You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జలగలతో చికిత్సకు రష్యా యువత ఎందుకు ఎగబడుతోంది? ఇది నిజంగానే రోగాలను నయం చేస్తుందా?
- రచయిత, జాన్ ఓ మాహొని
- హోదా, బీబీసీ రీల్
జలగలతో చికిత్స చేసే విధానం (లీచ్ థెరపీ) ఎంత పురాతనమైనదో, అంత వివాదాస్పదమైనది కూడా. ఆరోగ్యంపై శ్రద్ధ, సహజసిద్ధమైన చికిత్సా విధానాలపై ఆసక్తి పెంచుకుంటున్న నేటి తరం ఇప్పుడు ఈ లీచ్ థెరపీ వైపు మొగ్గుతోంది.
రష్యాలోని ఒక ప్రముఖ హిరుడోథెరపీ (జలగలతో చికిత్స) క్లినిక్స్‌ను మేము సందర్శించాం. అతిపెద్ద జలగల పెంపక కేంద్రానికి కూడా వెళ్ళి వాటి పెంపకం ఎలా జరుగుతుందో పరిశీలించాం.
లీచ్ థెరపీకి సుదీర్ఘ చరిత్ర ఉంది. పురాతన ఈజిప్ట్‌లోని కుడ్యచిత్రాలలో కూడా జలగల ప్రయోజనాల గురించిన ప్రస్తావన ఉంది.
అయితే, ఈ విధానం అన్ని చోట్లా కనుమరుగైనా రష్యాలో మాత్రం ఇప్పటికీ ఆదరణ పొందుతోంది.
ఒకప్పటి రష్యా అధ్యక్షుడు స్టాలిన్ కూడా జలగల వైద్యం చేయించుకున్నారు. ఆయన తల, చెవుల వెనుక జలగలతో చికిత్స చేయించుకున్నారు. ఆయన రక్తప్రసరణ సమస్యకు ఈ చికిత్స చేయంచుకున్నారని చెబుతారు.
పర్యావరణంపై అవగాహన కలిగిన యువ రష్యన్ల కారణంగా జలగల చికిత్సా విధానం కొత్త తరానికి కూడా అందుబాటులోకి వచ్చింది.
జీవావరణ సమస్యలను తీవ్రంగా పరిగణిస్తున్న రష్యన్ యువతలో ఎక్కువ మంది లీచ్ థెరపీ వంటి సహజమైన రోగ నివారణ పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారు.
జలగలను శరీరంపై వదిలినప్పుడు అవి రక్తం పీల్చడం మొదలుపెడతాయి. అవి పీల్చే రక్తంలో మంచి రక్తంతో పాటు చెడు రక్తం కూడా వెళ్ళిపోతుందని ఈ చికిత్స నిపుణులు చెబుతారు.
ఈ చికిత్సా విధానాన్ని ప్రయోగాత్మకంగా అందిస్తున్నప్పటికీ, ఫలితాలు సానుకూలంగానే ఉంటున్నాయని అంటున్నారు.
''జలగలను శరీరంపై సరైన ప్రాంతంలో వదలడానికి వీలుగా వాటిని సిరంజీలలోకి ఎక్కిస్తారు. జలగలు తమ ప్రతి బైట్‌లో వందకుపైగా జీవపదార్థాలను స్రవిస్తాయి. వాటిలోని ప్రతి ఎంజైమ్ కీలకపాత్ర పోషిస్తుంది'' అని లీచ్ స్పెషలిస్ట్ డాక్టర్ బోరిస్ నికోలవిచ్ లెబెడెవ్ చెప్పారు.
ఈ రోజుల్లో చాలామంది రోగులు తీవ్రమైన అలసట, భయాందోళనలు తదితర అనారోగ్యాలతో వస్తున్నారు. వీటికి జలగల చికిత్సా విధానం బాగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.
''జలగలు కుంచించుకుపోకుండా అవి ఎంత పొడవుంటే అంతలా సాగేలా వాటిపై తేలికపాటి మర్దన చేస్తాం. ఈ చర్య అవి రక్తం పీల్చడానికి కూడా సహాయపడుతుంది'' అని ఆయన చెప్పారు.
''జలగలు రక్తం పీల్చడం మొదలుపెట్టగానే ఆంక్యుపంక్చర్‌లా (సూదులతో గుచ్చడం), ఏదో గుచ్చుకున్నట్లు అనిపిస్తుంది. కానీ, ఇది అంత ఇబ్బందిగా ఏమీ ఉండదు'' లీచ్ థెరపీ చేయించుకుంటున్న బిజినెస్ కోచ్ యానా చెప్పారు.
మాస్కో సమీపంలోని వుడేల్నియాలోని ప్రపంచంలోని అతిపెద్ద జలగల పెంపక కేంద్రం నుంచి ఈ జలగలు వస్తాయి.
''ప్రస్తుతం ఏడాదికి 30 లక్షల జలగలను పెంచే సామర్థ్యం'' ఈ కేంద్రానికి ఉంది.
జలగకు శరీరం పొడవునా ఐదు జతల కళ్లు ఉంటాయి. వాటికి మూడు దవడలు కూడా ఉంటాయి. ఇవి తిరగేసిన ‘వై’ ఆకారంలో ఉంటాయి. వాటి అంచున తెల్లని కణజాలం ఉంటుంది. వాటిల్లో చిన్న పళ్ల దాగి ఉంటాయి. ప్రతి దవడలోనూ ఇటువంటివి 90 పళ్లు ఉంటాయి'' అని జలగల కేంద్రం ప్రొడక్షన్ హెడ్ యెలీనా టిటోవా చెప్పారు.
''జలగలు గూడు కట్టడం, పిల్ల జలగల పుట్టుక చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీటిని అలా చూడటం నాకెంతో సంతోషాన్నిస్తుంది. ఇందులో ప్రతి ప్రక్రియకు ఓ విభాగం ఉంది. అక్కడ వాటిని పరిశీలించడం సహా ప్రతి విషయంపైనా నియంత్రణ ఉంటుంది. ఇక్కడ వాటిని శుభ్రం చేసి, వేరు వేరుగా పెడతాం. ఈ దశలోనే వాటి ఉపయోగమేమిటో మేం నిర్ధరిస్తాం'' అని క్వాలిటీ కంట్రోలర్ స్వెట్లానా సిదోరెంకో చెప్పారు.
''ఇక్కడ ఉన్నవి గుడ్లు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న జలగలు. అవి కలయికకు సిద్ధంగా ఉన్నాయి. జలగలకు స్త్రీ, పురుష జననేంద్రియాలు ఉంటాయి. అయినా, అవి తమ భాగస్వామిని వెదుక్కోవాల్సి ఉంటుంది. ఇది గూడుకట్టేందుకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. ఇలా సిద్ధమైన వాటిని ప్రసూతి విభాగానికి పంపుతాం'' అని ఆమె చెప్పారు.
''ప్రతి జలగ ఐదు నుంచి 10 గుడ్లు పెడుతుంది. అవి పిల్లలు అయ్యాయో లేదో తెలుసుకోవడానికి అవి కట్టిన గూళ్లను వెలుతురులో పరీక్షించి తెలుసుకుందాం. ఈ గూడు మధ్యలో ఉబ్బెత్తుగా కనిపిస్తున్నది పిల్ల జలగ బయటకు రావడానికి సిద్ధమైనట్టు తెలుపుతుంది'' అన్నారు స్వెట్లానా.
వైద్యానికి పనికొచ్చేలా ఇవి ఎదిగేందుకు 6 నుంచి 12 నెలల సమయం పడుతుంది.
''జలగలు విడుదల చేసే స్రావాలకు సహజంగానే జీవ ప్రభావం ఉంటుంది. అవి మనిషి శరీరంలోని వ్యర్థాలను బయటికి లాగేస్తాయి'' అని డాక్టర్ బోరిస్ అన్నారు.
''ఏడాది కిందట నాకు మల్లిపుల్ స్లెరోసిస్ వ్యాధి ఉన్నట్లు తెలిసింది. ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన తీవ్రమైన వ్యాధి. ఈ సమస్యను సహజ చికిత్స పద్ధతులతో ఎదుర్కోవాలనుకున్నా. లీచ్ థెరపీ గురించి నాకు ఇంతకు ముందే తెలుసు. ఈ చికిత్స అంతా మంచిగానే ఉంటుంది'' అని యానా చెప్పారు.
అయితే, ప్రస్తుతం పర్యావరణ హితానికి సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. మనం ప్లాస్టిక్ బ్యాగ్స్, కాస్మొటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం.
''నన్ను నేటితరానికి ప్రతినిధిగా భావిస్తే, జలగల చికిత్స విధానం కంటే సహజమైనది లేదనే అంటాను. ఇది కృత్రిమంగా సృష్టించింది కాదని చెప్పగలను'' అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ప్రేమనాడులు మనలో ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసా
- డీజే: డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటుతో యువకుల మృతికి భారీ శబ్దాలే కారణమా? చెవికి, గుండెకు సంబంధం ఏమిటి?
- 40 ఏళ్ల వరకు గుండెజబ్బు రాకూడదంటే ఏంచేయాలి?
- అంతరిక్షంలో ఏడాది గడిపితే శరీరానికి ఏమవుతుంది?
- డెంగీ రెండోసారి వస్తే మరింత ప్రాణాంతకమా? అంత మంది చనిపోతున్నా ఈ వైరస్‌కు సరైన టీకా ఎందుకు రాలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)