విశాఖపట్నం: బోరు కోసం వందల అడుగులు తవ్వితే సముద్రపు నీరు వచ్చేస్తుందా? అప్పుడేమవుతుంది?

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

‘‘200 అడుగులు బోరు తవ్వితే కానీ నీళ్లు పడలేదండీ.. మేమైతే భవిష్యత్తులో ఇబ్బంది ఉండకూడదని ఏకంగా 300 అడుగులు కొట్టించాం...’’- ఇలాంటి మాటలు తరచూ వింటుంటాం.

విశాఖపట్నంలోని సాగర్‌నగర్, ఎండాడ, రుషికొండ, జోడుగుళ్లపాలెం లాంటి తీరానికి సమీపంలో ఉన్న ప్రాంతాలతో పాటు పెందుర్తి, చినముషిరివాడ, రామకృష్ణానగర్ లాంటి ప్రాంతాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

ఇలా వందల అడుగుల లోతుకు బోర్లు వేయించడం వల్ల భవిష్యత్తులో తీర ప్రాంత నగరాలకు ప్రమాదముందని జియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సముద్రం నీరు భూమి లోపలి పొరల్లోకి చొచ్చుకొచ్చి, బోర్లు తీసినా ఉప్పు నీరు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ ఏడాది వేసవిలో బోర్లు వేసేందుకు ప్రయత్నించిన కొన్ని ప్రాంతాల్లో 150 నుంచి 200 అడుగుల వరకు వెళ్లినా నీళ్లు రాకపోవడం పొంచి ఉన్న ప్రమాదానికి హెచ్చరిక అని వారు చెబుతున్నారు.

ఇంతకూ విశాఖపట్నంలో నీటి అవసరాలు ఏ స్థాయిలో ఉన్నాయి? భూగర్భ జలాల లభ్యత ఎంత? భూగర్భ జలాలు తగ్గడం వల్ల రానున్న ముప్పును ఎదుర్కొవాలంటే ఏం చేయాలి?

150 అడుగులు దాటాక ధైర్యం చేయలేకపోయా: విశాఖ వాసి

మే, జూన్ నెలల్లో చాలా మంది తాము 200 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీరు రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితి విశాఖలోని తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న ఎండాడ, రుషికొండ, జోడుగుళ్లపాలెం వంటి ప్రాంతాల్లో కనిపించింది.

“నేను ఎండాడలో ఇల్లు కట్టుకుందామని ముందుగా మే నెలలో బోరు వేయించాను. 150 అడుగులు దాటినా నీరు పడలేదు. మా ఇంటి పక్క వాళ్లకు వందడుగులకే నీరు పడింది. వాళ్లు పదేళ్ల కిందట బోరు తీయించారు. నేను 150 అడుగులు దాటిన తర్వాత ధైర్యం చేయలేకపోయాను” అని విశ్రాంత బ్యాంక్ ఉద్యోగి ఉమామహేశ్వరరావు చెప్పారు.

‘‘గతంలో అక్కయ్యపాలెంలో ఉండే వాడిని. అక్కడ నాకొక సొంతిల్లు ఉంది. అక్కడైతే 2013లో బోరు వేయించాను. 70 అడుగులకే నీరు పడింది. ఎండాడలో మాత్రం 150 అడుగుల మేర వెళ్లినా నీరు పడలేదు’’ అని ఆయన విచారం వ్యక్తంచేశారు.

ఈ రెండు సందర్భాల్లోనూ బోరు వేయించే ముందు నీరు పడుతుందా, లేదా అనే పరీక్షలు చేయించలేదని ఉమామహేశ్వరావు చెప్పారు.

ఈ మూడు అంశాలే కారణమా?

విశాఖలో భూగర్భ జలాలు తగ్గుదలతోపాటు సముద్ర నీరు భూగర్భ జలాల్లోకి వచ్చేందుకు ఏ అంశాలు కారణమవుతాయో ముందుగా తెలుసుకుందాం.

సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో పనిచేసి పదవీ విరమణ చేసిన ఏవీఎస్ఎస్ ఆనంద్ ఈ విషయంపై బీబీసీతో మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్రా యూనివర్శిటీ జియాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా ఆయన పనిచేస్తున్నారు.

‘‘విశాఖ భూగర్భ జలాల తగ్గుదలకు ప్రధానంగా మూడు కారణాలున్నాయి. అవి 1. ఇక్కడ ఎక్కువ భాగం గట్టి రాతి నేలలు ఉండటం, 2. నగరీకరణ, అధిక జనాభా, 3. తీర ప్రాంతం. ఈ మూడు అంశాల వల్ల విశాఖలో భూగర్భ జలాలు తగ్గి, ఆ స్థానంలో ఉప్పు నీరు అంటే సముద్రపు నీరు చేరే ప్రమాదం ఉంది’’ అని ప్రొఫెసర్ ఆనంద్ చెప్పారు.

కేంద్ర జల వనరుల శాఖ ఆధ్వర్యంలో పని చేసే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు విశాఖపట్నంలో - ‘‘ఆక్విఫైయర్ మ్యాపింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్’’ పేరుతో ఒక రిపోర్టు రూపొందించింది. దీనిని నిరుడు జూన్‌లో జలవనరుల శాఖకు సమర్పించారు. నివేదికలోని ముఖ్యాంశాలను ప్రొఫెసర్ ఆనంద్ వివరించారు.

  • విశాఖపట్నంలో రాతి నేలలు అధికంగా ఉన్నాయి. ఈ నేలలకు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం, నీటిని ప్రవహింప చేసే సామర్థ్యం రెండూ తక్కువే. దాంతో విశాఖలో జియాలజీ పరీక్షలు చేయకుండా ఎక్కడపడితే అక్కడ బోర్లు వేస్తే నీళ్లు పడవు. నీళ్లు పడకపోవడంతో మరింత లోతుగా బోర్లు వేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది మరింత ప్రమాదకరం. ఎందుకంటే తీరం సమీపంలో ఉండటంతో నీరు పడని బోర్లు వేసిన ప్రాంతంలోకి సముద్రపు నీరు వచ్చే అవకాశం ఉంది.
  • నగర పరిధిలోనే దాదాపు 24 లక్షల మంది నివసిస్తున్నారు. వీరి నివాస అవసరాలు, మౌలిక వసతుల కోసం సిమెంట్, కాంక్రీట్‌తో నిర్మాణాలు చేస్తున్నాం. దీని వల్ల వర్షపు నీటిని భూమి తనలోకి తీసుకునే అంటే వాటర్ రీచార్జ్ అయ్యే అవకాశం తక్కువ. సాధారణంగా వర్షపాతంలో 15 శాతం భూగర్భ జలాలుగా మారాలి. కానీ విశాఖలో అది 7 నుంచి 10 శాతం మధ్యే ఉంది. ఆ నీటిలో కూడా విశాఖలో 49 శాతం మాత్రమే ఉపయోగించుకోగలుతున్నాం. మిగతాదంతా సముద్రంలోకి వెళ్లిపోతుంది. దాంతో భూగర్భ జలాలు తగ్గుతున్నాయి.
  • విశాఖ నగరం తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉంటుంది. సాధారణంగా భూగర్భ జలాల కంటే సముద్రపు నీటి సాంద్రత ఎక్కువ. దాంతో సముద్రపు నీరు కింద ఉంటుంది. దాని పైన భూగర్భ జలాలు ఉంటాయి. భూగర్భ జలాలను ఎక్కువగా తోడేస్తుంటే.. ఆ స్థానంలోకి సముద్రపు నీరు వచ్చే అవకాశం ఉంటుంది. దీనినే సీ వాటర్ ఇన్‌ట్రూజన్ అంటాం. ప్రస్తుతం విశాఖ సీ వాటర్ ఇన్‌ట్రూజన్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన పరిస్థితి ఉంది.

‘రివర్స్ గ్రేడియంట్’ జరిగితే కష్టం

భూగర్భ జలాలను అంచనా వేసేటప్పుడు సాధారణం కంటే 10 మీటర్లకు మించి దిగువకు భూగర్భ జలాలు పడిపోతే ప్రమాదకర హెచ్చరికగా భావిస్తారు. ప్రస్తుతం విశాఖపట్నంలోని చాలా ప్రాంతాల్లో 20 మీటర్ల నుంచి 25 మీటర్ల కంటే దిగువలో భూగర్భ జలాలు ఉన్నాయి. ఇది 30 నుంచి 34 మీటర్ల మధ్యకు చేరితే నగర భూగర్భంలోకి సముద్రపు నీరు చొచ్చుకొస్తుందని జియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.

“ప్రస్తుతం విశాఖపట్నంలో భూగర్భ జలాల పంపింగ్ (తోడేయడం) ఎక్కువగా జరుగుతోంది. సాధారణంగా సముద్ర మట్టానికి భూగర్భ జలాలు ఒక మీటరు పైన ఉంటే 40 మీటర్ల కింద వరకు బోర్లు వేయవచ్చు, నూతులు తవ్వొచ్చు. కానీ ప్రస్తుతం భూగర్భ జలాల వాడకం, వృథా ఎక్కువగా జరుగుతుండటంతో ఆ స్థాయిని సగానికి తగ్గించేశారు. దీంతో భూగర్భ జలాల కోసం 20 నుంచి 25 మీటర్లు మాత్రమే తవ్వే పరిస్థితికి వచ్చాం. ఈ పరిమితికి మించి బోర్లు వేస్తే ఉప్పు నీళ్లు చేరే అవకాశం ఉంది” అని ప్రొఫెసర్ ఆనంద్ చెప్పారు.

“నదులు సముద్రంలో కలిసినట్లే భూగర్భ జలాలు కూడా సముద్రంలోనే కలుస్తాయి. దీనిని ‘గ్రేడియంట్’ అంటారు. భూగర్భ జలాలు తగ్గిపోతే రివర్స్ గ్రేడియంట్ జరిగి సముద్ర జలాలు భూగర్భంలోకి వచ్చి వాటర్ ఇన్‌ట్రూజన్ అవుతుంది. అప్పుడు దానిని ఆపడం కష్టమైపోతుంది” అని ప్రొఫెసర్ ఆనంద్ భవిష్యత్తులో హెచ్చరించారు.

నీటి వృథాను అరికట్టాలి

తూర్పు కనుమల్లో నుంచి అంటే అరకు, పాడేరు కొండల్లోంచి వచ్చే నీరు విశాఖ భూగర్భ జలాల కొరతను కొంత మేర తీరుస్తుంటాయి. అలాగే వివిధ ప్రాంతాల రిజర్వాయర్ల నుంచి నీటిని తీసుకుని వచ్చి తాగునీటి అవసరాలకు వాడతాం.

అంటే ఉపరితల నీటిని తాగునీటి అవసరాలకు వాడుతుంటే, ఇతర అవసరాలకు భూగర్భ జలాలను అధికంగా వినియోగిస్తాం. ఇక్కడే నీటి వృథా అధికంగా జరుగుతుంది.

వాహనాలను పైపు నీటితో కడగటం, కొళాయిను వదిలేయడం, నీటి పైపుల పగుళ్లు, అలాగే ఆర్వో ప్లాంట్లలో కూడా నీటి వృథా ఎక్కువ అవుతుంది.

“నీటి వనరులను ముఖ్యంగా భూగర్భ జలాలను వృథా చేయకుండా జాగ్రత్తగా వాడుకోవాల్సిన దశ మొదలై, చాలా రోజులైంది. ఒక ప్రాంతంలో ఒక్కోసారి భూగర్భ జలాలు అడుగంటినా, పూర్తిగా తరిగిపోయినా తిరిగి నీరు చేరడానికి సాధారణంగా 10 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. అసలు నీరు చేరని సందర్భాలు కూడా ఉన్నాయి” అని ఆనంద్ చెప్పారు.

ఈ సమస్యకు వాటర్ ఆర్టిఫిషియల్ రీచార్జ్‌తో పరిష్కారం లభిస్తుంది. అంటే ఇంకుడు గుంతలు తవ్వడం, వర్షపు నీటిని వృథా కానివ్వకుండా చూడటం, భూగర్భ జలాల వినియోగాన్ని రీసైక్లింగ్ చేయడం లాంటివి చురుగ్గా చేయాలి.

అది జరగకపోతే నీరు లేక వందల అడుగుల లోతుకు బోర్లు వేయడం, అక్కడ సముద్రపు నీరు చేరడం వంటివి సమీప భవిష్యత్తులోనే జరిగే అవకాశం ఉంటుంది.

ఇంకుడుగుంతలు తీయించుకోండి: అధికారి

సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు రిపోర్టు-2022 ప్రకారం విశాఖ నగర జనాభా అవసరాలకు 490 ఎంఎల్‌డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) అవసరం.

ప్రస్తుతం అందుబాటులో ఉన్నది 391 ఎంఎల్‌డీ మాత్రమే. ఇప్పటికే అవసరాలు, అందుబాటులో ఉన్న నీటి లెక్కలు చూస్తే 99 ఎంఎల్‌డీ కొరత ఉంది. ఈ అవసరాలు భవిష్యత్తులో మరింత పెరుగుతాయి.

కానీ నీటి వనరుల లభ్యత పెరిగేందుకు అవకాశం లేదు. అందుకే నీటి వనరులను వృథా చేయకపోవడమే పొదుపు చేసినట్లు.

ప్రజలందరూ తప్పనిసరిగా ఇంకుడు గుంతలు తీయించుకోవాలనివిశాఖపట్నం జిల్లా భూగర్భ నీటి వనరుల శాఖ అధికారి పి. లత అన్నారు.

‘‘నిరుటితో పోలిస్తే ఈ ఏడాది భూగర్భ జలాల మట్టాలు తగ్గాయి. దానికి తోడు ఈ ఏడాది 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో నీటి వాడకం కూడా పెరిగింది. ఈ సీజన్‌లో మంచి వర్షాలు పడితే భూగర్భ జల మట్టాలు కాస్త పెరిగే అవకాశం ఉంది. దీని కోసం ఇంకుడు గుంతలు తప్పనిసరిగా తీయించుకోవాలి” అని ఆమె చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)