You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పేద దేశాల్లో ప్రజలకు ఊబకాయం ఎందుకు వస్తోంది?
అతి పేద దేశాల్లోని మూడో వంతు దేశాల్లో ప్రజలు అధిక స్థాయి ఊబకాయం, పోషకాహారలోపం సమస్యలతో బాధపడుతున్నారని ప్రముఖ పత్రిక 'ది లాన్సెట్' తెలిపింది. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారం అంతర్జాతీయంగా అందుబాటులోకి రావడం, ప్రజలు తగినంతగా వ్యాయామం చేయకపోవడం ఈ పరిస్థితికి కారణమని చెప్పింది.
సమస్యకు ఆధునిక ఆహార వ్యవస్థ కారణమని, ఇందులో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు.
ఊబకాయం, పోషకలోపం సమస్యలు ప్రపంచంలోకెల్లా సబ్-సహారన్ ఆఫ్రికా, ఆసియాలోని దేశాల్లో ఎక్కువగా ఉన్నట్లు ద లాన్సెట్ నివేదిక తెలిపింది. ప్రపంచంలో దాదాపు 230 కోట్ల మంది చిన్నారులు, పెద్దవారు అధిక బరువు ఉన్నారని పేర్కొంది. 15 కోట్ల మందికి పైగా చిన్నారుల్లో వయసుకు తగిన ఎదుగుదల లేదని చెప్పింది.
చాలా స్వల్పాదాయ, మధ్యాదాయ దేశాలు ఏకకాలంలో ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ప్రజల్లో 20 శాతం మంది అధిక బరువు ఉన్నారు. నాలుగేళ్లలోపు పిల్లల్లో 30 శాతం మందిలో ఎదుగుదల సరిగా లేదు. 20 శాతం మంది మహిళలు బక్కచిక్కి ఉన్నట్లు గుర్తించారు.
పోషకాహార లోపం ఊబకాయం, బలహీనత రూపంలో వ్యక్తులపై జీవితంలో ఏదో ఒక దశలో ప్రభావం చూపిస్తుందని, ఇది సమాజంపై, కుటుంబంపైనా ప్రభావం చూపుతుందని లాన్సెట్ నివేదిక పేర్కొంది.
1990లలో 123 దేశాలకుగాను 45 దేశాల్లో, 2010లలో 126 దేశాలకుగాను 48 దేశాల్లో ఈ ప్రభావం కనిపించిందని నివేదిక వివరించింది.
అత్యంత తక్కువ ఆదాయమున్న 14 దేశాల్లో 1990ల నుంచి 2010ల మధ్య ఈ రెండు రకాల సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
ఆహార వ్యవస్థల వైఫల్యం
ఆహారపు అలవాట్లలో మార్పులు సమస్యకు కారణమని నివేదిక రాసిన నిపుణులు చెప్పారు. దీని పరిష్కారానికి ప్రభుత్వాలు, ఐక్యరాజ్యసమితి, విద్యావేత్తలు నడుం బిగించాలని సూచించారు.
ఆహారపు అలవాట్లు, జీవన శైలి మారిపోతున్నాయి. సూపర్‌మార్కెట్లు పెరిగిపోతుండటం, తక్కువ పోషక విలువలున్న ఆహారం తేలిగ్గా దొరకడం, శారీరక శ్రమ తగ్గిపోతుండటం మరింత మందిలో అధిక బరువుకు కారణమవుతున్నాయి.
అధికాదాయ దేశాలతోపాటు స్వల్పాదాయ, మధ్యాదాయ దేశాలపైనా ఈ మార్పులు ప్రభావం చూపిస్తున్నాయి.
చాలా దేశాల్లో పిల్లల్లో ఎదుగుదల మందగించడమనే సమస్య తగ్గుతోంది. అయితే చిన్న వయసులోనే అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినడం వయసుకు తగిన ఎదుగుదల లేకుండా చేస్తోంది.
నేటి ఆహార వ్యవస్థలు ప్రజలందరికీ ఆరోగ్యకరమైన, సురక్షితమైన, సరసమైన, దీర్ఘకాలిక ఆహారాన్ని అందించలేకపోతున్నాయని, పోషకాహారంతో ముడిపడిన సమస్యలకు ఇదే మూలమని నివేదిక ప్రధాన రూపకర్త డాక్టర్ ఫ్రాన్సెస్కో బ్రానా చెప్పారు.
ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)లో ఆరోగ్యం, అభివృద్ధిలకు సంబంధించిన పోషకాహార విభాగం సంచాలకుడిగా ఉన్నారు.
ఆహారం ఉత్పత్తి, ప్రాసెసింగ్ మొదలుకొని, ఆహార వాణిజ్యం, పంపిణీ, ధరల నిర్ణయం, మార్కెటింగ్, లేబ్లింగ్, వినియోగం, ఆహార వృథా వరకు అన్ని విషయాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని బ్రాంకా చెప్పారు. సంబంధిత విధానాలన్నింటినీ సమూలంగా మార్చాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో పెట్టుబడులపైనా సమగ్ర సమీక్ష జరపాలన్నారు.
ఎక్కువ నాణ్యమైన ఆహారంలో ఏమేం ఉంటాయో నివేదిక వివరించింది. దీని ప్రకారం-
- పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పీచుపదార్థం, విత్తనాలు, గింజలు ఎక్కువగా తినాలి.
- జంతువుల నుంచి వచ్చే ఆహారాన్ని ఓ మోస్తరుగా తీసుకోవాలి.
- ప్రాసెస్ చేసిన మాంసాన్ని తక్కువగా తినాలి.
- ఎక్కువ శక్తినిచ్చే ఆహారాన్ని, ద్రవాలను, యాడెడ్ షుగర్, సాచురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్, ఉప్పు సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి.
ఎక్కువ నాణ్యమైన ఆహారం తీసుకొంటే ఆరోగ్యకరమైన ఎదుగుదల ఉంటుంది. జీవితమంతా వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- శారీరక వ్యాయామం చేయని ప్రతి నలుగురిలో ఒకరికి ముప్పు
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- వ్యాయామం చేస్తే కరిగే కొవ్వు ఎటు వెళుతుంది?
- పౌరసత్వ సవరణ చట్టం: దిల్లీలోనూ ఆందోళనలు.. బస్సుల దహనం
- పౌరసత్వ సవరణ చట్టం: బీజేపీ తొందరపడిందా.. ఈ స్థాయి వ్యతిరేకతను ఊహించలేదా
- నిర్భయ ఘటనకు ఏడేళ్లు.. మహిళలపై నేరాల విషయంలో దేశం ఎంత మారింది
- ఈ చట్టంతో భారతదేశంలో ఏ ఒక్కరూ పౌరసత్వం కోల్పోరు: అమిత్ షా
- ఉన్నావ్ కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్‌ను దోషిగా ప్రకటించిన కోర్టు
- COP25 మాడ్రిడ్‌లో ఐరాస వాతావరణ సదస్సు సాధించిందేమిటి...
- థాయ్ మసాజ్‌కు ప్రతిష్ఠాత్మక యునెస్కో జాబితాలో చోటు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)