెక్షన్ 52 వారంలో ఇవ్వాల్సిన సెలవును నిర్వచిస్తుంది. ప్రతి ఉద్యోగికి వారానికి ఒకరోజు సెలవు కచ్చితంగా ఇవ్వాలి.
సెక్షన్ 54 ప్రకారం, ఏ ఉద్యోగి కూడా రోజులో 9 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు.
సెక్షన్ 56 ప్రకారం, పని గంటలు ఒక రోజులో పదిన్నర గంటలకు మించరాదు. విరామ సమయం కలుపుకుని పదిన్నర గంటలు దాటకూడదు.
సెక్షన్ 59 ప్రకారం, ఒక ఉద్యోగి రోజుకు తొమ్మిది గంటల కంటే ఎక్కువ పని చేస్తే, పనిచేసిన ప్రతి గంటకు రెట్టింపు వేతనం చెల్లించాలి.
ఈ నిబంధనల నుంచి పరిశ్రమలను మినహాయించే అధికారం రాష్ట్రానికి ఇస్తుంది సెక్షన్ 65-ఏ.
ప్రభుత్వం ఏం చెబుతోంది?
ఈ బిల్లుపై తమిళనాడు శాసనసభలో విపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కార్మిక సంక్షేమ శాఖ మంత్రి గణేశన్, పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసు అసెంబ్లీ ఆవరణలో మీడియాతో సమావేశమయ్యారు.
కార్మిక సంక్షేమ శాఖ మంత్రి గణేశన్ మాట్లాడుతూ, ఫ్యాక్టరీ, కార్మికులు ఒప్పుకుంటేనే ఈ సవరణ వర్తిస్తుందని అన్నారు.
"ఆర్టికల్ 65-ఏ ప్రకారం, కంపెనీలు లేదా ఫ్యాక్టరీలు కార్మికుల సమ్మతితో మాత్రమే దీన్ని అమలు చేయగలవు. వారానికి 48 పని గంటలు మాత్రమే ఉంటాయి. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఫ్యాక్టరీలు 12 గంటల పని వేళలను అమలు చేయాలనుకుంటే, అందుకు తగ్గ ఏర్పాట్లు, భద్రత ఉందో లేదో తనిఖీ చేశాక మాత్రమే ప్రభుత్వం అనుమతిస్తుంది. కార్మికుల సమ్మతి ముఖ్యం" అని గణేశన్ వివరించారు.
తంగం తెన్నరసు మాట్లాడుతూ, తమిళనాడులో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలు పని వేళల్లో వెసులుబాటును ఆశిస్తున్నాయన్నారు.
"తమిళనాడుకు వచ్చే కంపెనీలు పని వేళల్లో సౌలభ్యాన్ని ఆశిస్తున్నాయి. ఈ వెసులుబాటు కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది. కానీ, నిబంధనలు అన్ని కంపెనీలకు వర్తించవు. కొన్నిటికి మాత్రమే వర్తిస్తాయి. ఎలక్ట్రానిక్స్ సెక్టార్, నాన్-లెదర్ ఫుట్‌వేర్ ఫ్యాక్టరీలు, ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీ ఫ్యాక్టరీలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు మొదలైన వాటిలో పని చేసేవారు తమ పని వాతావరణానికి అనుగుణంగా దీన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకోవచ్చు" అని ఆయన అన్నారు.
అంతే కాదు, ఈ సవరణతో వారం రోజుల పనివేళల్లో ఎలాంటి మార్పు ఉండదని, ఈ బిల్లు ప్రకారం ఉద్యోగులు వారంలో నాలుగు రోజుల పాటు రోజుకు 12 గంటలు పనిచేసి, 3 రోజులు విశ్రాంతి తీసుకోవచ్చని తంగం తెన్నరసు వివరించారు.
ఏ పరిశ్రమలకు బిల్లు వర్తిస్తుందో నిబంధనలను రూపొందించి ప్రచురిస్తామని చెప్పారు. అంతే కాకుండా, ఒక ఉద్యోగి 12 గంటలు పనిచేస్తే అందుకు తగిన సౌకర్యాలు ఉన్నాయో లేదో పరిశీలించిన తరువాత మాత్రమే ఈ అనుమతి ఇస్తామని తెలిపారు.
కొత్త సవరణపై వ్యతిరేకత ఎందుకు?
ప్రతిపక్షాలన్నీ ఈ సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది శ్రమ దోపిడీని ప్రోత్సహిస్తోందని, జీతం కోసం ఎక్కువ గంటలు పని చేసే మనస్తత్వాన్ని సృష్టించడం మానవ హక్కులకు, సంక్షేమానికి విరుద్ధమని ద్రవిడర్ కళగం అధ్యక్షుడు కె. వీరమణి అన్నారు.
వామపక్ష పార్టీలు కూడా దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి.
"2020లో అప్పటి ఏడీఎంకే ప్రభుత్వం పని గంటలను పెంచడానికి ప్రయత్నించినప్పుడు, డీఎంకే దానిని తీవ్రంగా వ్యతిరేకించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో పని వేళలను 12 గంటలకు పెంచడాన్ని డీఎంకే ప్రభుత్వం నిరసించింది. ఇప్పుడెలా ఈ బిల్ పాస్ చేయగలదు? ఇది శ్రమ దోపిడీకి దారి తీస్తుంది. సాంకేతికత అభివృద్ధి చెందుతున్నందున పని గంటలను క్రమంగా తగ్గించాలి. ఈ చట్ట సవరణ కార్మికుల సంక్షేమానికి విరుద్ధం. చట్టపరమైన నిబంధనలకు విరుద్ధం. తమిళనాడు ప్రభుత్వం వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి" అంటూ మార్క్సిస్ట్ కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.
కరుణానిధి ఇష్టానికి వ్యతిరేకంగా డీఎంకే వ్యవహరిస్తోందా?
కరుణానిధి బతికి ఉన్నప్పుడు, డీఎంకే అధ్యక్షుడిగా వ్యవహరించినప్పుడు కార్మికుల పని వేళలను 8 గంటల నుంచి 6 గంటలకు కుదించాలని ఆసపడ్డారని, ప్రస్తుత డీఎంకే ఆయన ఇష్టానికి విరుద్ధంగా పని చేస్తోందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సౌందరరాజన్ ఆరోపించారు.
"డీఎంకే అధినేత కరుణానిధి పని గంటలను 8 నుంచి 6కు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆయన మే డే నినాదంలో ఈ డిమాండ్ ఉండేది. 20 ఏళ్లుగా ఈ డిమాండ్ మనుగడలో ఉంది. 8 గంటలను 6 గంటలకు తగ్గించకపోయినా ఫరవాలేదు, పెంచడం ఎలా కరక్ట్?" అని ఆయన ప్రశ్నించారు.
"పాశ్చాత్య దేశాలు వారానికి 48 గంటల సమయాన్ని 36, 35కి తగ్గిస్తున్నాయి. మనం వెనక్కి నడుస్తున్నాం. తమిళనాడులో స్టేట్ లేబర్ అడ్వైజరీ బోర్డు ఉంది. ఇందులో ట్రేడ్ యూనియన్లు, యజమానుల సంఘాలు, అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో కూడా ప్రభుత్వం చట్ట సవరణపై చర్చించలేదు. ఈ సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో తీవ్ర నిరసనలు తెలుపుతాం" అని ఆయన బీబీసీతో అన్నారు.
12 గంటల పని ప్రభావాలు ఎలా ఉంటాయి?
ఇప్పటికే కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, 12 గంటల పాటు పని చేసేందుకు అనుమతిస్తే పరిస్థితి మరింత దిగజారుతుందని అసంఘటిత కార్మికుల సంఘానికి చెందిన గీతా రామకృష్ణన్ అన్నారు.
"ఇది చాలా చెడ్డ సవరణ. ఇప్పటికే తమిళనాడులో బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు రోజుకు 12 గంటలు పని చేస్తున్నారు. తిరుపూర్‌లోని రెడీమేడ్ గార్మెంట్ ఫ్యాక్టరీలు, నిట్‌వేర్ ఫ్యాక్టరీలలో 12-14 గంటలు పని చేస్తున్నారు. ఇప్పుడు ఈ చట్టం వస్తే వారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుంది" అని గీత ఆన్నారు.
ఐరోపా దేశాల్లో ఎనిమిది గంటల పనికి బదులు ఆరు గంటల పని అమలు చేయాలని చర్చిస్తుంటే, తమిళనాడులో దానికి వ్యతిరేక దిశలో చట్టాలు చేస్తూ వెనక్కు నడుస్తున్నారని గీత ఆరోపించారు.
నాలుగు రోజులు 12 గంటలు పని చేయడానికి, 3 రోజులు సెలవు తీసుకోవడానికి ఏ ఫ్యాక్టరీ అనుమతించదు. కార్మిక యూనియన్లు బలంగా లేకపోతే, వారి పరిస్థితి మరింత దిగజారుతుందని ఆమె అన్నారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించినప్పుడు, దేశం నలు మూలల నుంచి వివిధ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దాంతో కేంద్రం నిర్ణయాన్ని రాష్టాలకు విడిచిపెట్టింది.
2020 మే లో, ఉత్తరప్రదేశ్‌లో చట్టాన్ని సవరించినప్పుడు, దానిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దాంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం సవరణ చట్టాన్ని ఉపసంహరించుకుంది.
కిందటి సంవత్సరం ఇదే తరహాలో కర్ణాటకలో కార్మిక సంక్షేమ చట్టాన్ని సవరించారు. రెండు సెల్‌ఫోన్ తయారీ కంపెనీల కోసమే ఈ చట్టాన్ని సవరించామని ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో బాహాటంగానే చెప్పింది.
తమిళనాడు విషయానికొస్తే, ఏ పరిశ్రమల కోసం ఈ చట్టాన్ని సవరించారో చెప్పలేదు.
"ఇలాంటి సవరణ తెచ్చే ముందు యూనియన్లతో చర్చించాలి కదా. కార్మికులతో మాట్లాడకుండా, ఫ్యాక్టరీలు కోరుతున్నాయి కాబట్టి సవరణ తీసుకొస్తారా?" అని గీత ప్రశ్నించారు.
రోజుకు 12 గంటల పని కొత్త సమస్యలను తెచ్చిపెడుతుందని సైకియాట్రిస్ట్ శివపాలన్ అంటున్నారు.
"కరోనా వ్యాప్తి తరువాత మానసిక ఆరోగ్య సమస్యలు పెరిగాయి. ప్రధాన కారణం, ఇంటి నుంచి పని చేయడం. చాలా మంది ఇంటి నుంచి పని చేయడం మేలని భావిస్తారు. కానీ, అలా చేసేటప్పుడు సమయ పాలన ఉండదు. పొద్దున్న 9 గంటలకు పని ప్రారంభిస్తే, రాత్రి 10-11 గంటల వరకు పని ఉంటుంది. ఇది ఒత్తిడికి ప్రధాన కారణం. గత కొన్నేళ్లుగా, వ్యక్తిగత జీవితం, అఫీసు పని మధ్య సమతుల్యతను సాధించలేకపోవడం వల్ల మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఐటీ ఉద్యోగుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.
కొత్తగా ఐటీ కంపెనీల్లో లేదా పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో చేరినవారికి ఎన్నో ఆర్థిక కలలు ఉంటాయి. అందువలన, వారు ఎక్కువ గంటలు పని చేయడానికి కూడా వెనుకాడరు. అదే అనేక సమస్యలకు దారి తీస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లలను సరిగ్గా పెంచలేకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం పని గంటలను నియంత్రించాలి. ఇలా పెంచితే ఉత్పాదకత, పని సామర్థ్యంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి" అని శివబాలన్ చెప్పారు.
మహిళలపై భారం పెరుగుతుంది
పని గంటలు పెరగడం వల్ల మహిళలపై మరింత భారం పడుతుందని శివబాలన్ అంటున్నారు. ఇంటి పని, ఆఫీస్ పని రెండూ చూసుకుంటూ.. వారి పరిస్థితి మరింత దిగజారుతుందని అన్నారు.
కాగా, పరిశ్రమలలో పని గంటలు పెంచడం, వారాంతం సెలవులు పెంచడం అనే ధోరణి ప్రపంచమంతటా వ్యాపిస్తోంది.
నాలుగు రోజులు పని చేస్తే, మిగిలిన మూడు రోజులు ఫ్యాక్టరీని నడపకుండా విద్యుత్ ఆదా చేయవచ్చని, వాహనాల వినియోగాన్ని తగ్గించవచ్చని, పర్యావరణాన్ని మెరుగుపరచవచ్చని చెబుతున్నారు.
ముఖ్యంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెట్టుబడులు పెట్టే ఎలక్ట్రానిక్ కంపెనీలు, పాదరక్షల కంపెనీలు దీనిని ముందస్తు షరతుగా ప్రస్తావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు కార్మిక సంక్షేమ చట్టాన్ని సవరించడం విమర్శలకు దారితీస్తోంది.
ఇవి కూడా చదవండి:
- కర్నాటకలో ముస్లిం డ్రైవర్‌ను కొట్టి చంపిన ఘటనపై వేడెక్కిన ఎన్నికల రాజకీయాలు
- భగత్ సింగ్ భార్యలాగా నటించి బ్రిటీషర్ల నుంచి ఆయన్ను తప్పించిన దుర్గావతీ దేవి ఎవరు?
- ధోలావీరా: 3,000 ఏళ్ల కిందట ఈ నగరం, ఇక్కడి సముద్రం ఎలా మాయమయ్యాయి?
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు నిధులు ఇవ్వడంలో కేంద్రం వివక్ష చూపిస్తోందా?
- ఆవు, గేదె పాలే తాగాలా? గాడిద, గుర్రం, ఒంటె పాలకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది? బీపీ, డయాబెటిస్, ఆటిజం తగ్గించే పాలు ఉంటాయా