భోళాశంక‌ర్ రివ్యూ: యాక్షన్, ఎంటర్టైన్‌మెంట్, కామెడీ అన్నీ ఉన్న వేదాళంను రీమేక్ చేసినా..

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం

చిరంజీవికి రీమేక్ చిత్రాలు బాగా క‌లిసొచ్చాయి. ఆయ‌న్ని మెగాస్టార్‌గా మార్చిన సినిమాల్లో చాలా వ‌ర‌కూ రీమేక్‌లు ఉన్నాయి.

తొమ్మిదేళ్ల త‌ర‌వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన‌ప్పుడు కూడా ఆయ‌న రీమేక్‌నే న‌మ్ముకొన్నాడు.

సైరా, ఆచార్య లాంటి స్ట్ర‌యిట్ చిత్రాలతో ఫ్లాపులు వ‌చ్చిన‌ప్పుడు `గాడ్ ఫాద‌ర్‌` కోసం రీమేక్‌పై ఆధార‌ప‌డ్డారు.

`ఓ మంచి సినిమా వేరే భాష‌లో వ‌చ్చినప్పుడు.. మ‌న ప్రేక్ష‌కుల కోసం దాన్ని రీమేక్ చేస్తే త‌ప్పేంటి` అనేది చిరు వాద‌న‌.

అదీ నిజ‌మే. మంచి అనేది ఎక్కడ‌, ఏ రూపంలో ఉన్నా, దాన్ని అందిపుచ్చుకోవ‌డంలో త‌ప్పేం లేదు. పైగా సెంటిమెంట్‌గా క‌లిసి వ‌చ్చినప్పుడు అస్స‌లు వ‌ద‌ల‌కూడ‌దు.

అందుకే త‌మిళ `వేదాళం` చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో `భోళా శంక‌ర్‌`గా తీసుకొచ్చారు.

చిరుకి అచ్చొచ్చిన రీమేక్ క‌థ కావ‌డం, పైగా `వేదాళం`లో చిరుకి స‌రిప‌డా యాక్షన్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉండ‌డం, వాల్తేరు వీర‌య్య లాంటి సూప‌ర్ హిట్‌ త‌ర్వాత వ‌స్తున్న సినిమా కావ‌డంతో... `భోళా`పైనా అంచ‌నాలు పెరిగాయి.

మ‌రి ఈ రీమేక్ చిరుకి ఎలాంటి ఫ‌లితాన్ని ఇచ్చింది. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత మెగా ఫోన్ ప‌ట్టిన మెహ‌ర్ ర‌మేష్‌కి హిట్ అందిందా, లేదా?

కోల్‌కతాలో ప్రారంభించి..

కోల్‌కతాలో మహిళల అక్రమ రవాణా ఎక్కువ‌గా జ‌రుగుతుంటుంది.

అక్క‌డో ముఠా... అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి, విదేశాల‌కు త‌ర‌లిస్తుంటుంది.

పోలీసులు మొత్తం ఆ మాఫియాని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు.

కానీ ఎలాంటి క్లూ దొర‌కదు. అలాంటి చోట‌..శంక‌ర్ (చిరంజీవి) త‌న చెల్లాయి మ‌హా (కీర్తి సురేష్‌)ని తీసుకొని అడుగుపెడ‌తాడు.

మ‌హా.. ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్‌. కోల్‌కతాలోని ఓ కాలేజీలో చేరుతుంది.

శంక‌ర్‌.. టాక్సీ న‌డుపుతూ జీవ‌నం సాగిస్తుంటాడు.

ఈ మాఫియాకు సంబంధించిన ఓ క్లూ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి ఇచ్చి.. అందులో కొంత‌మందిని ప‌ట్టిస్తాడు శంక‌ర్‌.

దాంతో శంక‌ర్‌పై ముఠా నాయ‌కుడు అలెక్స్ ప‌గ పెంచుకుంటాడు.

శంక‌ర్‌ని ఎలాగైనా ప‌ట్టుకోవాల‌ని త‌న కోసం గాలిస్తుంటాడు.

మ‌రి అలెక్స్ గ్యాంగ్‌కి శంకర్ దొరికాడా, లేదా? శంక‌ర్ హైద‌రాబాద్ నుంచి కోల్‌కతా ఎందుకు వ‌చ్చాడు? త‌న ముఖ్య ఉద్దేశం ఏమిటి? శంక‌ర్ - మ‌హా గ‌త‌మేంటి? ఈ విష‌యాలు తెలియాలంటే `భోళా శంక‌ర్‌` చూడాల్సిందే.

రెగ్యుల‌ర్ ట‌చ్‌లోనే...

క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు కొన్ని కొల‌త‌లు ఉంటాయి.

హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్‌, పాట‌, ఫైటూ, కొంచెం కామెడీ, ఇంకొంచెం రొమాన్స్‌.. ఇలా ఈ ప‌ద్ధ‌తిలోనే సాగుతుంటాయి.

భోళా శంక‌ర్ అందుకు మిన‌హాయింపేం కాదు. కోల్‌కతాలో జ‌రుగుతున్న‌ మహిళల అక్రమ రవాణా గురించి చెబుతూ, ఆ ముఠా నాయ‌కుడు అలెక్స్‌ని ప‌రిచ‌యం చేస్తూ ఈ క‌థ మొద‌లెట్టారు.

ఆ వెంట‌నే.. శంక‌ర్ పాత్ర‌లో చిరు ఎంట్రీ ఇచ్చేస్తాడు. వాళ్ల ప‌రిచ‌యం, మ‌హాని కాలేజీలో జాయిన్ చేయ‌డం, లాస్య (త‌మ‌న్నా)తో శంక‌ర్ గొడ‌వ‌, కోర్టు సీన్లూ... ఇలా ఓ సీన్ త‌ర‌వాత మ‌రోటి వ‌చ్చిపోతుంటాయి.

కానీ సీన్‌లో ఉన్న ఏ ఎమోష‌నూ థియేట‌ర్లో కూర్చున్న ప్రేక్ష‌కుడి మ‌న‌సుకు ట‌చ్ అవ్వ‌దు.

పైగా ప్ర‌తీ సీన్‌.. నిమిషాల కొద్దీ సుదీర్ఘంగా సాగుతుంది.

చిరు - వెన్నెల కిషోర్ మ‌ధ్య న‌డిచే ఇంట‌ర్వ్యూ ద‌గ్గ‌రే... ద‌ర్శ‌కుడు మ‌రీ పాత‌కాలం నాటి పోక‌డ‌ల ద‌గ్గ‌ర ఆగిపోయాడ‌న్న సంగ‌తి ప్రేక్ష‌కుల‌కు అర్థ‌మ‌వుతుంది.

ఆ త‌ర్వాత త‌మ‌న్నాతో కోర్టు సీన్ సైతం స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుంది.

నిజానికి చిరు కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. త‌న‌దైన మార్క్‌తొ న‌వ్విస్తారాయ‌న‌.

అలాంటి నటుడితోనూ.. ఫ‌న్ పండించ‌లేక‌పోయాడు ద‌ర్శ‌కుడు.

`మీ చెల్లి చూపులుతోనే పెళ్లి చూపులు అయిపోయాయి` లాంటి కొన్ని డైలాగులు మరీ ప్రాస కోసం పెట్టిన‌ట్టు అనిపించింది.

చిరంజీవి ఇమేజ్‌ని, ఆయ‌న స్టామినానీ, ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న ద‌క్కించుకొన్న స్థానాన్నీ మ‌ళ్లీ.. మ‌రోసారి గుర్తు చేయ‌డానికి అన్న‌ట్టు.. `సినిమాల్లో ట్రై చేస్తే ఎక్క‌డో ఉంటావు.. ద‌శాబ్దాల పాటు నెంబ‌ర్ వన్‌గా కొన‌సాగుతావు` లాంటి డైలాగులు చొప్పించారు.

ఇవ‌న్నీ అన‌వ‌స‌ర‌మైన ప్ర‌యాస‌లే అనిపిస్తాయి.

ఖుషి సీన్ రీ క్రియేట్‌

విశ్రాంతి ఘ‌ట్టంలో... శంక‌ర్ కాస్త భోళా శంక‌ర్‌గా మారి త‌న విశ్వ‌రూపం చూపిస్తాడు.

అక్క‌డో ట్విస్టు కూడా ఇచ్చాడు ద‌ర్శ‌కుడు. దాంతో ఫ‌స్టాఫ్ ఎలాంటి ఆస‌క్తీ క‌లిగించ‌క‌పోయినా, సెకండాఫ్ చూడాల‌న్న కూతూహ‌లాన్ని కాస్త కలిగించాడు.

ఫ్లాష్ బ్యాక్‌తో ద్వితీయార్థం మొద‌ల‌వుతుంది. అక్క‌డ బ‌స్తీ దాదాగా చిరంజీవిని ప‌రిచ‌యం చేస్తారు.

హైద‌రాబాద్ గ‌ల్లీల్లో శంక‌ర్ దాదాగా చిరు చేసే దందాల‌తో కొన్ని సీన్లు న‌డిపించారు. మ‌హా ఇంట్లో చిరు గ్యాంగ్ చేసే అల్ల‌రితో స‌న్నివేశాల్ని నింపేశారు.

అయితే ఎక్క‌డా ఫ‌న్ ఎలిమెంట్ అనేది వర్క‌వుట్ అవ్వ‌లేదు.

`ఖుషి`లోని మోస్ట్ పాపుల‌ర్ అయిన `న‌డుము సీన్‌` ఈ సినిమాలో రీ క్రియేట్ చేశారు.

చిరంజీవి, శ్రీ‌ముఖి మ‌ధ్య‌సాగిన ఆ స‌న్నివేశం పవ‌న్ అభిమానుల‌కు న‌చ్చొచ్చు. కానీ.. ఇప్ప‌టికే ఈ సీన్‌ని కొన్ని వంద‌ల సార్లు వాడేశారు.

దాంతో.. అక్క‌డా ద‌ర్శ‌కుడు కొత్త‌గా ఆలోచించ‌లేక‌పోయాడ‌నిపిస్తుంది.

మ‌హా అమ్మానాన్న‌ల‌పై విల‌న్ గ్యాంగ్ ఎటాక్ చేయ‌డం ద‌గ్గ‌ర్నుంచి క‌థలోకి సీరియ‌స్‌నెస్ వ‌స్తుంది. కాక‌పోతే.. త‌ర‌వాత ఏం జ‌ర‌గ‌బోతోంది? ఈక‌థ‌కు ఎలాంటి ముగింపు రాబోతోంది? అనే విష‌యాలు ప‌సిగ‌ట్ట‌డం అంత క‌ష్ట‌మేం కాదు.

రివైంజ్ అనేది వ్య‌క్తిగ‌తంగా ఉన్న‌ప్పుడు ఆ ఇంపాక్ట్ ఇంకా బలంగా ఉంటుంద‌ని స్క్రీన్ ప్లే పాఠాలు చెబుతుంటాయి.

ఈ క‌థ‌లో రివైంజ్ హీరో వ్య‌క్తిగ‌తం కాదు. దాంతో.. ఆ పాత్ర‌కు, త‌ను ప‌డుతున్న తాప‌త్ర‌యానికీ ప్రేక్ష‌కుడు రిలేట్ అవ్వ‌డం క‌ష్టం.

తెర‌పై ఎన్ని భీక‌ర‌ పోరాట ఘ‌ట్టాలు రూపొందిస్తున్నాం అనేది ముఖ్యం కాదు. ఆ ఫైట్‌లోనూ ఎంత ఎమోష‌న్ తీసుకొస్తున్నాం అనేదే కీల‌కం.

ఈ సినిమాలో ఫైట్స్ ఎక్కువే ఉన్నాయి. వాటిని స్టైలీష్‌గా తీశారు కూడా. కానీ.. ఎమోష‌న్ ప‌రంగా క‌నెక్ట్ అవ్వ‌లేదు.

ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌లూ కూడా అప్‌డేట్ అవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న సంగ‌తి `భోళా శంక‌ర్` గుర్తు చేస్తుంటుంది.

త‌ల‌పై ఓ దెబ్బ ప‌డ‌గానే గ‌తం మ‌ర్చిపోవ‌డం, మ‌రి కొన్నాళ్ల‌కు మ‌రో దెబ్బ‌తో... గ‌తం గుర్తొచ్చేయ‌డం, ఇలాంటి సీన్లు చూసే బాధ ప్రేక్ష‌కుల‌కు త‌ప్పుతుంది.

మెహ‌ర్ ర‌మేష్ లాజిక్ అనే మాట ప‌క్క‌న పెట్టి ఈ సినిమా తీశాడ‌నిపిస్తుంటుంది.

`వేదాళం` క‌థ‌ని 70 శాతం మార్చాను అని మెహ‌ర్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. అయితే... ఆ మార్పులు ఏమాత్రం క‌ల‌సి రాలేదు.

ఈజ్ ఉంది బాస్‌.. కానీ

చిరు వ‌య‌సు 67 ఏళ్లు. ఈ వ‌య‌సులోనూ ఆయ‌న‌లోని ఈజ్ ఎక్క‌డికీ పోలేదు.

కెమెరా ముందు హుషారుగా క‌దులుతున్నారు. స్టెప్పులు వేస్తున్నారు. గ్రేస్ కూడా ఉంది.

త‌న అభిమానులకి ఏం కావాలో అవ‌న్నీ ఇచ్చే ప్ర‌య‌త్నం చిరు నుంచి జ‌రిగిపోయింది.

అయితే ఫైట్లు, డాన్సులు, మేన‌రిజాలూ ఇవ‌న్నీ అభిమానులూ చాలా కాలంగా చూస్తూనే ఉన్నారు.

వాళ్ల‌కు సైతం కొత్త‌గా ఏమైనా కావాలి. అది ఈ సినిమాతో చిరు ఇవ్వ‌లేక‌పోయారు.

త‌మ‌న్నా పాత్ర‌కు క‌థ‌లో ప్రాధాన్యం లేదు. ద్వితీయార్థంలో త‌ను క‌నిపించే స‌న్నివేశాలు చాలా త‌క్కువ‌.

చిరు చెల్లాయిగా కీర్తికి మంచి పాత్ర ద‌క్కింది. అయితే అన్నా చెల్లెళ్ల మ‌ధ్య బాండింగ్ మాత్రం ద‌ర్శ‌కుడు స‌రిగా చూపించ‌లేకపోయాడు.

విల‌న్ గ్యాంగ్ అంతా స్టైలీష్‌గా ఉన్నారు. చిన్న పాత్ర‌ల‌కు సైతం పేరున్న న‌టుల్ని తీసుకొచ్చారు.

చిరు చుట్టూ జ‌బ‌ర్‌ద‌స్త్ క‌మెడియ‌న్స్ చాలామంది ఉన్నారు. కానీ వాళ్ల‌లో ఒక్క‌రికి కూడా గుర్తు పెట్టుకొనేంత డైలాగ్ కూడా ఇవ్వ‌లేదు.

ఆ పాట‌లేవీ?

చిరు సినిమా ఎలాగున్నా, సంగీత ప‌రంగా నిరాశ ప‌ర‌చ‌దు.

ఆయ‌న సినిమాల‌న్నీమ్యూజిక‌ల్ హిట్సే.

డిజాస్ట‌ర్‌గా మిగిలిన ఆచార్య‌లోనూ మంచి పాట‌లు వినే అవకాశం ద‌క్కింది.

అయితే `భోళా శంక‌ర్‌`లో ఆ మ్యాజిక్ లేదు. చిరు సిగ్నేచ‌ర్ స్టెప్పులేస్తున్నా స‌రే.. పాట మైండ్‌కి ఎక్క‌లేదు.

మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ చిరు స్థాయికి త‌గిన పాట‌ల్ని ఇవ్వ‌డంలో త‌డ‌బడ్డాడు.

భోళా మానియా పేరుతో ఇచ్చిన సౌండ్ ట్రాక్ మాత్రం బాగుంది.

కెమెరా ప‌నిత‌నం, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఇవ్వ‌న్నీ రిచ్ లుక్ తీసుకొచ్చాయి. మాట‌ల్లో మెరుపుల్లేవు. కొన్న‌యితే మ‌రీ పేల‌వంగా ఉన్నాయి.

ప‌దేళ్ల త‌ర‌వాత మెహ‌ర్‌ ర‌మేష్‌కి మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్టుకొనే ఛాన్స్ వ‌చ్చింది. పైగా త‌న‌కిష్ట‌మైన హీరో దొరికాడు.

మినిమం గ్యారెంటీ ఇవ్వ‌గ‌లిగే క‌థ ఉంది. అయినా స‌రే.. ఈ వ‌న‌రుల్ని మెహ‌ర్ ఏమాత్రం వాడుకోలేక‌పోయాడు.

మొత్తంగా చెప్పాలంటే చిరు వీరాభిమానుల్ని సైతం నిరాశ ప‌రిచే ప్రొడెక్ట్ ఇచ్చాడు.

(రివ్యూలో అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)