You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇజ్రాయెల్ ఇప్పటికీ గాజాలోకి అడుగు పెట్టలేకపోతోంది ఎందుకు? నాలుగు ప్రధాన కారణాలివే...
- రచయిత, ఫ్రాంక్ గార్డనర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ రాకెట్ల దాడి చేయడంతో వందలాది మంది చనిపోయారు. దీంతో గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగింది.
హమాస్‌ను తుదముట్టించడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించారు.
ఇజ్రాయెల్ వైమానిక, నౌకాదళాలు చాలా రోజులుగా గాజాలోని హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ గ్రూపు స్థావరాలపై బాంబు దాడులు చేస్తున్నాయి.
ఈ బాంబు దాడుల్లో వేలాది మంది పాలస్తీనియన్లు మరణించారు. పెద్ద సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. కొందరు హమాస్ కమాండర్లు కూడా మరణించారు.
గాజాలోని హాస్పిటల్ పేలుడులో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.
ఆసుపత్రిపై దాడి ఘటన పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది.
గత కొన్ని రోజులుగా గాజాలోకి తమ సైన్యం ప్రవేశిస్తుందని ఇజ్రాయెల్ సంకేతాలిస్తోంది. యుద్ధ తీవ్రత దృష్ట్యా 3 లక్షల మంది రిజర్వ్ సైనిక బలాన్ని సిద్ధం చేసింది.
గాజా సరిహద్దులో యుద్ధ ట్యాంకులు, ఫిరంగి దళాలు, ఆధునిక ఆయుధాలతో వేలాది మంది ఇజ్రాయెల్ సైనికులు సిద్ధంగా ఉన్నారు.
ఇంతకీ పౌరులు బందీలుగా ఉన్నా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోకి ప్రవేశించడానికి ఎందుకు సమయం తీసుకుంటోంది? దీనికి ప్రధానంగా నాలుగు కారణాలున్నాయి.
1. అమెరికా ఆందోళనలు
రెండు రోజుల కిందట అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌లో ఆకస్మిక పర్యటన చేశారు. ఇది పశ్చిమాసియాలో దిగజారుతున్న పరిస్థితులపై వైట్‌హౌస్ ఆందోళన చెందుతోందనడానికి సూచన.
అమెరికాకు రెండు ప్రధాన ఆందోళనలు ఉన్నాయి. ఒకటి నియంత్రించలేని మానవతా సంక్షోభం, రెండోది మిడిల్ ఈస్ట్ అంతటా విస్తరిస్తున్న ఘర్షణలు.
గాజాపై ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని అమెరికా ఇప్పటికే వ్యతిరేకించింది. 2005లో ఆ ప్రాంతంపై ఇజ్రాయెల్ నియంత్రణ వదులుకుంది.
గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ పట్టు సాధించడం సమంజసం కాదని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభిప్రాయం వ్యక్తంచేశారు.
రెండు రోజుల కిందట ఇజ్రాయెల్‌కు మద్దతుగా టెల్ అవీవ్ చేరుకున్నారు బైడెన్. ఎందుకంటే గాజా పట్ల ఇజ్రాయెల్ విధానంపై వైట్‌హౌస్ పూర్తిగా తెలుసుకోవాలనుకుంటోంది..
ఇజ్రాయెల్ మళ్లీ గాజాలోకి ప్రవేశిస్తే, అది ఎంతకాలం అక్కడ ఉంటుంది? ఖచ్చితంగా ఏం చేస్తుందో అగ్రరాజ్యానికి తెలియాలి. ఇదేసమయంలో టెల్ అవీవ్‌లో బైడెన్ ఉన్నంత కాలం, ఇజ్రాయెల్ గాజాలోకి ప్రవేశించే అవకాశం లేదు. అయితే, బైడెన్ ఇజ్రాయెల్ పర్యటన కంటే గాజా ఆసుపత్రిపై జరిగిన దాడిపైనే ఎక్కువగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా ఆసుపత్రిపై దాడి విషయంలో ఇజ్రాయెల్ వాదనలకు బైడెన్ మద్దతు తెలిపారు. అయితే, ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసిందని పాలస్తీనా అధికారులు ఆరోపించారు.
2. హిజ్బుల్లా దాడి చేస్తుందనే భయం?
గాజాపై ఇజ్రాయెల్ దాడికి ధీటుగా సమాధానం ఇస్తానని ఇరాన్ హెచ్చరిస్తోంది. అసలు ఈ బెదిరింపుల అర్థం ఏమిటి?
ఇరాన్ మిడిల్ ఈస్ట్‌లోని షియా మిలిటెంట్లకు ఆయుధాలు, నిధులు అందజేస్తూ వారికి శిక్షణనిస్తోంది. కొంతవరకు, ఈ గ్రూపులపై ఇరాన్ నియంత్రణ కూడా ఉంది.
ఈ గ్రూపుల్లో అత్యంత ప్రమాదకరమైనది హిజ్బొల్లా. ఇది ఇజ్రాయెల్ సరిహద్దులో గల లెబనాన్‌లో ఉంది.
2006లో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరిగింది, ఆ సమయంలో హిజ్బుల్లా ల్యాండ్‌మైన్‌ల సహాయంతో ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులనూ పేల్చేసింది.
ఆ యుద్ధం తర్వాత హిజ్బొల్లాను ఇరాన్ మరింత బలపరిచింది. హిజ్బుల్లా వద్ద లక్షన్నర రాకెట్లు, క్షిపణులు ఉన్నాయని ఒక అంచనా. ఇందులో కొన్ని సుదూర శ్రేణి కచ్చితత్వ క్షిపణులు కూడా ఉండొచ్చు.
గాజాలోకి ఇజ్రాయెల్ ప్రవేశిస్తే, ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో హిజ్బొల్లా కొత్త ఫ్రంట్ ప్రారంభించే అవకాశం ఉంది. దీంతో రెండు వైపులా పోరాటం ఇజ్రాయెల్‌కు పెద్ద సమస్య అవుతుంది.
ఈ పరిస్థితుల్లో హిజ్బొల్లా యుద్ధానికి ఆసక్తి చూపుతుందా అనేది స్పష్టంగా లేదు. ఎందుకంటే రెండు అమెరికా నేవీ యుద్ధనౌకలు మధ్యధరా సముద్రంలో ఉన్నాయి. అవి హిజ్బుల్లాను సులభంగా లక్ష్యంగా చేసుకోగలవు.
ఇది ఇజ్రాయెల్‌కు కొంత బలం ఇవ్వనుంది. ఎందుకంటే హిజ్బొల్లా రంగంలోకి దిగితే, అమెరికా భారీ ఫిరంగి దళంతో ముందుకొస్తుందని ఇజ్రాయెల్ అంచనా.
అయితే, 2006 యుద్ధం సమయంలో హిజ్బొల్లా క్షిపణులు మధ్యధరా సముద్రంలోని ఇజ్రాయెల్ యుద్ధనౌకలపై కూడా దాడి చేశాయని గమనించాలి.
3. మానవతా సంక్షోభం భయం
మానవతా సంక్షోభం నిర్వచనం ఇజ్రాయెల్ విషయంలో కొద్దిగా భిన్నంగా ఉంది.
పాలస్తీనాలో పౌర మరణాల సంఖ్య పెరుగుతున్నందున, అక్టోబర్ 7 హమాస్ క్రూరత్వానికి బదులుగా ఇప్పుడు ప్రపంచం దృష్టి ఇజ్రాయెల్‌పై పడింది.
గాజాలోని సాధారణ పౌరుల భద్రతపై ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇజ్రాయెల్ దళాలు గాజాలోకి ప్రవేశిస్తే మరణాల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.
సైన్యం గాజాలోకి వెళితే, ఇజ్రాయెల్ సైనికులు కూడా చనిపోతారు. వారిపై మెరుపుదాడి జరగొచ్చు. స్నిపర్లు వారిని లక్ష్యంగా చేసుకోవచ్చు, మందుపాతరలు పేలవచ్చు.
గాజా అంతటా విస్తరించి ఉన్న వందల కిలోమీటర్ల సొరంగాలు ఇజ్రాయెల్ సైన్యం మరణానికి ఉచ్చులుగా మారవచ్చు. దీని ప్రభావం సామాన్యులపై కూడా పడనుంది.
4. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వైఫల్యం
గత నెల ఇజ్రాయెల్ గూఢచార వ్యవస్థకు పీడకలలాంటిది.
ఇజ్రాయెల్ దేశీయ నిఘా సంస్థ 'షిన్ బెట్' హమాస్ దాడులను పసిగట్టడంలో విఫలమవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
షిన్ బెట్‌కు గాజాలో నిఘా, గూఢచారుల నెట్‌వర్క్ ఉంది. వారు హమాస్ ప్రతి కదలికను గమనిస్తుంటారు. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ అనే గ్రూపుపై కూడా వారి కన్ను పడింది.
అయితే, అక్టోబర్ 7న జరిగిన దాడి ఇజ్రాయెల్ గూఢచార సంస్థ అతిపెద్ద వైఫల్యం.
గత పది రోజులుగా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ అహర్నిశలు పనిచేస్తోంది.
ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గాజాలో కిడ్నాపైన వ్యక్తుల పేర్లు , వారున్న ప్రదేశాలను ఇజ్రాయెల్ సైన్యానికి అందజేస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతోపాటు హమాస్ కమాండర్లు, లొకేషన్ల సమాచారాన్ని కూడా సేకరించే పనిలో ఉంది.
గాజాలోకి పదాతిదళం ప్రవేశించినప్పుడు వారి వద్ద పూర్తి సమాచారం ఉంచడానికి నిఘా సంస్థలు సమయం కోరే అవకాశం కూడా ఉంది.
గాజాలోకి ప్రవేశించి హమాస్ ఉచ్చులో చిక్కుకోవద్దనుకుంటోంది ఇజ్రాయెల్ మిలటరీ.
అంతేకాదు గాజాలో ఇజ్రాయెల్ దాడిని ఊహించి హమాస్, ఇస్లామిక్ జిహాద్ అక్కడ మందుపాతరలను అమర్చి ఉండవచ్చు. ఇవన్నీ ఇజ్రాయెల్ సైన్యాన్ని ఆచితూచి వ్యవహరించేలా చేస్తోంది.
మరోవైపు భూగర్భ సొరంగాలలో సవాలు అత్యంత కఠినం. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇజ్రాయెల్ ఢిపెన్స్ ఫోర్సెస్‌కి ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలి. అప్పుడే సాయుధులు సమర్థవంతంగా దాడులను ఎదుర్కోగలరు.
ఇవి కూడా చదవండి
- నవాజ్ షరీఫ్: పాకిస్తాన్లో దిగిన మాజీ ప్రధాని... ఆర్మీ ఆటలో ఈసారి ఏం జరుగుతుందో?
- గోల్కొండ వజ్రాలతో ఆ యూదుల దశ ఎలా తిరిగింది?
- టైగర్ నాగేశ్వరరావు రివ్యూ: ఆంధ్రా రాబిన్ హుడ్‌గా రవితేజ అలరించాడా?
- డ్రీమ్ 11 యాప్‌లో క్రికెట్ ఆడి ఈ ఎస్సై కోటిన్నర ఎలా గెలుచుకున్నారు? ఆ తర్వాత ఏమైంది?
- ఇజ్రాయెల్‌తో పోరుకు సిద్ధమంటున్న హిజ్బొల్లా సంస్థ చరిత్ర ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)