You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైటిజం: ఎత్తుగా ఉన్నవారికే ప్రమోషన్లు వస్తాయా, జాబ్‌లో ఎదగాలంటే ఎంత ఎత్తు ఉండాలి?
- రచయిత, అయేషా ఇంతియాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
2010లో పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్న ప్రైవేట్ యూనివర్పిటీలో ఇమ్రాన్‌కు సెక్యూరిటీ గార్డ్‌గా పని దొరికింది. ఎంతో ఇష్టంగా అందులో చేరారు. రాత్రంతా పనిచేసి, కొన్నిసార్లు ఉదయం కూడా డ్యూటీలో కొనసాగుతూ, కష్టపడి పని చేసేవారు ఇమ్రాన్.
తనకు అప్పజెప్పిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని ఆయన భావించేవారు. అందరితో స్నేహంగా మెలగడం ఆయన నైజం. ఉదయం వచ్చే సందర్శకులు తొలిసారి చూసేది కూడా ఆయననే.
అయితే, ఈ ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. తాను పొట్టివాడినన్న సిగ్గు ఆయనలో ఉండేది. 5 అడుగుల 2 అంగుళాల (157 సెం.మీ.) ఎత్తు ఉంటారు ఇమ్రాన్. పాకిస్తాన్‌లో సగటు పురుషుడి ఎత్తుకన్నా ఇది తక్కువే.
సహచరులు ఆయనను సరదాగా 'మున్నా బాయ్' అంటూ ఆటపట్టిస్తుంటారు. చిన్నవాళ్లు, తమ్ముళ్లను స్థానికంగా ఇలా పిలుస్తుంటారు. 'బనా' అని కూడా అంటుంటారు. ఉర్దూలో ఈ మాటలకు అర్థం పొట్టివాడు, మరగుజ్జు అని.
ఉద్యోగ భద్రత దృష్ట్యా ఇమ్రాన్ పూర్తి పేరు వెల్లడించడం లేదు.
‘ఎత్తు పల్లాలు’
తాను చేస్తున్న పని పట్ల గర్వపడేవారు ఇమ్రాన్. అయితే, తన ఎత్తు విషయంలో ఎన్నో 'ఎత్తుపల్లాలు'ను చూశారు.
ఒక్క విషయంలో మాత్రం ఆయనకు నిత్యం ఒక అనుమానం ఉండేది. తగినంత ఎత్తు లేకపోవడం వల్లనే జీతం పెరగడం లేదన్నది ఆ అనుమానం.
"జీతాల పెరుగుదల వచ్చే సరికి నన్ను కొత్త గార్డులతో పోల్చుతుంటారు. ఈ సంస్థలో చాలా కాలంగా పనిచేస్తున్నాను. కొత్తవాళ్లతో సమానంగా నాకు జీతం ఇవ్వడం సరికాదు" అని అనేవారు ఇమ్రాన్.
ఉద్యోగి ఎత్తుకు, జీతానికి ఎవరూ ముడిపెట్టరని, ప్రమోషన్ రాకపోవడానికి ఎత్తు లేకపోవడమే కారణమనుకోవడం కేవలం భ్రమ మాత్రమేనని కొన్నిసార్లు ఇమ్రాన్ అనుకుంటుంటారు.
కానీ, మరుసటి సంవత్సరం కూడా తన జీతం కొత్తగా తీసుకున్న గార్డులతో సమానంగా ఉండడం చూసి ఆయన ఆశ్చర్యపోయారు.
పనితీరును చూసి కాకుండా, ఎత్తును చూసి జీతాల మదింపు చేస్తున్నారేమోనన్న అనుమానం మళ్లీ మొదలయ్యేది. ఎత్తులేకపోవడం వల్లే తాను వెనుకబడిపోతున్నాని అనుకోవడం తప్ప ఇంకేమి చేయగలరు?
ఎత్తు ఆధారంగా వివక్ష ఉంటుందన్న విషయం ఎప్పుడూ చెప్పుకోదగిన చర్చనీయాంశంగా లేదు. ఇలాంటి దాన్ని నిర్ధరించడం కూడా చాలా కష్టం కూడా.
ఎత్తును బట్టి నిర్ణయం తీసుకోవడం హాస్యాస్పదమవుతుందని ఇమ్రాన్‌లాంటి వారు భావిస్తుంటారు. పొట్టిగా ఉండడాన్ని నెగెటివ్ క్వాలిటీగా ఎవరైనా పరిగణించగలరా అని ప్రశ్నిస్తుంటారు.
ఎత్తు, పొడవు కారణంగా లబ్ధి పొందామని ఎవరూ ఎప్పుడూ చెప్పలేరు కూడా. అయితే ప్రొఫెషనల్ స్థాయిలో చూసినప్పుడు స్త్రీ, పురుషుల ఎత్తు స్పల్పంగానైనా స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఎత్తుకు, అధిక ఆదాయానికి పరస్పర సంబంధం ఉందని, పొడవుగా ఉండే వారిని రిక్రూటర్లు ఇష్టపడతారని, ప్రమోషన్ అవకాశాలపైనా ఎత్తు ప్రభావం చూపుతుందని అధ్యయనాలు వివరిస్తున్నాయి.
పొడవుగా ఉండే పురుషులు, మహిళలను ఇతరులు 'నాయకులు మాదిరిగా' చూస్తుంటారని పరిశోధనలు చెబుతున్నాయి. వారిని ప్రబలమైనవారిగా, బుద్ధి కుశలత కలవారిగా, ఆరోగ్యవంతులుగా పరిగణిస్తుంటారు చాలామంది.
పొడవుగా ఉన్నవారు పరిపాలన సంబంధమైన ఉద్యోగాలను పొందే అవకాశాలు ఉన్నాయి.
పొడవుగా ఉన్నవారిపై శ్రద్ధ, ఆసక్తి చూపడం అనేది అంతర్గతంగా ఉండే ఓ పక్షపాత బుద్ధి. తెలియకుండానే మనలో ఉండే లక్షణం. ఇలాంటి భావన ఉన్నట్టు గుర్తించలేం కూడా. గుప్తంగా ఉండే ఇలాంటి లక్షణాలను వదిలించుకోవడం చాలా కష్టం.
మనం ఎలా కనిపిస్తున్నామన్నదాని ఆధారంగా వివిధ రకాల వివక్షలు ఉంటాయన్నది తెలిసిందే. బరువు, చిన్న పిల్లల్లాంటి ముఖం ఇవన్నీ వివక్ష చూపడానికి కారణాలే.
మనం ఎత్తుగా ఉన్న కారణంగా ఇతరుల మీద వివక్ష చూపుతుంటాం. పొడవుగా ఉండడం మంచిదని మనం భావించడమే దీనికి కారణం.
పొడవుకు సంబంధించిన అంశాలు 'హైటిజం'పై యూనివర్సిటీ ఆఫ్ హఫియాలోని 'లా' విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఒమర్ కిమ్హీ పరిశోధనలు చేశారు.
పొడవు ఆధారంగా వివక్ష చూపే మూలాలు పరిణామ క్రమంలోనే ఉన్నాయి. జంతు సామ్రాజ్యంలో ఎత్తు, బలానికి అధిక ప్రాధాన్యం ఉండేది.
"మీరు భారీగా ఉంటే మీరే గుంపునకు అధిపతి. అలాంటి భావన ఇప్పటికీ స్థిరపడి పోయింది. అధికారం, బలం, ఉన్నత స్థానాలు పొందడానికి ఎత్తుకు సంబంధం ఉందని మనంలో చాలామంది నమ్ముతున్నాం" అని ఆయన చెప్పారు.
పొడవుగల వ్యక్తులపై తెలియకుండానే ఓ గౌరవ భావం ఉంది. ప్రాచీన సమాజంలో హోదాలను గుర్తించడానికి ఉపయోగించిన ఆదిమ విధానం అవశేషమే ఈ భావన.
ప్రాచీన సమాజాల్లో శారీరక దృఢత్వాన్ని నాయకత్వానికి చిహ్నంగా భావించేవారు.
ఆధునిక సమాజంలోనూ 'హైటిజం' పలు రూపాల్లో అమలవుతోందని డాక్టర్ ఎరిన్ ప్రిచార్డ్ అభిప్రాయపడ్డారు. ఆయన లివర్‌పూల్ హోప్ యూనివర్సిటీలో డిజబిలిటీ స్టడీస్ విభాగంలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. సెంటర్ ఫర్ కల్చర్ అండ్ డిజబిలిటీ స్డడీస్‌లో కోర్ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు.
"ప్రతి దేశంలో ఆదర్శవంతమైన ఎత్తు అనేది ఒకటి ఉంటుంది. ప్రతివారు 'తప్పకుండా' ఆ ప్రమాణం మేరకు ఉండాలని కోరుకుంటారు. అంతకన్నా తక్కువ ఉంటే ఏదో తప్పు జరిగిందని భావిస్తారు" అని ప్రిచార్డ్ వివరించారు.
'హైటిజం' భాషలోకీ చొరబడింది. పొడవును పొగుడుతూ, పొట్టిని విమర్శిస్తూ ఎన్నో జాతీయాలు ఉన్నాయి.
పొడవుకు..శారీరక, మానసిక లక్షణాలకు సంబంధం ఉందన్న భావన మనకు తెలియకుండానే మనస్సులో నిక్షిప్తమయింది. పొడవుగా ఉండేవారు సమర్థులు, రిస్కులు భరించేవారు, ప్రభావశీలురు, అసాధారణ తెలివితేటలు కలవారు, కొన్నిసార్లు ఆకర్షణీయమైన వ్యక్తులని కూడా భావిస్తుంటారు.
"అదే పొట్టివారిని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. వారికి గౌరవం ఇవ్వరు సరికదా, జోకులు వేస్తుంటారు" అని ప్రిచార్డ్ వివరించారు.
పొడవు ఆధారంగా వివక్ష చూపుతున్నామన్న భావనను చాలా మంది గుర్తించరు. ఎందుకంటే ఇది అంతర్గతంగా అవ్యక్తమైన అభిప్రాయం కాబట్టి వివక్ష చూపుతున్నామన్న ఫీలింగ్ కలగదు.
పనిపై ప్రభావం
హైటిజం కారణంగా కలుగుతున్న వివక్షను గుర్తించడం కష్టమే అయినప్పటికీ, ఉద్యోగుల పనితీరుపై దీని ప్రభావం ఉందని స్పష్టంగా తేలింది.
ఉద్యోగాల భర్తీలో ఇది ప్రభావం చూపిస్తున్నట్టు అధ్యయనాల్లో వెల్లడయింది. అర్హతలు ఒకే విధంగా ఉన్నప్పటికీ పొట్టివారిని తిరస్కరించిన సందర్భాలు అధికం.
ఉద్యోగాల్లో చేరిన తరువాత పొడగర్లకే పదోన్నతి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఒమర్ కిమ్హీ..మాల్కం గ్లాడ్‌వెల్ చేసిన సర్వేను ప్రముఖంగా ప్రస్తావించారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల సీఈఓలను సర్వే చేసిన అనంతరం 2005లో బ్లింక్ పేరిట పుస్తకాన్ని వెలువరించారు. ఆ సీఈఓలు ఎంతటి పొడుగరులో గ్లాడ్‌వెల్ అందులో వివరించారు.
"యూఎస్ జనాభాలో 14.5% మంది పురుషులు ఆరడుగుల కన్నా అధికంగా ఉంటారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల సీఈఓల్లో 58% మంది అంతటి పొడవు ఉన్నవారే" అని పేర్కొన్నారు.
వేతనాల మధ్య వ్యత్యాసానికి, పొడవుకు సంబంధం ఉంది. యూకే, చైనా, యూఎస్‌లలో ఉద్యోగి ఎత్తుకు, అధిక వేతనానికి సంబంధం ఉందని అధ్యయనాలు వెల్లడించాయి.
మహిళల్లో మరో రకం సమస్య
పొడవు విషయంలో స్త్రీ-పురుషుల మధ్య మరో రకమైన వివక్ష ఉండడం ఇంకో కోణం. దీనిపై కాలిఫోర్నియాలోని లయోలా మేరీమౌంట్ యూనివర్సిటీకి చెందిన ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఇనాస్ ఆర్.కెల్లీ అధ్యయనం చేశారు.
"శ్వేత జాతి పురుషుని ఎత్తు 10 సెంటీమీటర్ల మేర పెరిగే కొద్దీ వేతనం అధికమవుతుంది. శ్వేత జాతి మహిళల విషయంలో అలా జరగదు" అని ఆమె పేర్కొన్నారు.
ఆఫ్రికన్-అమెరికన్ల విషయంలో వేతనాల తేడా మరింత అధికంగా ఉంటుంది.
పొడగరిగా ఉండడం పురుషుడికి లబ్ధి కలిగిస్తుంది. అదే మహిళ పొడవుగా ఉంటే వివక్షకు గురవుతారు.
"మహిళ పొడవుగా ఉంటే మిగిలిన వారు ఆమెను ముప్పుగా భావించే అవకాశం ఉంది. మహిళ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తే దాన్ని దాడిగా పరిగణిస్తారు. అది సమస్యలు సృష్టిస్తుంది" అని ప్రిచార్డ్ తెలిపారు.
కెల్లీ అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయం వెల్లడయింది. మహిళలు పొట్టిగా ఉన్నప్పటికీ వారి వేతనాలేమీ పెద్దగా తగ్గవని తేలింది. సగటు పొడవుకన్నా కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ వారిని 'స్మాల్', 'పెట్టీ' అంటూ పిలుస్తారని ప్రిచార్డ్ వివరించారు.
'హైటిజం' వ్యక్తుల ప్రవర్తనను నిర్దేశిస్తుంది. తద్వారా అది పనితీరుపై ప్రభావం చూపుతుంది. "పొడవుకు, మానసిక సామర్థ్యానికి సకారాత్మక సంబంధం ఉంది. లేబర్ మార్కెట్‌లో ఇది ప్రతిఫలాన్ని ఇస్తుంది" అని కెల్లీ చెప్పారు.
అదే సమయంలో పొట్టివారు ఆత్మ గౌరవాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, ఎమోషన్స్ పరంగా స్థిరత్వాన్ని కోల్పోతున్నారా అన్నది ప్రశ్నగా మిగిలిందని ఆమె చెప్పారు. ఈ కారణంగానే వారు ప్రమోషన్లు, వేతనాలను పొందలేకపోతున్నారా అన్నది పరిశీలించాల్సి ఉందని తెలిపారు.
పాఠశాలల్లో పొడవుగా ఉండే పిల్లలకు ఆత్మ విశ్వాసం ఉంటుంది. ఉందుకంటే ఆటల్లో టీంలు ఏర్పాటు చేసే అవకాశం వారికి వస్తుంది. పొట్టివారికి ఇలాంటి పరిస్థితులు లేకపోవడంతో వారిలో ఆత్మ విశ్వాసం తక్కువగా ఉంటుంది.
పొడగరి వ్యక్తులకు మరికొన్ని విజయాలు వరిస్తాయి. అందంగా కనిపించడం, రొమాన్స్‌లోనూ వారు ముందుంటారు. అందువల్లవారిలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది.
"ఏదో దశలో వివక్ష ఉంటుంది. దీన్ని కొట్టిపారేయలేం. యజమాని వద్ద కాకపోయినా, జీవితంలోని తొలి దశల్లోనైనా ఇది కనిపిస్తుంది" అని కెల్లీ అభిప్రాయపడ్డారు.
ఎన్నో రకాల ఇజాలు
పొడవు అధారంగా వివక్ష చూపడం 'హైటిజం' అన్నది స్పష్టంగా కనిపించకపోయినా, పాతుకుపోయింది. దీన్ని ఎదుర్కోవడం సవాలుగా మారింది.
ఉద్యోగాల భర్తీ, జీతాల చెల్లింపు విషయంలో ఎలాంటి వివక్ష చూపకూడదంటూ మిషిగాన్ రాష్ట్రంలో ఎల్లియోట్ లార్సెన్ సివిల్ రైట్స్ యాక్ట్ పేరుతో సమగ్ర చట్టం ఉంది. దాని ప్రకారం ఉద్యోగాల భర్తీలో కనీస ఎత్తు ఉండాలంటూ నిబంధనలు విధించకూడదు.
చాలా కంపెనీలు ఉద్యోగుల జెండర్, రేస్ వంటి వివరాలను సేకరిస్తున్నాయని, వాటితో పాటు ఎత్తును కూడా నమోదు చేస్తే బాగుంటుందని డాక్టర్ కిమ్హీ అభిప్రాయపడ్డారు. ఆ సమాచారం ఉంటే పొట్టివారు ఏమైనా వివక్షకు గురవుతున్నారా అన్నదానిపై అధ్యయనం చేయవచ్చని చెప్పారు.
జూమ్, వీడియో సీవీల ద్వారా రిమోట్ హైరింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేస్తే వివక్ష తగ్గుతుందని ప్రిచార్డ్ అభిప్రాయపడ్డారు. ఈ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేసినప్పుడు అభ్యర్థి ముఖం, భుజాలనే చూస్తారని, మొత్తం శరీరాన్ని గమనించే వీలు లేకపోవడంతో వివక్షకు అవకాశాలు తక్కువగా ఉంటాయని అన్నారు.
ఆధునిక, పురాతన సమాజాల మధ్య ఉన్న తేడాను జాగ్రత్తగా విశ్లేషించిన అనంతరం పొడగరులను గొప్పగా కీర్తించడం మానాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత పని విధానానికి అలాంటి అర్హతలు అవసరమా అన్నదాన్ని పరిశీలించాల్సి ఉందని చెబుతున్నారు.
మార్పు అన్నది మనలోనే మొదలు కావాల్సి ఉంది. అంతర్లీనంగా ఉన్న ఆ వివక్షను సొంత దిద్దుబాటు ద్వారా ఎవరికివారు వదిలించుకోవాలి.
హైటిజంను ఎదుర్కోవడం చాలా సుదీర్ఘ ప్రయాణం లాంటింది. ప్రిచార్డ్ మాటల్లో చెప్పాలంటే "చాలా ఇజాల మాదిరిగా ఇది కూడా నిరంతరం సాగే ప్రక్రియలాగే ఉంటుంది"
ఇవి కూడా చదవండి:
- రాతి యుగంలో మనుషులు ఎలా మాట్లాడుకునేవారు? పేర్లు, వేర్వేరు తెగలు, భాషలు ఉండేవా?
- నరేంద్ర మోదీని రాజులా, యోగిలా కొలిచిన నేపాలీ హిందువులు ఇప్పుడు ఏమంటున్నారు?
- 'వీగర్ ముస్లింలపై చైనా ప్రభుత్వానిది మారణహోమం.. కళ్లుమూసుకుని కూర్చోకండి’
- ఏమిటీ ‘స్మోకింగ్ పనిష్మెంట్’ టెక్నిక్.. ఇలా చేస్తే సిగరెట్లు మానేయవచ్చా
- మీరు డార్క్ చాక్లెట్‌ను ఇష్టంగా తింటారా, అది ఆరోగ్యానికి నిజంగా మంచిదేనా?
- వేలంలో కొన్న సూట్‌కేసులు, ఇంటికి తెచ్చి చూస్తే అందులో మానవ అవశేషాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)