తమిళనాడు అసెంబ్లీలో నిజంగానే జయలలిత చీర లాగారా... ఆ రోజు అసలేం జరిగింది?

    • రచయిత, మురుగేశ్ మద్‌కన్ను
    • హోదా, బీబీసీ తమిళ్ ప్రతినిధి

తమిళనాడు అసెంబ్లీలో 1989లో జరిగిన ఒక ఘటన తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు రేపుతోంది.

ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పార్లమెంట్‌లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత విషయాన్ని ప్రస్తావించారు.

''డీఎంకే నేతలు పవిత్రమైన శాసనసభలో జయలలిత చీర లాగారు'' అని నిర్మల అన్నారు.

నిర్మల వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందిస్తుండడంతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి.

స్టాలిన్ ఏమన్నారు?

మణిపుర్ హింసకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 10న చర్చలో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఆ సమయంలో డీఎంకే ఎంపీ కనిమొళి మహాభారతం, ద్రౌపది గురించి ప్రస్తావించారు.

స్పందించిన నిర్మల, ''1989 మార్చి 25న జరిగిన ఒక ఘటనను గుర్తు చేస్తున్నాను. పవిత్రమైన శాసనసభలో తమిళనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలిత చీరను లాగారు. డీఎంకే సభ్యులు ఆమెపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమెను చూసి ఎగతాళిగా నవ్వారు'' అన్నారు.

నిర్మల విమర్శలపై మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన ఎంకే స్టాలిన్ ‘హిందుస్తాన్ టైమ్స్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.

''వాట్సాప్ మెసేజులు చదివి నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు అసెంబ్లీలో అలాంటి ఘటన జరగలేదు. అది జయలలిత ఆడిన నాటకమని ఆ సమయంలో హాల్లో ఉన్నవాళ్లందరికీ తెలుసు'' అని స్టాలిన్ అన్నారు.

''చెన్నె పోయెస్ గార్డెన్‌లోని తన ఇంట్లో జయలలిత ఈ నాటకాన్ని ముందే ప్రాక్టీస్ చేశారని సుబ్బురామన్ తిరుణావుక్కరసు అసెంబ్లీలో చెప్పారు. ఆయన అప్పుడు అక్కడే ఉన్నారు. అది కూడా వారు చెప్పిన నోట్‌లో ఉంది. తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఘటనలను నిర్మలా సీతారామన్ తప్పుగా అర్థం చేసుకోవడం విచారకరం. అది సభను తప్పుదోవ పట్టించడమే'' అని ఆయన ఆ ఇంటర్వ్యూలో అన్నారు.

తమిళనాడు అసెంబ్లీలో ఈ ఘటన జరిగిన సమయంలో సుబ్బురామన్ తిరుణావుక్కరసు ఏఐఏడీఎంకేలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం త్రిచీ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు.

స్టాలిన్ వాదనను ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం పళనిస్వామి తప్పుబట్టారు. 1989లో అసెంబ్లీలో జరిగిన ఘటన వాస్తవమని, ఆ రోజు జయలలితపై దాడి జరిగిందని ఆయన చెప్పారు.

పళనిస్వామి, తమిళిసై ఏం చెప్పారు?

''నేను ఆరోజు అక్కడే ఉన్నాను. నేను అక్కడ జరిగిందే చెబుతున్నాను. ఒక మహిళగా, ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలితను అవమానించారు. కరుణానిధి సమక్షంలోనే అదంతా జరిగింది'' అని పళనిస్వామి చెప్పారు.

అవును, జయలలితకు అలాగే జరిగిందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా మీడియాతో అన్నారు.

''అలాంటి ఘటనే జరగలేదని, వాట్సాప్ మెసేజ్‌లు చూసి నిర్మల మాట్లాడారని ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. కానీ అసెంబ్లీలో జయలలితపై దాడి జరిగిందనేది నిజం. తనను కాపాడుకునేందుకు చిరిగిపోయిన బట్టలతో ఆమె అసెంబ్లీ నుంచి బయటికి వచ్చారు. ఆ ఘటనకు నేను ప్రత్యక్ష సాక్షిని. ఆ సమయంలో మా నాన్న కుమరి ఆనందన్ ఉప ప్రతిపక్ష నేత. మూపనార్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ ఘటన జరిగినప్పుడు అసెంబ్లీ హాల్లో పుస్తకాలు విసిరేశారు. అవి ఇతరులపై పడకుండా అడ్డుకునే ప్రయత్నంలో మా నాన్న చేయి విరిగింది. తమిళనాడు అసెంబ్లీలో జరిగిన ఈ ఘటన దురదృష్టకరం. ఒక మహిళా నాయకురాలిగా పశ్చాత్తాపం చెందాల్సిన ఘటన ఇది'' అని తమిళిసై చెప్పారు.

13 ఏళ్ల తర్వాత అధికారంలోకి డీఎంకే

ఎంజీఆర్(ఎంజీ రామచంద్రన్) మరణం తర్వాత ఏఐఏడీఎంకే పార్టీ జయలలిత వర్గంగా, జానకి వర్గంగా చీలిపోయింది.

1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 150 స్థానాల్లో గెలిచి, 13 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది.

ఏఐఏడీఎంకే జయలలిత వర్గం 27 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 26 సీట్లు, ఏఐఏడీఎంకే జానకి వర్గం రెండు సీట్లు గెలుచుకున్నాయి.

డీఎంకే విజయంతో ముఖ్యమంత్రిగా మూడోసారి కరుణానిధి బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక శాఖను కూడా ఆయన తన వద్దే ఉంచుకున్నారు. 1989 మార్చి 25న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

జయలలిత ‘రాజీనామా’తో మలుపు

ఆ సమయంలో జయలలిత తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. ఆమె రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారని చెబుతుంటారు.

''1989 ఎన్నికల్లో జయలలిత వర్గం కేవలం 27 సీట్లు మాత్రమే గెలిచింది. ఆ ఒత్తిడి ఆమెపై ఉంది'' అని సీనియర్ జర్నలిస్ట్ కల్యాణ్ అరుణ్ బీబీసీ తమిళ్‌కు చెప్పారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ జయలలిత లేఖ కూడా రాసినట్లు చెబుతారు.

''కానీ, వాళ్లు ఆ లేఖను శాసనసభకు పంపలేదు. అదే సమయంలో, ఎన్నికల్లో టికెట్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారనే ఫిర్యాదు రావడంతో పోలీసులు నటరాజన్ (శశికళ భర్త ) ఇంటిపై దాడులు చేశారు. అక్కడ దొరికిన జయలలిత రాజీనామా లేఖను స్వాధీనం చేసుకుని, దానిని అసెంబ్లీ స్పీకర్ తమిళ్ గుడిమకణ్‌‌కు పంపించారు. ఆ తర్వాత, జయలలిత రాజీనామాను ఆమోదిస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారు. అది జయలలితకు ఆగ్రహం తెప్పించింది. దానికి నిరసనగా ఆమె చెపాక్ స్టేడియంలో బహిరంగ సభ కూడా పెట్టారు. స్పీకర్ రాజీనామాను ఆమోదించడం వెనక కరుణానిధి హస్తముందని వారు భావించారు'' అని కల్యాణ్ అరుణ్ చెప్పారు.

ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగింది?

ఆ రోజు ఏం జరిగిందనేది కల్యాణ్ అరుణ్ వివరించారు.

''మార్చి 25న అసెంబ్లీలో కరుణానిధి బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు ఏఐఏడీఎంకే వైపు నుంచి ఏదో అన్నట్లు వినిపించింది. అలాంటి నేరస్థుడు బడ్జెట్ ప్రవేశపెట్టకూడదని జయలలిత అన్నారు. కరుణానిధి అప్పుడు ఒక మాట అన్నారు. దీంతో కోపమొచ్చిన సెంగోట్టయాన్ సహా ఏఐఏడీఎంకే సభ్యులు దాడి చేసేందుకు ప్రయత్నించారు.

సెంగోట్టయాన్ చేయి తగిలి కరుణానిధి కళ్లజోడు కిందపడింది. దీంతో ఆగ్రహం చెందిన డీఎంకే సభ్యులు, ఏఐఏడీఎంకే సభ్యులపై దాడికి దిగారు. బడ్జెట్ పేపర్ల కట్టలను తీసుకుని విసిరేశారు'' అని కల్యాణ్ అరుణ్ చెప్పారు.

బడ్జెట్ పేపర్ల కట్టలు జయలలితకు తగిలాయి. దీంతో తిరుణావుక్కరసు, కేకేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ అడ్డుగా నిల్చుని నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వాళ్లకు దెబ్బలు తగిలాయి.

డీఎంకే సభ్యుడు కోసీ మణి బడ్జెట్ పేపర్లు ఉంచిన చిన్న కుర్చీని తీసుకుని జయలలితపైకి విసిరేందుకు ప్రయత్నించారు. అప్పుడు కోసీ మణిని పక్కనే ఉన్న మరో డీఎంకే సభ్యుడు దురైమురుగన్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో కుర్చీ కిందపడిపోయింది. పక్కపక్కనే ఉండడంతో అనుకోకుండా జయలలిత చీర దురైమురుగన్ చేతిలో పడింది. ఆమె చీర చినిగింది. ఆ తర్వాత ఏఐఏడీఎంకే సభ్యులు జయలలితను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి దేవకి ఆస్పత్రికి తరలించారు'' అని కల్యాణ్ అరుణ్ ఆ రోజు ఘటనను వివరించారు.

జయలలితపై దాడి జరిగిందని ఆ రోజు అసెంబ్లీలో ఉన్న తిరుణావుక్కరసు అనే సీనియర్ జర్నలిస్ట్ చెప్పారు.

2003లో జయలలిత ఏమన్నారు?

''కరుణానిధి బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగానే, నా రాజీనామా లేఖ మీకు ఎవరిచ్చారని జయలలిత ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పిన తర్వాతే బడ్జెట్ ప్రసంగం ప్రారంభించాలి. అప్పుడు, కరుణానిధి ఒక మాట అన్నారు. ఆ తర్వాత మళ్లీ బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారు. కరుణానిధి బడ్జెట్ ప్రసంగాన్ని ఏఐఏడీఎంకే అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో పొరపాటున కరుణానిధి కళ్లద్దాలు కిందపడిపోయాయి. దీంతో ఆగ్రహం చెందిన డీఎంకే సభ్యులు బల్లలపైకి ఎక్కి వాళ్లపై దాడికి దిగారు. జయలలితపై కూడా దాడి చేశారు. ఆమె చీర లాగారు'' అని జర్నలిస్ట్ తిరుణావక్కరసు చెప్పారు.

2003 మార్చి 25న జయలలిత ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో ఈ అంశం గురించి మాట్లాడారు.

''నాడు దురైమురుగన్, వీరపాండి ఆర్ముగమ్, ఇతర డీఎంకే మంత్రులు అసెంబ్లీలో నా చీర లాగారు. నన్ను కొట్టారు. అప్పటి నుంచి నేను అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. ఎందుకంటే అప్పుడు సభలో సభ్యులకు భద్రత లేదు'' అని ఆమె అన్నారు.

జయలలిత సూచన మేరకే తనపై ఏఐఏడీఎంకే సభ్యులు దాడి చేసేందుకు యత్నించారని కరుణానిధి కూడా ఆరోపించారు.

చీర లాగారనే ఆరోపణలపై స్పందించిన దురై మురుగన్, ''అలాంటిదేమీ జరగలేదని అప్పుడు జయలలితతోనే ఉన్న సుబ్బురామన్ తిరుణావుక్కరసు చెప్పారు'' అన్నారు.

కరుణానిధిని కొట్టారని అనుకున్నారు: సుబ్బురామన్ తిరుణావుక్కరసు

సుబ్బురామన్ తిరుణావుక్కరసు ఈ విషయంపై బీబీసీ తమిళ్‌‌తో మాట్లాడారు.

''జయలలిత రాజీనామా వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ఉదయం ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు జయలలిత నివాసం పోయెస్ గార్డెన్‌లో ఆమెను కలిశారు. కరుణానిధి బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. కుదిరితే కరుణానిధి చేతిలోని బడ్జెట్ ప్రతులను లాక్కోవాలని అనుకున్నారు. అయితే, అది ఎవరు చేయాలనేది నిర్ణయించలేదు'' అని తిరుణావుక్కరసు చెప్పారు.

చిన్న బల్లపై బడ్జెట్ ప్రతులను ఉంచి కరుణానిధి ప్రసంగం ప్రారంభించారని, బడ్జెట్ ప్రసంగం ఆపేయాలంటూ జయలలిత అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆయన తెలిపారు.

అయినా కరుణానిధి ప్రసంగించారు. దాని తర్వాత వాగ్వాదం మొదలైంది. ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకరు కరుణానిధి బడ్జెట్ ప్రసంగం ప్రతులను లాక్కునేందుకు ప్రయత్నించారు. అప్పుడు కరుణానిధి కళ్లద్దాలు కిందపడ్డాయి'' అని తిరుణావుక్కరసు చెప్పారు.

''కరుణానిధిని కొట్టారనుకుని డీఎంకే ఎమ్మెల్యేలు బడ్జెట్ ప్రతుల కట్టలు అవతలివారి మీదకు విసిరారు. అప్పుడు జయలలిత జుట్టు చిక్కుకుపోయింది. ఆమెకు నేను, కేకేఎస్ఎస్ఆర్ రక్షణగా నిల్చున్నాం. ఆ తర్వాత మేము ఆమెను క్షేమంగా బయటికి తీసుకెళ్లాం'' అని తెలిపారు.

''అక్కడ కరుణానిధిపై దాడి జరగలేదు, జయలలిత చీర లాగలేదు'' అని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి: