You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్ శివార్లలో వంతెన కింద మహిళ దారుణ హత్య: ప్రెస్‌రివ్యూ
దిశ ఘటనను మరువక ముందే హైదరాబాద్ శివార్లలో మరో మహిళ హత్యకు గురైందని ఈనాడు సహా ప్రధాన పత్రికలన్నీ కథనం ప్రచురించాయి.
చిలుకూరు-వికారాబాద్ రహదారిపై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి వంతెన కింద మంగళవారం గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది.
ఆమె తల ఛిద్రమై ఉంది. శరీరంపై దుస్తులు లేవు. ఎవరో ఆమెను వేరేచోట హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పారేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారని రాశారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జాగిలాన్ని, కూపీ బృందాన్ని రప్పించారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, మృతురాలి దుస్తులు, ఇతర ఆనవాళ్లేవీ చుట్టుపక్కల లభించలేదు.
మృతదేహానికి కొద్ది దూరంలో నైలాన్ తాడు మాత్రమే దొరికింది. ఈ తాడుతోనే మృతదేహాన్ని వంతెనపై నుంచి కిందకు దించి ఉంటారని అనుమానిస్తున్నారని కథనంలో వివరించారు.
బండరాతితో తలపై మోదినట్లుగా ఆ మహిళ ముఖం ఛిద్రమై గుర్తు పట్టడం కష్టంగా మారింది.
మృతదేహం చేతికి బంగారు గాజులు, ఉంగరం, మెడలో లాకెట్ ఉన్నాయి. చేవెళ్ల ప్రభుత్వాసుపత్రి వైద్యులు శవపరీక్ష చేశారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున అయిదు గంటల మధ్యలో మహిళ మృతి చెంది ఉంటుందని వైద్యులు అంచనా వేశారు.
కిందకు దిగేందుకు కూడా అవకాశం లేని తంగడపల్లిపై వంతెన ప్రాంతాన్ని నిందితులు ఎంచుకున్నారంటే, ఈ ప్రాంతంపై అవగాహన ఉన్న వ్యక్తులే అయి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోంది.
ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ప్రత్యేకంగా నాలుగు బృందాలను రంగంలోకి దించారని ఈనాడు వివరించింది.
మండలికి కల్వకుంట్ల కవిత
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున మాజీ ఎంపీ కవిత పోటీ చేస్తారని ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.
దీనికి సంబంధించి బుధవారం అధికారిక ప్రకటన వెలువడటంతోపాటు, పార్టీ అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేయటానికి రంగం సిద్ధమైంది.
ప్రస్తుతం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కవిత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్నారని పత్రిక చెప్పింది.
అంతకు ముందు ఆయన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, కొద్ది మంది ముఖ్య నేతలను తన వద్దకు పిలిపించుకొని ప్రత్యేకంగా మాట్లాడారని కథనంలో రాశారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం అభ్యర్థిగా పార్టీ నుంచి కవిత ఎంపికపై వారు సానుకూలత వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలతోనూ ఫోన్‌లో మాట్లాడారు.
వారు కూడా అభ్యర్థిగా కవిత ఎంపికను స్వాగతించారు. ఆ తర్వాతే ఈ విషయం జిల్లాకు చెందిన పలువురు పార్టీ ముఖ్యుల చెవిన పడిందని ఆంధ్రజ్యోతి రాసింది.
టీఆర్‌ఎస్ నుంచి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన డాక్టర్ భూపతిరెడ్డిపై అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. అర్ధంతరంగా ఖాళీ అయిన ఈ ఎమ్మెల్సీ స్థానం పదవీ కాలం 2022, జనవరి 4 న ముగియనుండగా, ఈసీ ఎన్నిక ప్రక్రియ చేపట్టింది.
షెడ్యూల్ ప్రకారం ఈనెల 19న నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కాగా, బుధవారం కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎన్నిక అనివార్యమైతే ఏప్రిల్ 7న పోలింగ్, 9న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారని కథనంలో వివరించారు.
ఆరు నెలల్లో కరోనా ఔషధం
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఐసీటీ, సిప్లా కంపెనీ కరోనావైరస్‌కు విరుగుడు మందులను తయారు చేయడానికి చేతులు కలిపినట్లు సాక్షి కథనం ప్రచురించింది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌తోపాటు ఇతర వైరస్‌లకూ చెక్‌పెట్టే దిశగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), దేశీయ ఫార్మా దిగ్గజం సిప్లా వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టాయని చెప్పింది.
కరోనావైరస్‌కు విరుగుడుగా పనిచేయగలవన్న ప్రాథమిక అంచనాకు వచ్చిన మూడు మందులను తయారు చేసేందుకు ఇరు సంస్థలు చేతులు కలిపాయని కథనంలో రాశారు.
రెమిడెస్‌విర్, బెలాక్సివిర్, ఫెవిపిరవిర్ అనే మూడు రసాయనాలు వైరస్‌లను నిరోధించేందుకు సమర్థంగా ఉపయోగపడతాయని ఐఐసీటీ శాస్త్రవేత్తలు గుర్తించగా.. వాటిని పారిశ్రామిక స్థాయిలో తయారు చేసి ఇస్తే తాము మాత్రలు తయారు చేసి అందరికీ అందుబాటులోకి తెస్తామని సిప్లా కంపెనీ ప్రతిపాదించింది.
ఈ మూడు మందులపై ఒకట్రెండు క్లినికల్ ట్రయల్స్ ఇప్పటికే పూర్తయ్యాయని, వేర్వేరు కారణాల వల్ల మార్కెట్‌లోకి రాని వాటిని అత్యవసర పరిస్థితుల్లో నేరుగా ఉపయోగించే అవకాశం ఉండటం విశేషమని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
క్లినికల్ ట్రయల్స్ ముగిసిన తరువాత వేర్వేరు కారణాల వల్ల పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయని మందులను నిశితంగా పరిశీలించడం ద్వారా తాము ఈ మూడు మందులను కరోనాతోపాటు ఇతర వైరస్‌లను ఎదుర్కొనేందుకు ఉపయోగించవచ్చన్న అంచనాకు వచ్చామని చెప్పారు.
సిప్లా అధినేత డాక్టర్ హమీద్ మంగళవారం ఐఐసీటీకి మెయిల్ పంపుతూ ఈ మందులను ఎలాంటి షరతుల్లేకుండా అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారని, ఇందుకు తగ్గట్లుగా తాము ఆరు నుంచి ఎనిమిది వారాల్లో రెండు మందులను (రెమిడిస్‌విర్, ఫెవిపిరవిర్) కావాల్సినంత మోతాదులో తయారు చేసి సిప్లాకు అందిస్తామని వివరించారు.
ఆ తరువాత కొన్ని ప్రభుత్వ అనుమతులతో వీలైనంత వేగంగా వాటిని అందుబాటులోకి తీసుకురావచ్చని చెప్పారు. అన్నీ సవ్యంగా జరిగితే 6 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావొచ్చన్నారు.
ఈ మందుల తయారీకి కావాల్సిన అన్ని రకాల రసాయనాలు ఐఐసీటీలో అందుబాటులో ఉన్నాయని తెలిపారని సాక్షి వివరించింది.
భారతీయ చిరుత జన్యుక్రమం గుర్తింపు
సీసీఎంబీ భారతదేశంలో అంతరించిపోయిన చిరుతను మళ్లీ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.
భారతదేశ చిరుత (చీతా)ని మళ్లీ సృష్టించడానికి ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) తెలిపింది.
భారతదేశపు చీతా జన్యుక్రమాన్ని ఇటీవలే గుర్తించామని పేర్కొంది. మన దేశంలో చిరుతపులులు (లెపర్డ్) విరివిగానే ఉన్నప్పటికీ చీతాలు మాత్రం అంతరించిపోయాయి.
ఆఫ్రికన్ దేశాలలో విస్తృతంగా కనిపించే చిరుతలు, ఆసియా ఖండంలో ఇరాన్‌లో మాత్రమే కొంతవరకు మిగిలి ఉన్నాయి.
ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని చిరుతపులుల జన్యుక్రమాలు వేర్వేరని సీసీఎంబీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇరాన్‌లోని చీతాల కణాలతో భారత్‌లో వాటిని మళ్లీ సృష్టించడానికి ల్యాబరేటరీ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్ స్పీసీస్ (ల్యాకోన్స్)తో కలిసి కృషి చేస్తున్నామని చెప్పినట్లు పత్రికలో రాశారు.
అత్యంతవేగంగా పరిగెత్తే జంతువైన చిరుతలు స్వాతంత్య్రానికి పూర్వం మనదేశంలో విరివిగా కనిపించేవి. కానీ అడవులతోపాటే అవి కూడా అంతరించిపోయాయి. చిత్తూరులో 1953 ప్రాంతంలో చివరిసారిగా చిరుత కనిపించినట్టు రికార్డులు తెలుపుతున్నాయి.
ఆ తరువాత చిరుతను అంతరించిన జంతుజాతిగా పేర్కొంటున్నారు. ఆసియా చిరుతలు ప్రస్తుతం ఇరాన్‌లో 50 వరకూ ఉన్నాయి.
మన దేశంలోని జూపార్క్‌లలో ఉన్నవి ఆఫ్రికన్ జాతి చిరుతలు. ఇరాన్‌లోని ఆసియా జాతి చిరుత కణాలతో భారతదేశపు చిరుతకు మళ్లీ ఊపిరిపోయాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో ఆసియా, ఆఫ్రికన్ జాతుల చిరుతలలో జన్యుపరమైన భేదాలపై పరిశోధనలు సాగించారు. వాటి డీఎన్‌ఏలను విశ్లేషించారు. మనదేశంలో లభ్యమైన 19వ శతాబ్దం నాటి చిరుత చర్మం నుంచి కూడా డీఎన్‌ఏను సేకరించి విశ్లేషించామని సీసీఎంబీ శాస్త్రవేత్త తంగరాజ్ తెలిపారని నమస్తే తెలంగాణ వివరించింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: రోగుల ప్రాణాలను కాపాడుతున్న త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- కరోనావైరస్: తెలంగాణలో పకడ్బందీ చర్యలు.. మార్చి 31 వరకే వివాహాలకు అనుమతి.. ఆ తరువాత తేదీలకు ఫంక్షన్ హాల్స్ బుకింగ్స్‌పై నిషేధం
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: తిరుమలకి భక్తుల రాకపోకలపై ప్రభావం ఎలా ఉంది? టీటీడీ అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి
- కరోనావైరస్: ట్రంప్ చెప్పిన ఆరు గొప్పలు.. అందులో నిజానిజాలు
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)