You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇజ్రాయెల్‌కు మద్దతుగా అమెరికా యుద్ధానికి దిగుతుందా?
- రచయిత, జొనాథన్ బేలె
- హోదా, డిఫెన్స్ కరస్పాండెంట్, యష్కెలన్, ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ - హమాస్ ఘర్షణలో తమ మద్దతు ఇజ్రాయెల్‌కేనని అమెరికా ప్రకటించింది. సైనిక సాయం కూడా చేస్తోంది. అయితే, ఈ ప్రాంతంలో ఎదురైన గత అనుభవాల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు మద్దతు విషయంలో అమెరికా ఎంత వరకూ వెళ్తుంది? అమెరికా మద్దతుకి పరిమితి ఉందా, లేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత మొదటిసారి స్పందించినప్పడే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ వైఖరిని స్పష్టం చేశారు. ''అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉంటుంది'' అని ఆయన చెప్పేశారు.
''ఈ పరిస్థితులను ఎవరైనా తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటే, వారికి ఒక్కమాట చెబుతున్నాను. ఎవరూ అలా చేయొద్దు'' అని బైడెన్ అన్నారు.
ఈ హెచ్చరిక ఇరాన్, దాని మిత్రదేశాలను దృష్టిలో పెట్టుకొనే చేసినట్టైంది.
ఇరాక్, సిరియాలోని అమెరికా సైన్యంపై ఇటీవల పలుమార్లు దాడులు జరిగినట్లు పెంటగాన్ తెలిపింది. అలాగే, ఇజ్రాయెల్ లక్ష్యంగా యెమెన్ నుంచి ప్రయోగించిన మిస్సైల్స్‌ను అమెరికా యుద్ధ నౌక ఎర్రసముద్రంలో కూల్చివేసింది.
ఇప్పటికే మధ్యధరా సముద్రం తూర్పు ప్రాంతంలో అమెరికా క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ ఒకటి సిద్ధంగా ఉంది. త్వరలో మరొకటి ఇక్కడికి చేరుకోనుంది. ఈ గ్రూప్‌లో భాగమైన విమాన వాహక యుద్ధనౌకపై 70కి పైగా యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. అవసరమైతే ఇక్కడికి పంపించేందుకు వేల మంది భద్రతా దళాలను కూడా బైడెన్ సిద్ధంగా ఉంచారు.
రక్షణ పరంగా ఇజ్రాయెల్‌కు అమెరికా అతిపెద్ద మద్దతుదారు. ఏడాదికి దాదాపు 3.8 బిలియన్ డాలర్లు (దాదాపు 31 వేల 566 కోట్ల రూపాయలు) రక్షణ సాయంగా అందజేస్తోంది.
గాజాపై బాంబులు కురిపిస్తున్న ఇజ్రాయెల్ జెట్ విమానాలు కూడా అమెరికాలో తయారైనవే. చాలా వరకూ కచ్చితంగా లక్ష్యాన్ని ఛేదించగలిగిన ఆయుధాలనే ప్రయోగిస్తున్నారు. ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ వ్యవస్థ (మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్) ఐరన్‌డోమ్ కోసం కొన్ని ఇంటర్‌సెప్టర్ మిస్సైల్స్‌ని కూడా అమెరికా ఉత్పత్తి చేసింది.
ఆ ఆయుధాలను ఇజ్రాయెల్ అడక్క ముందే అమెరికా సరఫరా చేస్తోంది.
వాటితోపాటు మిడిల్ ఈస్టర్న్ (మధ్య ప్రాచ్య) మిత్రదేశాలకు 105 బిలియన్ డాలర్ల ( సుమారు 8,72,505 కోట్ల రూపాయలు) సైనిక సహాయ ప్యాకేజీలో భాగంగా, 14 బిలియన్ డాలర్ల (సుమారు 1,16,334 కోట్ల రూపాయలు) సాయాన్ని ఆమోదించాలని గత శుక్రవారం అమెరికా కాంగ్రెస్‌ను బైడెన్ కోరారు.
ఆ మరుసటి రోజే అత్యంత శక్తిమంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థలను మిడిల్ ఈస్ట్‌కి పంపనున్నట్లు పెంటగాన్ ప్రకటించింది. వాటిలో టెర్మినల్ హై అల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ (టీహెచ్‌ఏఏడీ) బ్యాటరీ, అదనపు పేట్రియాట్ బ్యాటరీలు కూడా ఉన్నాయి.
ఎన్నికల ఏడాది బైడెన్ అంత సాహసం చేస్తారా?
అయితే, అమెరికా అధ్యక్షుడు మరో యుద్ధంలో చిక్కుకునేందుకు సిద్ధంగా ఉన్నారా? మరీ ముఖ్యంగా ఈ ఎన్నికల సంవత్సరంలో అంత సాహసం చేస్తారా? ఇప్పటికే ఈ ప్రాంతంలో సైనిక చర్యల కారణంగా ఆర్థికంగా, రాజకీయంగానే కాకుండా చాలా మంది సైనికులను కూడా అమెరికా కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా సిద్ధంగా ఉందా?
విమాన వాహక యుద్ధనౌకలను మోహరించడం ద్వారా అమెరికా మొదటి అడుగు వేసిందని అమెరికాకు ఇజ్రాయెల్ మాజీ రాయబారి మైకేల్ ఒరెన్ అభిప్రాయపడ్డారు. ''తుపాకీ వాడే ఉద్దేశం లేకపోతే అలా బయటికి తీయాల్సిన అవసరం లేదు'' అని ఆయన ఉదహరించారు.
అయితే, గాజా యుద్ధంలో నేరుగా పాల్గొనేందుకు అమెరికా అంత సుముఖంగా లేదని వాషింగ్టన్‌లోని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సేథ్ జీ జోన్స్ అన్నారు.
ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించి వైమానిక దాడులు చేయగలిగిన అమెరికా, మిడిల్‌ఈస్ట్ ప్రాంతంలో యుద్ధ నౌకలను మోహరించడం వ్యూహాత్మకమేనని, దాడి చేయకుండానే అనుకున్న లక్ష్యం నెరవేరే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దాడి చేయడం చివరి ఆప్షన్ అని అన్నారు.
హిజ్బొల్లా ముప్పుపై అమెరికా, ఇజ్రాయెల్ ఆందోళన
ప్రధానంగా ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతం వైపు నుంచే ముప్పు పొంచి ఉంది. ముఖ్యంగా మిలిటెంట్ సంస్థ హిజ్బొల్లా నుంచి ఆ ముప్పు ఉండొచ్చని ఇజ్రాయెల్, అమెరికా ఆందోళన చెందుతున్నాయి.
గాజాలో హమాస్ కంటే, ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బొల్లాతోనే ఎక్కువ ముప్పు. హిజ్బొల్లా ఆయుధాగారంలో దాదాపు 1,50,000 రాకెట్లు ఉన్నట్లు అంచనా. హమాస్ ప్రయోగించిన రాకెట్ల కంటే ఇవి శక్తిమంతమైనవి. లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించగలవు. ఇప్పటికే బద్ద శత్రువులు హిజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య పరస్పరం కాల్పులు కూడా జరిగాయి.
గాజాలోకి ఇజ్రాయెల్ చొచ్చుకెళ్లి, యుద్ధంలో అలిసిపోయిన సమయంలో హిజ్బొల్లా రంగంలోకి దిగొచ్చని మైకేల్ ఒరెన్ ఆందోళన వ్యక్తం చేశారు.
అదే జరిగితే, లెబనాన్‌లోని హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు చేసే అవకాశం ఉందని ఒరెన్ అభిప్రాయపడ్డారు. నేరుగా భూతల యుద్ధంలో అమెరికా పాల్గొంటుందని తాను అనుకోవడం లేదని చెప్పారు.
అమెరికా జోక్యంతో ఎవరికి నష్టం?
అమెరికా పౌరులు, అమెరికా సైన్యంపై దాడులు జరిగినా, పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారినా అమెరికా తప్పకుండా ప్రతిస్పందిస్తుందని యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ చెప్పారు.
తమను తాము రక్షించుకునే హక్కు అమెరికాకు ఉందని, అలాంటి పరిస్థితి వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకాడేది లేదని ఆస్టిన్ ఆదివారం చేసిన ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల కారణంగా జరగబోయే ప్రమాదాలను జోన్స్ అంచనా వేసే ప్రయత్నం చేశారు. అమెరికా జోక్యం చేసుకుంటే ఇరాన్, దాని మిత్రదేశాలకు మరింత నష్టం కలిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒకవేళ లెబనాన్ భూభాగం నుంచి మిలిటెంట్ సంస్థ హిజ్బొల్లా ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంపై దాడి చేస్తే మాత్రం వాళ్లు తీవ్రమైన ప్రతిదాడిని ఎదుర్కోవాల్సి ఉంటుందని జోన్స్ అన్నారు. గతంలో ఈ ప్రాంతంలో ఇరాన్ మద్దతు కలిగిన సంస్థలు అమెరికా సైన్యంపై చేసిన దాడులను ఆయన గుర్తు చేశారు.
అలాగే, హమాస్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్ కూడా ప్రత్యక్ష సైనిక మద్దతు కోరడం లేదు.
''తనను తాను సొంతంగా రక్షించుకోవడం ఇజ్రాయెల్ సైనిక సిద్ధాంతం'' అని డానీ అర్బాచ్ అన్నారు. ఆయన హిబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలెంలో మిలిటరీ హిస్టరీ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
ఇజ్రాయెల్‌కి మద్దతు విషయంలో కొన్ని షరతులు ఉంటాయని అమెరికా అధ్యక్షుడి ఇజ్రాయెల్ పర్యటన సూచించింది. గాజాలోకి మానవతా సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతించడంతో పాటు, గాజా స్ట్రిప్‌ను పూర్తిగా ఆక్రమించుకోవడానికి తాము వ్యతిరేకమన్న సంకేతాలు పంపింది. అది చాలా తప్పు అని సీబీఎస్ టీవీ 60 మినిట్స్ కార్యక్రమంలో బైడెన్ అన్నారు.
అమెరికా మద్దతు కాలానుగుణంగానూ ఉండే అవకాశం ఉందని మిలిటరీ అనలిస్ట్, జెరూసలెం పోస్ట్‌కి చెందిన కాలమిస్ట్ యాకోవ్ కట్జ్ అభిప్రాయపడ్డారు. గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్య ప్రారంభమైన తర్వాత అమెరికా మద్దతుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని, మరోవైపు అక్కడ పౌరుల మరణాలు కూడా పెరిగాయని, అది కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆయన అన్నారు.
మరి కొద్ది వారాల్లో ఇజ్రాయెల్‌కి మద్దతు తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సుదీర్ఘ కాలం కొనసాగే సైనిక చర్యకు అమెరికా సహా ఇతర దేశాల నుంచి ఇదే తరహా మద్దతు ఉండకపోవచ్చని అన్నారు.
ఇజ్రాయెల్‌కి మద్దతు ఇవ్వడం, మిడిల్ ఈస్ట్‌లో అమెరికా భద్రతా దళాల మోహరింపు వంటి చర్యలు ప్రస్తుత ఘర్షణ వాతావరణం మరింత విస్తృతం కాకుండా అడ్డుకునేందుకు సరిపోతాయని అమెరికా భావిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- చమురును అరబ్ దేశాలు 50 ఏళ్ల క్రితమే ఆయుధంగా ఎలా మలచుకున్నాయి? ఆ తర్వాత ప్రపంచం ఎలా మారిపోయింది?
- గాజా: 'మురికి నీళ్లు తాగుతున్నా, నాకు వేరే ఆప్షన్ లేదు'
- ఇజ్రాయెల్ vs హమాస్: ‘‘ఈ ఘర్షణ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా?’’
- హమాస్ మిలిటెంట్ల బాడీకామ్ ఫుటేజిని జర్నలిస్టులకు ప్రదర్శించిన ఇజ్రాయెల్... అక్టోబర్ 7 నాటి ఆ వీడియోల్లో కాల్పుల మోతలు, రక్తంతో తడిసిన పౌరుల హాహాకారాలు
- గాజా ప్రజలను కాపాడండి: ఐక్యరాజ్య సమితిలో కన్నీరు పెట్టుకున్న పాలస్తీనా ప్రతినిధి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)