You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నిర్భయ ఘటన: ఏడేళ్ల కిందట దేశాన్ని కుదిపేసిన అత్యాచార ఘటన తరువాత పరిస్థితిలో మార్పు వచ్చిందా
ఏడేళ్ల కిందట దిల్లీలో ఒక బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థినిని(నిర్భయ) సామూహిక అత్యాచారం చేసి చంపేశారు.
దేశ రాజధానిలో జరిగిన ఈ ఘటన తరువాత భారత్‌లో అత్యాచారాలు, మహిళలపై నేరాల విషయం మరింత చర్చనీయమైంది.
అంతేకాదు భారత దేశ న్యాయవ్యవస్థపైనా అందరి దృష్టి పడింది.
అసలు ఆ రోజు ఏం జరిగింది?
దిల్లీలో 2012 డిసెంబర్ 16 రాత్రి 11 గంటల తర్వాత ఒక యువతి తన స్నేహితుడితో కలిసి బస్సు ఎక్కింది. బస్సులో అయిదుగురు పురుషులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెతో ఉన్న స్నేహితుడిని కొట్టారు.
చావుబతుకుల మధ్య ఉన్న వారిద్దరినీ రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. ఇది చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే వారిని ఆసుపత్రిలో చేర్చారు.
తీవ్రంగా గాయపడిన నిర్భయ మరణించింది. ఆ భయంకరమైన అనుభవం నుంచి కోలుకోలేకపోయినా గాయాల నుంచి కోలుకున్న ఆ స్నేహితుడు బతికాడు.
దేశవ్యాప్తంగా స్పందన
నిర్భయకు జరిగిన అన్యాయానికి యావద్దేశం తల్లడిల్లింది. నిందితులకు న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది.
వారిని ఎప్పుడు ఉరి తీస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రానప్పటికీ అందుకోసం ఉరితాళ్లు సిద్ధమవుతున్నాయి.
రోజుకు 90 రేప్‌లు
ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారత్‌లో రోజుకు సగటున 90 అత్యాచారా కేసులు నమోదవుతున్నాయి.
అత్యాచార కేసుల సంఖ్య పెరుగుతున్నా ఈ కేసుల్లో నిందితులలో చాలా తక్కువమందికి శిక్షలు పడుతున్నాయి.
నిర్భయ ఘటన తరువాత ఇలాంటి నేరాలపై పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.
2012లో అత్యాచార కేసులు దేశవ్యాప్తంగా 25 వేల కంటే తక్కువ ఉండగా 2016 నాటికి 38 వేలకు పెరిగింది. 2017లో 32,559 అత్యాచార కేసులు నమోదయ్యాయి.
కేసుల సంఖ్య పెరుగుతుండడంతో విచారణ జరపడం కోర్టులకు కష్టమవుతోంది. 2017 చివరి నాటికి 1,27,800కి పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2017లో 18,300 కేసుల్లో మాత్రమే విచారణ పూర్తయి తీర్పులొచ్చాయి.
2012లో 20,660 అత్యాచార కేసుల విచారణ పూర్తయి ఆ ఏడాది చివరి నాటికి 1,13,000 కేసులు పెండింగులో ఉన్నాయి.
నేర నిరూపణ ఎంతవరకు జరుగుతోంది?
2002 నుంచి 2011 మధ్య కోర్టు వరకు వెళ్లిన మొత్తం కేసుల్లో 26 శాతం కేసులలో మాత్రమే శిక్షలు పడ్డాయి. 2012 తర్వాత ఈ గణాంకాలు కొంత మెరుగుపడినా కూడా 2016 నాటికి 25 శాతానికి తగ్గింది.
2017లో ఇది 32 శాతానికి చేరింది. మన న్యాయవ్యవస్థలో కేసుల పరిష్కారానికి పట్టే సమయం చాలా ఎక్కువ కావడంతో నేర నిరూపణ చాలా తక్కువగా ఉంటోంది.
మరోవైపు బాధితులు, సాక్షులపై కలగజేసే ఒత్తిళ్లూ నేర నిరూపణలో అడ్డంకులుగా మారుతున్నాయి.
ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ సంబంధాలున్నవారు అయినప్పుడు శిక్షల విషయం చర్చనీయమవుతోంది.
ఉదాహరణకు, స్వయంప్రకటిత బాబా ఆశారాం బాపు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఆ కేసుకు సంబంధించిన కనీసం 9 మంది సాక్షులు దాడులకు గురయ్యారు. 2018లో ఆయనకు శిక్ష విధించారు.
పెండింగులో ఉన్న అత్యాచార కేసుల సత్వర విచారణకు మరో 1000 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది.
అంతర్జాతీయంగా ఎలా ఉంది?
భారత్‌లో అత్యాచార దోషులకు శిక్షలు పడడమనేది ఇతర దేశాలతో పోల్చితే ఎక్కువే. దక్షిణాఫ్రికాలో 2017లో చేసిన ఒక అధ్యయనం ప్రకారం అత్యాచార కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారిలో 8 శాతం మందికి శిక్షలు పడ్డాయి.
మహిళా హక్కుల కోసం పోరాడే ఒక సంస్థ 2018లో చేసిన సర్వే ప్రకారం బంగ్లాదేశ్‌లో ఇలాంటి కేసుల్లో దోషుల నిర్ధారణ శాతం అత్యంత తక్కువగా ఉంది.
దోషుల నిర్ధారణ రేటు ఎక్కువగా ఉన్న కొన్ని దేశాల్లోనూ చాలాకేసులు కోర్టులకు వరకు రావడం లేదు.
బ్రిటన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లలో నమోదవుతున్న అత్యాచార కేసులకు, కోర్టుల వరకు వెళ్తున్న కేసులకు మధ్య అంతరం పెరుగుతోంది.
ఇంగ్లండ్, వేల్స్‌లో ఈ ఏడాది కోర్టు విచారణ వరకు వెళ్లిన అత్యాచార కేసుల సంఖ్య గత దశాబ్ద కాలంలోనే అతి తక్కువగా నమోదయ్యాయి.
60 శాతం కన్విక్షన్ రేట్ కొనసాగించాలన్న ఉద్దేశం దీని వెనుక ఉంది.
జెండర్ ఈక్వాలిటీలో ముందుండే స్వీడన్ వంటి దేశాలలో రేప్ కేసుల్లో దోషుల నిర్ధారణ చాలా తక్కువ ఉంది అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆరోపిస్తోంది.
చాలా దేశాలలో అత్యాచారానికి చట్టపరంగా వివిధ అర్ధాలు ఉంటాయి. అలాగే న్యాయ విచారణ పద్ధతులూ వేర్వేరుగా ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
- నలుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు పెళ్లి కొడుకులు, ఒకే రోజు పెళ్లి
- పౌరసత్వ సవరణ బిల్లులో ఏముంది... ఎవరు వ్యతిరేకిస్తున్నారు
- యూఎస్బీ కండోమ్ అంటే ఏమిటో తెలుసా?
- బెంగాల్లో అక్రమంగా ఉంటున్న అందరినీ 'బయటకు గెంటేస్తాం'- అమిత్ షా
- సర్దార్ పటేల్: ‘రాజులను అంతం చేయకుండానే, రాజ్యాలను అంతం చేసిన నాయకుడు’
- ఎన్ఆర్సీ: పౌరసత్వం చట్రంలో నలిగిపోతున్న అసోం చిన్నారులు
- షారుఖ్ ఖాన్ ఇంటర్వ్యూ: ‘అందుకే నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి..’
- ఎన్ఆర్సీ: ‘ఇక్కడే పుట్టాం.. ఇక్కడే బతికాం.. ఇప్పుడెక్కడికి పోతాం?’ - అస్సాం పౌరసత్వ జాబితాలో పేరు లేని లక్షలాది మంది ఆవేదన
- నా పేరు రాహుల్ సావర్కర్ కాదు, నేను క్షమాపణ కోరను: రాహుల్ గాంధీ
- ఆ 19 లక్షల మందిని బంగ్లాదేశ్‌కు పంపించేస్తారా
- భారత్‌లో అత్యాచారాలను రాజకీయ అంశంగా మార్చిన రాహుల్, మోదీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)