ఆ ఇద్దరు పదేళ్లుగా హమాస్ బందీలు... వర్ణ వివక్ష కారణంగానే ఇజ్రాయెల్ వారిని విడిపించడం లేదా?

    • రచయిత, లారెన్స్ పీటర్,
    • హోదా, బీబీసీ న్యూస్

అక్టోబరు 7న హమాస్ బందీలుగా పట్టుకుపోయిన 200మంది గురించి హెడ్‌లైన్స్‌లో నానుతూ ఉంది. కానీ ఏళ్ళ తరబడి హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ఆ ఇద్దరు పౌరుల సంగతేంటి?

వీరిద్దరిలో ఒకరు ఇథియోపియా, ఇజ్రాయెలీ మూలాలు ఉన్న అవెరా మెన్గిస్టో కాగా, మరొకరు అరబ్,ఇజ్రాయెలీ మూలాలున్న హిషమ్ అల్-సయ్యద్.

మెన్గిస్టోను 2014లోనూ, హిషమ్‌ను 2015లో హమాస్ కిడ్నాప్ చేసింది.

ఇక 2014లో హమాస్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో హదార్ గోల్డెన్, ఓరాన్ ‌షౌల్ అనే ఇజ్రాయెలీ సైనికులు మరణించారు. అయితే వీరి మృతదేహాలు ఇప్పటికీ గాజాలో హమాస్ వద్దే ఉండటంతో వీరి బంధువులు తల్లడిల్లిపోతున్నారు.

హమాస్ తనవద్ద ఉన్న బందీలను విడుదల చేయడానికి భారీ మూల్యాన్ని ఆశిస్తుంటుంది. బందీలను అడ్డుపెట్టుకుని తనకు కావాల్సింది సాధించాలని చూస్తుంటుంది.

ఇరాన్ మద్దతు ఉన్న హమాస్‌ను పశ్చిమదేశాలు టెర్రిరిస్టు గ్రూపుగా భావిస్తున్నాయి.

ఓరాన్ సోదరుడు అవిరామ్ షౌడ్ మాట్లాడుతూ ఓరాన్ మృతదేహాన్ని ఎక్కడ ఉంచారనే విషయంపై పదేళ్లుగా తమ కుటుంబానికి ఎటువంటి సమాచారం అందలేదని వాపోయాడు.

2014లో గాజాలోని ఓ సొరంగంలో ఇజ్రాయెలీ సైనికులు ఓరాన్‌కు సంబంధించిన హెల్మెట్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌లను గుర్తించారు..

ఇక అప్పటి నుంచి ఇజ్రాయెలీ సైన్యం చనిపోయిన సైనికులిద్దరి గురించి మరిచిపోయినట్టుందని అవిరామ్ బీబీసీకి చెప్పారు.

‘‘ఇప్పుడు మా సోదరుడిని వెనక్కి తీసుకురావడానికి మంచి అవకాశం దొరికింది. ఎందుకంటే ప్రస్తుతం 200మంది గాజాలో బందీలుగా ఉన్నారు. ఇప్పటిదాకా మా సోదరుడిని వెనక్కి తీసుకురావడానికి ప్రభుత్వం ఏమీ చేయలేదు. కానీ వారిప్పుడు ఓ పెద్ద ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది’’ అని అవిరామ్ అన్నారు.

‘‘ఇజ్రాయెల్ బందీలను విడిపించడానికి ఓ మానవీయ ఒప్పందాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. తమకు అవసరమైన కరెంట్, నీరు కావాలంటే హమాస్ కచ్చితంగా బందీలను, సైనికులను విడిచిపెట్టి మృతదేహాలను వెనక్కి ఇవ్వాల్సిందే. వాళ్లకు అవి అవసరం లేకపోతే స్పందించకపోతే ఇజ్రాయెల్ ‌కూడా ఏమీ చేయలేదు’’ అని అంటారు అవిరామ్.

అపహరణకు గురైన గిలాద్ షలిత్ అనే సైనికుడిని 2011లో ఇజ్రాయెల్ రహస్య చర్చల ద్వారా విడిపించుకుంది. అతని కోసం జైల్లో ఉన్న 1,027మంది పాలస్తీనా ఖైదీలను విడుదలచేసింది.

హమాస్‌ను తుడిచిపెట్టేయాలని ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది. దీంతో గాజాపై వైమానిక దాడులతో విరుచుకుపడటంతో ఆ నగరం నేలమట్టమవుతోంది.

ఈ సమయంలో కొత్త ఖైదీల మార్పిడి కష్టతరమే కాకుండా వివాదాస్పదం కూడా అవుతుంది. గాజాలో మృతుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ పాలస్తీనీయులకు ఇజ్రాయెల్‌పై ఆగ్రహం పెరిగిపోతోంది.

షలిత్ విడుదల సందర్భంగా జరిగిన చర్చలలో అప్పటి మిలటరీ కమాండర్, మొస్సాద్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ హగై హదాస్ కీలక పాత్ర పోషించారు.

పాలస్తీనా కిడ్నాపర్లతో ఇటువంటి ఖైదీల ఒప్పందం రాజకీయ సమస్య. ప్రస్తుత పరిస్థితులలో ఇజ్రాయెల్ హమాస్‌పై తీవ్ర ఆగ్రహంతో ఉంది.

‘‘అందువల్ల ఇంతకు ముందులా ఇప్పుడు వారితో బేరసారాలు సాధ్యం కాదు. ఇది ఏమాత్రం జరగదు.’’ అని హగై హదాస్ తెలిపారు.

అప్పట్లో షలిత్ ను విడుదల చేయించి, ఖైదీలను వదిలిపెట్టడమనేది రాజకీయంగా సరైన నిర్ణయమేనని బెంజిమెన్ నెతన్యాహూ అప్పట్లో అన్నారు.

పైగా ఈ ఒప్పందం అంతకు రెండేళ్ళు ముందుగానే ఖరారైందని చెప్పారు.

ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర తన బందీలను విడిపించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని హగై హదాస్ అంటున్నారు.

బందీలను ఏ ప్రాంతంలో దాచారానే కచ్చితమైన సమాచారం ఉంటే సైనికచర్య తీసుకోవడం, అలాగే బందీలను విడుదల చేయడానికి డబ్బు చెల్లించడం, లేదంటే హమాస్ నేతలు గాజాను వదిలిపొమ్మని చెప్పొచ్చు అని తెలిపారు.

వీటిల్లో చివరి అంశానికి వస్తే గాజా నేతలను ఒత్తిడిలోకి నెట్టాలి.

తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బందీలను వదిలిపెట్టొచ్చనే ఆలోచన వారికి వచ్చేలా చేయాలని హగై చెప్పారు.

‘‘బందీలలో చాలామంది హమాస్ చేతుల్లో ఉన్నారు. ఇజ్రాయెల్ మిలటరీని ఉపయోగించి వారెక్కడున్నారో కనిపెట్టి వెనక్కి తీసుకు రాగలదు’’ అని హగై అన్నారు.

గాజాలో పూర్తిస్థాయి యుద్ధం జరుగుతున్నప్పటికీ, బందీల విడుదలకు ఇజ్రాయెల్ ఏదైనా ఒప్పందానికి ప్రయత్నించవచ్చు.

ఇజ్రాయెల్ చివరి క్షణం వరకు బందీల విడుదల కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటుందని హగై చెప్పారు.

‘‘మేము ప్రాణాలకు విలువనిస్తాం, దానికోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ’’ అన్నారు.

2014లో ఇద్దరు ఇజ్రాయెలీ పౌరులు బందీగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ ‘‘వారు కిడ్నాప్ కాలేదు’’ అని హదాస్ చెప్పారు. అయితే వారు గాజాకు వెళ్ళారు. వారి మానసికస్థితి సరిగా లేదు.

‘‘ఈ ఇద్దరి సంగతి వేరు, అక్టోబరు 7న ఇజ్రాయెల్ అనుభవాలు వేరు’’ అంటూ హమాస్ ఊచకోత ఉదంతాన్ని గుర్తుచేసుకుంటూ చెప్పారు హదాస్.

హమాస్ మాత్రం అవెరా మెన్గిస్టో, హిష్ అల్-సయ్యద్‌లిద్దరూ ఇజ్రాయెల్ సైనికులని చెబుతోంది.

కానీ హ్యూమన్ రైట్స్ వాచ్ చూసిన ఇజ్రాయెలీ అధికారిక పత్రాల ప్రకారం వీరద్దరిని సైనిక సర్వీసుల నుంచి తప్పించినట్టుగా ఉంది.

అవెరాను విడుదల చేయించడానికి టిలా ఫెంటా పోరాటం చేస్తున్నారు. కానీ ఆమె ఉద్యమానికి ఇజ్రాయెల్ స్పందించకపోవడంతో నిరాశకు గురయ్యారు.

అయితే ఇప్పుడు గాజా బందీలపై అంతర్జాతీయ సమాజం దృష్టి పడటం తన పోరాటానికి సహాయకారి కాగలదని ఆమె నమ్ముతున్నారు.

‘‘అవెరా విడుదలకు అవకాశాలు మెరుగయ్యాయని నమ్ముతున్నాను. కానీ ఇదంతా విషాదమే’’ అని ఆమె బీబీసీకి చెప్పారు.

హమాస్ దాడిచేసి 1400మందిని చంపి భారీ ఎత్తున బందీలను పట్టుకోవడంపై ఆమె మాట్లాడుతూ ‘‘ ఇజ్రాయెల్ అంతా ఇంకా దిగ్భ్రాంతిలోనే ఉంది’’ అని చెప్పారు.

అవేరా, హిషమ్‌లను వెనక్కి తీసుకురావడంలో ఇజ్రాయెల్ వైఫల్యంపై అంతా విసిగి పోయారని చెప్పారు.

‘‘వాళ్ళు సైనికులుకారు. జబ్బుపడి ఉన్నారు. వారికి మానసిక సమస్యలు ఉన్నాయి, మానవత్వం లేకుండా హమాస్ వారిని బంధించింది’’ అని ఆమె వాపోయారు.

వీరిద్దరి గురించి పట్టించుకోకపోవడానికి వీరి సామాజిక నేపథ్యాలే కారణమంటారు ఆమె.

ఇజ్రాయెల్‌లో ఇథియోపియన్ యూదులు, బెడ్వాయిన్ అరబ్ ల పట్ల ఉన్న వివక్ష కారణంగా వీరి విడుదలపై ఎవరికీ పట్టింపు లేకుండా పోయిందన్నారు.

‘‘అవెరా రంగు, మానసిక ఆరోగ్యం, అతను పెరిగిన పేదరిక పరిస్థితులు కారణంగా సమాజం అతన్ని పెద్దగా ఇష్టపడటంలేదు. అదే అతను కొంచెం మంచి రంగు ఉండి, మంచి ప్రాంతంలో పెరిగి ఉండి సమాజ వైఖరి భిన్నంగా ఉండేది. ఈ సమయంలో నా దేశం గురించి తప్పుగా చెప్పడం సరికాదని నాకు తెలుసు. కానీ నిజం చెప్పి తీరాలి. పెద్దపెద్ద మానవ హక్కుల సంస్థలు కూడా వీరి విడుదల విషయంలో ఏదో ఒకటి చేసి ఉండవచ్చు’’ అని టిలా ఫెంటా చెప్పారు.

జుమా అబు గనిమా అనే మరో ఇజ్రాయెలీ యువకుడు కూడా 2016లో గాజాలోకి ప్రవేశించాడని భావిస్తున్నారు.

ఇతను కూడా హిషమ్ లానే బెడౌయిన్ అరబ్బు. ఇతను కూడా హమాస్ చేతుల్లోనే ఉండి ఉండవచ్చు. అయితే దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

గాజాస్ట్రిప్‌లోకి అవేరా, హిషమ్ అక్రమంగా ప్రవేశించడానికి ముందు పలుసార్లు తప్పిపోయినట్టు, వారు మానసిక చికిత్స తీసుకున్నట్టు హ్యూమన్ రైట్స్ వాచ్ రీసెర్చ్ తెలుపుతోంది.

జనవరిలో తేదీలేని ఓ చిన్న వీడియోను హమాస్ విడుదల చేసింది. అందులో హిబ్రూ భాషలో గొణుగుతున్నట్టున్న ఓ మనిషి కనిపించాడు.

‘‘నేను బందీగా ఉన్న అవెరా మెన్గిస్టోను. నేనింకా ఎంతకాలం బందీగా ఉండాలి’’ అని చెప్పడం కనిపించింది.

మెన్గిస్టో కుటుంబసభ్యులు అతనిని గుర్తించారని అవేరా విడుదల కోసం పోరాటం చేస్తున్నవారు బీబీసీకి చెప్పారు.

అవేరా బతికే ఉన్నట్టుగా తమకు సమాచారం ఉన్నట్టు ప్రధాని నెతన్యాహు అవేరా తల్లి అగురేష్‌కు తెలిపారు.

‘‘అవెరా మెన్గిస్టోతోపాటు మిగిలిన బందీలు, తప్పిపోయినవారిని వెనక్కి తీసుకురావడానికి ఇజ్రాయెల్ తన ప్రయత్నాలను ఆపదు’’ అని కూడా ఆయన చెప్పారు.

జూన్ 2022లో హిషమ్ అల్ సయ్యద్ బందీగా ఉన్న వీడియోను విడుదల చేయగా, ఆయన తండ్రి దానిని ధృవీకరించారు.

అతని ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు మాత్రమే హమాస్ అందులో చెప్పింది. కానీ మరే ఇతర వివరాలు లేవు.

ఆ వీడియోలో అతను వెంటిలేటర్‌పై ఉన్నట్టుగా ఉంది. అతని పక్కన ఇజ్రాయెలీ గుర్తింపు కార్డు ఉంది.

హమాస్‌ సంఘర్షణలలో చనిపోయిన హదార్ గోల్డిన్ సోదరుడు జుర్ గోల్డిన్ ఇంకా గాజాలోనే ఉన్నారు. కిడ్నాప్‌లకు సంబంధించి ఇజ్రాయెల్ స్పష్టమైన విధానాన్ని తీసుకోవాలని ఆయన కోరారు.

జుర్‌ గోల్డిన్ ప్రకటనను ఇజ్రాయెలీ నేషనల్ న్యూస్ ‘‘ప్రతి కిడ్నాప్ కుటుంబాలను క్షోభ పెడుతుంది. కుటుంబాలలో, సమాజంలో వేదనను మిగల్చడానికే కిడ్నాప్ పన్నాగాన్ని ఉపయోగిస్తున్నారు. ఇటువంటివాటికి మన సమాజం అలవాటు పడిపోయింది. బందీల నుంచి దూరంగా బతకడంమనేది తమ తలరాతగా భావించే పరిస్థితి వచ్చింది’’ అని పేర్కొంది.

హగాయ్ హదాస్ బీబీసీతో మాట్లాడుతూ హమాస్ బందీల విడుదల చాలా సంక్లిష్టం, వివాదాస్పదం అని చెప్పారు.

‘‘టెర్రరిస్టులతో ఏదైనా ఒప్పందం చేసుకుంటే అది మంచి లేదా చెడు పరిణామాలకు దారి తీస్తుందనే సందిగ్థత ఉంటుంది’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)