You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇజ్రాయెల్-పాలస్తీనా ఘర్షణ ఏనాటిది, ఎలా మొదలైంది? 9 పదాల్లో సంక్లిష్ట చరిత్ర
- రచయిత, రెడాషియన్
- హోదా, బీబీసీ న్యూస్, ముండో
ఇజ్రాయెల్, పాలస్తీనా గత 50 ఏళ్ళలో ఎన్నడూ చవిచూడనంత అతిపెద్ద సంఘర్షణగా ప్రస్తుత యుద్ధం పరిణమిస్తోంది.
అక్టోబరు 7న హమాస్ మెరుపుదాడులతో ఈ యుద్ధం ప్రారంభమైంది. ఈ దాడులలో 1400 మందికిపైగా మరణించారు. వీరిలో ఎక్కువమంది సాధారణ పౌరులే. అలాగే 200 మందిని కిడ్నాప్ చేశారు.
అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజాస్ట్రిప్ నంతటిని దిగ్బందించింది. దీనివలన 4వేల మంది చనిపోగా, వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.
ఈ యుద్ధం ఇజ్రాయెల్, గాజా సరిహద్దులను దాటి విస్తరించే ప్రమాదముందనే విషయంపైనే ఇప్పుడు ప్రపంచమంతా దృష్టిసారించింది.
ఇజ్రాయెల్, పాలస్తీనా సంఘర్షణను అర్థం చేసుకోవాలంటే తరచూ ప్రస్తావనలోకి వచ్చే పదాలు, వాటి వెనుకున్న చరిత్రను తెలుసుకోవాలి. అవేమిటో చూడండి.
1. ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ ఓ మధ్య ప్రాచ్య దేశం. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఒట్టోమాన్ రాజ్యంలో కొంత ప్రాంతం బ్రిటీషు ఆదిపత్యం కిందకు వచ్చింది. బ్రిటీషర్లు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళాక 1948లో ఐక్యరాజ్యసమితి ఈ ప్రాంతాన్నే యూదులు, అరబ్బులకు పంచింది. అలా యూదులకు కేటాయించిన ప్రాంతం ఇజ్రాయెల్‌గా అవతరించింది.
అయితే, ఇజ్రాయెల్ నాగరికత మూలాలు చాలా ప్రాచీనమైనవి. ఇజ్రాయెల్‌లో 90 లక్షలకు పైగా జనాభా ఉంది. వీరిలో దాదాపు 74 శాతం మంది యూదులే. ప్రతి పది మందిలో 8 మంది ఇజ్రాయెల్‌లో పుట్టినవారే. సుమారు 20 శాతం మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యూదులు కాగా, 21 శాతం మంది ఇజ్రాయెలీ అరబ్బులు న్నారు. ఇతరులందరూ కలిపి అయిదు శాతం దాకా ఉంటారు.
జెరూసలెం ఇజ్రాయెల్ అధికారిక కేంద్రం కాగా, టెలీ అవీవ్ ఆర్థిక కేంద్రంగా ఉంది. ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రధానమంత్రి బెంజిమెన్ నెతన్యాహు నేతృత్వంలో నడుస్తోంది. ఇజ్రాయెల్‌కు అధ్యక్షుడు కూడా ఉంటారు. ప్రస్తుతం ఐజాక్ హెర్జాగ్ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే, ఈ పదవి ఉత్సవ విగ్రహం లాంటిది.
ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలో ఆర్థిక, సాంకేతిక, సైనికశక్తిగా ఎదిగింది.
ఈ దేశ చరిత్ర ఎక్కువభాగం పాలస్తీనాతోపాటు పొరుగునున్న అరబ్ దేశాల సంఘర్షణలతో ముడిపడి ఉంటుంది.
ఇక జెరూసలెం సమస్య, పాలస్తీనా శరణార్థులు, వారి వారసులు, పాలస్తీనా భూభాగాలలో యూదుల సెటిల్‌మెంట్లు, ఇస్లాం సాయుధ గ్రూపుల దాడులు శాంతిస్థాపనకు ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయి.
2. హమాస్
పాలస్తీనా ఇస్లామ్ గ్రూపులలో హమాస్ అతిపెద్దది. ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్ కు అరబిక్ సంక్షిప్త రూపమే హమాస్.
వెస్ట్‌బ్యాంక్, గాజాస్ట్రిప్‌లను ఇజ్రాయెల్ ఆక్రమించడాన్ని వ్యతిరేకిస్తూ ఏర్పడిన 1987 నాటి పాలస్తీనా ఇంతిఫాదాలో హమాస్ మూలాలు ఉన్నాయి. పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయడమే హమాస్ లక్ష్యాలలో ప్రధానమైనది. ఈ సంస్థ మిలీషియాలను అల్ కస్సమ్ బ్రిగేడ్స్‌గా పిలుస్తారు.
హమాస్‌కు అధికారం, పరపతి పెరిగాకా 2007 నుంచి గాజాస్ట్రిప్‌ను పరిపాలిస్తోంది. వెస్ట్‌బ్యాంక్ ను పాలిస్తున్న పాలస్తీనా అథారిటీ సహా ఇతర పాలస్తీనా గ్రూపులు, ఇజ్రాయెల్ మధ్య జరిగే ఒప్పందాలను హమాస్ ఎన్నడూ గుర్తించదు.
ఇజ్రాయెల్‌తో పాటు యునైటెడ్ స్టేట్స్, యురోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి మరికొన్ని దేశాలు హమాస్‌ను టెర్రరిస్టు గ్రూపుగా ప్రకటించాయి.
3. పాలస్తీనా నేషనల్ అథారిటీ
ఇజ్రాయెల్, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ( పీఎల్‌ఓ) మధ్య కుదిరిన ఓస్లో ఒడంబడిక ప్రకారం 1994లో ది పాలస్తీనా నేషనల్ అథార్టీ (పీఎన్‌ఏ) రాజకీయ గుర్తింపు పొందింది.
గాజా స్ట్రిప్, వెస్ట్‌బ్యాంక్ లో పాలస్తీనీయుల కోసం స్వతంత్రప్రతిపత్తి గల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇజ్రాయెల్, పాలస్తీనా సంఘర్షణలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించారు.
పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్, రాజకీయ పార్టీ అయిన ఫతాకు అధ్యక్షుడిగా ఉన్న యాసర్ అరాఫత్ నేతృత్వంలో పాలస్తీనా నేషనల్ అథారిటీ (పీఎన్‌ఏ) గాజా, వెస్ట్‌బ్యాంక్ ప్రాంతాలను పాలించింది.
2004లో అరాఫత్ మృతిచెందిన తరువాత ఈ బాధ్యతలు మహమూద్ అబ్బాస్ చేతికి వచ్చాయి.
2006 ఎన్నికలలో గాజాలో హమాస్ విజయం సాధించడం, హమాస్, ఫతా మధ్య రాజుకున్న అంతర్గత యుద్ధం కారణంగా పీఎన్‌ఏ గాజాపై తన పట్టును కోల్పోయింది.
పాలస్తీనా నేషనల్ అథారిటీ ఓ బహుళపార్టీ ప్రభుత్వ వ్యవస్థ. దీని అధ్యక్షుడిని ప్రజలు, పాలస్తీనా శాసనమండలిలోని 132 మంది డిప్యూటీలు కలిసి ఎన్నుకుంటారు.
పీఎన్ఏ 30 ఏళ్ళ చరిత్రలో 2006లో మాత్రమే ఎన్నికలు జరిగాయి.
పీఎన్ఏ ఇటీవల కాలంలో తన ప్రభావాన్ని కోల్పోతోంది. పరిమిత అధికారాల ప్రభుత్వం కావడంతోపాటు పాలస్తీనా ప్రజల మద్దతు కొరవడటం, ముఖ్యంగా ఇజ్రాయెల్‌తో పీఎన్‌ఏ అంటకాగుతోందనే తీవ్ర విమర్శలతో చాలామంది హమాస్‌కు మద్దతు తెలిపేందుకు మొగ్గు చూపుతున్నారు.
4. గాజా స్ట్రిప్
గాజా ప్రాంతం దాదాపు 41 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పుతో (మొత్తం 365 చదరపు కిలోమీటర్ల మేర) విస్తరించిన నగరం. ఇక్కడ మొత్తం 23 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. ఇంత చిన్న ప్రాంతంలో ఎక్కువమంది ప్రజలు ఉండడంతో ఇది ప్రపంచలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతంగా మారింది.
బ్రిటీష్ పాలిత పాలస్తీనాను ఐక్యరాజ్యసమితి 1947లో రెండు భాగాలుగా చేసింది. 55 శాతాన్ని యూదు ప్రాంతంగానూ, జెరూసలెంను అంతర్జాతీయ ప్రభుత్వ నియంత్రణలో ఉండేట్టుగానూ, గాజాస్ట్రిప్ సహా మిగిలిన ప్రాంతమంతా అరబ్బులకు దక్కేలా కేటాయించారు. అలా గాజాస్ట్రిప్ ఏర్పడింది.
పాలస్తీనీయులు ఈ ఒప్పందాన్ని తిరస్కరించారు. 1948లో అరబ్ -ఇజ్రాయెలీ యుద్ధాన్ని ప్రారంభించారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచింది. దాంతో, నిరాశ్రయులైన పాలస్తీనావాసులు పెద్దఎత్తున వలసపోవాల్సి వచ్చింది.
అనేక యుద్ధాల తరువాత 1993 ఓస్లో ఒప్పందం గాజాస్ట్రిప్‌కు పరిమిత స్వయంప్రతిపత్తినిచ్చింది. 2005 నాటికి ఇజ్రాయెల్ గాజాస్ట్రిప్ నుంచి తన దళాలను పూర్తిగా ఉపసంహరించుకుంది. కానీ గాజాలోకి ప్రజలు రాకపోకలు సాగించే మార్గాలపై, ఇజ్రాయెల్ తన నియంత్రణను కొనసాగిస్తోంది.
ఈ నియంత్రణల వలనే హ్యుమన్ రైట్స్ వాచ్ సంస్థ గాజాస్ట్రిప్‌ను బహిరంగ జైలుగా అభివర్ణించింది.
5. జియోనిజం
జియోనిజం యూదుల రాజకీయ ఉద్యమం. 19వ శతాబ్దం మొదట్లో ఊపిరిపోసుకుంది. పాలస్తీనా ప్రాంతంలో ఇజ్రాయెల్ ఏర్పాటుకు ఈ ఉద్యమం ప్రోత్సాహం అందించేది. ఇజ్రాయెల్ ఏర్పడాలనే లక్ష్యం 1948లో నెరవేరిన తరువాత ఇజ్రాయెల్‌కు వెన్నుదన్నుగా నిలిచేలా ఆధునిక జియోనిజం రూపాంతరం చెందింది.
యూదుల గురించి చెప్పడానికి కొన్నిసార్లు జియోనిస్టు అనే పదాన్ని వాడేస్తుంటారు. కానీ, ఇది తప్పు. నిజానికి కొంతమంది జియోనిజాన్ని వ్యతిరేకించకుండానే జుడాయిజాన్ని నమ్ముతున్నారు. ఎందుకంటే వీరికి ఆధునిక ఇజ్రాయెల్ భావనపై నమ్మకం లేదు.
6. జెరూసలెం
క్రీస్తు పూర్వం 2,800 సంవత్సరాల కిందటే జెరూసలెం మూలాలు ఉన్నాయి. అప్పట్లో దీనిని ‘శాంతి నగరం’, ‘శాంతినివాసం‘గానూ అభివర్ణించారు.
ఈ నగరం జొడాయిక్, ఇస్లామ్, క్రిస్టియన్ల నమ్మకాలకు కేంద్రంగా ఉండటంతో మతపరమైన వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా మారింది.
ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం జెరూసలెంకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి. కానీ 1967లో జరిగిన ఆరోరోజుల యుద్ధం తరువాత ఇజ్రాయెల్ ఈ నగరంపై పూర్తి పట్టు సాధించింది. 1980లో ఇజ్రాయెల్ పార్లమెంట్ జెరూసలెంను విడదీయలేనిదంటూ ఏకంగా చట్టాన్నే చేసింది.
పాలస్తీనాతో ఉన్న వివాదాల్లో జెరూసలెం ప్రతిపత్తి కూడా ఒకటి. జెరూసలెంలోని తూర్పు భాగంలో ఉన్న పాలస్తీనా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంతోపాటు జెరూసలెంపై ఇజ్రాయెల్ నియంత్రణను పాలస్తీనావాసులు వ్యతిరేకిస్తున్నారు. జెరూసలెంను వారు తమ చారిత్రక రాజధానిగా పరిగణిస్తుంటారు.
ఈ వివాదాల కారణంగా అంతర్జాతీయ సమాజంలో చాలా భాగంగా జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించడం లేదు. అయితే, 2019లో అమెరికా ఈ గుర్తింపును ఇచ్చింది.
7. వెస్ట్‌బ్యాంక్
ఇది జోర్డాన్ నది పశ్ఛిమ తీర ప్రాంతం. అందుకే, దీన్ని వెస్ట్‌బ్యాంక్ అంటారు. గాజాస్ట్రిప్, తూర్పు జెరూసలెంతోపాటు పాలస్తీనా అధీనంలో ఉన్న మరో భూభాగమిది. ఐక్యరాజ్యసమితి దీన్ని 1947లో ప్రత్యేక తీర్మానం ద్వారా ఏర్పాటు చేసింది.
1967లో అరబ్బులు, ఇజ్రాయెలీల మధ్య జరిగిన ఆరురోజుల యుద్ధంలో జోర్డాన్ నది పశ్చిమతీరంలో 5,800 కిలోమీటర్ల ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించింది. తూర్పు జెరుసలెం ను కూడా ఇజ్రాయెల్ నియంత్రిస్తుంటుంది.
వెస్ట్‌బ్యాంక్‌లో 30 లక్షలమందికిపైగా పాలస్తీనియన్లు నివస్తున్నారు. కానీ, అక్కడ ఇజ్రాయెల్ అనేక సెటిల్‌మెంట్స్ ఏర్పాటు చేసింది. ఆ సెటిల్మెంట్ కాలనీలలో దాదాపు ఏడు లక్షల మంది యూదులు నివసిస్తున్నారు. ఈ సెటిల్‌మెంట్లు పెరుగుతుండడం, పాలస్తీనీయులు నిరాశ్రయులు ఇజ్రాయెల్, పాలస్తీనా మిలటరీ గ్రూపుల మధ్య దశాబ్దాల తరబడి హింసాత్మక వివాదంగా కొనసాగుతోంది.
వెస్ట్‌బ్యాంక్‌ను పాలస్తినీయన్ నేషనల్ అథారిటీ మహమూద్ అబ్బాస్ నేతృత్వంలో పాలిస్తోంది. దీని సాయుధ రాజకీయ గ్రూపు అయిన ఫతాకు హమాస్‌తో అధికారం కోసం 2000 సంవత్సరం నుంచి పోరు నడుస్తోంది.
8. రఫా పాస్
1967 యుద్ధం తరువాత ఇజ్రాయెల్ ఈజిప్ట్ నుంచి సినాయ్ ద్వీపకల్పాన్ని రఫానగరం సహా స్వాధీనం చేసుకుంది. తరువాత జరిగిన ఒప్పందంలో ఇజ్రాయెల్ తన సేనలను ఉపహసంహరించుకున్నా ఓ పక్క ఈజిప్ట్, మరోపక్క గాజాస్ట్రిప్ హద్దులుగా రఫాను విభజించింది. ఇక్కడో బోర్డర్ క్రాసింగ్ ను ఏర్పాటు చేసింది. గాజాలోకి వెళ్ళడానికి ఇదొక్కటే మార్గం.
ఈ బోర్డర్ క్రాసింగ్‌ను ఈజిప్ట్ నియంత్రిస్తోంది. కానీ గాజాలోకి ఏ సామాన్లు తీసుకువెళ్ళాలన్నా ఇజ్రాయెల్ ఆమోదం కావాలి.
కొంతమంది పాలస్తీనీయులు ఈ బోర్డర్ దాటడానికి ఈజిప్ట్ అనుమతి పొందారు. అప్పుడప్పుడు మాత్రమే ఈ గేటు తెరుస్తుంటారు. ఊహించని విధంగా ఈ గేటు మూతపడిందంటే బయటకు వచ్చిన పాలస్తీనా ప్రజలు గాజాబయట చిక్కుకుపోయినట్టే.
నిరాశ్రయులైన పాలస్తీనీయుల కోసం ఈజిప్ట్ ఏకపక్షంగా ఈ గేటు తెరలేదు. ఇందుకోసం అది ఇజ్రాయెల్‌తో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.
9. హిజ్బొల్లా
హిజ్బొల్లా అంటే దేవుడి పార్టీ అని అర్థం. లెబనాన్‌లో గట్టి పట్టున్న ఈ షియా ఇస్లాం రాజకీయ సంస్థకు ఇరాన్ అండగా ఉంది.
ఇజ్రాయెల్ నామరూపాల్లేకుండా చేయడమే లక్ష్యమనే ప్రణాళికను అధికారికంగా ప్రకటిస్తూ 1985లో ఈ సంస్థ ఏర్పాటైంది. దీంతోపాటు పాలస్తీనియన్లను, మధ్యప్రాచ్యంలోని షియా ముస్లింలకు ఇది మద్దతు పలుకుతుంటుంది.
తన లక్ష్య సాధన కోసం ఈ సంస్థ అనేక దాడులు చేసింది. హిజ్బొల్లాను యూస్, ఇజ్రాయెల్, యూకే, అరబ్‌లీగ్‌లోని కొన్ని దేశాలు టెర్రరిస్టు సంస్థగా పరిగణిస్తున్నాయి.
1992 నుంచి హసన్ నార్సల్లా దీనికి నాయకత్వం వహిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమవతమైన సైనికేతర శక్తిగా దీనిని పేర్కొంటారు.
హిజ్బోల్లాకు ఇరాన్ తన నిధులలో సింహభాగాన్ని కేటాయిస్తుంటుంది. దీంతోపాటు శిక్షణ, ఆయుధాలు, పేలుడు పదార్థాలను అందిస్తుందని యూఎఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ చెపుతోంది.
ఇవి కూడా చదవండి..
- రఫా క్రాసింగ్ ఓపెన్: 20 లక్షలమందికి 20 లారీల సాయం సరిపోతుందా?
- వేడి వేడి చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు
- నవాజ్ షరీఫ్: పాకిస్తాన్లో దిగిన మాజీ ప్రధాని... ఆర్మీ ఆటలో ఈసారి ఏం జరుగుతుందో?
- గోల్కొండ వజ్రాలతో ఆ యూదుల దశ ఎలా తిరిగింది?
- టైగర్ నాగేశ్వరరావు రివ్యూ: ఆంధ్రా రాబిన్ హుడ్‌గా రవితేజ అలరించాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)