సొమాలియాలో మిడతల దండయాత్ర.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం

సొమాలియా ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆ దేశంపై ప్రస్తుతం దండయాత్ర జరుగుతోంది. దండయాత్ర అంటే పొరుగుదేశం ఏదైనా దానిపై దాడి చేస్తోందని అనుకోకండి. ఎందుకంటే.. అక్కడ జరుగుతున్నది మిడతల దండయాత్ర.

సొమాలియాతో పాటు తూర్పు ఆఫ్రికాలోని అనేక దేశాలపై లక్షలాది మిడతలు దాడి చేస్తున్నాయి. పంట పొలాలను సర్వనాశనం చేస్తున్నాయి.

ప్రస్తుతం సొమాలియాలో పండుతున్న పంటలో చాలా భాగాన్ని మిడతలే తినేస్తున్నాయి. ''అసలే అంతంతమాత్రంగా ఉన్న దేశ ఆహార భద్రతకు ఈ పరిణామం మరింత నష్టం కలిగిస్తోంది'' అని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు.

ఏప్రిల్‌ నెలలో కోతలు మొదలయ్యేనాటికి కూడా ఈ పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఇథియోపియా, సొమాలియాలో గత పాతికేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఈ మిడతల దాడి జరుగుతోందని ఐక్య రాజ్య సమితి చెబుతోంది.

మిడతల దాడి ఏ స్థాయిలో జరుగుతోందో కింది వీడియోలో చూడండి

ఇక కెన్యాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గత 70ఏళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఈ కీటకాలు అక్కడి పొలాలపై దాడి చేస్తున్నాయి.

ఇప్పటిదాకా ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తొలి దేశం సొమాలియానే.

సొమాలియాలో భద్రతా కారణాల వల్ల విమానాల ద్వారా పంటలపై పురుగు మందులు కొట్టే పరిస్థితి కూడా లేదు. దాంతో లక్షలాది ప్రజల జీవనోపాధి ప్రమాదంలో పడింది.

ఈ ఏడాది జూన్ నాటికి ఆఫ్రికాలో మిడతల సంఖ్య 500 రెట్లు పెరిగే అవకాశం ఉందని, కాబట్టి దీనిపై అంతర్జాతీయంగా ఆ దేశాలకు సాయం అవసరమని గత నెలలో ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ కోరింది.

ఎర్ర సముద్రం మీదుగా యెమెన్ నుంచి ఈ కీటకాలు తూర్పు ఆఫ్రికాలోకి ప్రవేశించాయి. గత ఏడాది చివర్లో భారీగా వర్షపాతం నమోదవడంతో కీటకాలు వృద్ధి చెందడానికి అనువైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఒక్క రోజులో మిడతలు 150 కి.మీ.ల దాకా ప్రయాణించగలవు. రోజులో ఒక మిడత తన బరువుకు సమానమైన ఆహారాన్ని తినగలదు.

గత డిసెంబర్‌లో మిడతల దండు కారణంగా ఇథియోపియాలో ఒక విమానం భారీ కుదుపులకు లోనైంది. విమానం ఇంజిన్‌, విండ్‌ షీల్డ్‌తో పాటు విమానం కింద భాగంలోకి ఎక్కువ సంఖ్యలో మిడతలు ప్రవేశించడంతో అత్యవసరంగా దాన్ని ల్యాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)