You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చంద్రయాన్-3: ఇస్రో చంద్రునిపై నీటిని ఎలా గుర్తించింది?
- రచయిత, శ్రీకాంత్ బక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన ప్రయోగాలుగా చంద్రయాన్ ప్రాజెక్టుల్ని చెప్పుకోవచ్చు.
వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇంత భారీ ప్రాజెక్టులు ప్రయోగించడం వల్ల ఇస్రో సాధించేది ఏంటి?
చంద్రయాన్-1, చంద్రయాన్-2 ప్రయోగాలతో ఇస్రో సాధించిన విజయాలు ఏంటి?
చంద్రుడి మీద నాసా
భారత్‌లో ఇస్రో ప్రస్థానం ప్రారంభం కావడానికన్నా ముందే 1969లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రుడి మీదకు తన వ్యోమగాముల్ని పంపించింది. ఆ తర్వాత 1972 వరకూ 12 మంది వ్యోమగాముల్ని చంద్రుడి మీదకు పంపి, అక్కడి శిలలను, మట్టిని భూమ్మీదకు తీసుకొచ్చింది.
కానీ ఆ చంద్ర శిలలను పరిశీలించిన నాసా వాటిలో నీటి జాడలు లేవని తేల్చింది. వాటిని పరిశీలించిన నాసా శాస్త్రవేత్తలు చంద్రుడి ఉపరితలం పూర్తిగా పొడిబారి ఉందని తేల్చారు. ఆ తర్వాత కొన్ని దశాబ్దాల వరకూ చంద్రుడి మీద నీటి జాడ కోసం ప్రయత్నాలు కూడా జరగలేదు.
1990ల్లో చంద్రుడి చీకటి భాగంలో గడ్డకట్టిన మంచు రూపంలో నీరు ఉండొచ్చన్న అభిప్రాయాలు వినిపించాయి. దీంతో నాసా ప్రయోగించిన క్లెమెంటైన్ మిషన్ లో లూనార్ ప్రాస్పెక్టర్ మిషన్ చంద్రుడి ఉపరితలాన్ని పరిశీలించి, చంద్రుడిపై సూర్యరశ్మి చేరని ప్రాంతాల్లో హైడ్రోజన్ ఉనికిని కనుగొంది. దాని ఫలితాలు చంద్రుని ధృవాల దగ్గర నీరు ఉండొచ్చన్న అభిప్రాయాలకు బలం చేకూర్చాయి. కానీ కచ్చితంగా నీటి జాడల్ని మాత్రం కనిపెట్టలేదు.
భారత్ తొలి ప్రయత్నంలోనే
నాసా చంద్రుడి మీద నీటి జాడలు కనిపెట్టేందుకు నాలుగున్నర దశాబ్దాలుగాపైగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కానీ చంద్రుడి మీద నీరు ఉందన్న సంగతి చంద్రయాన్ వన్ మిషన్ ద్వారానే కనిపెట్టగలిగింది. చంద్రయాన్ వన్ ఆర్బిటర్లో అమర్చిన మూన్ మైనరాలజీ మ్యాపర్ అనే పరికరం... పంపిన డేటాను విశ్లేషించిన నాసా చంద్రుడి మీద నీటి జాడలు ఉన్నాయని కనిపెట్టగలిగింది.
అప్పటి వరకూ నాసా చేసిన ప్రయోగాల్లో ఎక్కడా కూడా చంద్రుడిపై నీటి జాడలు స్పష్టంగా గుర్తించేలా ఫలితాలు రాలేదు. 2009 సెప్టెంబర్ 24న నాసా ప్రచురించిన సైన్స్ జర్నల్‌లో చంద్రయాన్ ఆర్బిటర్‌లో అమర్చిన మూన్ మైనరాలజీ మ్యాపర్ నీటి జాడల్ని కనుగొన్నట్లు ప్రకటించింది.
నాసా ప్రకటించిన మరుసటి రోజే... ఇస్రో మరో ప్రకటన చేసింది. తాము చంద్రుడి ఉపరితలం మీదకు పంపిన మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ఇచ్చిన సమాచారంతో తాము అప్పటికి మూడు నెలల కిందటే చంద్రుడి మీద నీటి జాడలను గుర్తించినట్లుగా ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఈ అంశంపై అటు నాసా కానీ, ఇటు ఇస్రో కానీ స్పష్టమైన ప్రకటనలు చేయలేదు.
ఏమిటీ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్
ఇస్రో చేపట్టిన మొదటి డీప్ స్పేస్ మిషన్ చంద్రయాన్-1 ప్రయోగంలోనే ఆర్బిటర్ తో పాటుగా, చంద్రుడి మీద క్రాష్ ల్యాండ్ అయ్యేలా మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనే మరో పరికరాన్ని కూడా పంపింది. చంద్రయాన్-1లో ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ నిర్ణీత కక్ష్యలో తిరుగుతుంటే... మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ మాత్రం చంద్రుడి ఉపరితలంపై క్రాష్ ల్యాండ్ అయ్యింది.
ఆ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌కు నాలుగు పక్కలా భారతీయ జెండాను ఉంచారు. అలా చంద్రుడి మీదకు 15 ఏళ్ల కిందటే భారత జాతీయ పతాకం చేరిందన్నమాట. చంద్రయాన్ -1 రెండేళ్ల కాలానికి నిర్దేశించారు. కానీ పది నెలల ఆరు రోజులకే చంద్రయాన్-1 ఆర్బిటర్ నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. చంద్రయాన్-1లో మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌ను 2008 నవంబర్ 18న వంద కిలోమీటర్ల ఎత్తు నుంచి విడుదల చేశారు.
25 నిమిషాల్లో అది చంద్రుడి దక్షిణ ధ్రువం మీద పడేలా చేశారు. అయితే ఇది ల్యాండర్ మాదిరిగా సేఫ్ ల్యాండ్ అవ్వదు. కానీ దీనిని కంట్రోల్డ్ గానే ఇస్రో చంద్రుడి దక్షిణ ధృవంపై పడేలా చేయగలిగారు. ఈ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌లో అమర్చిన చంద్రాస్ ఆల్టిట్యూడ్ కంపోజిషన్ ఎక్స్‌ప్లోరర్ చంద్రుడి ఉపరితలం నుంచి 650 మాస్ స్పెక్ట్రా రీడింగ్స్‌ను సేకరించింది. ఈ సమాచారాన్ని విశ్లేషించిన ఇస్రో చంద్రుడి మీద నీరు ఉన్నట్లు 2009 సెప్టెంబర్ 25న ప్రకటించింది.
చంద్రయాన్-2లో విజయాలేంటి?
చంద్రయాన్ విజయం తర్వాత, ఇస్రో దాదాపు నాలుగు టన్నుల బరువైన పేలోడ్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లగల రాకెట్ జీఎస్ఎల్వీ ఎంకే 3ని తయారు చేసింది.
ఆ తర్వాత ఆ రాకెట్ సాయంతోనే 2019లో చంద్రయాన్-2 ప్రయోగం జరిగింది. ఈ ప్రయోగంలో చంద్రుని చుట్టూ తిరిగే ఆర్బిటర్‌తోపాటు ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌ను కూడా పంపించారు.
ఆర్బిటర్ విజయవంతంగా కక్ష్యలో తిరుగుతోంది. ఇప్పటి వరకు ఈ ఆర్బిటర్ చంద్రుడి ఉపరితలాన్ని చాలా వరకూ స్కాన్ చేసింది. వాటి నుంచి ఎంతో విలువైన సమాచారాన్ని భూమికి పంపించింది.
అంతేకాదు, అప్పట్లోనే ఈ ఆర్బిటర్ జీవిత కాలం ఏడున్నరేళ్లు అని ఇస్రో నిర్ధరించింది. ఇప్పటి వరకు మూడేళ్ల పది నెలలకు పైగా అది చంద్రుడి చుట్టూ తిరుగుతూ తన సేవలు అందిస్తోంది.
అంతే కాదు, ఆర్బిటర్ సమర్థంగా పనిచేస్తోంది కాబట్టి చంద్రయాన్-3ప్రయోగంలో ఆర్బిటర్ పంపించడం లేదు. చంద్రయాన్-2లో పంపించిన ఆర్బిటర్‌నే దీనికి ఉపయోగించుకోనున్నారు.
దీనివల్ల చంద్రయాన్-3 ప్రయోగానికి తక్కువ ఖర్చయ్యింది. చంద్రయాన్-2 ప్రయోగానికి 978 కోట్ల రూపాయలు ఖర్చయితే, చంద్రయాన్-3 ప్రయోగానికి రూ. 615 కోట్లు మాత్రమే ఖర్చవుతున్నాయి.
చంద్రయాన్-2లో ప్రయోగించిన ల్యాండర్‌తో చంద్రుడి ఉపరితలం నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు కమ్యూనికేట్ చేయగలిగారు.
అయితే, ఉన్న సంబంధాలు ఆఖరి క్షణంలో తెగిపోయాయి. దీంతో ల్యాండర్ నుంచి రోవర్ కూడా బయటకు రాలేదు.
చంద్రయాన్-3 లో ఏమున్నాయి?
చంద్రయాన్-3లో ప్రధానంగా రెండు భాగాలున్నాయి. ల్యాండర్, రోవర్ మాడ్యూల్‌ను చంద్రుని కక్ష్యలో తీసుకెళ్లడం... ఆపై ల్యాండర్, రోవల్ మాడ్యూల్‌ను సురక్షితంగా చంద్రుడి ఉపరితలంపై దించేందుకు ఇంటిగ్రేడెట్ మాడ్యూల్ ఉంటుంది.
దాని నుంచి ల్యాండర్ మాడ్యూల్ వేరుపడి, చంద్రుడి ఉపరితలంపైకి దిగుతుంది. ల్యాండర్ సురక్షితంగా చంద్రుడి ఉపరితలం రెగోలిత్ మీద దిగిన తర్వాత దాని నుంచి ర్యాంప్ బయటకు వచ్చి, రోవర్ కూడా బయటకు వస్తుంది.
ఇది చంద్రుడి మీద కలియ తిరుగుతూ చంద్రుడి ఉపరితలాన్ని విశ్లేషిస్తుంది.
ఈ రోవర్ చంద్రుడి ఉపరితలాన్ని విశ్లేషించి ఆ సమాయాన్ని దగ్గర్లో ఉన్న ల్యాండర్‌కి పంపిస్తుంది. ల్యాండర్ తాను సేకరించిన సమాచారంతో పాటు, రోవర్ నుంచి సేకరించిన సమాచారాన్ని... చంద్రుడి ఉపరితలానికి 100 కిలోమీటర్ల దూరంలో ఎగురుతున్న చంద్రయాన్- 2 ఆర్బిటర్‌కి పంపిస్తుంది.
అక్కడి నుంచి ఆ సమాచారం భూమ్మీద ఉన్న ఇస్రో బేస్ స్టేషన్లకు చేరుతుంది.ఇప్పటికే చంద్రయాన్-2 ఆర్బిటర్, చంద్రుడి ఉపరితలాన్ని 3,400 సార్లకు పైగా చుట్టి వచ్చింది. అది పంపిన డేటాతో చంద్రుడి ఉపరితలం గురించి ఇస్రో విశ్లేషణలు జరుపుతోంది.
చంద్రయాన్-3: ప్రయోగాలు ఏమిటి?
చంద్రయాన్-3లో ప్రయోగించే ల్యాండర్, రోవర్ లు కూడా చాలా ప్రయోగాలు చేసి కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలను సాధించాల్సి ఉంటుంది.
వాటిల్లో చంద్ర ఉపరితల శోధన, చంద్రుని ఉపరిలంపై ఖనిజాల పరిశీలన, అక్కడ మూలకాల లభ్యతను శోధించడం, చంద్రుని వాతావరణాన్ని పరిశీలించడం, నీరు, మంచు రూపంలోని నీటి లభ్యతను పరిశీలించడం, చంద్ర ఉపరితలాన్ని ఫొటోలు తీసి త్రీడీ మ్యాపులు తయారు చేయడం, చంద్రుడి మీద ఉపరితలాన్ని రసాయనికంగా విశ్లేషించి, వాటిలోని మూలకాలను బట్టి చంద్రుడి పుట్టుక రహస్యాన్ని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
చంద్రయాన్ త్రీలో చంద్రుడి మీద దిగే ల్యాండర్ నుంచి బయటకు వచ్చే రోవర్‌లో ప్రధానంగా రెండు పరికరాలు అమర్చారు.
వాటిలో ఒకటి లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రో మీటర్. దీన్నే సంక్షిప్తంగా లిబ్స్ అంటారు. రోవర్ చంద్రుడి మీద రెగోలిత్ పైకి దిగిన తర్వాత ఈ పరికరానికి అమర్చిన లేజర్ బీమ్స్ చంద్రుడి ఉపరితలంపై ప్రసరిస్తాయి.
దీంతో ఆ నేల అత్యధిక ఉష్ణోగ్రత వద్ద మండుతుంది. దీని వల్ల దాని నుంచి వాయువులు వెలువడతాయి. ఆ వాయువులను స్పెక్ట్రో అనాలిసిస్ చేయడం ద్వారా... చంద్రుడి ఉపరితలం మీద ఉన్న మూలకాలను విశ్లేషిస్తారు.
ఇలా చంద్రుడి మీద పరిస్థితులను తెలుసుకుని, భవిష్యత్తులో చంద్రుడిపై మానవ నివాసానికి యోగ్యమైన పరిస్థితులపై పరిశోధనలు చేయడంతో పాటు, చంద్రుడి పుట్టుక గురించి కూడా వివరాలు తెలుసుకునే అవకాశముందని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు.
చంద్రుడి పుట్టుక మీద చాలా భిన్నమైన సిద్ధాంతాలున్నాయి. చంద్రుడు భూమి నుంచి ఏర్పడ్డాడని, భూమిని పెద్ద ఆస్టరాయిడ్ ఢీకొంటే పుట్టిన గోళమని.. ఇలా చాలా సిద్ధాంతాలున్నాయి.
చంద్రయాన్ ప్రయోగాల వల్ల అవన్నీ తెలుసుకునే అవకాశం ఉంటుందని సోమనాథ్ వెల్లడించారు.
వాస్తవానికి ఇలా ఆర్బిటర్‌ను, ల్యాండర్‌ను ఒకేసారి పంపడం అంత సులువైన విషయం కాదు. ఇస్రో మాత్రం ఈ రెండింటినీ ఒకేసారి ఒకే రాకెట్‌తో ప్రయోగించేసింది.
అంతేకాదు, ఇందులో ఆర్బిటర్‌తోపాటు, చంద్రుడి మీద దిగే రోవర్‌ను కూడా పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించారు.
చంద్రయాన్- 2లో తలెత్తిన లోపాలను దృష్టిలో పెట్టుకుని ల్యాండింగ్ మరింత సమర్థంగా, సాఫీగా జరిగేలా ఇస్రో జాగ్రత్తలు తీసుకొంటోంది.
ఇవి కూడా చదవండి:
- థ్రెడ్స్ యాప్ ఎలా పనిచేస్తుంది.. ఇప్పటికే కోటి మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్న ఈ యాప్‌లో ఫీచర్స్ ఏమిటి
- ట్విటర్ Vs. థ్రెడ్స్: ఎలాన్ మస్క్ ట్రిక్స్ ఎందుకు పారడం లేదు... మెటా యజమాని జుకర్‌బర్గ్ కొత్త యాప్‌తో పోటీ ఎలా ఉండబోతోంది?
- సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల వివాహాల కేసు జడ్జిలకు పరీక్షగా మారిందా?
- టెక్నాలజీ మ్యారేజేస్: భాగస్వామి హృదయ స్పందనను తెలిపే ఉంగరాలు, లాకెట్ల కథ ఏంటి?
- ప్రేమలో విడిపోతే గుండెపోటు వచ్చినట్లు ఎందుకు అనిపిస్తుంది, ఆ బాధలో గుండెకు ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)