You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Neha Shetty: ‘హీరోయిన్ ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలున్నాయో తెలుసుకున్నారా’ అంటూ జర్నలిస్టు ప్రశ్న, మండిపడుతున్న నెటిజన్లు
- రచయిత, ఆలమూరు సౌమ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
సినిమాలో "హీరోయిన్ చేత 16 పుట్టుమచ్చలున్నాయని చెప్పించారు కదా, రియల్‌గా తెలుసుకున్నారా ఎన్ని పుట్టుమచ్చలున్నాయో హీరోయిన్‌కి?"
ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకలో ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న ఇది.
దీనిపై ఆ సినిమా హీరోయిన్ నేహా శెట్టి మండిపడ్డారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ‘ఇదీ మన జర్నలిజం’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగింది?
సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన 'డీజే టిల్లు ' చిత్రం ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ట్రైలర్‌లో హీరోయిన్ పుట్టుమచ్చలకు సంబంధించిన డైలాగు ఒకటి ఉంది.
"ఎన్ని, మొత్తం ఎన్ని పుట్టుమచ్చలున్నాయేంది నీకు?" అని హీరో అడిగితే, "16" అని జవాబిస్తుంది హీరోయిన్.
ట్రైలర్ రిలీజ్ సందర్భంగా జరిగిన బహిరంగ వేడుకల్లో హీరో సిద్ధు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుండగా, ప్రేక్షకుల్లో కూర్చున్న సినిమా నిర్మాత, జర్నలిస్టు సురేశ్ కొండేటి మైక్ అందుకుని "హీరోయిన్ ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలున్నాయో రియల్‌గా తెలుసుకున్నారా?" అని ప్రశ్నించారు.
"ఈ ప్రశ్నకు జవాబు చెప్పదలుచుకోలేదు" (ఐ విల్ అవాయిడ్ దిస్ క్వశ్చన్) అని హీరో సిద్ధు చెప్పారు.
అనంతరం, హీరోయిన్ నేహా శెట్టి ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ సురేశ్ అడిగిన ప్రశ్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఈ రోజు జరిగిన ట్రైలర్ లాంచ్‌లో ఈ ప్రశ్న అడగడం చాలా దురదృష్టకరం. ఇది తన పట్ల, తన చుట్టూ వర్క్ ప్లేస్‌లో, ఇంట్లో ఉన్న మహిళల పట్ల ఆయనకెంత గౌరవం ఉందో తెలియజేస్తుంది" అని ఆమె ట్వీట్ చేశారు.
"సారీ నేహా, ఇది నిజంగా బాధాకరం" అంటూ ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగవంశీ ఆమె ట్వీట్ కింద కామెంట్ పెట్టారు. అయితే, అదే వేడుకలో నాగవంశీ కూడా హీరోయిన్‌పై చవకబారు కామెంట్లు చేశారని, దానికి జవాబు చెప్పాలంటూ యూజర్లు నిలదీశారు.
"ఇది నాగవంశీ గారి బయోపిక్ అయితే కాదు కదా, దాని కేరక్టరైజేషన్ అలాగే అనిపిస్తోంది" అని ఒకరు ప్రశ్నించారు.
దానికి జవాబుగా, "పర్లేదు, ఇంత అందమైన అమ్మాయిని ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే మనమే యాక్ట్ చేస్తాం. ఏమైంది, తప్పేముంది?" అంటూ జవాబిచ్చారు నాగవంశీ.
హీరోయిన్లపై కామెంట్లు కొత్తేం కాదు
ఇంటర్వ్యూలలో, పబ్లిక్‌గా జరిగే సినిమా వేడుకల్లో జర్నలిస్టులు ఇలాంటి ప్రశ్నలు వేయడం కొత్తేం కాదు.
గత ఏడాది డిసెంబర్‌లో నాని, సాయి పల్లవి, కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదలైంది. దానికి ముందు ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా బృందం పలు ఇంటర్వ్యూలలో పాల్గొంది.
ఆ సినిమాలో నాని, కృతిలకు మధ్య ఉన్న ముద్దు సీన్ల గురించి ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నపై హీరోయిన్ సాయి పల్లవి విరుచుకుపడ్డారు.
సినిమాలో శృంగారభరితమైన సన్నివేశాల్లో నటించడానికి ఇబ్బందిపడ్డారా అని నాని, కృతిలను అడిగారు ఆ జర్నలిస్టు.
దానికి సాయి పల్లవి సమాధానం చెప్తూ, "సినిమాలో ఒక మూడ్ ఉంటుంది. ఆ సన్నివేశాలు ఆ పాత్రల మధ్య చిత్రీకరిస్తారు. వాటి గురించి ముందే చర్చించుకుని అందరినీ ఒక కంఫర్టబుల్ జోన్‌లో పెట్టి చిత్రీకరించిన సన్నివేశాలవి. ఇక్కడ మీ ముందు నాని, కృతి అనే ఇద్దరు స్వతంత్ర వ్యక్తులు కూర్చున్నారు. వీరిని అలాంటి ప్రశ్న అడగడం సమంజసం కాదు" అని అన్నారు.
'హీరోలను అలాంటి ప్రశ్నలు ఎందుకు అడగరు?'
రంగస్థలం సినిమాలో రాంచరణ్, సమంతకు మధ్య ఉన్న ముద్దు సీను గురించి చర్చ జరిగిన విషయం తెలిసిందే.
ఆ సినిమా విడుదలకు ముందే సమంతకు, నాగ చైతన్యతో వివాహం జరిగింది. పెళ్లయిన తరువాత లిప్‌లాక్ సీన్లలో ఎలా నటించగలరంటూ సమంతపై విమర్శలు వెల్లువెత్తాయి.
"రాం చరణ్‌కు కూడా పెళ్లయింది కదా. మరి, ఆయన్ను ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడగరు?" అంటూ సమంత ఘాటుగా స్పందించారు.
సోషల్ మీడియాలో చర్చ
తాజాగా నేహా శెట్టి పుట్టుమచ్చలపై ప్రశ్న వివాదంలో, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. జర్నలిజం విలువలు పడిపోతున్నాయంటూ నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.
"ఇదీ మన జర్నలిజం" అంటూ SaRath_Tweetss అనే యూజర్ ట్వీట్ చేశారు.
"ఇలాంటి ప్రశ్నలను కచ్చితంగా ఖండించాల్సిందే. మరో మార్గం లేదు. ఆ ప్రశ్నకు సిద్ధు ఎంతో హుందాగా, పరిణితితో సమాధానమిచ్చారు. అందుకు ఆయన్ను మెచ్చుకోవాలి. ప్రశ్న అడిగిన ఆ జర్నలిస్టును అక్కడే ఎవరైనా నిలదీసి ఉండాల్సింది" అంటూ కుమార్_3699 అనే యూజర్ నేహా ట్వీట్‌కు కామెంట్ పెట్టారు.
"ఇలాంటి వాళ్లందరూ భారతదేశంలో జర్నలిస్టులు అవుతున్నారు. ఇది మన కర్మ" అంటూ VARUNP007 అనే యూజర్ వ్యాఖ్యానించారు.
కాగా, నేహా శెట్టిని ట్యాగ్ చేస్తూ జరిగిన దానికి ట్విటర్ ముఖంగా క్షమాపణలు కోరారు సురేశ్ కొండేటి.
"మిమ్మల్ని అవమానించడమో, ఇబ్బంది పెట్టడమో నా ఉద్దేశం కాదు. మిమ్మల్ని బాధపెట్టినందుకు క్షమాపణలు కోరుతున్నాను" అంటూ సురేశ్ ట్వీట్ చేశారు.
‘జర్నలిస్టులకు సెన్సిటైజేషన్ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది’
సమాజంలో ఉన్న భావాలే జర్నలిస్టుల్లోనూ ప్రతిబింబిస్తున్నాయని స్త్రీవాద రచయిత, భూమిక జాల పత్రిక సంపాదకులు కొండవీటి సత్యవతి అన్నారు.
"గతంలో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ఆడియో ఫంక్షన్‌లో సీనియర్ నటుడు చలపతి రావు 'అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారని' అసభ్యకరమైన కామెంట్ చేశారు. దానిపై మేం కోర్టు మెట్లు ఎక్కాం. కానీ, ఆయన పశ్చాత్తాపడుతున్నారంటూ మాకు అనేక రికమండేషన్లు రావడంతో, ఆయనకు ఒక వార్నింగ్ ఇప్పించి కేసు వెనక్కు తీసుకున్నాం" అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
"మన సమాజంలో పితృస్వామ్య భావాలు పాతుకుపోయాయి. జర్నలిస్టులు కూడా మన సమాజంలో భాగమే కదా. జర్నలిస్టుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే.. మహిళా ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లి, మీరు వృత్తిని, కుటుంబాన్ని ఎలా బ్యాలన్స్ చేస్తున్నారు, వంట ఎలా చేస్తారు, పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు లాంటి పనికిమాలిన ప్రశ్నలడుగుతారు. పురుషులను మాత్రం అలాంటి ప్రశ్నలడగరు. మహిళల పట్ల సహానుభూతి (సెన్సిటివిటీ) లేకపోవడమనేది అందరిలోనూ ఉంది, జర్నలిస్టుల్లోనూ ఉంది" అని ఆమె అన్నారు.
జర్నలిస్టుల్లో అలాంటి సెన్సిటివిటీ రావడానికి, వారికి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని సత్యవతి అభిప్రాయపడ్డారు.
"ప్రెస్ అకాడమీ జర్నలిస్టుల కోసం అలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. వాళ్లని సెన్సిటైజ్ చేసే ప్రోగ్రాంలు అందించాలి. జర్నలిస్టులు ఎలాంటి భాష వాడాలి, ఎవరిని, ఎలాంటి ప్రశ్నలడగాలి వంటి విషయాల్లో ట్రైనింగ్ ఇవ్వాలి.
మేం చాలాసార్లు ప్రెస్ అకాడమీకి ఈ అంశంపై ప్రపోజల్స్ ఇచ్చాం. ఒక గంట, రెండు గంటలు జర్నలిస్టులకి ఈ విషయాలపై ట్రైనింగ్ ఇస్తాం అని నేను, కొండెపూడి నిర్మల ప్రతిపాదించాం. రెండు, మూడు సార్లు ఈ ప్రతిపాదన తీసుకొచ్చాం. కానీ, అవేమీ కార్యరూపం దాల్చలేదు. వ్యవస్థలోనే పితృస్వామ్య భావజాలం పాతుకుపోయి ఉన్నప్పుడు, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి ఎవరూ ముందుకు రారు" అని సత్యవతి అన్నారు.
సమాజంలో జర్నలిస్టులు చాలా ముఖ్య పాత్ర పోషిస్తారని, వారు ఏ వైపూ మొగ్గకుండా వార్తలను అందించడం, సహానుభూతిని కలిగి ఉండడం కీలకమని ఆమె అన్నారు.
"గతంలో ఒక సంఘటన జరిగింది.. ఒకామె భర్త ఆరోగ్యం బాగోలేకపోతే ఒక పెద్ద ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె భర్త బతకడం కష్టమని డాక్టర్లు చెప్పేశారు. ఆ మాట విన్నాక, ఆమె ఆ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
అప్పుడు జర్నలిస్టులు ఎలాంటి కథనాలు రాశారంటే.. 'ఆమె పునిస్త్రీగా పోవాలని కోరుకున్నారు', 'సౌభాగ్యవతిగా భర్త కళ్ల ముందే తాను చనిపోవాలని బలంగా కోరుకున్నారు, అందుకే భవనం పైనుంచి దూకేశారు' అంటూ వార్తలు నింపేశారు.
ఆమెకు ఎలాంటి ఆర్థిక కష్టాలు ఉన్నాయి, లేదా ఇంకేమైనా సమస్యలున్నాయా అనేవాటిపై దృష్టి పెట్టలేదు. ఇంత ఘోరంగా ఆలోచిస్తారు వీళ్లు. ఇది మారాలంటే వారికి ట్రైనింగ్ ఇవాల్సిన అవసరం ఉంది" అని సత్యవతి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘బెల్లి డాన్స్’: ఈ పదం నాకు అస్సలు నచ్చదు
- పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగుల 'చలో విజయవాడ': జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన
- క్రిప్టో కరెన్సీ ఆదాయంపై 30శాతం పన్ను.. బిట్‌కాయిన్ లీగల్ అయినట్లేనా?
- గుంటూరు జిన్నా టవర్: ఆకుపచ్చగా ఉన్న ఈ టవర్‌కి భారత్ జెండా రంగులు ఎవరు., ఎందుకు వేశారు?
- ఒమిక్రాన్ BA.2: ఈ వేరియంట్ గురించి మనం ఆందోళన చెందాలా, లేదా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)