కామెడీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ 2018 విజేతలు వీళ్లే

మనుషులకున్న హావభావాలన్నీ జంతువులకు లేకపోయినా, కొన్ని సందర్భాల్లో వాటి హావభావాలు నవరసాలను పోలి ఉంటాయి. సరిగ్గా అలాంటి సమయంలోనే వాటిని క్లిక్..మనిపించిన ఫోటోలు ప్రత్యేకం.

అలాంటి ఫోటోల్లో కొన్ని 2018 కామెడీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ పోటీలకు ఎన్నికయ్యాయి. అందులో ఈ షాక్‌కు గురైనట్లున్న ఉడత ఫోటో మొదటి బహుమతి సంపాదించుకుంది.

మేరీ మెక్ గోవాన్ తీసిన ఈ ఉడత ఫోటో మొదటి అవార్డును సంపాదించుకుంది. పీపుల్స్ చాయిస్ అవార్డుతోపాటు, క్రీచర్స్ ఆఫ్ ద ల్యాండ్ అవార్డునూ సొంతం చేసుకుంది.

ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని, ‘భూ..’ అంటూ పిల్లలతో ఆడుకున్నట్లు కనిపించే ఈ గుడ్లగూబను షేన్ కీనా అనే వ్యక్తి ఫోటో తీశారు. ఈ ఫోటోకు ‘క్రీచర్స్ ఆఫ్ ద ఎయిర్’ ప్రైజ్ వచ్చింది.

ఎంతటి చతురులైనా సముద్రంలోని షార్క్‌ను నవ్వించగలరా? అంతపెద్ద జీవిని నవ్వించాలంటే ఎంత పెద్ద జోక్ వేయాలి..!

కానీ తానియా హోప్పర్‌మాన్ ఏం మాయ చేశారో లేక నిజంగా జోకే వేశారో కానీ, సముద్రంలో ఒక బ్లూ షార్క్ నవ్వుతున్నట్లు తానియా ఫోటో తీశారు. ‘అండర్ ద సీ’ కేటగిరీలో ఈ ఫోటోకు ప్రైజ్ వచ్చింది.

భారత్‌కు చెందిన అర్ష్‌దీప్ సింగ్ తీసిన ‘ఆశ్చర్యంగా చూసే గుడ్లగూబ’ ఫోటోకు.. జూనియర్ అవార్డ్ వచ్చింది.

ఫిన్లాండ్‌లోని ఓ ఎలుగుబంటి కుటుంబాన్ని వాల్టేరీ మల్కాహేనెన్ అనే వ్యక్తి ఫోటో తీశారు. ఆ కుటుంబంలోని మూడు ఎలుగుబంటి పిల్లలు చెట్టెక్కి, అమాయకంగా కిందకు చూస్తున్న ఫోటో ‘అమేజింగ్ ఇంటర్నెట్ పోర్ట్‌ఫోలియో’ విభాగంలో అవార్డు గెలుచుకుంది.

ఇవి కూడా ప్రశంసలందుకున్న ఫోటోలే!

ఖడ్గమృగానికి నెమలి పింఛం ఉంటే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుందేమో చూడండి.. భారత్‌లోని గోరుమరా నేషనల్ పార్క్‌లోని ఓ ఖడ్గమ‌ృగం ఇలా కనిపించింది.

విసిగివేసారి, తలపట్టుకున్నట్లు కనిపించే ఈ అలాస్కాలోని ఎలుగుబంటి ఫోటోను డేనియెల్ డీ ఎర్మో తీశారు.

ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ ఎలుగుబంటి ఫోటోగ్రాఫర్‌ను చూడండి.. కెమెరా కళ్లలోంచి ఎలా చూస్తోందో..! ఈ ఫోటోను రోయ్ గ్యాలిడ్జ్ అనే వ్యక్తి స్వాల్‌బార్డ్‌లో తీశారు.

పూల తీగలపై ఊయలలూగుతోందా? లేక సర్కస్ చేస్తోందా ఈ ఉడత? రెండిట్లో ఏదైనా, తినడం మాత్రం కామన్ కదా! గీర్ట్ వెగన్ స్వీడన్‌లో ఈ ఫోటో తీశారు.

ఇది ప్రేయసీప్రయుల కౌగిలింతా? లేక ఇద్దరు మిత్రుల ఆలింగనమా? బహుశా ఇవేవీ కాకపోవచ్చు కూడా..

ఈ ఫోటోను సర్గేయ్‌ సావ్వీ అనే వ్యక్తి శ్రీలంకలో తీశారు.

అబ్బబ్బా... ఆ కోపం చూడండి! డూపుల్లేకుండా స్టంట్ చేస్తున్న ధీరులు ఇద్దరూ.. శ్రీలంకలో తొండల ఫోటో తీసిన సర్గేయ్‌ సావ్వీ ఈ ఫోటోను కూడా తీశారు. అయితే ఈసారి థాయ్‌ల్యాండ్‌లో.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)