You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లూనా-25: చంద్రయాన్-3 తర్వాత నెలకు ప్రయోగించిన రష్యా మిషన్, చంద్రుడిని ముందే ఎలా చేరుకుంటుంది?
రష్యా ఆగస్టు 11 శుక్రవారం ‘లూనా-25’ అంతరిక్ష నౌకను ప్రయోగించింది.
చంద్రుడిపైకి అంతరిక్ష నౌకను రష్యా చివరిసారిగా 1976లో అంటే 47 ఏళ్ల క్రితం పంపింది. మళ్లీ ఇప్పుడు లూనా-25 ప్రయోగాన్ని చేపట్టింది. ఇది చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగనుంది.
అక్కడ నీటి జాడ ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
లూనా-25 కంటే దాదాపు నెల క్రితం జులై 14న భారత్ చంద్రయాన్-3ని ప్రయోగించింది. ఇది ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగనుంది.
లూనా-25 ఆగస్టు 21న చంద్రుడిపై దిగుతుందని రష్యా స్పేస్ చీఫ్ యూరీ బోరిసోవ్ చెప్పారు. మొదట ఆగస్టు 23న దిగుతుందని అనుకున్నా, ఇప్పుడిది ఆగస్టు 21కే అక్కడకు చేరుకుంటుందని భావిస్తున్నారు.
రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కోస్మోస్ ఇచ్చిన సమాచారం ప్రకారం లూనా-25ను సూయజ్ 2.1బీ రాకెట్ ద్వారా వోస్తోనీ కాస్మోడ్రోమ్ నుంచి లాంచ్ చేశారు. ఇది మాస్కోకు తూర్పున దాదాపు 5,550 కిలోమీటర్ల దూరంలో ఉంది.
సూయజ్ 2.1బి రాకెట్ పైభాగం లాంచ్ అయిన ఒక గంట తర్వాత దానిని భూకక్ష్య నుంచి బయటికి నెడుతూ, చంద్రుడి వైపు తీసుకెళ్తుంది.
లూనా-25లో రోవర్, ల్యాండర్ ఉన్నాయి. ల్యాండర్ బరువు 800 కిలోలు.
లూనా-25తో రష్యా, చంద్రుడి మట్టి నమూనాలు సేకరించి, వాటిని విశ్లేషిస్తుంది.
సుదీర్ఘకాలంపాటు పరిశోధనలకు చేయడానికి అనువుగా ఈ మిషన్‌ను రూపొందించారు.
సూయజ్ 2.1బీ రాకెట్ సాయంతో లూనా-25ను లాంచ్ చేశారు.
ఈ రాకెట్ 46.3 మీటర్ల పొడవుంటుంది. 10.3 మీటర్ల వ్యాసం ఉన్న ఈ రాకెట్ బరువు 313 టన్నులు.
ఈ రాకెట్ నాలుగు దశల్లో లూనా-25 ల్యాండర్‌ను భూమి వెలుపల వృత్తాకార కక్ష్యలోకి పంపుతుంది.
లూనా-25 లక్ష్యం ఏంటి?
రష్యా తన మూన్ మిషన్‌తో చైనా, అమెరికాలతో పోటీపడుతోంది.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై అంతరిక్ష నౌకను దించడానికి అమెరికా, చైనా కూడా అడ్వాన్స్‌డ్ మిషన్స్ ప్రారంభించాయి.
లూనా-25 ఆకారం చిన్న కారులా ఉంటుంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇది ఏడాదిపాటు పని చేస్తుంది. కొన్నేళ్లుగా నాసా, ఇతర అంతరిక్ష సంస్థలు అక్కడ మంచు జాడలను గుర్తించాయి.
రష్యా మూన్ మిషన్ వెనుక రాజకీయ ప్రాధాన్యం కూడా ఉందంటున్నారు. యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పశ్చిమ దేశాలు తమ ఆంక్షల ద్వారా రష్యా అంతరిక్ష కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేశాయి.
కానీ పశ్చిమ దేశాల ఆంక్షలు రష్యా ఆర్థిక వ్యవస్థను పతనం చేయడంలో విఫలమయ్యాయి.
కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రయోగానికి రష్యా సన్నాహాలు చేస్తోంది. ఈ మూన్ మిషన్ విజయవంతమైతే ఇది రష్యాకు అతిపెద్ద విజయం అవుతుంది. యుక్రెయిన్ మీద దాడుల తర్వాత పశ్చిమ దేశాల స్పేస్ ఏజెన్సీలు, రష్యా ఏజెన్సీల మధ్య పరస్పర సహకారానికి తెరపడింది.
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లూనా-25లో తమ పైలట్-డి నేవిగేషన్ కెమెరాను జోడించి, దానిని పరీక్షించాలని భావించింది. కానీ, యుక్రెయిన్ మీద రష్యా దాడి తర్వాత, ఆ ప్రణాళికను ఉపసంహరించుకుంది.
అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1969లో చంద్రుడిపైకి చేరుకున్న మొదటి వ్యక్తి.
రష్యా(సోవియట్ యూనియన్) లూనా-2 మిషన్ 1959లో చంద్రుడి ఉపరితలంపైకి చేరుకున్న మొదటి అంతరిక్ష ప్రయోగంగా నిలిచింది.
1966లో రష్యా ప్రయోగించిన లూనా-9 మిషన్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తొలి మిషన్.
చంద్రయాన్-3 ఆలస్యానికి కారణమేంటి?
లూనా-25 మిషన్‌ను చంద్రయాన్-3 తర్వాత దాదాపు నెల రోజులకు ప్రయోగించినప్పటికీ, అదే ముందు ఎలా చేరుకుంటుందనే ప్రశ్న ఉంది. లూనా-25 మిషన్‌తో పోలిస్తే చంద్రయాన్-3 సుదీర్ఘ మార్గంలో ప్రయాణించడమే ఈ ప్రశ్నకు సమాధానం.
రష్యా మిషన్ చంద్రుడి దిశగా ఐదున్నర రోజుల్లో ప్రయాణం పూర్తి చేస్తుంది. అక్కడ అది వంద కిలోమీటర్ల కక్ష్యలో మూడు నుంచి ఏడు రోజులపాటు గడిపిన తర్వాత చంద్రుడి ఉపరితలంపై దిగుతుంది. దీని తర్వాతే చంద్రయాన్-3 దిగుతుంది.
చంద్రయాన్-3 తన ప్రయాణంలో భూమి, చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి నుంచి ప్రయోజనాన్ని పొందాలనుకుంటోంది. దానివల్ల అది చాలా తక్కువ ఇంధనంతోనే తన ప్రయాణం పూర్తి చేయగలుగుతుంది.
లూనా-25 త్వరగా చంద్రుడిపైకి చేరుకోవడానికి సంబంధించిన ప్రశ్నలపై ‘రీచింగ్ ఫార్ ద స్టార్స్: ఇండియాస్ జర్నీ టు మార్స్ అండ్ బియాండ్’ రచయిత, సైన్స్ జర్నలిస్ట్ పల్లవ్ బాగ్లాతో బీబీసీ మాట్లాడింది.
“అది రాకెట్ ఎంత శక్తివంతమైనది అనేదానిపై ఉంటుంది. రష్యా రాకెట్ చాలా పెద్దది. మన రాకెట్ చిన్నది. ఫలితంగా మన రాకెట్ చంద్రయాన్-3 ఎక్కువ వేగంతో చంద్రుడి మీదకు వెళ్లలేదు” అన్నారు.
“ శక్తిమంతమైన, పెద్ద రాకెట్లు చాలా ఖర్చుతో కూడుకున్నవి. అందుకే భారత్ చిన్న రాకెట్ల ద్వారా తన లక్ష్యాన్ని సాధించాలని ప్రణాళికలు రూపొందించింది. పరిమిత వనరులు ఉన్నప్పటికీ, భారత్ తన మిషన్‌ను లాంచ్ చేసి చూపించింది. అది భారత శాస్త్రవేత్తల ఘనత. అంతరిక్ష మిషన్ల విషయానికి వస్తే రష్యాతో పోలిస్తే భారత్ చిన్నది” అని ఆయన వివరించారు.
లూనా-25 లాంచింగ్ విజయవంతం కావడంపై రాస్కాస్మోస్‌కు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపింది.
170 గ్రాముల మట్టి తెచ్చిన లూనా-24
రష్యా చివరిసారిగా 1976లో పంపిన మిషన్ లూనా-24 చంద్రుడిపైకి చేరుకుంది. చంద్రుడిపైకి ఇప్పటివరకు ప్రయోగించిన అంతరిక్ష నౌకలు దాని ‘ఈక్వేటర్’ వరకే చేరుకున్నాయి.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగనున్న తొలి మిషన్ రష్యాదే కానుంది.
1976లో లాంచ్ చేసిన లూనా-24 చంద్రుడి నుంచి దాదాపు 170 గ్రాముల మట్టిని తీసుకుని సురక్షితంగా భూమికి తిరిగొచ్చింది.
లూనా-25 మిషన్ విజయవంతం కావడానికి 50 శాతం అవకాశాలు ఉన్నాయని అంతరిక్ష శాస్త్రవేత్త వ్లాదిమిర్ సార్డిన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి? ఓటింగ్ ఎలా జరుగుతుంది?
- లోక్‌సభలో మహిళా ఎంపీకి రాహుల్ గాంధీ ‘ఫ్లయింగ్ కిస్’ ఇచ్చారా? స్మృతి ఇరానీ ఏమన్నారు?
- ఆంధ్రప్రదేశ్: నంద్యాల అమ్మాయి దౌలత్, పాకిస్తానీ అబ్బాయి గుల్జార్... రాంగ్ కాల్‌తో మొదలైన లవ్ స్టోరీ
- రాజ సంస్థానాలు: భారత్‌లో విలీనానికి హైదరాబాద్ నిరాకరించినప్పుడు ఏం జరిగింది... పటేల్-వీపీ మేనన్ ఒప్పందాలతో రాచరిక వారసులకు అన్యాయం జరిగిందా?
- ఆంధ్రప్రదేశ్: తోలుబొమ్మలాట మొగలుల దండయాత్ర వల్లే తెలుగు నేలకు చేరిందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)