You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ అసెంబ్లీలో సీఏఏపై తీర్మానం బడ్జెట్ సమావేశాల్లోనే... గవర్నర్‌తో కేసీఆర్ - ప్రెస్ రివ్యూ
బడ్జెట్ సమావేశాల్లోనే సీఏఏపై తీర్మానం.. గవర్నర్‌కు తెలిపిన కేసీఆర్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి 9 నుంచి నిర్వహిస్తామని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దృష్టికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీసుకెళ్లారని, పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) వ్యతిరేకిస్తూ ఈ సమావేశాల్లోనే తీర్మానం చేస్తామని ఆమెకు చెప్పారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన 'ఎట్ హోం' కార్యక్రమంలో గవర్నర్‌తో సీఎం 20 నిమిషాలపాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పలకరించుకోలేదు. ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య కూడా ఈ దూరం కనిపించింది.
శనివారం మీడియా సమావేశంలో సీఏఏను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేస్తామని ప్రకటించడమే కాకుండా బీజేపీ విధానాలను సీఎం కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. అదే స్థాయిలో బీజేపీ కూడా బదులిచ్చింది. ఈ ప్రభావం, రాజ్‌భవన్‌లో జరిగిన తేనీటి విందులో స్పష్టంగా కనిపించింది.
ఏపీ మండలి రద్దుకు నేడు అసెంబ్లీలో తీర్మానం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ రోజు (సోమవారం) ఉదయం తొమ్మిదిన్నరకు మంత్రివర్గ సమావేశం జరగనుందని, శాసనమండలి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని సాక్షి తెలిపింది.
సాక్షి కథనం ప్రకారం- అభివృద్ధి వికేంద్రీకరణ, సమ్మిళిత అభివృద్ధి బిల్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు బిల్లు శాసనమండలిలో నిలిచిపోయిన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. శాసనమండలి రద్దుకు అనుకూలంగా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మచిలీపట్నం పోర్టు నిర్మాణాలపైనా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అర్హులైన పేదలందరికీ ఉగాది పర్వదినాన ఇళ్లస్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూముల సేకరణపైనా చర్చించనున్నారు.
కేబినెట్ భేటీ అనంతరం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశంలో బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత తలెత్తిన పర్యవసానాలపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. శానసమండలిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఆమోదం పొందనున్నట్లు అధికార వర్గాల సమాచారం.
రెండ్రోజుల్లో సెలక్ట్ కమిటీలో సభ్యుల నియామకం: శాసనమండలి చైర్మన్ షరీఫ్
అభివృద్ధి వికేంద్రీకరణ, సమ్మిళిత అభివృద్ధి బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లు ప్రస్తుతం సెలక్ట్ కమిటీ పరిధిలో ఉన్నాయని, రెండ్రోజుల్లో ఈ కమిటీలో సభ్యులను నియమిస్తానని శాసనమండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ చెప్పారని ఆంధ్రజ్యోతి రాసింది. ఆదివారం హైదరాబాద్‌లో గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మండలి రద్దు అంశంలో ప్రభుత్వ విధానంపై తాను స్పందించబోనన్నారు.
సమత కేసులో నేడు ఆదిలాబాద్ కోర్టు తీర్పు
సమత కేసులో ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు ఇవ్వనుందని నమస్తే తెలంగాణ తెలిపింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో 2019 నవంబరు 24న సమతపై ముగ్గురు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడి ఆపై ఆమెను హత్య చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసును వేగంగా విచారించేందుకు డిసెంబర్ 11న ఆదిలాబాద్‌లో ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. పోలీసులు ముగ్గురు నిందితులపై డిసెంబర్ 14న 144 పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేశారు.
నిందితుల తరఫున కేసును వాదించేందుకు న్యాయవాదులు ఎవరూ ముందుకు రాకపోవడంతో కోర్టు నిందితులకు న్యాయవాదిని కేటాయించింది. నిందితుల తరఫున న్యాయవాది రహీం వాదనలు వినిపించారు.
బాధితురాలి కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులు, పోలీసు, రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్ వైద్యులు మొత్తం 25 మంది సాక్షులను కోర్టు విచారించగా డిసెంబర్ 31తో విచారణ పూర్తయింది.
ఈ నెల 20తో ప్రాసిక్యూషన్, డిఫెన్స్ లాయర్ల మధ్యవాదనలు ముగియగా.. తీర్పును ఈ నెల 27న వెలువరించనున్నట్టు న్యాయమూర్తి ప్రకటించిన విషయం తెలిసిందే.
ఏపీ: రోడ్లు, భవనాలశాఖలో వెయ్యి కోట్ల బిల్లులు పెండింగ్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2018 చివరి నుంచి రహదారులు, భవనాలశాఖలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు నిలిచిపోయాయని, మొత్తంగా వెయ్యి కోట్లకుపైనే బిల్లులు పెండింగ్ ఉన్నాయని ఈనాడు చెప్పింది.
2019 ఏప్రిల్, మే నెలల్లో దాదాపు రూ.160 కోట్ల మేర చెల్లించడంతో 2018లోని అక్టోబరు, నవంబరు మాసాల బిల్లులకు మోక్షం కలిగింది. 2018 డిసెంబరు నుంచి బిల్లులు అలాగే ఉండిపోయాయి.
రాష్ట్రవ్యాప్తంగా పెద్ద పనులు చేసే కాంట్రాక్టర్లు, చిన్నచిన్న మరమ్మతులు నిర్వహించే కాంట్రాక్టర్లు కలిపి 1700 మంది వరకు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పెద్దయెత్తున రహదారుల పనులు జరిగాయి. ముఖ్యంగా జిల్లా ప్రధాన రహదారులు (ఎండీఆర్) పనులు ఎక్కువగా చేపట్టారు. వీటికి బిల్లులు చెల్లించడం లేదు.
కొంత కాలం కిందటి వరకు 'కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టం(సీఎఫ్‌ఎంఎస్)'లో బిల్లులు అప్‌లోడ్ చేసుకునే అవకాశమైనా ఉండేది. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడంతో బిల్లుల అప్‌లోడ్ కావడం లేదు.
ఇప్పుడప్పుడే చెల్లించే పరిస్థితి లేకపోవడంతో కనీసం ప్రభుత్వ హామీతో బ్యాంకు రుణమైనా ఇప్పించాలని కాంట్రాక్టులు అడుగుతున్నారు. దీనికీ అధికారుల నుంచి స్పందన లేదు.
జాతీయ రహదారుల పనుల బిల్లులను కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లిస్తే వాటిని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత కాలంగా ఈ బిల్లులనూ సకాలంలో చెల్లించకపోవడంతో జాతీయ రహదారుల పనులు చేసేందుకూ కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. విశాఖపట్నం-రాయ్‌పూర్ జాతీయ రహదారిలో విజయనగరం- బొబ్బిలి మధ్య మరమ్మతులకు నాలుగు టెండర్లు పిలిస్తే ఒక్క పనికే టెండర్లు దాఖలయ్యాయి.
ఇవి కూడా చదవండి:
- పద్మ అవార్డ్స్ 2020 : జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు మరణానంతరం పద్మ విభూషణ్.. పీవీ సింధుకు పద్మభూషణ్
- భర్త వైద్యం కోసం.. 65 ఏళ్ల వయసులో ఆమె పరుగు పందేల్లో పోటీ పడుతున్నారు
- కరోనా వైరస్: వెయ్యి పడకల ఆస్పత్రిని చైనా ఆరు రోజుల్లోనే ఎలా నిర్మిస్తోంది?
- కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'
- CAA-NRC: జనన ధ్రువీకరణ పత్రాల కోసం మాలెగావ్‌లో 4 నెలల్లో 50వేల దరఖాస్తులు
- బిడ్డ పుట్టిన నిమిషం లోపే బొడ్డు తాడు కత్తిరిస్తే ఏమవుతుంది
- క్రికెట్ పోటీల్లోకి మరో కొత్త దేశం.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నైజీరియా జట్టు
- టైఫాయిడ్ వాక్సిన్: 'అద్భుతంగా పనిచేస్తోంది'
- మీ స్నేహితులు మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారా?
- మీ జుట్టు తెల్లబడుతోందా? అయితే కారణం అదే కావొచ్చు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)