You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేరళ వరదలు: ‘హత్తుకొని పడుకునే ఆ పిల్లలు... అలాగే ప్రాణాలొదిలారు’
- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి, కేరళ నుంచి
''ఆ పిల్లలు కలిసే ఆడుకునే వారు, కలిసే పడుకునే వారు. ఎప్పుడూ ఒకరిని విడిచి మరొకరు ఉండేవారు కాదు. చివరికి ఇప్పుడు శిథిలాల కింద కూడా ఒకరినొకరు హత్తుకొనే కనిపించారు. వాళ్లిద్దరినీ కలిపే పూడ్చిపెట్టాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు'' అని చనిపోయిన అనఘ, అలీనల ఫ్యామిలీ ఫ్రెండ్ షిజో మాథ్య్యూ బీబీసీకి తెలిపారు.
భారీ వర్షాలతో కేరళలోని మలప్పురంలోని కవలప్పర్ర గ్రామంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో అక్కా చెల్లెళ్లు అనఘ, అలీనలు కన్నుమూశారు. ఈ ఇద్దరమ్మాయిలు.. అన్నదమ్ములైన విక్టర్, తోమాల పిల్లలు. వీరంతా ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. అన్నదమ్ములు వడ్రంగి,పెయింటింగ్ పని చేస్తున్నారు.
ఈ నెల 8న కొండ చరియలు విరిగిపడటం గమనించిన స్థానికులు ఇంట్లో ఉన్న కొందరిని తీసుకుని బయటకు వచ్చేశారు. కానీ, అనఘ, అలీనాలు ఇంట్లోనే చిక్కుకుపోయారు. వారిని తీసుకువచ్చే లోపే ఇల్లు కుప్పకూలింది.
ఈ ఘటన జరిగినప్పుడు తోమా ఇంటికి దూరంగా ఉన్నారు. వరదల వల్ల రోడ్లు కొట్టుకుపోవడంతో శనివారం ఆయన ఇంటికి చేరుకోలేకపోయారు.
ప్రమాదం జరిగిన రెండు గంటల తరువాత పిల్లలను వెతకడానికి విక్టర్ కొంతమందితో కలసి సంఘటన స్థలానికి వెళ్లారు. అక్కడ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. సహాయ చర్యలు చేపట్టడానికి కూడా అనువుగా లేదు. శుక్రవారం ఉదయానికి తోమా కూతురు అనఘాను శిథిలాల నుంచి బయటకు తీయగలిగారు. కాంక్రీటు శిథిలాలు విరిగి అడ్డుగా ఉండడంతో విక్టర్ కూతురు అలీనాను బయటకు తీయడం కుదరలేదు. అనఘాను ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే మరణించిందని వైద్యులు నిర్ధారించారు.
ఆసుపత్రి నుంచి తిరిగి అన్నదమ్ములిద్దరూ సహాయక చర్యలు జరుగుతున్న చోటుకు వెళ్లారు. అప్పటికే అలీనా మృతదేహాన్ని బయటకు తీశారు.
రెండు మృతదేహాలను ఒకే శవపేటికలో పెట్టి మలప్పురంలోని భూతనంలో సెయింట్ మేరీస్ చర్చి సమీపంలో పూడ్చిపెట్టారు.
సౌదీ అరేబియాలో పనిచేస్తున్న అష్రాఫ్ వరద ప్రమాదం గురించి తెలుసుకొని స్నేహితుల వద్ద అప్పు తీసుకొని హుటాహుటిన కేరళ వచ్చారు.
"వరదల గురించి తెలియగానే నా భార్య, బిడ్డకు ఫోన్ చేశాను. స్పందన రాలేదు. ఊళ్లో తెలిసిన వారికీ ఫోన్ చేస్తే కలవలేదు. దీంతో వెంటనే ఇక్కడికి వచ్చేశా. శిబిరాల్లో వెతికాను. వాళ్లను చూశాకే కుదుటపడ్డాను. నీటిలో మునిగిన ఊరిని చూస్తే గుండె బరువెక్కింది. నాకు తెలిసినవారు కొందరు ఇంకా శిథిలాల కిందే ఉన్నారు'' అని చెప్పారు.
శిథిలాల కింద 59 మంది ఉండొచ్చని జిల్లా ఎస్పీ అబ్దుల్ కరీం చెప్పారు. సహాయక చర్యలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు.
సోమవారం సాయంత్రానికి 20 మృతదేహాలను వెలికితీశారు. 40 అడుగుల లోతున ఉన్న మట్టి పెళ్లలను తొలగిస్తున్నారు.
అధికారిక సమాచారం ప్రకారం మంగళవారం నాటికి కేరళ వ్యాప్తంగా 91 మంది మరణించారు. రెండున్నర లక్షల మంది సహాయక శిబిరాలలో తలదాచుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- గోదావరి వరదలు: 12 రోజులుగా వరద ముంపులో ‘రంగస్థలం’ గ్రామం
- కేరళ వరదలు: తొమ్మిది జిల్లాల్లో రెడ్ అలర్ట్.. ‘నలభై ఏళ్ల తర్వాత ఇంత విధ్వంసం చూస్తున్నాం’
- మోదీ 'మ్యాన్ వర్సెస్ వైల్డ్'లో కనిపించడం వల్ల జిమ్ కార్బెట్కు వచ్చే లాభం ఏంటి...
- ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా శ్రీనగర్లో నిరసనలు.. అలాంటిదేమీ లేదన్న ప్రభుత్వం
- కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ
- టార్డిగ్రేడ్స్: చందమామపై చిక్కుకుపోయిన వేలాది 'మొండి' జీవులు.. ముప్పై ఏళ్ల తర్వాత నీటి తడి తాకినా బతికేస్తాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)