'ఏనుగుతోనే కలిసి పెరిగాను, అది నా కోసం చెమట చిందించింది... వచ్చే జన్మలోనైనా దాని రుణం తీర్చుకుంటా'

    • రచయిత, సునెత్ పెరెరా
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

నేను ఎదిగేటప్పుడు నా పెంపుడు జంతువులు పిల్లులు, కుక్కలు కాదు - ఏనుగులు.

రుడ్‌యార్డ్ కిప్లింగ్ రచించిన కాల్పనిక కథ జంగిల్ బుక్‌లో తోడేళ్లు పెంచిన క్యారెక్టర్ మోగ్లీ మాదిరిగా, నా జీవితంలోనూ జంతువులదే ప్రధానపాత్ర.

చిన్నప్పటి నుంచీ ఏనుగులను ఆలింగనం చేసుకుంటూ, వాటితో మాట్లాడుతూ పెరిగాను. వాటితో పండ్లు కూడా పంచుకున్నాను. ఏడేళ్ల వయసు నుంచే ఏనుగులతో తిరగడం మొదలుపెట్టా. జంగిల్ బుక్2లో మోగ్లీ బ్లాక్‌పాంథర్, ఎలుగుబంటిపై వెళ్లినట్టుగానే రోజూ సాయంత్రం ఏనుగుల స్నానం అయిపోయిన తర్వాత వాటిపై ఎక్కి ఇంటికి వెళ్లేవాడిని.

నా దృష్టిలో ఏనుగులు కేవలం జంతువులు కాదు. వాటితో నాకు అంతకుమించిన బంధం ఉంది.

దక్షిణ శ్రీలంకలోని రత్నపుర మా ఊరు. ఏనుగుల మందను పెంచుకుంటున్న అతి తక్కువ కుటుంబాల్లో మాది కూడా ఒకటి.

మా తాత వద్ద ఐదు ఏనుగులు ఉండేవి. వాటిలో మూడు మగ ఏనుగులు కాగా రెండు ఆడ ఏనుగులు. అందులో ఏకదంత అనే పెద్ద ఏనుగు ఉండేది. ఆ మందలో అదే పెద్దది.

మా నాన్న, తాత ఏకదంత అని పిలిచే ఆ ఏనుగును చూసుకునేవారు. ఏకదంత అంటే ఒకే దంతం ఉన్న ఏనుగు అని అర్థం. దంతాలున్న ఈ భారీ ఏనుగులకు దక్షిణ ఆసియా ప్రాంతంలో సాంస్కృతికంగానూ గుర్తింపు ఉంది. అయితే, ఆసియాలో కనిపించే అన్ని మగ ఏనుగులకు దంతాలు ఉండవు.

వన్యప్రాణి విభాగం లెక్కల ప్రకారం శ్రీలంకలో కనిపించే ఏనుగుల్లో కేవలం 2 శాతం ఏనుగులకే దంతాలు ఉండేవి. ఆఫ్రికాలో కనిపించే మగ, ఆడ ఏనుగులకూ దంతాలు ఉంటాయి.

అయితే, నేను ఏకదంతతో ఉండేవాడిని కాదు. చిన్న ఆడ ఏనుగు మణికె‌ పైన ఎక్కి వెళ్లేవాడిని.

మణికె అంటే గౌరవప్రదమైన స్త్రీ అని అర్థం.

ఏనుగు సవారీ...

ప్రతిరోజూ మా ఇంటికి సమీపంలో ఉన్న నది వద్దకు ఏనుగులను స్నానానికి తీసుకెళ్లేవారు. వాటిని చూసేందుకు మా తాతతో కలిసి నేను కూడా వెళ్లేవాడిని.

కొంచెం పెద్దయ్యాక కేవలం ఏనుగులను చూడడానికే కాకుండా మావటిలపై ఓ కన్నేసేందుకు అక్కడికి వెళ్లేవాడిని. మావటీలు గోడ్ (ముల్లుగర్ర లాంటి వస్తువు) తో ఏనుగులను ఇబ్బంది పెట్టకుండా చూడడం నా పని.

మణికె నీళ్లలో పడుకుంటే దాని మావటి ప్రేమరత్న దానిపై నీళ్లు చిలకరించి, కొబ్బరిపీచుతో రుద్దేవాడు. నీళ్లు చిలకరించే ముందు ఏనుగుకు నమస్కరించి ప్రార్థన చేసేవాడు.

ప్రేమరత్న మీసాలు పెంచుకుని, పొట్టిగా, ముందు పళ్లు ఊడిపోయి ఉండేవాడు. మణికె వల్ల ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనలో అతని ముందు పళ్లు ఊడిపోయాయి.

ఏనుగుల ఒళ్లు రుద్దేందుకు మావటీలు కొబ్బరి పీచులు వాడేవారు.

ప్రేమరత్న తన గోడ్ పెద్దగా వాడేవాడు కాదు. ఏనుగును నిద్ర లేపేందుకు, లేదంటే ముందుకు వెళ్లమనేందుకు ''దహ దహ'' అంటూ అదిలించేవాడు.

అయితే, మణికె కావాలనే అతని ఆజ్ఞలు పట్టించుకోనట్టు ఉండేది. మణికె అతని మాటలు పట్టించుకోకపోవడంతో నెమ్మదిగా స్వరం పెంచేవాడు.

ఆ తర్వాత కోపం వచ్చినట్టు నటిస్తూ, కర్ర కోసం వెతుకుతున్నట్టు అటూ ఇటూ తిరిగేవాడు.

''నేను మళ్లీ మళ్లీ చెప్పను.. ఈ ఏనుగు చెవిటిదైందా? భగవంతుడా.. '' అని వేడుకునేవాడు.

కానీ, దానిని ఎప్పుడూ ఇబ్బందిపెట్టేవాడు కాదు. నా ముందు ఎప్పుడూ అలా చేయలేదు.

నది ఒడ్డున ఒక రాయిపై కూర్చుని రోజూ ఈ తంతు చూసేవాడిని.

ఒక పది, పదిహేను నిమిషాలు కేకలు వేసిన తర్వాత మణికె నెమ్మదిగా లేచి తన కాళ్లు పైకెత్తి నిల్చుని, తొండంతో వయ్యారంగా నీళ్లు చల్లుకునేది. స్నానం పూర్తయ్యాక ఇంటికి బయలుదేరేది.

అప్పుడు నేను ''మణికె నీ చెయ్యివ్వు'' అని వినయంగా అడిగేవాడిని.

వెంటనే నేను పైకి ఎక్కేందుకు వీలుగా తన ముందు కాలును చాచేది.

దాని శరీరం తడిగా ఉన్నప్పటికీ ఇంటికెళ్లేప్పటికి నా బట్టలు ఆరిపోతాయని తెలిసే పైకి ఎక్కేవాడిని.

ఒక్కోసారి నా ప్యాంటులో నుంచి ఏనుగు వెంట్రుకలు సూదుల్లా గుచ్చుకునేవి.

చిన్నపిల్లాడు ఏనుగుపై సవారీ చేస్తున్నాడని రోడ్డుపై వెళ్తున్న జనం ఆశ్చర్యంగా చూసేవారు.

ఇంటికి చేరుకున్న తర్వాత మణికె తన కాలును మళ్లీ ముందుకు చాచేది. నేను పైనుంచి కిందకు దిగేవాడిని.

అదొక స్టేటస్ సింబల్

ఏనుగులు, అందులోనూ దంతాలున్న ఏనుగులు శ్రీలంకలో స్టేటస్ సింబల్.

శ్రీలంకలో సంపన్న జీవనానికి, ఉన్నత స్థితికి ఆనవాళ్లు ఏనుగులు.

అయితే, స్టేటస్‌తో పాటు పని కోసం, బుద్ధిజం ఊరేగింపులలో ఏనుగులను ఉపయోగించేవారు.

1970 లెక్కల ప్రకారం శ్రీలంకలో 378 మంది ప్రైవేట్ యజమానుల వద్ద 532 ఏనుగులు ఉన్నట్లు అంచనా.

కానీ ప్రస్తుతం 47 మంది వద్ద 97 ఏనుగులు మాత్రమే ఉన్నాయని క్యాప్టివ్ ఎలిఫెంట్ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి చెప్పారు.

శ్రీలంకలో చాలా మంది పిల్లల్లాగే నేను కూడా నాకు ఇష్టమైన ఏప్రిల్ నెల కోసం ఎదురుచూసేవాడిని.

ఆ నెలలో సింహళ హిందూ సంవత్సరాది మొదలువుతుంది. స్కూళ్లకు చాలా రోజులు సెలవులు కూడా ఉంటాయి.

నా వయస్సు వాళ్లంతా కొత్త బట్టలు, బహుమతుల కోసం ఎదురుచూస్తుంటే, నాకు మాత్రం ఏనుగులు తిరిగి రావడం ఆనందం కలిగించేది.

అక్కడ వాటిని భారీ చెట్లను తరలించేందుకు ఉపయోగించేవారు.

ఈ ఉత్సవాల సమయంలో పనులు తాత్కాలికంగా ఆగిపోవడంతో ఏనుగులు ఇంటికి తిరిగి వచ్చేవి. మారుమూల ప్రాంతాల నుంచి తిరిగి వచ్చేందుకు కొన్నిసార్లు వారాలు కూడా పట్టొచ్చు.

గొలుసులు, వాటి మెడలో వేలాడుతున్న గంట శబ్దాలు ఏనుగులు వస్తున్నట్లు తెలియజేసేవి.

అవి ఇంటికి దగ్గరగా వస్తున్నకొద్దీ వాటి వేగం, గొలుసులు, గంటల చప్పుడు కూడా ఎక్కువయ్యేది.

తిరిగి వచ్చే ఏనుగులకు ప్రధాన ద్వారం వద్ద అరటిపండ్లు, చెరకు గడలు, సముద్రపు ఉప్పు లేదా చింతపండుతో ఘన స్వాగతం పలికేవారు.

అవి వాటి తొండం ఇంటి లోపలికి పెట్టి మమ్నల్ని పసిగట్టేవి. తొండం చివరలో వేలులా ఉండే దానితో చిన్నచిన్న వస్తువులను పట్టుకునేవి.

ఆసియా ఏనుగులకు ఒక వేలు ఉండేది, అదే ఆఫ్రికన్ ఏనుగులకు రెండు ఉంటాయి.

మణికె ఎప్పుడూ నా వైపే వచ్చేది. ఏదైనా ఆహారం పెట్టినప్పుడు మెల్లగా చెవులు ఆడిస్తూ, ఆప్యాయత చూపేది.

ఏనుగు పేడ, మూత్రం సువాసన నేను సెలవుల్లో ఉన్నానని గుర్తు చేసేది.

ఇంటి వెనక ప్రాంతంలో కొట్టంలో ఏనుగులు ఉండేవి. కొన్నివారాల తర్వాత మళ్లీ పని ప్రదేశాలకు తీసుకెళ్లేవారు.

ఇంట్లో ఉంటే సురక్షితంగా భావించేవి. గంటల తరబడి గురకపెడుతుండేవి.

వాటి నుంచి లయబద్దంగా వచ్చే శబ్దాలను వినేవాడిని. అవి చెవులను సుతారంగా కదిలిస్తూ ఉండేవి. చాలా బాగుండేది.

ఆహారం తినేటప్పుడు కూడా కొన్నిసార్లు చిన్నచిన్న శబ్దాలు చేసేవి.

అన్నింటికంటే ముఖ్యంగా, చీకటి పడిన తర్వాత ఈ శబ్దాలు విన్నప్పుడు ఆనందంగా అనిపించేది.

వెన్నెల వెలుగులోనూ ఏనుగు తలపై ఎత్తుపల్లాలను దూరం నుంచి కూడా గుర్తించగలను.

గొలుసులతో బందీగా...

ఇళ్లలో ఉండే ఏనుగులు ఎప్పుడూ చైన్‌లతోనే కట్టేసి ఉండేవి.

గత జన్మలో ఏనుగులు మనుషులై వాటి యజమానులకు రుణపడి ఉండి ఉంటాయని, వారి కోసం పనిచేయడం ద్వారా ఈ జన్మలో రుణం చెల్లిస్తున్నాయని శ్రీలంకలో ఒక నమ్మకం ఉండేది.

1990లలో శ్రీలంకలో టింబర్ డిపో పరిశ్రమ దాదాపు మూతపడిపోవడంతో ఏనుగుల నుంచి ఆదాయం రావడం ఆగిపోయింది. కానీ, అప్పటికే మా మూడు ఏనుగులకు రుణం తీరిపోయింది.

నాకు ఐదేళ్లు ఉన్నప్పుడు ఏకదంత చనిపోవడం నాకు ఇంకా గుర్తుంది.

జబ్బు పడిన ఏకదంతకు కొన్ని నెలలు వైద్యం అందించినా అది బతకలేదు. ఇంటి వెనుకే దానిని పూడ్చిపెట్టారు.

టూరిస్టు సఫారీలు

1990ల చివరికి టింబర్ వ్యాపారం స్థానంలో కొత్త ఉపాధి మార్గాలు వచ్చాయి. విదేశీ టూరిస్టులను ఏనుగుపై ఎక్కించి సవారీ చేయించేవారు.

నేను 8వ గ్రేడ్ చదువుతున్న మణికెను ఉత్తర శ్రీలంకలోని హరబనా పట్టణానికి పంపించారు. 200 కిలోమీటర్ల దూరం ఉండే ఆ టౌన్‌లో రిసార్టులు ఉండేవి.

అప్పటివరకూ అది ఎప్పుడూ లారీ ఎక్కింది లేదు.

ఎప్పటిలాగే లారీలోకి ఎక్కమని ప్రేమరత్న అదిలించాడు.

కానీ, ఈసారి అతను చెప్పింది వినపడనట్టు నటించలేదు అది. చాలా భయపడిపోయింది. చాలా సార్లు పేడ వేసింది. మూత్రం పోసింది. దానిలో భయం కనిపించింది.

మొదట తన ముందు కాళ్లు ట్రక్కులో పెట్టింది. కానీ, లారీలోకి ఎక్కేందుకు అది ఒప్పుకోలేదు. వెనక కాళ్లు కింద పెట్టి అలాగే చాలాసేపు ఉంది.

చాలా గంటలు శ్రమించిన తర్వాత ఎట్టకేలకు అది లారీలోకి ఎక్కింది. అది చూసేందుకు రోడ్డు పక్కన చాలా మంది జనాభా గుమిగూడారు.

అది లారీలో ఎక్కినప్పటి నుంచి కంటికి కనిపించేంత వరకూ దానినే చూస్తూనే ఉన్నాను.

దానిని చాలా దూరం తీసుకెళ్లిపోయారు. నాకు బాధగా అనిపించింది.

మళ్లీ కలుద్దాం మణికె అని మనసులో అనుకున్నాను.

చివరి రోజుల్లో...

మేము సంవత్సరానికి ఒకటి లేదా రెండుసార్లు మణికెని దగ్గరికి వెళ్లేవాళ్లం. ప్రతి ఏప్రిల్‌లో ఇంటికి వచ్చేది. కొన్నివారాల పాటు ఇక్కడే ఉండేది. దానికి లారీ ప్రయాణం అలవాటు అయిపోయింది.

మణికెకు అరవై ఏళ్లు వస్తున్నాయి. కానీ, ఏనుగుకు రిటైర్మెంట్ ఏమీ ఉండదు.

సాధారణంగా అవి పనిచేస్తూనే ఉంటాయి. చివరి వరకూ సాంస్కృతిక కార్యక్రమాలకు తీసుకెళ్తూనే ఉంటారు.

చివరికి మా నాన్న మణికెని ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. అయితే అందుకు బాగా ఖర్చయ్యేది. కానీ, మణికెను మళ్లీ పనికి పంపించలేదు.

2006 చివర్లో మా ఊరికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొబ్బరి తోటకు పంపించారు. అక్కడ కొబ్బరి ఆకులు, ఇతర ఆహారం బాగా లభించేది.

అదే, మణికె ఆఖరి ప్రయాణమని దానికి గానీ, నాకు గానీ తెలియదు.

కొన్ని రోజుల తర్వాత మణికె ఆరోగ్యం చెడిపోయింది. చికిత్స చేయించే సమయంలో మేము దానిని చూడడానికి వెళ్లాం.

మణికె ఒక పెద్ద కొబ్బరి తోటలో పడి ఉంది.

పైకి లేచేందుకు కూడా శక్తి లేదు. ఆహారం పెట్టేందుకు ప్రయత్నించినప్పుడు మమ్మల్ని పసిగట్టి మా వైపు వేలు చూపించింది.

నేను దాని నుదుటిపై చేయివేసి నిమిరాను. చీకటి పడే సమయానికి ఇంటికి తిరిగొచ్చాం.

మరుసటి రోజు ఉదయం విషాదకరమైన ఫోన్ కాల్ వచ్చింది. మణికె రుణం తీరిపోయింది అని.

దాని అంత్యక్రియలకు వెళ్లి నివాళులర్పించాను. కొబ్బరి తోట మధ్యలో పడి ఉన్న మణికె‌ ముఖం తెల్లటి గుడ్డతో కప్పేశారు. బౌద్ద సన్యాసులు అంత్యక్రియలు నిర్వహించారు.

శకం ముగిసింది...

ఏనుగులను కౌగిలించుకోవడం, వాటితో మాట్లాడటం, పండ్లు పంచుకుని తినడం నేర్చుకుంటూ పెరిగాను.

మణికె నాకు జీవితాంతం తోడుగా ఉంటుందనుకున్నాను.

నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను పెంచి చదువు చెప్పించినా, అందుకోసం అది చెమటోడ్చింది.

నాలో ఏనుగు రక్తం ఉండకపోవచ్చు, కానీ ఏనుగు నన్ను పెంచిందని భావిస్తున్నాను.

నేను మళ్లీ మణికెని కలుసుకోలేను. కానీ, లండన్‌లోని బీబీసీ కార్యాలయానికి వెళ్తున్నప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి.

మణికె ముఖం గుర్తొచ్చి విషాదం తన్నుకొచ్చింది.

నేను మణికెను ప్రేమించాను. కానీ, ఎందుకు నేను దానిని చైన్లతో బంధించాను?

మణికెతో 20 ఏళ్లు గడిపినా కనీసం ఫోటో తీసుకోకపోవడం చాలా బాధగా ఉంది.

మణికెను కోల్పోతానని నేనెప్పుడూ అనుకోలేదు.

ఇప్పుడు మళ్లీ మణికె వస్తే ఫోటో తీయను, చైన్లు తీసేసి స్వేచ్ఛగా విహరించేలా చేస్తాను.

చివరిసారిగా దాని కళ్లలోకి చూసి ధన్యవాదాలు చెప్పాను.

నిజంగా మరణం తర్వాత మరో జీవితం ఉంటే, నేను దాని రుణం చెల్లిస్తాను.

గుడ్‌బై మణికె.

ఇవి కూడా చదవండి: