పహల్గాం దాడి : ‘హార్ట్ ప్రాబ్లం కారణంగా ఎక్కువ దూరం పరుగెత్తలేక కాల్పులకు బలయ్యారు’.. జమ్మూ కశ్మీర్‌లో విశాఖవాసి మృతి

ఫొటో సోర్స్, TDP
- రచయిత, లక్కోజు శ్రీనివాస్, తులసిప్రసాద్ నంగా
- హోదా, బీబీసీ కోసం
జమ్మూ కశ్మీర్ కాల్పుల ఘటనలో ఇద్దరు తెలుగువారు చనిపోయారు. వారిలో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్‌రావు ఒకరు. మరొకరు విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి జేఎస్ చంద్రమౌళి.
విశాఖకు చెందిన జేఎస్ చంద్రమౌళి స్టేట్ బ్యాంక్‌లో పనిచేశారు. చంద్రమౌళి స్వస్థలం పార్వతీపురం. ఆయనకు ఇద్దరు కూతుళ్లున్నారు. వారిద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు.
ఇటీవల ఆయన కూతుళ్లిద్దరూ అమెరికా నుంచి వచ్చి తల్లిదండ్రులతో కొన్నిరోజులు గడిపి తిరిగి వెళ్లిపోయారు.
పిల్లలు వెళ్లిపోయిన కొద్ది రోజులకే చంద్రమౌళి టూర్ ప్లాన్ చేసుకున్నారని.. అయితే కశ్మీర్ వెళ్తున్నట్లు తమకు చెప్పలేదని అపార్ట్‌మెంట్ సెక్రటరీ రవికుమార్ ‘బీబీసీ’తో చెప్పారు.
చంద్రమౌళి దంపతులు మరో రెండు కుటుంబాలతో కలిసి ఏప్రిల్ 18న కశ్మీర్ వెళ్లారని ఆయన తోడల్లుడు కుమార్ రాజా చెప్పారు.
శ్రీనగర్‌లో ఉంటూ రోజుకో ప్రాంతంలో పర్యటిస్తున్నారని, ఆ క్రమంలో ఏప్రిల్ 22న పహల్గాం వెళ్లారని తెలిపారు.
‘‘మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో వారంతా పహల్గాం వెళ్లారు. పహల్గాం వెళ్లిన తరువాత చంద్రమౌళి ఫ్రెష్ అవ్వడానికి వాష్‌రూంకి వెళ్లారు. వాష్‌రూం నుంచి బయటకు రాగానే కాల్పులు మొదలయ్యాయి. తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ... వెంటాడి మరీ కాల్పులు జరిపారు. ఆయనతోపాటు ఉన్న మిగిలిన ఐదుగురు పారిపోయి తప్పించుకోగా... హార్ట్ ప్రాబ్లం కారణంగా ఆయన ఎక్కువదూరం పరిగెత్తలేకపోయారు. చంద్రమౌళిని కాల్చిచంపారు’’ అని కుమార్ రాజా చెప్పారు.
"కశ్మీర్‌లో దాడి జరిగిన తర్వాత రాత్రి ఒంటి గంట సమయం వరకు మా తోడల్లుడు మిస్సయ్యారనే అనుకున్నాం. కానీ ఆయన్ను కాల్చి చంపేశారని ఆ తర్వాతే తెలిసింది" అని కుమార్ రాజా చెప్పారు.


టూర్ అని చెప్పారే కానీ...
చంద్రమౌళి ఎస్బీఐలో ఉన్నతాధికారిగా పని చేసి రిటైరయ్యారు. అనంతరం విశాఖ బీచ్ రోడ్డులోనే నివాసముంటున్నారు. ప్రస్తుతం బ్యాంక్ యూనియన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని ఆయన బంధువులు చెప్పారు.
ఆయనకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు కూడా వివాహితులే. అమెరికాలో స్థిరపడ్డారు.
ఇటీవలే వాళ్లు కూడా వచ్చి వెళ్లారు. వాళ్లు వెళ్లిన తర్వాత చంద్రమౌళి టూర్ ప్లాన్ చేసుకున్నారు. అయితే ఆయన ఎక్కిడికి వెళ్లినా టూర్ అని చెప్పారే కానీ ఫలానా ప్రదేశానికి అని చెప్పరని ఆయన నివాసముంటున్న అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ సుధాకర్, ఆపార్ట్మెంట్ సెక్రటరీ, చంద్రమౌళి స్నేహితుడైన రవికుమార్ చెప్పారు.
"నేను పార్వతీపురం వెళ్తున్నారని అనుకున్నాను. కశ్మీర్ అని నాకు తెలియదు. వార్తల్లో చూసిన తర్వాతే తెలిసింది" అని రవి కుమార్ చెప్పారు.

ఫొటో సోర్స్, Chandramouli family
చంద్రబాబు నివాళి
చంద్రమౌళి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. బుధవారం రాత్రి 10 గంటలకు మృతదేహాన్ని విశాఖకు తీసుకువచ్చారు. తరువాత విమానాశ్రయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చంద్రమౌళి భౌతికకాయానికి నివాళులర్పించారు.
ఇక చంద్రమౌళి కుమార్తెలు అమెరికా నుంచి గురువారం (24.04.25) సాయంత్రానికి విశాఖకు చేరుకున్నాక అంత్యక్రియలు నిర్వహిస్తామని చంద్రమౌళి తోడల్లుడు కుమార్ రాజా చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
కాల్పులకు బలైన కావలి యువకుడు
కావలికి చెందిన మధుసూదన్ రావు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు భార్య కామాక్షి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కూతురు మేధ ఇంటర్ చదువుతుండగా, కొడుకు దత్తు ఎనిమిదో తరగతి చదువుతున్నారు.
భార్యాపిల్లలతో కలిసి మధుసూదన్‌రావు కశ్మీర్ పర్యటనకు వెళ్లారు.
పహల్గాం కాల్పుల్లో మధుసూదన్‌రావు చనిపోయారని తెలిసి ఆయన స్వస్థలం కావలిలో విషాదం నెలకొంది.
మధుసూదన్‌రావు తల్లిదండ్రులు 80 ఏళ్లు పైబడిన వృద్ధులు. కావలిలో అరటిపళ్ల వ్యాపారం చేస్తుంటారు.
ఆయన తండ్రికి ఇటీవలే హార్ట్ ఆపరేషన్ అయింది. వారితో మాట్లాడానికి పోలీసులు మీడియాని అనుమతించడంలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














