పాక్ పాలిత కశ్మీర్‌లో మంచు తుపాను: ‘నా కూతురి బొమ్మ టార్చిలైట్ నా ప్రాణాలు కాపాడింది’

    • రచయిత, ఫర్హత్ జావెద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘ఆ మంచు కింద నాకు చావు తప్ప ఇంకేం కనిపించలేదు. 11 నెలల నా పాప ఓ వైపు ఉంటే, మా వదిన మృతదేహం మరోవైపు ఉంది’.. కొన్ని రోజుల క్రితం తాను అనుభవించిన నరకయాతనను గుర్తుచేసుకుంటూ 32 ఏళ్ల షకీలా చెప్పిన మాటలివి.

షకీలాది పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని సుర్గున్ గ్రామం. నీలమ్ లోయ ప్రాంతంలో ఈ ఊరు ఉంది.

గత జనవరిలో నీలమ్‌‌లో మంచుచరియలు విరిగిపడ్డాయి. 75కుపైగా మంది చనిపోయారు. గాయపడ్డవారి సంఖ్య, నిరాశ్రయులైనవారి సంఖ్య కూడా ఎక్కువే ఉంది.

నీలమ్‌లో ఈ శతాబ్దంలోనే ఎప్పుడూ లేనంతగా ఈసారి మంచు కురిసిందని వాతావరణ విభాగం తెలిపింది.

షకీలా ఆరు గంటలపాటు అప్పుడు మంచు కింద చిక్కుకుని ఉన్నారు.

‘‘ఒక్కసారిగా ఉరుములా, పెద్ద చప్పుడు వచ్చింది. నేను ఇంటి బయట నా కూతురుతో కలిసి కూర్చున్నా. నా కూతురు ఆడుకునే బొమ్మ టార్చిలైట్ నా చేతిలో ఉంది’’ అని చెప్పారు షకీలా.

‘‘ఇంటి లోపల మా అత్త, తన మనవళ్లు, మనవరాళ్లతో ఉంది. మా వదిన ఇంటిపని చేస్తోంది. పిల్లలు ఆడుకుంటున్నారు. వంటచెరకు కోసమని మా మామయ్య బయటకు వెళ్లాడు. ఒక్కసారిగా, పెద్ద పెనుగాలి వచ్చినట్టు వచ్చింది. భారీ మంచు కుప్ప, కనుచూపు మేరలో ఉన్న ప్రతిదాన్నీ కప్పేసింది’’ అని షకీలా అన్నారు.

షకీలాతోపాటు ఆమె కూతురు ముకద్దస్ కూడా మంచు కింద చిక్కుకుంది.

‘‘అసలేం జరిగిందో చాలా సేపు నాకు తెలియలేదు. నేను బతికున్నానో లేదో కూడా అర్థం చేసుకోలేకపోయా. అరుస్తూ ఉన్నా. ఎవరైనా రండంటూ కేకలు వేశా. దాదాపు ఓ గంట ఇలా గడిచిందనుకుంటా. మా కుటుంబ సభ్యుల అరుపులు కూడా వినిపించడం మొదలైంది. అందరూ అరుస్తున్నారు. పిల్లలు ఏడుస్తున్నారు. మా అత్త, మామ ఖురాన్‌లోని వచనాలను పలుకుతున్నారు. ఆ తర్వాత అంతా నిశ్శబ్దంగా మారింది’’ అని షకీలా చెప్పారు.

షకీలా రెండు కాళ్లు, వెన్నెముకకు ఫ్రాక్చర్స్ అయ్యాయి. పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌ నగరంలో ఉన్న ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకుంటున్నారు. సుర్గున్ నుంచి ఆ నగరం దాదాపు 100 కి.మీ.ల దూరంలో ఉంది.

నీలమ్‌లో మంచు చరియలు విరిగిపడ్డ గ్రామాల్లో కొన్నింటిని చేరుకోవడానికి సహాయ చర్యల్లో పాల్గొనేవారికి మూడు రోజుల దాకా సమయం పట్టింది.

అప్పటికి చనిపోయిన చాలా మందికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. గాయపడ్డవారిని తీసుకువెళ్లేందుకు హెలికాప్టర్లు వస్తాయని వారి బంధువులు ఎదురుచూస్తూ ఉన్నారు.

వివాదాస్పద కశ్మీర్ ప్రాంతాన్ని విభజిస్తున్న నియంత్రణ రేఖ పక్కనే ఈ నీలమ్‌ వ్యాలీ ఉంది.

సుర్గున్‌లో చనిపోయినవాళ్లలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే. ఈ సీజన్‌లో చలి ఎక్కువగా ఉండటం వల్ల పాఠశాలలు మూసేస్తారు. చిన్నారులు ఎక్కువగా ఇళ్ల వద్దే ఉంటారు.

మంచు కింద తనకు సమాధిలో ఉన్నట్లు అనిపించిందని షకీలా అన్నారు.

‘‘అంతా మౌనం. పైనుంచి మనుషుల మాటలు వినిపించాయి. వాళ్లకు నా మాటలు వినపడలేదో, లేక నేను ఎక్కడున్నానో గుర్తించలేకపోయారో తెలియదు. ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది. నేను బతకనని నిర్ణయానికి వచ్చా. అంతా చీకటిగా మారింది. మంచు కింద కొన్ని యుగాలు ఉన్నట్లు అనిపించింది. అస్సలు కదల్లేకపోయా. నా కాళ్లు, ఓ చెక్క ముక్కకు గట్టిగా ఒత్తుకుని ఉన్నాయి’’ అని చెప్పారు.

‘‘నా కూతురు నా పక్కనే పడి ఉందని అనుకున్నా. చిన్న కదలిక వల్ల కూడా ఆమెకు ఏదైనా జరగొచ్చన్న భయంతో ఆమెను ముట్టుకునే ప్రయత్నం చేయలేదు. అంతా నిశ్శబ్దంగా మారిన తర్వాత, నేను కూడా అరవడం, ఏడవడం ఆపేశా. ఇక ఏ క్షణమైనా చనిపోవచ్చని అనుకున్నా. చలి, నొప్పి అనిపించడం ఆగిపోయింది. నా తల్లిదండ్రులు, ఊళ్లోవాళ్లంతా ఏమైపోయారా అని ఆలోచించా. కరాచీలో ఉంటున్న నా భర్తకు ఈ విషయం తెలుస్తుందా అని అనుకున్నా. పాత జ్ఞాపకాలన్నీ మదిలో మెదిలాయి’’ అని చెప్పారు షకీలా.

అప్పుడే ఆమెకు మంచు చరియలు పడ్డ సమయంలో తన కూతురి బొమ్మ టార్చిలైట్ తన చేతిలోనే ఉందన్న విషయం గుర్తుకువచ్చింది. ఆ టార్చిలైట్ ఇంకా ఆమె పక్కనే ఉంది.

దాన్ని ఆన్ చేసి, పైవైపు తిప్పి పెట్టారు షకీలా.

‘‘చిమ్మ చీకట్లో ఆ టార్చిలైట్ వెలుతురు మంచు నుంచి బయటకు వచ్చింది. మేం అక్కడ ఉన్నామని మా ఊరివారికి తెలిసేలా చేసింది. వాళ్లే మమ్మల్ని బయటకు తీశారు. అప్పటికే నేను స్పృహ కోల్పోయా’’ అని ఆమె చెప్పారు.

‘‘తిరిగి మెలకువ వచ్చేసరికి, నన్ను ఓ సైనిక హెలికాప్టర్‌లోకి తరలిస్తున్నారు. నా కూతురు ఏమైందని అడిగా. నిద్రపోతోందని చెప్పారు. మరుసటి రోజు కరాచీ నుంచి నా భర్త అమ్జద్ ఆసుపత్రికి వచ్చారు. అప్పటికే ఆయన తన తల్లిదండ్రులు, కోడళ్లు, అల్లుళ్లకు అంత్యక్రియలు పూర్తి చేసేశారు. ముకద్దస్ కూడా ప్రాణాలతో లేదని నాకు చెప్పారు’’ అని షకీలా వివరించారు.

మొత్తంగా ఈ విపత్తులో షకీలా 11 మంది కుటుంబ సభ్యులను కోల్పోయారు.

మంచు చరియలు పడిన వార్త తెలుసుకున్న వెంటనే కరాచీ నుంచి తన ఊరికి అమ్జద్ పయనమయ్యారు. సుర్గున్‌కు సమీపంలోని ఓ పట్టణం దాకా ఆయన రాగలిగారు. మంచు వల్ల రోడ్లన్నీ మూసుకుపోవడంతో అక్కడి నుంచి సుర్గున్ చేరుకోవడానికి ఇంకో 22 గంటలు ఆయన నడిచి రావాల్సివచ్చింది.

మంచు చరియలు పడ్డ తర్వాత కూడా నీలమ్‌లో విపరీతంగా మంచు కురుస్తూనే ఉంది. గడ్డకట్టే చలిలో, ప్రభుత్వ రేషన్‌ సాయంతో అక్కడి వాళ్లు పూట గడుపుకుంటున్నారు. సహాయ చర్యలు ముగిశాయి. మృతులందరికీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఒకరి మృతదేహం మాత్రం లభ్యం కాలేదు.

అమ్జద్, షకీలాలకు ఒకే కూతురు. వాళ్లు ఈ మధ్యే సుర్గున్‌కు వచ్చారు. ఇప్పుడు ముకద్దస్ చనిపోవడంతో, ఆ ఊరికి తిరిగివెళ్లలేమని షకీలా అంటున్నారు.

‘‘ఆ జ్ఞాపకాలను నేను భరించలేను. నా కుటుంబం నాశనమైపోయిన ఆ ఊరికి తిరిగి ఎప్పటికీ వెళ్లను’’ అని ఆమె బాధపడుతూ చెప్పారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)