పాకిస్తాన్ నుంచి మిడతల దండు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల వైపు వచ్చేస్తోందా

పాకిస్తాన్ నుంచి వచ్చిన భారీ ఎడారి మిడతల దండు పశ్చిమ మధ్య భారతంలోని పంటలను నాశనం చేస్తోంది. ఇవి ఇప్పుడు మిగతా రాష్ట్రాలకూ వెళ్తున్నాయని.. తెలుగు రాష్ట్రాల రైతులకూ మిడతల దాడి ముప్పు ఉండొచ్చని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

గత మూడు దశబ్దాల్లో ఇదే అతిపెద్ద మిడతల దాడి అని నిపుణులు చెబుతున్నారు.

డ్రోన్లు, ట్రాక్టర్లు, కార్ల సాయంతో ఈ మిడతలున్న ప్రాంతాలను గుర్తిస్తున్నారు. కీటకనాశనులను చల్లుతూ వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటివరకూ ఈ మిడతల దండు 50 వేల హెక్టర్ల విస్తీర్ణంలో పంటలను నాశనం చేసింది.

రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లోని కొన్ని భాగాల్లో ప్రతి చదరపు కిలోమీటరుకు ఎనిమిది నుంచి పది వరకూ మిడతల దండులు యాక్టివ్‌గా కనిపిస్తున్నాయని ప్రభుత్వ సంస్థ లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్ డిప్యుటీ డైరక్టరేట్ ఎల్ గుర్జర్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.

ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాలానుగుణంగా వేసే పంటలకు మిడతల వల్ల చాలా నష్టం కలిగింది. చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

దేశం కరోనావైరస్ సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో ఈ మిడతల దాడి మరిన్ని ఇక్కట్లు తెచ్చిపెడుతోంది.

రాజస్థాన్‌లోకి ప్రవేశించకముందు పొరుగు దేశం పాకిస్తాన్‌లోనూ ఈ మిడతలు చాలా ఇబ్బందులు సృష్టించాయి.

భారత్‌లోని మిగతా రాష్ట్రాల్లోనూ చిన్న చిన్న మిడతల గుంపులు ఉన్నాయని గుర్జర్ అన్నారు.

ఐరాస ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సమాచారం ప్రకారం నాలుగు కోట్ల మిడతలున్న దండు 35 వేల మందికి తినేందుకు సరిపోయే ఆహారాన్ని నాశనం చేయగలదు.

రాజస్థాన్‌లోని జనావాస ప్రాంతాల్లో మిడతల గుంపులు కనిపిస్తున్నాయి.

మిడతలను తరిమికొట్టేందుకు జనాలు వివిధ ఉపాయాలు పాటిస్తున్నారు. కొందరు కీటకనాశనులు చల్లుతున్నారు. కొందరు పాత్రలపై కొడుతూ చప్పుళ్లు చేస్తున్నారు.

పరిస్థితి మరింత తీవ్రం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఐరాస సమాచారం ప్రకారం భారీ వర్షాలు, తుపానుల వల్ల గత ఏడాది ఆరంభంలో మిడతల జనాభా బాగా పెరిగింది. అరేబియా ద్వీపకల్పంలో వీటి సంఖ్య ఎక్కువైంది.

1993 తర్వాత భారత్ ఎప్పుడూ ఇంత భారీ స్థాయిలో మిడతల దాడి చూడలేదు.

పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఏటా మిడతల దాడుల వల్ల పంటలకు నష్టం జరుగుతూ ఉంటుంది.

కానీ, ఈసారి మిడతలు రాజస్థాన్ దాటుకుని ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ వరకూ వచ్చేశాయి.

గాలి దిశ కారణంగా ఇవి నైరుతి వైపు కదులుతున్నట్లు లోకస్ట్ వార్నింగ్ సెంటర్ చెబుతోంది.

ఎడారి మిడతలు మహమ్మారిగా ఎలా మారతాయి?

మిడతల్లో ఎడారి మిడతలు ఓ రకం. ఎడారుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. గుడ్ల నుంచి పుట్టి, ఎగిరే జీవులుగా ఇవి పరిణామం చెందుతాయి.

ఎడారి మిడతలు సాధారణంగా ఒంటరిగానే జీవిస్తుంటాయి. కొన్ని కొన్ని సార్లు మాత్రం వాటి స్వభావం ప్రమాదకరంగా మారిపోతుంది.

పచ్చటి గడ్డి మైదానాలపై ఈ మిడతలు పోగవుతాయి. ఒంటరితనాన్ని వదిలి సమూహంగా మారి, ప్రమాదకర రూపం తీసుకుంటాయి.

గుంపుగా మారే ఈ కొత్త దశలో మిడతల రంగు కూడా మారిపోతుంది. క్రమంగా ఇవి దండుగా తయారవుతాయి. భారీ సమూహాలుగా ఎగురుతూ పంటలపై దాడులు చేసే మహమ్మారిలా పరిణమిస్తాయి.

మిడతల దండు చాలా భారీగా ఉంటుంది. ఒక్కో దండులో మిడతల సంఖ్య వెయ్యి కోట్ల దాకా ఉండొచ్చు. ఆ గుంపు కొన్ని వందల కిలోమీటర్ల వరకూ వ్యాపించి ఉండొచ్చు. అలాంటి దండు రోజుకు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) అంచనాల ప్రకారం, ఒక సగటు మిడతల దండు ఒక ఏడాదిలో 2500 మంది ఆకలి తీరేందుకు సరిపోయే పంటలను నాశనం చేయగలదు.

ఇప్పటివరకూ జరిగిన మిడతల దాడుల్లో 2003-05లో పశ్చిమాఫ్రికాలో జరిగిన 2.5 బిలియన్ డాలర్ల విలువైన పంటనష్టం అత్యధికం అని ఐక్యరాజ్యసమితి చెప్పింది.

1930, 40, 50ల్లో కూడా చాలా ప్రాంతాల్లో మిడతల దాడుల వల్ల పంటనష్టం జరిగింది.

వాటిలో కొన్ని దండ్లు ఎన్నో ప్రాంతాలకు వ్యాపించాయి. ‘మహమ్మారి'గా పిలిచే స్థాయిలో వాటి సంఖ్య ఉంది.

మిడతల దాడుల వల్ల ప్రపంచంలోని ప్రతి పది మందిలో ఒకరి జీవనోపాధిపై ప్రభావం పడుతోందని ఎఫ్ఏఓ అంచనా వేసింది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కీటక శ్రేణిగా వర్ణించింది.

దశాబ్దాల్లోనే అత్యంత భయంకరమైన ఎడారి మిడతల దండ్లు ఇప్పుడు హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంతటా పంటలను, పచ్చికబయళ్లను నాశనం చేస్తున్నాయి. ఫలితంగా ఆ ప్రాంతమంతా ఆహార భద్రతకు ప్రమాదం ఏర్పడింది.

ఒక్క మిడతతో ఎంత ప్రమాదం?

ఒక సగటు మిడత ప్రతి రోజు తన బరువుకు సమానంగా, అంటే 2 గ్రాముల ఆహారం తీసుకోగలదు.

దీని వల్ల కరవులు, వరదల వంటి విపత్తుల బారిన పడ్డ ప్రాంతాల్లో ఈ మిడతలు ఆహార సంక్షోభాన్ని సృష్టించగలవు.

కానీ, మిడతల దాడులు ఎందుకు ఇంత విస్తృతమయ్యాయి.

మిడతల ప్రస్తుత దాడులకు 2018-19లో కురిసిన భారీ వర్షాలు, తుపానులు ప్రధాన కారణం.

ఎడారి మిడతలు సాధారణంగా పశ్చిమ ఆఫ్రికా, భారత్ మధ్య 1.60 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని దాదాపు 30 దేశాల్లో ఉన్న ఉష్ణమండల ప్రాంతాల్లో నివసిస్తాయి.

కానీ, రెండేళ్ల క్రితం దక్షిణ అరేబియా ద్వీపకల్పంలో ఏర్పడిన తేమ, అనుకూల పరిస్థితులు మూడు తరాల మిడతలు ఎవరికీ తెలీకుండా పెరిగేందుకు దోహదపడ్డాయి అని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

2019 ప్రారంభం నాటికి మొదటి మిడతల గుంపు యెమెన్, సౌదీ అరేబియా, ఇరాన్ వైపు వెళ్లి, సంతానోత్పత్తి చేసి తూర్పు ఆఫ్రికావైపు వెళ్లింది. 2019 చివరికల్లా ఎరిత్రియా, డిజిబౌటీ, కెన్యాల్లో కొత్త మిడతల దండ్లు ఏర్పడ్డాయి. అక్కడి నుంచి మిగతా దేశాలకు పాకాయి.

వీటి పీడ విరగడయ్యేదెలా?

హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో మిడతల దండ్ల పరిమాణాన్ని, అవి వృద్ధి చెందుతున్న వేగాన్ని చూసి, వివిధ దేశాలు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాయి.

మెరుగైన నియంత్రణ, పర్యవేక్షణపై వీటి నివారణ ఆధారపడి ఉంటుంది.

ఎఫ్ఏఓ తరఫున నడిచే డెసర్ట్ లోకస్ట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ మిడతల దండ్లకు సంబంధించిన హెచ్చరికలు, సమాచారం అందిస్తోంది. మిడతలు చొరబడే ప్రాంతం, వచ్చే సమయం, వాటి తీవ్రత, వాటి జనాభా వంటి వాటి గురించి ముందస్తు సమాచరం ఇస్తోంది.

కానీ, మిడతల సంఖ్య పరిమితులు దాటి పెరిగిపోతే అత్యవసర చర్యలు అవసరమవుతాయి. వాటి సంఖ్యను తగ్గించడంతోపాటు, వాటి ప్రత్యుత్పత్తిని నియంత్రించే చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది.

మిడతల సమస్యను పరిష్కరించేందుకు పర్యావరణ హితమైన మార్గల కోసం అన్వేషణ కొనసాగుతోంది.

జీవ క్రిమిసంహారకాలు, మిడతలను తినే ఇతర జీవులను ప్రవేశపెట్టడం ఇలాంటి మార్గాలు.

మిడతల నియంత్రణ కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్న పద్ధతి క్రిమి సంహారకాలు పిచికారీ చేయడమే.

చేతి పంపులు, వాహనాలు, విమానాల సాయంతో క్రిమి సంహారకాలు చల్లుతూ మిడతలను చంపవచ్చు.

మిడతల దాడులు ఎదుర్కున్న అనుభవం లేని దేశాలకు వాటిని ఎదుర్కోవడం మరింత కష్టం. ఎందుకంటే, వాటిని ఎదుర్కొనే వ్యవస్థలు వాటి దగ్గర ఉండవు.

భారత్‌లో పరిస్థితి

పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఏటా మిడతల దాడులు జరుగుతూనే ఉంటాయి. అయితే గత మూడు దశాబ్దాల్లో మిడతల దాడులు ఇంత విస్తృతమవడం ఇదే మొదటిసారి. పైగా అవి ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ దాకా వచ్చాయి.

ఇంతకుముందు గత ఏడాది డిసెంబర్‌లో పాకిస్తాన్ వైపు నుంచి భారత్‌కు వచ్చిన భారీ మిడతల దండు వల్ల గుజరాత్ రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు.

ఈ ఏడాది ఏప్రిల్ 11న రాజస్థాన్‌లోని గంగానగర్‌లో దేశంలో తొలి మిడతల దాడి జరిగింది. ఈ మిడతలు పాకిస్తాన్ నుంచి వచ్చాయి.

జైపుర్ పరిసర ప్రాంతాల్లోనూ మిడతల దాడులు నష్టం కలిగించాయి.

మిడతల దండ్లను నియంత్రించేందుకు బృందాలు ఏర్పాటయ్యాయి. అగ్నిమాపక విభాగం కూడా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)