‘జన్‌ధన్‌ ఖాతాలో ఉన్నట్లుండి రూ.30 కోట్లు వచ్చిపడ్డాయ్.. ఎవరు వేశారో తెలియదు’ - ప్రెస్‌రివ్యూ

కర్ణాటకలో ఓ మహిళ జన్‌ధన్ ఖాతాలో గుర్తు తెలియని వ్యక్తులు రూ.30 కోట్లు వేశారంటూ 'ఈనాడు' దినపత్రిక ఓ వార్త రాసింది.

రెహానా బానో, సయ్యద్‌ మల్లిక్‌ దంపతులు కర్ణాటకలోని రామనగర జిల్లా చెన్నపట్టణ బీడీ కాలనీలో ఉంటున్నారు. 2015లో రెహానా పేరిట ఆమె భర్త జన్‌ధన్ ఖాతాను ప్రారంభించారు.

'మీ భార్య పొదుపు ఖాతాలో రూ.కోట్లలో నగదు డిపాజిట్‌ అయ్యింది. బ్యాంకు ఖాతాను ఇప్పటివరకు ఆధార్‌తో అనుసంధానం చేయించుకోలేదు" అని బ్యాంకు అధికారులు గత డిసెంబరు చివరివారంలో చెప్పడంతో ఆయన ఆశ్చర్యపోయారు.

ఏటీఎంకు వెళ్లి స్టేట్‌మెంట్ తీసుకుంటే, ఖాతాలో దాదాపు రూ.80 కోట్లు ఉన్నట్లు తెలుసుకుని నిర్హాంతపోయారు. వివరాల కోసం బ్యాంకు చుట్టూ తిరిగినా, వారు ఇవ్వలేదు.

దీంతో ఏదో మోసం జరుగుతోందని భావించి, ఆదాయపన్ను విభాగం అధికారులకు సయ్యద్ ఫిర్యాదు చేశారు.

డిసెంబరు మూడోవారంలో గుర్తుతెలియని వ్యక్తి రెహాన్‌కు ఫోన్‌ చేసి.. ''మీరు ఆన్‌లైన్‌లో చీర కొన్నారు... మీకు లాటరీ వచ్చింది. మీ ఖాతాసంఖ్య చెబితే నగదు బదిలీ చేస్తాం'' అని చెప్పాడు. దీంతో ఆమె వారికి ఖాతా సంఖ్య చెప్పారు.

ఆ తర్వాతే ఆమె ఖాతాలోకి మొత్తం రూ.80 కోట్లు బదిలీ అయ్యాయని, తెలియకుండానే కొన్ని నగదు లావాదేవీలు జరిగాయని అధికారులు గుర్తించారు.

ఇందులో బ్యాంకు అధికారులు, సిబ్బంది పాత్ర ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. రామనగర, కనకపుర, చెన్నపట్టణ విభాగాల్లో 8 మంది వ్యక్తుల ఖాతాలకు రూ.120 కోట్ల నగదు ఇలానే బదిలీ అయ్యిందని గుర్తించారు.

'గులాబీ కూలీపై ఐటీ నోటీసులు'

టీఆర్‌ఎస్‌కు చెందిన పలువురు కీలక నేతలకు ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ నోటీసులు ఇచ్చిందని పేర్కొంటూ 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

మూడేళ్ల క్రితం టీఆర్ఎస్ చేపట్టిన 'గులాబీ కూలీ' విరాళాల సేకరణ కార్యక్రమం లెక్కలు చెప్పాలంటూ ఐటీశాఖ నుంచి టీఆర్ఎస్ నాయకులకు నోటీసులు అందినట్లు సమాచారం.

కేటీఆర్‌, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, మహమూద్‌ అలీ సహా కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వీరిలో ఉన్నట్లు తెలుస్తోంది.

2017 ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 'గులాబీ' నాయకత్వం వరంగల్‌లో భారీ ఎత్తున ప్రగతి నివేదన సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు వచ్చే కార్యకర్తల దారి ఖర్చుల కోసం టీఆర్ఎస్ 'గులాబీ కూలీ' కార్యక్రమం చేపట్టింది.

టీఆర్ఎస్ నాయకులు గోడలకు నీళ్లు పట్టడం, ఐస్‌క్రీమ్‌ అమ్మడం లాంటి చిన్న చిన్న పనులు చేస్తే, వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, ప్రముఖులు రూ.లక్షల్లో వారికి చెల్లించారు.

గులాబీ కూలీ పేరిట అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని అప్పట్లోనే ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు.

వీటన్నింటి పర్యవసానంగానే ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నేతలకు ఐటీ నోటీసులు అందినట్లు తెలుస్తోంది.

రాజధానిపై రెఫరెండానికి సిద్ధమా : చంద్రబాబు

మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో రెఫరెండం నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సవాలు విసిరినట్లు 'సాక్షి' దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

రెఫరెండంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు సమర్థిస్తూ తీర్పునిస్తే, తాను మరో మాట మాట్లాడబోనని చంద్రబాబు నాయుడు అన్నారు.

రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో కోరుతుంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవటం లేదని విమర్శించారు.

అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ 2015లో జీవో జారీ చేశామని, వచ్చే ఏప్రిల్‌కు ఐదేళ్లవుతుందని చెప్పారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సాక్ష్యాధారాలుంటే చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని అన్నారు.

విశాఖపట్నంలో 6 వేల ఎకరాల ఎస్సీల భూములను బలవంతంగా లాండ్‌పూలింగ్‌ పేరుతో తీసుకోవాలని చూస్తున్నారని, నాలుగు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని అమ్మాలనే ప్రయత్నంలో ఉన్నారని ఆరోపించారు. ఆస్తులమ్మి ఎవరైనా అభివృద్ధి చేస్తామంటే అది వినాశనానికేనని తేల్చిచెప్పారు.

నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం

నిజామాబాద్‌లో సుగంధద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారని 'నమస్తే తెలంగాణ' ఓ వార్త రాసింది.

పసుపు, మిరపపంటను దృష్టిలో ఉంచుకొని నిజామాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు పీయూష్ చెప్పారు. దీనిపై త్వరలోనే అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు.

ఐఏఎస్‌ స్థాయి అధికారి ఈ ప్రాంతీయకార్యాలయంలో డైరెక్టర్‌ హోదాలో కార్యకలాపాలు పర్యవేక్షిస్తారని, ఈ కార్యాలయం నేరుగా కేంద్ర మంత్రిత్వశాఖకు నివేదిస్తుందని తెలిపారు.

దీనిపై నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ.. అనేక కారణాలతో బోర్డులు విఫలమవుతున్నాయని, వాటికి శాఖలతో సమన్వయం చేసుకునే అవకాశం లేదని చెప్పారు.

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికలప్పుడు హమీ ఇచ్చి, ఇప్పుడు మాట మార్చిందని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

ఇప్పటికే వరంగల్‌లో సుగంధద్రవ్యాల బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఉందని, నిజామాబాద్‌లో మరొకటి ఏర్పాటు చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని చెప్పారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)