You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చమురును అరబ్ దేశాలు 50 ఏళ్ల క్రితమే ఆయుధంగా ఎలా మలచుకున్నాయి? ఆ తర్వాత ప్రపంచం ఎలా మారిపోయింది?
- రచయిత, గ్యులెర్మో డి. ఒల్మో
- హోదా, పెరూ నుంచి బీబీసీ కోసం
ఇజ్రాయెల్ మీద అక్టోబర్ 7న హమాస్ దాడులు చెయ్యడంతో, ఈ రెండు పక్షాల మధ్య ఘర్షణలు ఒక్కసారిగా తారస్థాయికి చేరాయి. పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మిడిల్ ఈస్ట్‌లోని మిగతా దేశాలకు వ్యాపిస్తుందేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.
50 ఏళ్ల క్రితం ముడి చమురు ఉత్పత్తి చేసే దేశాలు తీసుకొచ్చిన చమురు సంక్షోభం అరబ్ దేశాల భాగ్యరేఖల్ని తిరగరాసింది. అది ఒక దశలో అమెరికాను ఆర్థికంగా కూల్చివేస్తుందోమోనని భయపెట్టింది.
1948లో యూదు దేశంగా ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత ఆ దేశానికి అరబ్ దేశాలకు మధ్య జరిగిన అనేక యుద్ధాల్లో ఒకటి అగ్గి రాజేసింది.
యోమ్ కిప్పూర్ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు ఆయుధాలు అందించాలని అమెరికా నిర్ణయించింది. ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ చమురు ఎగుమతుల్లో కీలకంగా ఉన్న అరబ్ దేశాలైన ఈజిప్ట్, సిరియాలతో పోరాడుతోంది. ఇజ్రాయెల్‌కు ఆయుధాల సరఫరా విషయంలో అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకించిన అరబ్ దేశాలు అమెరికాతో పాటు దాని మిత్ర దేశాలకు చమురు ఎగుమతుల మీద నిషేధం విధించాలని నిర్ణయించాయి. దీంతో చమురు ధరలు అమాంతం పెరిగి అమెరికా సహా ప్రపంచంలోని అనేక ఆర్థిక వ్యవస్థలు నిలువునా కదిలిపోయాయి. ఇది ఎలా జరిగింది?
1973లో ప్రపంచం ఎలా ఉంది?
1973లో దాదాపు ప్రపంచ దేశాలన్నీ అమెరికా- రష్యా మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా రెండుగా చీలిపోయాయి. ఈ రెండు దేశాలు యుద్ధంలో ఒకదానితో ఒకటి నేరుగా తలపడకున్నా, చాలా దేశాల్లో చెరో వైపు చేరి వాటికి మద్దతు ప్రకటించాయి.
ఆటోమొబైల్ రంగం విస్తరిస్తున్న సమయంలో ప్రజల్లో వినిమయ సంస్కృతిని పెంచేందుకు అవసరమైన చమురు కోసం ఈ రెండు దేశాలు అణుయుద్ధానికి దిగుతాయోమోనని ఆ సమయంలో ప్రపంచం భయపడింది.
అప్పటి వరకూ పశ్చిమ దేశాల్లో చమురు ధరలు చాలా చౌకగా ఉండేవి. ఈ దేశాల చమురు కంపెనీలు మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి చాలా చౌక ధరలకు ఇంధనాన్ని కొనేవి.
ప్రపంచానికి చమురు ఎగుమతిదారులుగా అంతర్జాతీయ యవనిక మీద అరబ్ దేశాల ప్రాధాన్యం పెరుగుతూ వచ్చింది. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత ఆ దేశానికి అరబ్ దేశాలతో ఘర్షణ వల్ల ఆ ప్రాధాన్యం మరింత పెరిగింది.
చమురు సంక్షోభం ఎందుకు మొదలైంది?
1973 అక్టోబర్‌లో ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఉద్యమాలు జరుగుతున్న సమయంలో, వియత్నాంలో అమెరికా చేస్తున్న యుద్ధంలో రక్తపాతాన్ని తగ్గించేందుకు నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ హెన్రీ కిసింజర్ అనే యూదు దౌత్యవేత్తను విదేశాంగ మంత్రిగా నియమించారు. ఈ పరిణామం అందర్నీ ఆకర్షించింది.
అయితే అదే సమయంలో హఠాత్తుగా ప్రకటించిన మరో యుద్ధం కూడా ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుంది.
1973 అక్టోబర్ 6 యూదుల పవిత్ర దినం యోమ్ కిప్పూర్ రోజున ఈజిప్టు, సిరియా నాయకత్వంలోని అరబ్ సంకీర్ణ కూటమి దళాలు ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి.
1967లో జరిగిన 6 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి దక్కించుకోవాలని ఈజిప్టు అధ్యక్షుడు మొహమద్ అన్వర్ ఎల్ సదత్, సిరియా అధ్యక్షుడు హఫేజ్ అల్ అస్సాద్ భావించారు.
సిరియా, ఈజిప్టు, భాగస్వామ్య దేశాలకు రష్యా నుంచి ఆయుధాల సరఫరా మొదలు కావడంతో ఇజ్రాయెల్‌కు సైనిక ప్యాకేజ్ ఇస్తున్నట్లు నిక్సన్ ప్రకటించారు. అమెరికా ఇజ్రాయెల్‌కు ఆయుధాలు పంపించడంపై అరబ్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
11 రోజుల తర్వాత చమురు ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించిన అరబ్ దేశాలు, అమెరికాకు చమురు సరఫరాపై నిషేధం విధిస్తామని హెచ్చరించాయి. అమెరికాతో పాటు ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్న అమెరికా, నెదర్లాండ్స్, పోర్చుగల్, సౌతాఫ్రికాకు కూడా చమురు ఎగుమతులు ఆపేస్తామని చెప్పాయి.
చమురు ఎగుమతి దేశాల సమాఖ్య- ఒపెక్‌కు నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయం తర్వాతి రోజుల్లో ప్రపంచ ఆర్థిక, భౌగోళిక పరిణామాలపై ప్రభావం చూపిస్తూ వచ్చింది. అంతే కాకుండా తాము అమెరికాకు చమురు సరఫరా చేస్తామనే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దని చెప్పింది.
కీలక పాత్ర పోషించిన సౌదీ, సిరియా నాయకులు
సౌదీ రాజు ఫైసర్ బిన్ అబ్దులజీజ్ ఈ నిర్ణయాన్ని ప్రోత్సహించారు. ఇందులో సిరియా అధ్యక్షుడు సదత్ కూడా కీలకంగా వ్యవహరించారని కొంత మంది రచయితలు రాశారు. ఇజ్రాయెల్ మీద దాడి చెయ్యడానికి కొన్ని నెలల ముందే, యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు పలికితే ఆ దేశానికి చమురు ఎగుమతుల మీద నిషేధం విధించాలని, దాడి చెయ్యడానికి కొన్ని నెలల ముందు నుంచి సదత్, సౌదీ రాజుని ఒప్పించేందుకు ప్రయత్నించారు.
“సదత్, ఫైసల్ ఒప్పుకోకుంటే ఈ నిషేధం అమల్లోకి వచ్చేది కాదు” అని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖలో మధ్య ప్రాచ్య వ్యవహారాల విశ్లేషకుడిగా ఉన్న గ్రీమ్ బ్యానర్‌మాన్ బీబీసీతో చెప్పారు.
“ఒక్కసారి వెనక్కి వెళితే, అరబ్ దేశాలు ఇప్పటికంటే అప్పట్లో ఎక్కువ ఐక్యంగా ఉన్నాయి. పాలస్తీనాకు విమోచన కల్పించాలని కోరుతున్న దేశాలు, ఈజిప్టు మాదిరిగా సైనిక మార్గంలో యుద్ధం చెయ్యడం కాకుండా, చమురు అనే పదునైన అస్త్రం ద్వారా ఆ కార్యాన్ని సాధించగలమని గుర్తించాయి” అని కెనడాలోని వాటర్‌లూ యూనివర్సిటీలో మిడిల్ ఈస్ట్ వ్యవహారాల నిపుణులు బెస్సామ మొమని బీబీసీతో అన్నారు.
చమురు ఎగుమతిదారుల్ని నిక్సన్ దెబ్బతీయడంతో..
వాస్తవానికి అరబ్ దేశాలు అమెరికా గురించి ఆందోళన చెందడానికి కారణాలు ఉన్నాయి.
అందులో ఎక్కువ చర్చనీయాంశంగా మారిన అంశం బంగారం ప్రామాణికతను మారుస్తూ 1971లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ తీసుకున్న నిర్ణయం.
బంగారాన్ని డాలర్లలోకి మార్చుకునే ప్రామాణిక విలువను నిక్సన్ మార్చివేశారు. అప్పట్లో ఒక డాలర్‌కు ఒక ఔన్స్ బంగారం వచ్చేది. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో కుదిరిన బ్రెట్టన్ ఉడ్స్ ఒప్పందానికి అనుగుణంగా ఉన్న ప్రామాణిక మారకపు విలువను నిక్సన్ 1971లో మార్చేశారు. అప్పటివరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తూ వచ్చిన కీలక అంశాల్లో ఈ ప్రామాణిక మారకపు విలువ ఒకటి.
నిక్సన్ నిర్ణయం చమురు ఎగుమతిదారుల్ని దెబ్బ తీసింది. అరబ్ దేశాలు చమురుని డాలర్లకు అమ్మేవి. అయితే ఇప్పుడు డాలర్‌కు కూడా నాటి విలువ లేదు.
ఈ పరిస్థితుల మధ్య అనేక అరబ్ దేశాలు “ప్రపంచం తమ డిమాండ్లకు తల వంచేలా చమురును ఆయుధంగా మలచుకోవాలి” అని పిలుపు ఇచ్చాయి. సౌదీ అరేబియా లాంటి కొన్ని దేశాలు మాత్రం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. ఇలా చేస్తే అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు చమురు దిగుమతుల కోసం వేరే దేశాలను ఆశ్రయించవచ్చని సౌదీ అరేబియా భయపడింది.
“వాస్తవానికి అమెరికాకు చమురు ఎగుమతుల నిషేధం విషయంలో సౌదీ రాజు ఫైసల్ అంత సుముఖంగా లేరు. అయితే అప్పటి పరిస్థితులు ఆయనను ఒత్తిడి చేశాయి. సోవియట్ రష్యా, అల్జీరియా లాంటి దేశాలు ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి” అని స్పెయిన్‌లోని కంప్లూటెన్స్ యూనివర్సిటీ ఆఫ్ మాడ్రిడ్‌లో అరబ్ అండ్ ఇస్లామిక్ స్టడీస్ ప్రొఫెసర్ ఇగ్నాసియే అల్వరెజ్ ఒస్సోరియో బీబీసీతో చెప్పారు.
ఇజ్రాయెల్‌లోని గొల్డా మెయిర్ ప్రభుత్వానికి సైనిక సాయం అందించాలని నిక్సన్ నిర్ణయించడంతో “చమురుని ఆయుధంగా ప్రయోగించాలి” అనే ప్రతిపాదనకు మద్దతు పెరిగింది.
అమెరికాను శిక్షించాలని వాళ్లు భావించారు.
నిషేధంతో షాక్ తిన్న అమెరికా
చమురు ఎగుమతులపై అరబ్ దేశాలు నిషేధం విధించడంతో అమెరికా షాక్ తింది.
ఆ ఏడాది జులైలో 2.90 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడి చమురు ధర డిసెంబర్ నాటికి 11.65 డాలర్లకు చేరింది.
అమెరికాలో పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కోసం కార్లు గంటల తరబడి క్యూలలో నిల్చోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి కొన్ని నెలల వరకూ కొనసాగింది. అనేక రాష్ట్రాల్లో చమురు సరఫరాలో నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
వ్యక్తిగత వాహనాన్ని స్వేచ్ఛకు చిహ్నంగా భావిస్తున్న అమెరికా సమాజంలో ఈ పరిణామం చిచ్చు రేపింది. సామాన్యుల కలలు చెదిరిపోయాయి. చమురు కొరత అమెరికా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది.
అమెరికన్లకు అష్ట కష్టాలు
చమురు ఎగుమతులపై నిషేధంతో 1975 వరకు అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఆరు శాతం పడిపోయింది. నిరుద్యోగిత రెట్టింపై 9 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం పెరిగి లక్షల మంది అమెరికన్లు అష్టకష్టాలు పడ్డారు.
“1815లో బ్రిటిషర్లు వాషింగ్టన్‌ను తగలబెట్టినప్పటి నుంచి మరే దేశం వల్ల కూడా అమెరికాకు ఇంత భారీగా ఆర్థిక నష్టం జరగలేదు” అని చమురు ఎగుమతుల నిషేధం వల్ల అమెరికాకు జరిగిన నష్టంపై సీఐఏ మాజీ ఏజంట్ బ్రూస్ రైడెల్ వ్యాఖ్యానించారు.
నిషేధాన్ని ఎత్తి వేయాలని కోరుతూ 1974 వరకూ హెన్రీ కిసింజర్ అరబ్ దేశాల రాజధానులకు చక్కర్లు కొడుతూనే ఉన్నారు. యోమ్ కిప్పూర్ యుద్ధం ముగిసిన చాలా రోజుల తర్వాత నిషేధాన్ని తొలగించారు.
ఇజ్రాయెల్‌కు మద్దతివ్వాలన్న అమెరికా నిర్ణయాన్ని మాత్రం ఈ నిషేధం మార్చలేకపోయింది. నేటికీ ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా నిలుస్తూనే ఉంది. అయితే ఆ నిర్ణయం ప్రపంచ రాజకీయ గమనంలో కొన్ని మార్పుల్ని తీసుకొచ్చింది.
చమురు సంక్షోభం, దాన్ని అమలు చేసిన, ఎదుర్కొన్న నేతల కథ ఎలా ముగిసింది?
ఇజ్రాయెల్ మీద దాడి విషయంలో ఈజిప్టు అధ్యక్షుడు సదత్ అనుకున్నది సాధించలేకపోయినా, తమది బలమైన సైనిక శక్తినని, ఎప్పుడైనా దాడి చెయ్యగలమని ఆయన నిరూపించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికానాయకత్వం 1978లో ఈజిప్టుతో క్యాంప్ డేవిడ్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం సినాయ్ ద్వీపకల్పాన్ని ఇజ్రాయెల్ ఈజిప్టుకు ఇచ్చేసింది.
“అమెరికాకు చమురు ఎగుమతుల నిషేధం వల్ల ఆ దేశ విధాన రూపకల్పనలో మార్పు రాకపోయి ఉంటే క్యాంప్ డేవిడ్ ఒప్పందం ఎప్పటికీ సాధ్యమై ఉండేది కాదు” అని బ్యానర్ మాన్ అభిప్రాయపడ్డారు.
సినాయ్ ద్వీపకల్పాన్ని ఇచ్చినందుకు ప్రతిగా ఈజిప్ట్ ఇజ్రాయెల్‌ను అధికారికంగా గుర్తించింది. ఇలా గుర్తించిన తొలి అరబ్ దేశం అదే. దీంతో అరబ్ ప్రపంచంలో సదత్ ప్రతిష్ఠ దిగజారింది. అయితే పశ్చిమ దేశాలకు ఆయన ఆధారపడదగిన వ్యక్తిగా, శాంతికాముకుడిగా మారారు. క్యాంప్ డేవిడ్ ఒప్పందం తర్వాత ఈజిప్ట్, రష్యాకు దూరం జరిగి అమెరికా, ఐరోపా దేశాలకు సన్నిహితంగా మారింది.
నిక్సన్ రాజీనామా
చమురు ఎగుమతుల నిషేధం తొలగించిన ఐదు నెలల తర్వాత నిక్సన్ వాటర్‌గేట్ కుంభకోణంలో అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. అవినీతి ఆరోపణలతో పదవికి రాజీనామా చేసిన తొలి అమెరికా అధ్యక్షుడిగా రికార్డులకెక్కారు.
రియాద్‌లో జరిగిన ఓ విందు కార్యక్రమంలో సౌదీ రాజు ఫైసల్‌ను ఆయన మేనల్లుడు కాల్చి చంపాడు. ఆ తర్వాత ఆయన చాలా కాలం అమెరికాలోనే ఉన్నారు. ఫైసల్ హత్య వెనుక సీఐఏ ఉందని అనుమానాలు వ్యక్తమైనప్పటికి నిర్ధరణ కాలేదు.
చమురు సంక్షోభం తర్వాతి కాలంలో ఎలాంటి ప్రభావం చూపించింది?
అప్పటి వరకూ చౌకగా లభించిన ముడి చమురు తర్వాత ఖరీదైన వ్యవహారంగా మారింది. మధ్యప్రాచ్యంలో చిన్న అలజడి చెలరేగినా ముడి చమురు ధరలు పెరగడం ఆనవాయితీగా మారింది.
1979లో వచ్చిన ఇరాన్ విప్లవం, 1991లో గల్ఫ్ వార్ సమయంలో ముడి చమురు ధరలు అమాంతం పెరగడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింది.
నిషేధం తర్వాత ప్రపంచ ఇంధన మార్కెట్‌లో అంతర్జాతీయ చమురు ఎగుమతి దేశాల సమాఖ్య- ఒపెక్ ప్రత్యేక శక్తిగా అవతరించింది. సమాఖ్యలోకి కొత్త దేశాలను చేర్చుకుని మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఒపెక్ దేశాలు సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటిస్తే.. పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థల్లో వణుకు పుడుతోంది.
అమెరికా, యూరప్‌లలో వచ్చిన మార్పులు ఏమిటి?
నిషేధం తర్వాత అమెరికాలో ఆటోమొబైల్ రంగంలో భారీ మార్పులు వచ్చాయి. పెట్రోలు ఎక్కువగా వినియోగించే వాహనాల స్థానంలో ఎక్కువ మైలేజీ వచ్చే వాహనాల కోసం డిమాండ్ పెరిగింది. ఈ ట్రెండ్ యూరప్ దేశాలతో పాటు ప్రపంచమంతా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న కార్లు, మైలేజ్ ఎక్కువ వచ్చే కార్లకు బీజం పడింది అప్పుడే.
చమురు కోసం అరబ్ దేశాల మీద ఆధారపడటంలో ఉన్న ప్రమాదాన్ని గుర్తించిన అమెరికా, చమురుకు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని కనుక్కునే పరిశోధనల కోసం భారీగా ఖర్చు చెయ్యడం మొదలు పెట్టింది. ఆ తర్వాతి కాలంలో అది ప్రపంచం మొత్తానికి తప్పనిసరి వ్యవహారంగా మారింది.
అమెరికాలో హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన తర్వాత 2005 నుంచి అమెరికాలో చమురు దిగుమతులు తగ్గుతూ వస్తున్నాయి. 2020లో అమెరికా చమురు దిగుమతుల కంటే ఎగుమతులే ఎక్కువ.
సుసంపన్నమైన మిడిల్ ఈస్ట్
ముడి చమురు మధ్య ప్రాచ్యాన్ని సుసంపన్నం చేసింది.
ముఖ్యంగా పర్షియన్ గల్ఫ్, 1960,70ల్లో చమురు ధరలు పెరగడం మొదలైనప్పటి నుంచి కువైట్, సౌదీ అరేబియా, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి దేశాలకు డాలర్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. ఈ సంపదతో ఆ దేశాల్లో అభివృద్ధి పరుగులు తీస్తోంది.
చమురు సంక్షోభం తర్వాత అమెరికా సౌదీ అరేబియాతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. “వైట్‌హౌస్‌లోకి ఎవరు అడుగు పెట్టినా రియాద్‌ను సందర్శించడం వారి విధుల నిర్వహణలో భాగంగా మారింది” అని రైదెల్ చెప్పారు.
సౌదీ అరేబియా ఇస్లామిక్ శక్తిగా ఎదిగింది. అప్పట్లో అయేతుల్లో ఖొమైనీ నాయకత్వంలోని ఇరాన్‌కు శత్రువుగా మారింది.
చమురు ఎగుమతులతో వచ్చిన నిధులతో సౌదీ అరేబియాలో మౌలిక వసతులు భారీగా పెరిగాయి. సైన్యం బలోపేతమైంది. సౌదీ నాయకత్వం ఇతర దేశాల్లోనూ తాము పాటిస్తున్న వహాబీయిజాన్ని ప్రోత్సహిస్తోంది.
50 ఏళ్ల క్రితం వచ్చిన చమురు సంక్షోభం, ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు లాంటివి చమురు వాడకాన్ని తగ్గించేలా ప్రపంచంపై ఒత్తిడి తెస్తున్నా.. అందుకు అనువైన పరిస్థితులు సమీప దూరంలో కనిపించడం లేదు. 1970లో అరబ్ దేశాలు తీసుకున్న నిర్ణయం చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలకు బలమైన ఆర్థిక పునాదుల్ని వేసింది. యుక్రెయిన్ మీద రష్యా దాడి చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా ముడి చమురు ధరల్లో కుదుపు మొదలైన తీరు అరబ్ దేశాల ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గలేదని చెబుతోంది.
సౌదీ అరేబియాకు చెందిన చమురు ఉత్పత్తి సంస్థ ఆరామ్‌కో, యాపిల్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థ. నిరుడు ఈ సంస్థ తన లాభాలను 161 బిలియన్ డాలర్లుగా ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- గాజాలో భూతల దాడులు చేసి ఇజ్రాయెల్ తన లక్ష్యాన్ని సాధించగలదా?
- టవర్ ఆఫ్ సైలెన్స్: పార్సీలు తమ బంధువుల మృతదేహాలను రాబందులకు ఎందుకు వదిలేస్తారు?
- ప్రవళిక ఆత్మహత్యపై నాయకులు, విద్యార్ధి సంఘాల వాదనేంటి, పోలీసులు ఏం చెప్పారు?
- ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఎందుకు ఏకం కాలేకపోతున్నాయి?
- తెలంగాణ ఎన్నికలు: ఆ నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటర్లు మహిళలే అయినా ఒక్కరూ ఎమ్మెల్యే కాలేకపోయారు, ఎందుకు?
- భూకంపం వచ్చిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసించడం ఎంత వరకు సేఫ్, ఎలా తెలుసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)