పాలస్తీనా ప్రత్యేక దేశంగా ఎందుకు మారలేదు? 4 ప్రధాన కారణాలు ఇవే...

    • రచయిత, తఫ్సీర్ బాబు
    • హోదా, బీబీసీ న్యూస్

అది 1948వ సంవత్సరం. అప్పటి నుంచే అరబ్ - ఇజ్రాయెలీ యుద్ధం మొదలైంది. నాటి నుంచి నేటి వరకు పాలస్తీనాలో యుద్ధం ఆగలేదు.

యాభై ఏళ్ల కిందట 1973లో అరబ్ - ఇజ్రాయెల్ మధ్య మూడో యుద్ధం జరిగింది. ఆ తర్వాత అరబ్ దేశాలతో ఇజ్రాయెల్‌కి ప్రత్యక్షంగా యుద్ధం జరగలేదు. అయితే, పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ మాత్రం కొనసాగుతూ వస్తోంది.

ఈ ఘర్షణలకు ముగింపు పలికి రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు రెండు దేశాల సూత్రం 'టూ నేషన్ ఫార్ములా' చాలాసార్లు తెరపైకి వచ్చినప్పటికీ అది ఆచరణకి నోచుకోలేదు.

పాలస్తీనా, ఇజ్రాయెల్‌ను రెండు దేశాలుగా ఏర్పాటు చేయడమే ఈ ఫార్ములా ముఖ్య ఉద్దేశం. 1947లో ఐక్యరాజ్యసమితి ఈ ఫార్ములాను ప్రతిపాదించింది. ఇజ్రాయెల్ యూదుల దేశంగా, పాలస్తీనా అరబ్బుల దేశంగా అప్పట్లో ప్రతిపాదించారు.

ఈ ప్రతిపాదనలు చేసిన కాలం నాటికి మొత్తం భూభాగంలో యూదుల సంఖ్య 10 శాతం మాత్రమే. అయితే, టూ నేషన్స్ ఫార్ములా ప్రకారం, భూభాగాన్ని ఇద్దరికీ సమానంగా పంచాలనేది ప్రతిపాదన. అందుకు అరబ్ దేశాలు ససేమిరా అంగీకరించలేదు.

ఈ ఒప్పందం తిరస్కరణకు గురికావడం అరబ్ - ఇజ్రాయెల్ మధ్య తొలి యుద్ధానికి దారితీసింది. ఒకానొక దశలో ఈ రెండు దేశాల ఫార్ములాకి పాలస్తీనా, ఇజ్రాయెల్ అంగీకరించాయి.

కానీ, ఈ ఫార్ములా ఎలా విఫలమైందో ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే.

ఏంటీ రెండు దేశాల ఫార్ములా?

1947లో ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన ఈ రెండు దేశాల ఫార్ములాలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆచరణ దిశగా అడుగులు వేసేందుకు ఇజ్రాయెల్, పాలస్తీనా 1993లో తొలిసారి శాంతి ఒప్పందం కోసం భేటీ అయ్యాయి. నార్వే రాజధాని ఓస్లోలో ఈ భేటీ జరిగింది.

ఈ శాంతి ఒప్పందాన్ని ఓస్లో ఒప్పందంగా పిలుస్తారు.

శాంతి ఒప్పందం మేరకు, పాలస్తీనా అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌ను ఈ అథారిటీ పరిధిలోకి తెచ్చారు. ఐదేళ్లలోపు ఈ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేలా చర్చలు జరిగాయి.

మరోవైపు, పాలస్తీనా కూడా ప్రత్యేక ఇజ్రాయెల్‌ను గుర్తించింది.

వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లో పరిపాలన సాగించేందుకు పాలస్తీనియన్ నేషనల్ అథారిటీని త్వరగా ఏర్పాటు చేయాలని కూడా ఈ ఒప్పందంలో పేర్కొన్నారు.

అయితే, ఆ తర్వాత శాంతిభద్రతలు క్రమంగా క్షీణించాయి. రకరకాల సమస్యలు మొదలయ్యాయి.

శాంతి ప్రక్రియ ఎందుకు ఆగింది?

రెండు వేర్వేరు దేశాల ఫార్ములాకి ఓస్లో ఒప్పందంలో అంగీకారం కుదిరింది. అయితే, అది ఎప్పటిలోపు జరగాలనే కాలపరిమితిపై మాత్రం స్పష్టత రాలేదు.

ఇజ్రాయెల్ నుంచి పాలస్తీనా ప్రత్యేక దేశ ఏర్పాటు డిమాండ్‌కు దారితీసిన నాలుగు ప్రధాన సమస్యలకు నేటికీ పరిష్కారం దొరకలేదు.

  • ఆ నాలుగు ప్రధాన సమస్యలు ఇవే..

1. రెండు దేశాల మధ్య సరిహద్దు ఎక్కడని నిర్ణయించాలి?

2.జెరూసలెం ఎవరి ఆధీనంలో ఉంటుంది?

3. పాలస్తీనియన్ ప్రాంతంలో స్థిరపడిన ఇజ్రాయెలీ పౌరులను అక్కడి నుంచి తరలిస్తారా?

4.ఇజ్రాయెల్‌లో నిరాశ్రయులైన పాలస్తీనియన్ల పరిస్థితేంటి? వారు ఎలా తిరిగి వస్తారు?

ఐదేళ్లలో పాలస్తీనా అథారిటీ ఏర్పడిన తర్వాత ఈ సమస్యలన్నింటినీ చర్చిస్తామని ఒప్పందంలో ఉంది. అయితే, అది జరగనే లేదు.

ఓస్లో ఒప్పందం పూర్తి స్థాయిలో అమలు జరగకపోవడానికి ఇరుపక్షాలూ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ యూనివర్సిటీలో మిడిల్ ఈస్ట్ స్టడీస్ ప్రొఫెసర్ మీర్ లిత్వక్ అన్నారు.

మీర్ బీబీసీతో మాట్లాడుతూ ''పాలస్తీనా, ఇజ్రాయెల్‌కు చెందిన రెండేసి గ్రూపులు శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అవి ఏకాభిప్రాయాన్ని తిరస్కరించాయి. మొత్తం ప్రాంతం తమ దేశానికే చెందుతుందని ఆ గ్రూపులు వాదిస్తున్నాయి'' అన్నారు.

పాలస్తీనా వైపు హమాస్, ఇస్లామిక్ జిహాద్ సంస్థలు శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తుండగా, ఇజ్రాయెల్ వైపు ఫండమెంటలిస్ట్ జూయిష్ రెలిజియస్, నేషనలిస్ట్ గ్రూపులు వ్యతిరేకిస్తున్నాయి.

ఫలితంగా ఓస్లో ఒప్పందాలు ఆచరణలో ముందుకు సాగలేదు.

1993 ఒప్పందానికి నిరసనగా హమాస్, ఇస్లామిక్ జిహాద్ సంస్థలు యూదులపై దాడులు చేయడం మొదలుపెట్టాయి. మరోవైపు ఈ శాంతి ఒప్పందాన్ని సమర్థించిన ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి ఇత్సా‌క్ రాబిన్‌ను జూయిష్ ఫండమెంటలిస్ట్ సంస్థ హతమార్చింది.

ఆ తర్వాత, 1996లో జాతీయవాద భావాలున్న రైట్ వింగ్ పార్టీ ఇజ్రాయెల్‌లో అధికారంలోకి వచ్చింది. శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వం అనుకోలేదు.

ఆ తర్వాత ఇరువర్గాలు పలుమార్లు సమావేశమైనప్పటికీ సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు. అదే సమయంలో పాలస్తీనియన్ ప్రాంతాల్లో యూదుల కాలనీలను విస్తృతం చేయడంపై ఫోకస్ పెట్టింది ఇజ్రాయెల్. దానికితోడు అక్కడి రైట్ వింగ్ ప్రభుత్వం జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా ప్రకటించింది.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భౌగోళికంగా పాలస్తీనా దేశం ఏర్పాటు కల సాధ్యమవుతుందా? అనే సందేహం చాలా మందిలో ఉంది.

స్వతంత్ర పాలస్తీనా ఎలా సాధ్యం?

ఏ దేశం ఏర్పాటుకైనా ముందుగా కావాల్సింది భూభాగం. పాలస్తీనాకి కూడా అదే అవసరం. అయితే, పాలస్తీనా ప్రాంతంగా చెబుతున్న వెస్ట్ బ్యాంక్‌లో ఇప్పటికే వేల సంఖ్యలో యూదు కాలనీలు ఉన్నాయి.

దానికి తోడు అరబ్బులు ఎక్కువగా ఉన్న ప్రాంతమైన జెరూసలెంను ఇజ్రాయెల్ తమ రాజధానిగా ప్రకటించింది. అమెరికా సహా చాలా దేశాలు దానిని గుర్తించాయి కూడా. అందువల్ల భౌగోళికంగా ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పాటు చేయడం కష్టమని చాలా మంది భావిస్తున్నారు.

అమెరికాలో ఉంటూ మిడిల్ ఈస్ట్‌ సమస్యలపై పరిశోధన చేసిన షహీన్ బెరెన్జీ అలాంటి వారిలో ఒకరు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడం ఒక పెద్ద సవాల్ అని షహీన్ అభిప్రాయపడ్డారు.

''పాలస్తీనా ప్రత్యేక దేశం ఏర్పాటు విషయం 1990ల నాటితో పోలిస్తే ఇప్పుడు మరింత కష్టతరంగా మారింది. వెస్ట్‌ బ్యాంక్‌తో పాటు జెరూసలెం చుట్టూ యూదుల కాలనీలు విపరీతంగా పెరిగిపోయాయి.

1993 ఒప్పందం నాటికి ఆయా ప్రాంతాల్లో యూదుల సంఖ్య 1,20,000 కాగా, ఇప్పుడు ఆ సంఖ్య ఏడు లక్షలు దాటేసింది. ఇప్పటికి కూడా యూదు కాలనీలు ఏర్పాటవుతూనే ఉన్నాయి. చట్టాలను కూడా ఉల్లంఘించి ఈ ఇజ్రాయెల్ కాలనీలు ఏర్పాటవుతున్నాయి'' అని షహీన్ బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

''దానికితోడు రెండు దేశాల ఫార్ములాకి ఇజ్రాయెల్ అనుకూలంగా లేదు. మరోవైపు పాలస్తీనా హమాస్, ఫతా గ్రూపులుగా విడిపోయింది. దీంతో పాలస్తీనా ప్రజల తరఫున శాంతి ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడే కరువయ్యారు'' అని ఆయన అన్నారు.

రెండు దేశాల ఫార్ములా ఇప్పుడు సాధ్యం కాదా?

ఇరుపక్షాల మధ్య సయోధ్యకు ఇంకా అవకాశం ఉందని ప్రొఫెసర్ మీర్ లిత్వక్ వంటి నిపుణులు భావిస్తున్నారు. కానీ, ఇజ్రాయెల్ అందుకు సుముఖంగా ఉందా? అనే ప్రశ్న ఎదురవుతోంది.

ఇజ్రాయెల్ అందుకు సుముఖంగా లేదని ప్రొఫెసర్ లిత్వక్ కూడా అభిప్రాయపడ్డారు.

''ఈ విషయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వ వైఖరిని నేను విమర్శిస్తాను. ఎందుకంటే, వాళ్లు సమస్య పరిష్కారం కోసం చూడకుండా సమస్య ఎలా ఉందో అలానే వదిలేశారు. వెస్ట్ బ్యాంక్ మాదిరిగా. ఇక్కడ పాలస్తీనా అథారిటీ ఉండాలని, దానిపై వాళ్ల నియంత్రణ ఉండాలని కోరుకుంటున్నారు. అంటే, స్వతంత్రంగా వ్యవహరించేందుకు వీల్లేని ఒక బలహీనమైన అథారిటీ ఉండాలని వారి కోరిక'' అని లిత్వక్ అన్నారు.

అన్నింటిపై తమ నియంత్రణ కొనసాగాలని ఇజ్రాయెల్ కోరుకోవడం సరికాదని, దాని నుంచి ఇజ్రాయెల్ బయటికి వచ్చినప్పుడే పరిష్కారం సాధ్యమవుతుందని లిత్వక్ భావిస్తున్నారు. పాలస్తీనా ఏర్పాటులో యూదు కాలనీలే పెద్ద అడ్డంకి అని ఆయన అంటున్నారు.

''గాజాలోని తమ కాలనీలన్నింటినీ ఇజ్రాయెల్ తొలగించాలి. దానిపై నియంత్రణ కూడా వదిలేయాలి. వెస్ట్ బ్యాంక్‌లోనూ అదే జరగాలి. కొద్దిగా కష్టమైనప్పటికీ అదే జరగాలి'' అన్నారు.

అలాగే, జెరూసలెం విషయంలోనూ ఇరుపక్షాలు తమ వైఖరిని సడలిస్తే ఏకాభిప్రాయం సాధించే అవకాశం ఉంది.

కానీ, ప్రస్తుత యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శతాబ్దాలుగా నెలకొన్న ప్రతిష్ఠింభనను ఎవరు తొలగిస్తారన్నదే పెద్ద ప్రశ్న.

అమెరికా చొరవ చూపుతుందా?

''ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా చొరవ చూపాల్సిన అవసరం ఉంది. ఈ వివాదం పరిష్కరించేందుకు అమెరికా ముందుకొచ్చి అంతర్జాతీయ సమాజం మద్దతు కూడగడితే సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది'' అని అమెరికన్ పరిశోధకులు షహీన్ బెరెన్జీ అన్నారు.

''మిడిల్‌ ఈస్ట్‌ ప్రాంతంలో ఏదైనా చేయాలని అమెరికా అనుకున్న ప్రతిసారీ అలాగే జరిగిందనేది చారిత్రక వాస్తవం. ఈజిప్ట్ - ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం, జోర్డాన్‌తో ఒప్పందం, ఇటీవల జరిగిన అబ్రహాం ఒప్పందాలే అందుకు నిదర్శనం. వీటన్నింటిలో అమెరికా పాత్ర ఉంది'' అని షహీన్ అభిప్రాయపడ్డారు.

అసలు మిడిల్ ఈస్ట్‌లో శాంతి నెలకొల్పేందుకు అమెరికా ఆసక్తి చూపుతుందా? అనేదే ఇక్కడి ప్రశ్న.

దీనిపై షహీన్ స్పందిస్తూ '' 9/11 దాడుల తర్వాత ఓస్లో ఒప్పందం అమలుపై కాకుండా టెర్రరిజంపై అమెరికా ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఆ తర్వాత ఇరాన్, రష్యా, చైనాతో వివాదాలు. కానీ ఇప్పుడు, మిడిల్ ఈస్ట్ విషయంలో అమెరికా మళ్లీ చొరవ చూపాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ ఘర్షణల కారణంగా అందరూ బాధపడాల్సి వస్తుంది. ఇలాగే వదిలేస్తే మరికొద్ది కాలం తర్వాత ఇది మరింత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది'' అన్నారు.

ఇదంతా గమనిస్తే, పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య శాంతి నెలకొల్పడంలో అమెరికానే ఆశాకిరణంగా కనిపిస్తోంది. శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడంలో అమెరికా చొరవ తీసుకుంటే కొత్త ఆశలు చిగురించినట్లే.

అయితే, ఇజ్రాయెల్‌పై దాడి తర్వాత పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో శాంతి గురించి ఎవరూ మాట్లాడడం లేదు. అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్, హమాస్‌ ఎవరూ దాని గురించి పట్టించుకోవడం లేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)