You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: మేడిగడ్డ బరాజ్ కట్టిన నాలుగేళ్లకే ఎందుకు కుంగిపోయింది? ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలివే...
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మేడిగడ్డ బరాజ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్.
'7 బుర్జ్ ఖలీఫాలకు సరిపడా కాంక్రీటు, 15 ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సరిపడా ఉక్కు.. ప్రపంచంలో అతి పెద్దదైన గీజా పిరమిడ్ వంటి 6 పిరమిడ్ల పరిమాణంలో తవ్విన మట్టి. 72 గంటల్లో 25,584 ఘనపు మీటర్ల కాంక్రీటును పోసి గిన్నిస్ రికార్డ్...' మేడిగడ్డ బరాజ్ నిర్మాణ ఘనత గురించి దాని కాంట్రాక్టు సంస్థ ఎల్ అండ్ టీ చెప్పిన మాటలివి
ఈ ప్రాజెక్టులో గేట్ల బరువును ఆపే స్తంభాల వంటి నిర్మాణాలు (పీర్) ఒక్కొక్కటీ 110 మీటర్ల పొడవు, 4-6 మీటర్ల వెడల్పు, 25 మీటర్ల ఎత్తున కాంక్రీటుతో నిర్మించారు. ఇంత భారీగా కట్టిన పీర్‌లలో ఒకటి ఇప్పుడు కుంగింది.
20వ నంబర్ పీర్ మాత్రం కుంగిందనేది ప్రాథమికంగా అందిన సమాచారం. పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాలి. శనివారం రాత్రి నుంచే కుంగడం ప్రారంభమైందని చెబుతున్నారు.
అయితే, ప్రస్తుతం అక్కడంతా రహస్యంగా ఉంది. మీడియాను అటు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. గతంలో కాళేశ్వరం పంప్ హౌసులు మునిగినప్పుడు కూడా మీడియాను అనుమతించలేదు. రహస్యంగానే ఉంచారు.
బీఆర్ఎస్ పార్టీ తమ ఘన విజయాల్లో ఒకటిగా చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఈ మేడిగడ్డ బరాజ్ కుంగడంతో దాని కారణాలపై చర్చ మొదలైంది. కాళేశ్వరం ఒక అద్భుతమని, ప్రపంచంలోనే పెద్దదని బీఆర్ఎస్ చెప్పుకుంటుండగా, ఇది అవినీతిమయమని, ఉపయోగంలేని ప్రాజెక్టనీ ప్రతిపక్షాలు విమర్శించేవేళ, సరిగ్గా ఎన్నికల ముందు జరిగన ఈ ఘటనకు కారణాలేంటి?
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ గ్రామం వద్ద తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది మేడిగడ్డ బరాజ్. దీనికి లక్ష్మీ బరాజ్ అని పేరు పెట్టారు కేసీఆర్. 2016 మే లో శంకుస్థాపన, 2019 జూన్‌లో నిర్మాణం పూర్తయింది.
ఈ ఒక్క బరాజ్‌కే సుమారు రూ.1850 కోట్లు ఖర్చు అయింది. 16 టీఎంసీల నీరు ఇందులో నిల్వ ఉండే ఏర్పాటు ఉంది. 85 గేట్లు ఉంటాయి. రెండేళ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేసినట్టు నిర్మాణ సంస్థ ప్రకటించుకుంది. అదొక గొప్ప విషయంగా కూడా ప్రచారం చేశారు. ఇది బరాజ్ మాత్రమే కాకుండా వంతెన కూడా. ఆ రోడ్డు తెలంగాణ, మహారాష్ట్రలను కలుపుతుంది. పొడవు దాదాపు 1.6 కిలోమీటర్లు.
ఒకే ప్రాజెక్టులో ఒక్కసారిగా పెద్ద మొత్తంలో కాంక్రీటు పోయడం అనే రికార్డు తెచ్చి మీడియాలో వార్తల కవరేజీ కోసం అప్పట్లో తెలుగు రాష్ట్రాలు పోటీపడేవి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సుమారు 16 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు ఒకేసారి పోసి రికార్డు సృష్టిస్తే, దాన్ని అధిగమించి 25 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పోసి రికార్డు సృష్టించారు మేడిగడ్డలో. ఇది 2018 డిసెంబరులో జరిగింది.
ఇప్పుడు మరి ఇలా ఎందుకు జరిగింది, బరాజ్ ఎందుకు కుంగింది అన్నది తెలుసుకునే ముందు మేడిగడ్డ ప్రాధాన్యత ఏంటో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క బరాజ్ కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ అని చెప్పవచ్చు.
కాళేశ్వరం అనేది ఒక బరాజో, ఒక పంపు హౌసో కాదు.. కొన్ని బరాజ్‌లు, పంపు హౌజులు, కాలువలు, సొరంగాల కలయిక. వాటిలో మేడిగడ్డ అతి ముఖ్యమైనది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ ఏర్పడ్డాక రీడిజైన్ చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో అనుకున్న దాని కంటే కాస్త కిందకు, అంటే ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తరువాత వచ్చేలా ఈ మేడిగడ్డ బరాజ్‌ను నిర్మించారు.
అసలు గోదావరిలో నీరు తగ్గిపోతోన్న వేళ ప్రాణహిత నుంచి వచ్చిన నీటిని ఒడిసిపట్టి వెనక్కు తోడి ప్రాణహిత కలవక ముందు ఉండే గోదావరిలో వేయడం ఈ బ్యారేజీ ఉద్దేశం.
అందువల్లే ఉత్తర తెలంగాణ ప్రాణహిత నీరు అందాలంటే మేడిగడ్డే ఆధారం. అలా మేడిగడ్డ నుంచి నీటిని గోదావరిలో వెనక్కు తోడాలి.
కానీ ఇప్పుడు జరిగిన ఘటనతో అసలు మేడిగడ్డలో నీళ్లు ఆపే పరిస్థితి లేదంటున్నారు సాగునీటి నిపుణులు. ప్రస్తుతానికి ఉన్న నీరంతా ఖాళీ చేసేశారు.
దీంతో ఇప్పుడు ప్రాణహిత నుంచి వచ్చే నీటిని నిల్వ చేయడానికి కానీ, ఆ నీటిని వెనక్కు తోడి సుందిళ్ల, అన్నారం దగ్గరకు మళ్లించి అక్కడ నుంచి తోడి నీరు ఇవ్వడానికి సాధ్యం కాకపోవచ్చు. అంటే మొత్తం ప్రాజెక్టు ప్రయోజనానికే గండి పడే అవకాశం ఉంది.
మరి అంత భారీగా కట్టిన బరాజ్ ఎందుకు కుంగింది?
ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో కేంద్ర ఇంజినీర్లు ఉన్నారు. అయితే, ఇది స్పష్టంగా నిర్మాణంలో నాణ్యతా లోపమే అంటున్నారు తెలంగాణ ఇంజినీర్ల ఫోరం కన్వీనర్ దొంతి లక్ష్మీ నారాయణ.
‘‘కచ్చితంగా పునాదుల నిర్మాణంలో లోపం వల్లే ఇలా జరిగింది. ఫౌండేషన్ సరిగా చేయలేదు. అందులో లోపం ఉంది. దానివల్ల కొంత కాలంగా కొంచెం కొంచెం ఫౌండేషన్ కింద ఉన్న ఇసుక కొట్టుకుంటూపోయి ఇప్పుడు కుంగింది. రాతి పునాది వేరు. ఇది ఇసుక పునాది. ఇసుక పునాదిలో నిర్మాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఉదాహరణకు రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ఇసుక పునాది అయినప్పటికీ బలంగా ఉంది. కానీ ఇక్కడ నిర్మాణ దశలో జాగ్రత్తలు పాటించలేదని స్పష్టంగా తెలుస్తోంది’’ అని బీబీసీతో అన్నారు లక్ష్మీనారాయణ.
‘‘సాధారణంగా ఒక పిల్లర్ దెబ్బతింటే ఆ ప్రభావం పక్కవాటి మీద కూడా పడుతుంది. ఇక్కడ ఎంత మేర దెబ్బతిన్నది అన్నది తెలియాల్సి ఉంది. అప్పుడే మరమ్మతు సాధ్యపడుతుందా, అయితే ఎలా చేయాలి వంటివి తెలుస్తాయి.’’ అన్నారాయన.
ప్రస్తుతం ఆ బరాజ్ నిర్మాణం చేసిన తెలంగాణ ప్రభుత్వ ఇంజినీర్లు, ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీలోని ఇంజినీర్లు, ఆ బరాజ్ కట్టిన కాంట్రాక్టు కంపెనీ ఇంజినీర్లు అంతా ఏం జరిగిందో సమగ్రంగా తెలుసుకునే పనిలో ఉన్నారు. కానీ వారికి నీరు అడ్డంకిగా మారింది. ఎందుకంటే, ఘటన జరిగే సమయానికి ప్రాజెక్టు నిండుగా ఉంది.
ఆ నీటిని కిందకి వదిలేసినప్పటికీ, పై నుంచి ఇంకా నీరు వస్తోంది. దాన్ని కూడా కిందకు వదిలేస్తున్నారు. సరిగ్గా గోదావరి నదిలో ప్రాణహిత కలిసిన తరువాత మేడిగడ్డ బారేజీ ఉంటుంది. అందుకని నీటి ప్రవాహం ఎక్కువ ఉంది.
అయితే, నిర్మాణ లోపాలు లేవని ప్రాజెక్టు నిర్మించిన ఆ సంస్థ చెబుతోంది. ‘‘వరద నీటిని తట్టుకునేలా ప్రాజెక్టు నిర్మించాం. భారీ శబ్దం తరువాత ఇది జరిగింది. దీనిపై డిజైన్ టీమ్, ఇంజినీరింగ్ టీమ్ పరిశీలించింది. నీటి మట్టం తగ్గాకే ఏం జరిగిందో తెలుస్తుంది. బరాజ్‌కి ఏం జరిగినా ఎల్ అండ్ టీ బాధ్యత వహిస్తుంది. ప్రజలకూ, వాతావరణానికీ ఎటువంటి హానీ కలగనివ్వబోం. డిజైన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. నిర్మాణం మేం చేశాం.’’ అంటూ ఆదివారం సాయంత్రం మీడియాతో చెప్పారు ఎల్ అండ్ టీ ఇంజినీర్ సురేశ్ కుమార్.
ప్రభుత్వం ఏం చెబుతోంది?
ప్రభుత్వం కూడా ఇంకా ఏం జరిగిందో పరిశీలిస్తున్నామనే చెబుతోంది.
‘‘ఎల్ అండ్ టీ వారు వచ్చారు. బరాజ్ కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంకా పరిశోధన చేస్తున్నాం. నిపుణుల బృందం వస్తుంది. ప్రస్తుతం బరాజ్ ఎల్ అండ్ టీ ఆధ్వర్యంలోనే ఉంది. పూర్తి బాధ్యత వారిదే.’’ అని బరాజ్ చీఫ్ ఇంజినీర్ వేంకటేశ్వర్లు మీడియాతో అన్నారు.
ఇలాంటి ప్రాజెక్టు నిర్మాణానికి ముందు నదీ మట్టంలోని ఇసుకను వదులు లేకుండా చేయాలనీ కానీ మేడిగడ్డ విషయంలో ఆ ప్రక్రియ సక్రమంగా జరగలేదనీ కొందరు చెప్తున్నారు. ఈ అంశంపై బీబీసీ తెలంగాణ సాగునీటి శాఖను సంప్రదించింది. వారు స్పందించాల్సి ఉంది.
1. కొత్త బరాజ్ ప్రారంభమై నాలుగేళ్లే అయింది. అప్పుడే ఎందుకు దెబ్బతింది? నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నాయా? మరమ్మత్తులు చేయగలరా? చేయడానికి ఎంత అవుతుంది, ఎంత కాలం పడుతుంది?
2. ఈ బరాజ్‌కి మరమ్మత్తులు పూర్తయి మళ్లీ నీటిని నిల్వ చేసే వరకూ రైతులు పరిస్థితి ఏంటి? వారు పంటల విషయంలో ఈ నీటిని నమ్ముకుని వెళ్లవచ్చా?
3. డిజైన్లో కానీ, నిర్మాణంలో కానీ తప్పు ఎవరిదో తేల్చి ఆ బాధ్యులపై చర్యలు తీసుకుంటారా?
4. జరిగిన ఆర్థిక నష్టానికి బాధ్యత ఎవరిది?
5. మిగిలిన బరాజ్‌ల పటిష్టత మాటేంటి. ఎందుకంటే వరదల సమయంలో ఇటువంటి ఘటన జరిగితే కింద అనేక గ్రామాలకు ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉంది.
ఈ ప్రశ్నలకు తెలంగాణ ప్రభుత్వం సాగునీటి శాఖ సమాధానం చెప్పాల్సి ఉంది.
మేడిగడ్డ బరాజ్ పీర్ కుంగిందన్న వార్తతో కేంద్ర ప్రభుత్వం దీనిపై ఒక నిపుణుల కమిటీని పంపింది. ఈ కమిటీ పీర్ కుంగడానికి కారణాలను పరిశీలించి, లోపాలపై ఒక నివేదికను సమర్పిస్తుంది.
అప్పట్లో పంపుహౌజులూ...ఇప్పుడు బరాజ్
కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనుమానాలు పెంచిన మొదటి ఘటన 2022 వరదలు. గోదావరి నదికి వచ్చిన వరదలకు ఆ ప్రాజెక్టులో భాగంగా పెట్టిన పంపు హౌజులు మునిగాయి.
ప్రస్తుతం ఘటన జరిగిన మేడిగడ్డ దగ్గర పంపు హౌస్ మునిగింది. పంపు హౌస్ గోడ కూలింది. వీటిని తిరిగి పని చేసేలా చేయడానికి మూడు నెలలకు పైగా సమయం పట్టింది. అంతేకాదు, కోట్ల రూపాయలు ఖర్చు అయింది.
అప్పట్లో పంపుహౌసులు మునిగిన దాదాపు మూడు నెలల తరువాత జలవనరుల శాఖ కార్యదర్శి రజత్ భార్గవ వాటి వివరాలు మీడియా ముందు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)