జయలలిత వారసులుగా దీప, దీపక్‌.. మద్రాస్‌ హైకోర్టు తీర్పు : ప్రెస్ రివ్యూ

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన దాదాపు రూ. 913 కోట్ల ఆస్తులకు ఆమె మేనల్లుడు దీపక్‌, మేనకోడలు దీప వారసులు కాబోతున్నారు. జయలలిత సోదరుడి సంతానమైన వీరిద్దరినీ ఆమెకు ద్వితీయ శ్రేణి వారసులుగా మద్రాసు హైకోర్టు బుధవారం స్పష్టమైన తీర్పు ఇచ్చిందని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. భారత వారసత్వ చట్టం ప్రకారం వారిద్దరినీ జయలలితకు ద్వితీయ శ్రేణి వారసులుగా ప్రకటిస్తున్నట్లు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎన్‌.కృపాకరన్‌, జస్టిస్‌ అబ్దుల్‌ ఖుదూస్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

జయలలిత నివాసగృహం వేదా నిలయాన్ని ప్రభుత్వం స్మారక మందిరంగా మార్చకూడదంటూ ఆమె మేనకోడలు దీప దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

జయలలితకు సంబంధించి కొన్ని ఆస్తులను కేటాయించి, ఆమె పేరుతో సేవాభావంతో కూడిన ట్రస్టును నిర్వహించే బాధ్యతలను దీప, దీపక్‌లకు అప్పగించాలని, దీనిపై ఎనిమిది వారాల్లోగా తమకు నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

జయలలిత ఆస్తులను నిర్వహించేందుకు ప్రత్యేక ట్రస్టీలను నియమించాలని కోరుతూ అన్నాడీఎంకే నేత పుగళేంది, జానకి రామన్‌ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది.

జయలలిత పోయెస్‌ గార్డెన్‌ నివాసాన్ని స్మారక మందిరంగా మార్చేందుకు ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేటప్పుడు, దానికి సంబంధించి నష్టపరిహారాన్ని నిర్ణయించి, చట్ట్రపకారం జయలలిత వారసులైన దీపా, దీపక్‌లకు అప్పగించాలని కూడా ధర్మాసనం ఆదేశించింది.

అదే సమయంలో జయ నివాస స్థలాన్ని స్వాధీనం చేసుకుని అందుకు భారీగా నష్టపరిహారం చెల్లించటానికి బదులు, ఆ ధనాన్ని నీటి పథకాలు, నీటివనరుల శుద్ధీకరణ పనులకు ఉపయోగించవచ్చునని సూచించింది.

ప్రజాధనాన్ని స్మారక మందిరాల నిర్మాణానికి దుర్వినియోగం చేయరాదని స్పష్టం చేసింది. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడమే దివంగత నేతలకు అసలైన నివాళి అని పేర్కొంది.

జయ నివాసాన్ని పూర్తిగా స్మారక మందిరంగా మార్చే యోచనను ప్రభుత్వం పునఃపరిశీలించాలని, అవసరమైతే కొంత భాగాన్ని స్మారక మందిరంగా మార్చి, తక్కిన భాగాన్ని ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉపయోగించే విషయాన్ని పరిశీలించాలని సూచించింది.

దీప, దీపక్‌లకు 24 గంటలూ భద్రత కల్పించాలని, జయ ఆస్తులలో ఒకదానిని విక్రయించగా వచ్చే ధనాన్ని బ్యాంక్‌లో డిపాజిట్‌ చేసి ఆ వడ్డీని వారి భద్రతా చర్యలకు వినియోగించవచ్చునని హైకోర్టు పేర్కొంది.

కాగా, మూడంతస్తుల స్మారక భవనంగా మార్చేందుకు జయ నివాసం, ఫర్నిచర్‌, పుస్తకాలు, నగలు తదితరాలను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా స్వాధీనం చేసుకునేలా గవర్నర్‌ భన్వరీలాల్‌ ఈనెల 22న ఆర్డినెన్స్‌ జారీ చేసిన నేపథ్యంలో తాజా తీర్పు వెలువడటం విశేషం.

డిజిటల్ వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు

ప్రతి ఏడాదీ తెలుగుదేశం పార్టీ వైభవంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం బుధవారం ప్రారంభమైందని ప్రజాశక్తి ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారా చంద్రబాబునాయుడు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు యనమల రామకృష్ణుడు, నారా లోకేశ్‌, అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని కార్యకర్తలు, అభిమానులు, నాయకులు దాదాపు 14 వేల మంది జూమ్‌ యాప్‌ ద్వారా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా మరో 10 వేల మంది కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది రెండు రోజులు మాత్రమే నిర్వహించనున్నారు.

మీడియా నియంత్రణ చట్టం పరిధిలో ఉండాలి - ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌

సమాచార, ప్రసార మధ్యమాలు నియంత్రణ చట్టం పరిధిలో ఉండాలని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ అన్నారని సాక్షి ఒక కథనంలో పేర్కొంది.

ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్, ప్రింట్‌, సోషల్‌ మీడియాలు నియంత్రణ లేకుండా రెచ్చ గొట్టేలా వ్యవహరిస్తున్నాని తెలిపారు. ప్రచురిస్తున్న వార్తలు, వ్యాఖ్యానాలు వల్ల సమాజంలో అలజడి రేగుతోందన్నారు. వ్యక్తిగత దూషణల నుంచి మొదలై వైషమ్యాల వైపు దారి తీస్తున్నాయని తెలిపారు. అశాంతి వాతావరణాన్ని ప్రేరేపిస్తున్నాయని తెలిపారు.

ఇలాంటి పరిణామాలు సమాజానికీ, వ్యవస్థకూ మంచిది కాదన్నారు. వాటిని అరికట్టేందుకు శాఖాపరమైన వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని వివరించారు. సీఐడీ విభాగంలోని సైబర్‌ క్రైం వింగ్‌లో సోషల్‌ మీడియా నేరాల నియంత్రణ, పర్యవేక్షణకు ప్రత్యేకంగా మరో వింగ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఫిర్యాదులపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నామని డీజీపీ చెప్పారు.

హైకోర్టు తీర్పుల పట్ల కొందరు చట్టాన్ని అతిక్రమించి వ్యాఖ్యలు చేశారని, న్యాయస్థానం ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. ప్రభుత్వం మీద, ప్రభుత్వంలోని ప్రముఖ వ్యక్తుల మీద కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. అవాస్తవాలు ప్రచారం చేసి ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్ననిస్తున్న వారి మీద పోలీసుల నిఘా ఉందని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.

‘మిడతల దండుతో తెలంగాణకు నష్టం ఉండకపోవచ్చు’

మహారాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేకపోతే రెండుమూడు రోజుల్లో మిడతల దండు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రమాదముందని నమస్తే తెలంగాణ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ప్రస్తుతం 17 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక మిడతల గుంపు మహారాష్ట్రలోని అమరావతి సమీపంలోకి చేరుకుంది.

దాంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నిజామాబాద్‌, కామారెడ్డి, అసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలకు వీటితో ప్రమాదం పొంచి ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ కమిషనర్‌ బీ జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

మిడతల దండు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సమస్యపై బుధవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సరిహద్దు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో నిఘాబృందాలు, గ్రా మ కమిటీలను ఏర్పాటుచేసి మిడతల దండుతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలన్నారు.

మిడతల దండు 1993 తర్వాత మళ్లీ ఇప్పుడే మహారాష్ట్ర వైపు వచ్చిందని అగ్రికల్చర్‌ టెక్నాలజీ అప్లికేషన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పదోజోన్‌ డైరెక్టర్‌ వైజీ ప్రసాద్‌ బుధవారం తెలిపారు. ఇవి తెలంగాణ సరిహద్దుకు 400 కి.మీ దూరంలో ఉన్నాయని, రాష్ట్రంలోకి వస్తాయా? రావా? అనేది రెం డురోజుల్లో తెలుస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రధాన పంటలన్నీ పొలాల నుంచి ఇండ్లకు చేరటం తో అవివచ్చినా నష్టం ఉండదని వ్యవసాయరంగ నిపుణులు అంచనావేస్తున్నారు. కూరగాయల పంటలు నష్టపోయే ప్రమాదముందని చెప్తున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)