You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రాజ సంస్థానాలు: భారత్‌లో విలీనానికి హైదరాబాద్ నిరాకరించినప్పుడు ఏం జరిగింది... పటేల్-వీపీ మేనన్ ఒప్పందాలతో రాచరిక వారసులకు అన్యాయం జరిగిందా?
- రచయిత, జాన్ జుబ్రిజికీ
- హోదా, రచయిత
అద్భుతమైన రాజప్రాసాదాలలో నివసించారు. వెలకట్టలేని వజ్రాలు, విలువైన రాళ్లను సేకరించారు. రోల్స్ రాయిస్‌లలో తిరిగేవారు. ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేవారు. తుపాకుల మధ్య ఘనస్వాగతాలతో అట్టహాసంగా దిల్లీకి వచ్చేవారు. తమ రాజ్యంలోని ప్రజల జనన, మరణాలను శాసించేవారు. ఏ పని చేయాలన్నా వేల మంది సేవకులు ఉండేవారు.
1947లో భారతదేశానికి స్వాత్వంత్ర్యం వచ్చే సమయానికి దేశంలో 562 రాజ్యాలు ఉండేవి. దేశంలోని సగం భూభాగం, మూడొంతుల జనాభా వాటి ఆధీనంలోనే ఉండేవారు. బ్రిటన్‌కు విధేయులుగా ఉంటూ, ఎవరూ అందుకోలేని స్థాయిలో ఉండేవారు. కొన్ని ఘోరమైన నేరాలకు పాల్పడిన వారు, కొన్ని అరుదైన సందర్భాల్లోనే కొందరు రాజ్యాలను కోల్పోయారు.
రాచరికం ముగిసిపోతున్న ఆ చివరి రోజుల్లో ధనవంతులు, రాజకీయంగా బలంగా ఉన్న రాజవంశీయులు మినహా మిగిలిన వారందరూ సంపద కోల్పోయి, అతి సాధారణ జీవితాలు గడిపారు.
నా కొత్త పుస్తకం కోసం అధ్యయనంలో భాగంగా, స్వాతంత్య్రం వచ్చిన నాటి పరిస్థితులు, దాని తర్వాత జరిగిన ఘటనలను నిశితంగా పరిశీలించినప్పుడు అనేక రాజ్యాల రాకుమారులను విభజించి, భయాందోళనకు గురిచేసి అణగదొక్కేశారని, అప్పటివరకూ వారు అనుభవించిన అపరిమిత అధికారాలను వదులుకోవాల్సి వచ్చిందని స్పష్టంగా అర్థమైంది.
రాజులు తమ రాజ్యాలను కాపాడుకోవాలనే భావించారు. తాము కూడా ప్రజాస్వామిక విధానాలను అబలంబిస్తూ స్వతంత్ర భారతంతో సమాంతరంగా ముందుకు సాగాలని అనుకున్నారు. అయితే, అలాంటి సంస్కరణలను వెంటనే అమల్లోకి తీసుకురావాలని రాకుమారులపై ఒత్తిడి చేసి, భద్రత సాకుతో బ్రిటిష్ అధికారులు వారిని పట్టించుకోకుండా వదిలేశారు.
లార్డ్ మౌంట్‌బాటన్ ఆఖరి వైస్రాయ్ అయినప్పుడు తమను రక్షించే వ్యక్తి వచ్చాడని రాజకుమారులు అనుకున్నారు. మౌంట్‌బాటన్ దొర తమను కాపాడకపోతారా? అని భావించారు. అయితే, భారత ఉపఖండంలోని పరిస్థితులను అర్థం చేసుకోవాడానికే మౌంట్‌బాటన్ ప్రాధాన్యమిచ్చారు. రాజ సంస్థానాల సమస్యను ఆయన పట్టించుకోలేదు.
సంస్థానాలతో చేసుకున్న ఒప్పందాలను బ్రిటన్ రద్దు చేయబోదని ఒకవైపు చెబుతూనే, భారత్ లేదా పాకిస్తాన్‌తో కలవాలని మరోవైపు ఒత్తిడి తెచ్చారు. అదే సమయంలో, యువరాజులను దారిలోకి తెచ్చేందుకు లండన్‌లో పావులు కదుపుతూ వచ్చారు.
జాతీయవాదులు రాజరికాన్ని పెద్దగా ఇష్టపడేవారు కాదు. మరీముఖ్యంగా చెప్పాలంటే, అప్పటికే భారత దేశానికి తొలి ప్రధాన మంత్రి అయ్యే అవకాశం ఉన్న జవహర్‌లాల్ నెహ్రూకి సంస్థానాల ఉనికి అస్సలు ఇష్టం లేదు. ''అపరిమిత అధికారం, జవాబుదారీతనం లేకపోవడం నిరంకుశత్వానికి, దుర్మార్గాలకు కారణమవుతుంది'' అని ఆయన చెప్పేవారు.
సంస్థానాలను భారత్‌లో విలీనం చేయడంలో కాంగ్రెస్ నాయకుడు వల్లభాయ్ పటేల్ కీలకంగా వ్యవహరించారు. భారతదేశం భౌగోళికంగా, రాజకీయంగా సుస్థిరమైన దేశంగా ఉండాలంటే సంస్థానాలు అందులో భాగం కావాల్సిందేనని ఆయన భావించారు. ఇందులో ఏదైనా పొరపాటు జరిగితే అది గుండెలో బాకు దిగినట్టేనని రాజవంశీయులతో కచ్చితంగా వ్యవహరించారు. వారి ముందు ఎలాంటి అవకాశాలు లేకుండా చేశారు.
బ్రిటిష్ పాలకులతో ఉన్న ఒప్పందాల ప్రకారం, అధికార మార్పిడి జరిగిన తర్వాత తాము భారత్, లేదా పాకిస్తాన్‌తో కలవొచ్చని, లేదంటే.. స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగవచ్చని రాకుమారులు భావించారు.
అయితే, మౌంట్‌బాటన్, వల్లభాయ్ పటేల్ సహా ఇలాంటి విషయాల్లో నిష్ణాతుడైన అధికారి వీపీ మీనన్‌ను ఎదుర్కోవడం కష్టమని, తమ దారులు మూసుకుపోతున్నట్లు అర్థమైంది.
''భారత్‌లో చేరండి. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్ మినహా మిగిలిన వాటన్నింటిపై అధికారం మీదే. మీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోం. ఒకవేళ నిరాకరిస్తే ప్రజలు తిరగబడే ప్రమాదం ఉంది. అప్పుడు మీకు సాయం చేసేందుకు కూడా ఎవరూ రారు'' అని రాజులకు స్పష్టం చేశారు.
ఏమీ చేయలేని నిస్సహాయత, ఏమవుతుందోనన్న ఆందోళనతో చాలా మంది ఒప్పందాలపై సంతకాలు చేశారు. జునాగఢ్, కశ్మీర్, హైదరాబాద్ వంటి కొన్ని సంస్థానాలు నిరాకరించినా సైనిక చర్యతో విలీనమయ్యాయి. హైదరాబాద్ సంస్థానంపై జరిపిన పోలీస్ యాక్షన్‌లో 25 వేల మంది వరకూ చనిపోయారు.
ఆ తర్వాత రాకుమారులకు ఇచ్చిన వాగ్దానాలు చెల్లిపోయాయి. చిన్నచిన్న రాజ్యాలు ఒడిశా వంటి రాష్ట్రాల్లో విలీనమయ్యాయి. మరికొన్ని రాజ్యాలు కలిసి రాజస్థాన్ తరహాలో రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.
సువిశాలంగా, మెరుగైన పరిపాలన ఉన్న గ్యాలియర్, మైసూర్, జోధ్‌పూర్, జైపూర్ వంటి రాజ్యాలు స్వతంత్ర రాజ్యాలుగా ఉండొచ్చని విలీనం సమయంలో పటేల్, మీనన్ వాగ్దానం చేశారు. ఆ తర్వాత అవి భారత్‌లో కలిసిపోయాయి.
పాకిస్తాన్ విభజన కారణంగా కోల్పోయిన భూభాగం, జనాభాను రాజ్యాలను విలీనం చేయడం ద్వారా భారతదేశం తిరిగి పొందింది. అలాగే నగదు, పెట్టుబడులు రూపంలో ఒక బిలియన్ రూపాయలు (ప్రస్తుతం 84 బిలియన్లు) నిధులు సమకూరాయి.
రాజవంశీకులకు పన్నులు లేకుండా భరణాలు చెల్లించే విధానం వచ్చింది. అది వేర్వేరు రాజులకు వేరుగా ఉండేది.
మైసూర్ మహారాజుకు ఏడాదికి 20 వేల యూరోలు ( సుమారు రూ.21 లక్షలు) భరణంగా ఇచ్చేవారు. అలాగే, కటోడియా తాలూక్‌దారుకి 40 యూరోలు (సుమారు రూ.4 వేలు) ఇచ్చేవారు. చివరి రోజుల్లో ఆయన గుమాస్తాగా పనిచేశారు. ప్రయాణ ఖర్చులు తగ్గించుకునేందుకు సైకిల్‌పై వెళ్లేవారు.
కేవలం రెండు దశాబ్దాల వరకూ మాత్రమే ఈ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చాలా మంది రాజవంశీయులు రాజకీయాల్లోకి ప్రవేశించారు. కొందరు నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎక్కువ మంది ప్రతిపక్ష పార్టీల్లో చేరారు.
అయితే, తండ్రిలాగే ఇందిరా గాంధీ కూడా రాజరికాన్ని సమర్థించలేదు.
రాజవంశీకులు తమ పలుకుబడితో ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిస్తుండడంతో పార్లమెంట్‌లో ఇందిరా మెజార్టీ పడిపోతోంది. దీంతో ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఏదైనా చేయాలనుకున్న ఇందిర యువరాజుల గుర్తింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు వచ్చేలా చేశారు.
అయితే, అది రాష్ట్రపతి అధికారాల కిందకు రాదని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.
1971 ఎన్నికల అనంతరం మూడింట రెండొంతుల మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి రాజవంశీకులకు ఉన్న అన్ని సదుపాయాలు, భరణాలను రద్దు చేశారు.
''సమాజంతో ఎలాంటి సంబంధం లేని వ్యవస్థ'' అంతం కావాల్సిన సమయం వచ్చిందని ఆమె భావించారు.
రాజరిక వ్యవస్థను రద్దు చేసినందుకు కొంతమంది భారతీయులు ఆవేదన చెందారు. ఒకప్పటి దర్బార్ హాళ్లు మూగబోయాయి.
భారత ప్రజాస్వామ్యంలో బ్రిటన్ తరహాలో రాజరిక వ్యవస్థకు స్థానం లేదు. అయితే, వాటి ముగింపుకి సంబంధించి చాలా వాదనలు ప్రచారంలోకి వచ్చాయి. ఒప్పందాలు జరిగిన సమయంలో యువరాజులకు అన్యాయం జరిగిందనే భావనలు ఉన్నాయి.
జాన్ జుబ్రిజికీ కొత్త పుస్తకం డిత్రోన్‌డ్: పటేట్, మీనన్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్‌లీ ఇండియా.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ నిజాం సొమ్ము కేసు: పాకిస్తాన్‌కు రూ.53.7 కోట్లు జరిమానా విధించిన బ్రిటన్ కోర్టు
- లండన్ బ్యాంకులో ఉన్న రూ.307 కోట్ల నిజాం నిధికి 120మంది వారసులు - ప్రెస్‌రివ్యూ
- ఆర్టీసీ బస్ నంబర్ ప్లేట్ మీద Z అక్షరానికి, నిజాం రాజుకు సంబంధం ఏమిటి
- ఔరంగాబాద్: ఈ నగరం పేరు మార్చడంపై వివాదం ఎందుకు... హైదరాబాద్‌తో సంబంధమేమిటి
- సెప్టెంబర్ 17: విలీనమా... విమోచనా? 1948 నాటి సైనిక చర్యను ఎలా చూడాలి - అభిప్రాయం