Amala Paul: సన్నిహితంగా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటున్నాడంటూ మాజీ ఫ్రెండ్‌పై హీరోయిన్ ఫిర్యాదు

నటి అమలాపాల్‌ను వేధిస్తున్నారన్న ఆరోపణలపై పంజాబ్‌కు చెందిన భవ్‌నిందర్ సింగ్ దత్‌ను తమిళనాడులోని విల్లుపురం పోలీసులు అరెస్ట్ చేశారు.

భవ్‌నిందర్‌తో ఒకప్పుడు తాను దిగిన ఫొటోలను ఇప్పుడు బయటపెడతానని బెదిరిస్తున్నారని.. అలాగే వ్యాపారంలోనూ మోసం చేశారని ఆరోపిస్తూ అమలాపాల్ విల్లుపురం క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

2018లో భవ్‌నిందర్ సింగ్ దత్ కుటుంబం, అమలాపాల్ కలిసి ఒక ఫిల్మ్ కంపెనీ ప్రారంభించారు. ఇందుకోసం విల్లుపురం జిల్లా కోటకుప్పం సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. అక్కడే ఉంటూ సినిమా ప్రొడక్షన్ వర్క్ చేశారు.

ఆ సమయంలో భవ్‌నిందర్ సింగ్, అమలాపాల్ సన్నిహితంగా ఉండేవారు. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనీ అప్పట్లో మీడియాలో కథనాలు వచ్చాయి.

అయితే, కొన్నాళ్లకే ఇద్దరి మధ్య మనస్పర్థలతో దూరం పెరిగింది.

అప్పట్లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని భవ్‌నిందర్ బెదిరిస్తున్నారని అమలాపాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

భవ్‌నిందర్ తనను ఆర్థికంగా మోసగించారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్థికంగా, వృత్తిపరంగా ఒత్తిడి చేసి తనకు నిద్ర లేకుండా చేశారని ఆరోపిస్తూ ఆగస్ట్ 26న ఆమె విల్లుపురం జిల్లా ఎస్పీ శ్రీనాథ్‌కు ఫిర్యాదు చేశారు.

కాగా అమలాపాల్ ఫిర్యాదుతో విల్లుపురం పోలీసులు భవ్‌నిందర్‌ను అరెస్ట్ చేశారు. అమలాపాల్ నటించిన కడావర్ చిత్రం ఇటీవలే ఆగస్ట్ 12న ఓటీటీలో విడుదలైంది.

ఈ చిత్రాన్ని అమలాపాల్, భవ్‌నిందర్ కలిసి నిర్మించారు. సినిమా కోసం ఇద్దరం డబ్బు పెట్టగా... ప్రొడక్షన్ కంపెనీ నుంచి తనను డైరెక్టర్‌గా తొలగించి నకిలీపత్రాలతో కంపెనీ ఆయనదిగా చూపిస్తున్నారని అమలాపాల్ ఆరోపించారు.

దీనిపై భవ్‌నిందర్‌ను ప్రశ్నించడంతో ఆయన తన ఫొటోలను బహిర్గతం చేస్తానంటూ బెదిరిస్తున్నారని అమల ఆరోపించారు.

ఈ వ్యవహారంపై విల్లుపురం ఎస్పీ శ్రీనాథ్ 'బీబీసీ'తో మాట్లాడుతూ... 'భవ్‌నిందర్, అమలాపాల్ కలిసి సినిమా వ్యాపారం చేశారు. ఇద్దరి మధ్య డబ్బు లావాదేవీలు ఉండేవి. ఈ క్రమంలోనే అమలాపాల్ నుంచి తీసుకున్న డబ్బు ఆయన తిరిగి ఇవ్వడం లేదని ఆమె ఆరోపిస్తున్నారు. అలాగే, సినిమా హక్కులూ తనవేనని భవ్‌నిందర్ క్లెయిమ్ చేసుకుంటున్నారని అమల ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయన కొన్ని పత్రాలను ఫోర్జరీ చేసినట్లు గుర్తించాం'' అని చెప్పారు.

లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అమలాపాల్ ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని ఎస్పీ చెప్పారు.

రెండేళ్ల కిందట ఏమైందంటే..

అమలాపాల్, భవ్‌నిందర్‌లు నిశ్చితార్థం చేసుకుంటారంటూ రెండేళ్ల కిందట కొన్ని ఫొటోలు వైరల్ కాగా అప్పట్లో ఆమె మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు.

కేసు విచారణకు తీసుకున్న కోర్టు అమలాపాల్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేయరాదని భవ్‌నిందర్‌ను ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)