You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
200 ఏళ్ల నాటి హెరిటేజ్ బిల్డింగ్ పునరుద్ధరణ, ఈ భవనం మీకు తెలుసా?
- రచయిత, చెరిలాన్ మోలాన్
- హోదా, బీబీసీ న్యూస్
హైదరాబాద్‌లో 200 ఏళ్ల నాటి పురాతన వారసత్వ భవనాన్ని పునరుద్ధరించారు. 20 ఏళ్ల పాటు సాగిన ఒక ప్రతిష్టాత్మక పునరుద్ధరణ ప్రాజెక్ట్ ద్వారా సాధ్యమైంది.
హైదరాబాద్‌లోని తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం (కోఠి మహిళా కాలేజి) పునరుద్ధరణ పనులు ఈ నెలలో పూర్తయ్యాయి.
ఈ భవనం ఒకప్పుడు కల్నల్ జేమ్స్ అకిలెస్ కిర్క్‌ప్యాట్రిక్ నివాసంగా ఉండేది. 1797-1805 కాలంలో హైదరాబాద్ కోర్టులో కల్నల్ జేమ్స్, బ్రిటిష్ ప్రతినిధిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన నివాసాన్ని యూనివర్సిటీగా మార్చారు.
ఏళ్ల తరబడి నిర్వహణ లేమి, సరిగా మరమ్మతులు చేయకపోవడం, భవనంలో రాకపోకలు అధికం కావడంతో ఇది శిథిలావస్థకు చేరింది.
2002లో ప్రపంచ స్మారక భవనాల నిధి (డబ్ల్యూఎంఎఫ్) జాబితాలో ఈ భవనం కూడా కూడా చేర్చింది. దీని పునరుద్ధరణ కోసం ‘20 ఏళ్ల ప్రాజెక్టు’ను ప్రారంభించింది.
డబ్ల్యూఎంఎఫ్ అనేది లాభాపేక్ష లేని సంస్థ. రక్షించాల్సిన అవసరం ఉన్న వారసత్వ ప్రదేశాలను ఈ సంస్థ పరిరక్షిస్తుంది.
డబ్ల్యూఎంఎఫ్ నిధులు, అంతర్జాతీయంగా, స్థానిక చారిటీల నుంచి లభించిన మొత్తంతో పాటు ప్రైవేటు దాతల నుంచి సేకరించిన డబ్బుతో దశల వారీగా ఈ భవనాన్ని పునరుద్ధరించారు.
చివరి దశ పనులను గత ఏడాది మే నెలలో ప్రారంభించారు. ఈ పనుల కింద భవనంలోని సెంట్రల్ హాల్‌తో పాటు మూడు చారిత్రక ద్వారాల పునరుద్ధరణ జరిగింది.
ఈ చివరి దశ పనులను ‘‘క్వీన్ ఎలిజబెత్-2 ప్లాటినం జూబ్లీ కామన్వెల్త్ హెరిటేజ్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్’’ చేపట్టింది.
యూకే చెందిన హమిష్ ఆగ్‌స్టాన్ ఫౌండేషన్ దీనికోసం రూ. 1.5 కోట్లు (1,93,000 డాలర్లు) నిధులు అందించింది.
హైదరాబాద్‌తో పాటు యూకేకు చెందిన యువతకు నిపుణుల నుంచి భవన పరిరక్షణ మెళకువలు నేర్చుకునేందుకు ఈ ప్రాజెక్టులో పనిచేసేందుకు అవకాశం ఇచ్చింది.
పునరుద్ధరణ కోసం కామన్వెల్త్ హెరిటేజ్ స్కిల్స్ ప్రోగ్రామ్ ఎంపిక చేసిన 20 ప్రాజెక్టుల్లో కోఠి మహిళా కాలేజీ మొదటిది.
తర్వాత కోల్‌కతా బొటానికల్ గార్డెన్స్‌లోని రాక్స్‌బర్గ్ హౌజ్ పునరుద్ధరణ పనులను ఈ హెరిటేజ్ స్కిల్స్ ప్రోగ్రామ్ చేపట్టనుంది.
హైదరాబాద్‌లో కోఠి మహిళా కాలేజీ (ఇప్పుడు తెలంగాణ మహిళా యూనివర్సిటీ) చాలా ప్రముఖమైన విద్యా సంస్థ.
ప్రస్తుతం ఈ విద్యా సంస్థ అనేక గ్రూపుల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిపికెట్ స్థాయిలలో ప్రతీ ఏడాది 2,500 మందికి పైగా విద్యార్థినులకు విద్యను అందిస్తోంది.
భవనం పునరుద్ధరణ తర్వాత అనేక వసతులు యూనివర్సిటీలోకి అందుబాటులోకి రానున్నాయి. సెంట్రల్ మాల్‌కు ఇరువైపులా గ్రీన్ స్పేస్‌ను ఏర్పాటు చేశారు.
క్యాంపస్‌లో విద్యార్థులు, సిబ్బంది తిరిగే చోటును మరింత ఆహ్లాదంగా మార్చారు.
1857లో దిల్లీ ముట్టడిలో పోరాడిన లెఫ్టినెంట్ రాబర్ట్స్ పేరుతో యూనివర్సిటీలో ఉన్న ఒక ద్వారాన్ని కూడా పునురుద్ధరించారు.
ఈ ద్వారం పునరుద్ధరణ పనుల్లో యూకే, భారత్‌కు చెందిన ట్రైనీలు పాల్గొన్నారు. సున్నాన్ని కలపడం, జల్లెడ పట్టడం, మోర్టార్‌ను తయారు చేయడం వంటి పనుల్లో ట్రైనీలకు ఈ ద్వారం రిపేర్ సందర్భంగా శిక్షణ లభించింది.
యూనివర్సిటీ గ్రాండ్ దర్బార్ హాల్‌లోని పేపర్ మాషే సీలింగ్ (కాగితం, నీరు, బంక మిశ్రమంతో తయారైన పైకప్పు) పునరుద్ధరణ పనులను నిపుణులు చూసుకున్నారు.
గత కొన్ని ఏళ్లుగా ఈ సీలింగ్ నుంచి ఊడిపడిపోయిన ముక్కలను నిపుణులు తిరిగి పైన అమర్చారు. భవన నిర్వాహకులు ఈ ముక్కలను ఏళ్లుగా భద్రంగా దాచి ఉంచారు.
‘‘ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. సీలింగ్ నుంచి ఊడిపోయిన ప్రతీ భాగాన్ని మేం తిరిగి అక్కడ అమర్చాలనుకున్నాం. యథాస్థితిలో ఉండేలా తిరిగి అమర్చడం కోసం తీవ్రంగా కృషి చేయాల్సి వచ్చింది’’ అని సీలింగ్ పునరుద్ధరణలో పని చేసిన ఆర్ట్ కన్జర్వేటర్ మణిందర్ సింగ్ గిల్ అన్నారు.
ఈ భవనం, ‘పల్లాడియన్ విల్లా’ శైలిలో ఉంటుంది. దాదాపు అమెరికా వైట్ హౌజ్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది.
కిర్క్‌ప్యాట్రిక్ ఈ భవనాన్ని తన భారతీయ భార్య ఖైరున్నీసాతో కలిసి ఉండటం కోసం నిర్మించుకున్నారు.
వీరి బంధంపై చరిత్రకారుడు విలియం డాల్రింపుల్ రచించిన ‘వైట్ మొగల్స్’ అనే పుస్తకం 2002లో వచ్చింది. వీరిద్దరి మధ్య ప్రేమ ఆ సమయంలోని మత, రాజకీయ, సాంస్కృతిక హద్దులు అన్నింటినీ ఎలా చెరిపేసిందో ఆ పుస్తకంలో వివరించారు.
ఇవి కూడా చదవండి:
- మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు: 'బంబుల్, టిండర్ వంటి యాప్స్‌తో నేను మగాళ్ళను ఎందుకు ఆకర్షించాలి?'
- జహాన్ ఆరా: విలాసవంతమైన మసీదులు, సత్రాలు కట్టించిన అందాల మొఘల్ రాణి
- ఫిన్లాండ్: పరీక్షలు, ర్యాంకులు లేని అక్కడి చదువు మీద ఇండియాలో చర్చ ఎందుకు జరుగుతోంది?
- జగన్ విశాఖ టూర్ : సీఎం వస్తున్నారని చెట్లు నరికేశారు, నిబంధనలను పట్టించుకోరా?
- జమున: తెలుగు సినిమా సత్యభామ ఆమె...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)