NCRB రిపోర్ట్: భారతదేశంలో పిల్లలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, ఎందుకు?

    • రచయిత, రాఘవేంద్ర రావ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతదేశంలో 2021 సంవత్సరంలో మైనర్లపై అత్యాచార ఘటనలు అమాంతం పెరిగాయి.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తాజా నివేదిక ప్రకారం, 2021లో 18 ఏళ్లు పైబడిన మహిళలపై అత్యాచారాలకు సంబంధించి మొత్తం 28,644 కేసులు నమోదయ్యాయి. మైనర్లపై 36,069 అత్యాచార కేసులు నమోదయ్యాయి.

ఈ 36,069 కేసుల్లో ఎక్కువ భాగం పోక్సో చట్టం కింద నమోదైనవే. లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే చట్టమే పోక్సో. మిగిలినవి భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల క్రింద నమోదయ్యాయి.

18 ఏళ్లు దాటిన మహిళలపై అత్యాచారాల ఘటనలతో పోలిస్తే, మైనర్లపై అత్యాచారాలు క్రమంగా పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి (గ్రాఫ్ చూడండి).

మైనర్లపై పెరుగుతున్న అత్యాచారాల కేసులను ఎలా చూడాలి?

ఎన్‌సీఆర్‌బీ నివేదికలో డేటా గురించి ఒక హెచ్చరిక ఉంది. గణాంకాలు పెరుగుతున్న నేరాల ధోరణిని సూచిస్తాయి గానీ, పోలీసు వ్యవస్థ ప్రభావవంతంగా పనిచేయట్లేదని కాదు అంటూ ఒక సూచన రాశారు.

న్యాయవాది అనంత్ అస్థానా బాలల హక్కులకు సంబంధించిన కేసులను డీల్ చేస్తారు.

మైనర్ల అత్యాచార ఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయంటే దానర్థం పోక్సో చట్టం బాగా అమలవుతోందని.

లైంగిక వేధింపులు, అశ్లీలతకు సంబంధించిన నేరాల నుంచి పిల్లలను రక్షించడానికి 2012లో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ (POCSO)ను రూపొందించారు.

ఈ చట్టం ప్రకారం, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిని 'పిల్లలు ' గా పరిగణిస్తారు. పిల్లలపై నేరాలకు కఠిన శిక్ష విధించే నిబంధనలను ఇందులో పొందుపరిచారు. ఈ చట్టంలో జెండర్ వ్యత్యాసం లేదు. బాలికలు, బాలురు.. ఇద్దరిపై జరిగే లైంగిక వేధింపులను పరిగణిస్తుంది.

పోక్సో చట్టం రాక ముందు, మైనర్లపై అత్యాచారాల కేసులను ఐపీసీ సెక్షన్ 376 కింద నమోదు చేసేవారు.

"సుప్రీంకోర్టు, హైకోర్టులు గత అయిదేళ్లల్లో జ్యుడీషల్, పరిపాలనా స్థాయిలలో ఈ చట్టాన్ని అమలు చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాయి. దానివల్ల నమోదవుతున్న కేసుల సంఖ్య పెరిగింది. అంటే, గతంలో కొన్ని కేసులు నమోదయ్యేవి, కొన్ని రిపోర్ట్ అయ్యేవి కావు. ఇప్పుడు చాలా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. దీనికి కారణం వ్యవస్థ గతంలో కంటే మెరుగ్గా పనిచెయడం, సమాజంలో చైతన్యం పెరగడం. కొన్నేళ్లకు ముందు ప్రజలకు పోక్సో చట్టం ఉందని కూడా తెలీదు. అనేక స్వచ్ఛంద సంస్థలు పోక్సో చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రచారాలను చేపట్టాయి. పోలీసుల వద్దకు వెళితే న్యాయం జరుగుతుందన్న విశ్వాసాన్ని కలిగించేదుకు ప్రయత్నించాయి" అని లాయర్ అనంత్ అస్థానా చెప్పారు.

పోర్నోగ్రఫీ, సులువుగా ఇంటర్నెట్, డాటా లభించడంపై ఆందోళనలు

భారతి అలీ ఒక సామాజిక కార్యకర్త, హక్ సెంటర్ ఫర్ చైల్డ్ రైట్స్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు.

"కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందంటే ఎక్కువగా నమోదవడం కారణమనో లేదా ఘటనలు పెరిగాయనో.. ఒక్క కారణం చెప్పడం సరి కాదు. ఈ రెండూ జరిగి ఉండవచ్చు" అని భారతి అభిప్రాయపడ్డారు.

దీనిలో అనేక కోణాలు ఉన్నాయని, పిల్లలకు ఇంటర్నెట్, ఆన్‌లైన్ వేదికలు సులువుగా అందుబాటులో ఉండడం వలన, అవి దుర్వినియోగం అయ్యే భయం కూడా ఉందని అన్నారు.

"పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ ఉండడం, వాళ్లు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపించడం లేదా వచ్చే రిక్వెస్టులను అంగీకరించడం.. వీటన్నిట్లో చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్లు సందేహాస్పదమైన కంటెంట్, సంబంధాలలోకి దిగుతారు. అది ఆన్‌లైన్‌లో ప్రారంభమై ప్రమాదాల వైపు నెడుతుంది" అని వివరించారు భారతి.

చైల్డ్ పోర్నోగ్రఫీ ఒక ముఖ్యమైన సమస్య అని, కోవిడ్ 19 మహమ్మారి సమయంలో ఇలాంటి సంఘటనలు బాగా పెరిగాయని ఆమె అన్నారు.

"మహమ్మారి సమయంలో చాలా మంది ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు కాబట్టి పిల్లలపై లైంగిక వేధింపులు తగ్గాయనుకుంటాం. కానీ, అది నిజం కాదు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా లైంగిక హింసకు గురయ్యారు. దగ్గర బంధువులు లేదా సన్నిహితులు, తరచుగా సొంత కుటుంబాల నుంచి వ్యక్తులే పిల్లలపై అత్యాచారాలకు పాల్పడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి" అని భారతి చెప్పారు.

కన్సెంట్ వయసు పెంచడానికి కారణం?

పోక్సో చట్టం 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిని పిల్లలుగా పరిగణిస్తుంది కాబట్టి, ఈ చట్టంలో సమ్మతి (కన్సెంట్) వయసును 16 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు పెంచారు.

పోక్సో చట్టం కింద నమోదవుతున్న అత్యాచార కేసుల సంఖ్య పెరగడానికి ఇదీ ఓ కారణమని భారతీ అలీ అన్నారు.

"కన్సెంట్ వయసు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్ప్పిన తరువాత, భారతదేశంలో బాల్య వివాహాల కేసులు కూడా పోక్సో చట్టం కింద నమోదవుతున్నాయి. నేటి కాలంలో యువత కన్సెంట్‌తో లైంగిక సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు. కానీ, చాలా సందర్భాల్లో వారి తల్లిదండ్రులు వారి ప్రేమ వ్యవహరాన్ని తప్పుగా భావించి రిపోర్ట్ చేస్తున్నారు. దానివల్ల కూదా పిల్లలపై లైంగిక వేధింపుల కేసులు పెరుగుతాయి. పోక్సో కోర్టులో 25 నుంచి 30 శాతం కేసులు రొమాంటిక్ సంబంధాలవే. ఇప్పుడు బాల్య వివాహాలు కూడా జతయ్యాయి" అని ఆమె చెప్పారు.

చైల్డ్ రేప్ కేసుల్లో కొన్నింటిని పోక్సో కింద ఎందుకు నమోదు చేయట్లేదు?

మైనర్లపై అత్యాచారం కేసులు పోక్సో చట్టం కింద నమోదవుతున్నాయి. కానీ, ఐపీసీ సెక్షన్ 376 కింద కూడా అలాంటి కేసులు నమోదు అవుతున్నాయని డాటా చెబుతోంది.

2021లో పిల్లలపై మొత్తం 36,069 అత్యాచారం కేసులు నమోదైతే, 33,036 కేసులు పోక్సో కింద, మిగిలిన 3,033 కేసులు ఐపీసీ సెక్షన్ 376 కింద నమోదయ్యాయి.

ఇలా ఎందుకు జరుగుతోంది? అన్నీ పోక్సో కిందే ఎందుకు నమోదవ్వట్లేదు?

ఎన్‌సీఆర్‌బీ మాజీ డైరెక్టర్ శారదా ప్రసాద్ దీని గురించి వివరించారు.

"పోక్సో చట్టం గురించి సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. పోక్సో కింద నమోదు చేస్తే కేసులో బలం పెరుగుతుందని చాలామందికి తెలీదు. అయితే, ఐపీసీ సెక్షన్ 376 కింద మైనర్లపై అత్యాచారం కేసులు నమోదు చేయడంలో ఎలాంటి అడ్డంకి లేదు. పోలీస్ స్టేషన్‌లో ఎవరు ఫిర్యాదు చేస్తారన్నది చూడాలి. పోక్సో కింద కేసు బలపడుతుంది. కాబట్టి, కొంతమంది పోక్సో కింద కేసు నమోదు చేయాలని ఒత్తిడి చేస్తారు. కొందరు వద్దని, ఐపీసీ సెక్షన్ కింద కేసు దాఖలు చేయమని పట్టు పడతారు" అని ఆయన చెప్పారు.

లాయర్ అనంత్ అస్థానా కూడా శారదా ప్రసాద్‌తో ఏకీభవిస్తున్నారు.

"ఇంతకుముందు పోక్సో చట్టంలో మరణశిక్ష లేదు. ఇప్పుడు ఉంది. పోక్సో లెక్కల్లో, జీవిత ఖైదు అంటే చనిపోయేవరకు జైల్లో ఉండడం. వాళ్లు ఎప్పటికీ బయటకు రారు. అందుకే కొంతమంది పోక్సో చట్టం కింద కేసు వద్దని కూడా చెబుతుంటారు. ఇందులో బెయిల్ రావడం కూడా చాలా కష్టం. వాంగ్మూలాలు తీసుకునేవరకు, తప్పుగా ఫిర్యాదు చేశారని జడ్జి అనుకుంటే తప్ప బెయిల్ మాటే రాదు" అని అనంత్ చెప్పారు.

పోలీసుల విశ్వసనీయతపై సందేహాలు

అనూజా కపూర్ ఒక న్యాయవాది, క్రిమినల్ సైకాలజిస్ట్.

మైనర్‌పై అత్యాచారం జరిగి, పోక్సో చట్టం కింద కేసు నమోదుచేయకపోతే పోలీసుల విశ్వసనీయతపై సందేహాలు వస్తాయని న్యాయవాది, క్రిమినల్ సైకాలజిస్ట్ అనూజా కపూర్ అన్నారు.

"పిల్లలపై అత్యాచారం జరిగితే తప్పకుండా పోక్సో కిందే కేసు నమోదు చేయాలన్న అవగాహన పోలీసులకు ఉండాలి. కానీ, చాలా పోలీస్ స్టేషన్లలో పోలీసులకు ఈ విషయంలో అవగాహన లేదు. వాళ్లు ఐపీసీ సెక్షన్ 376 కింద కేసులు నమోదు చేస్తుంటారు. చాలాసార్లు పోక్సో కింద కేసు నమోదు చేయనందుకు కోర్టులో జడ్జి చేత చీవాట్లు తింటారు కూడా. పోలీసులకు ముందు సరైన అవగాహన ఉండాలి" అని అనూజా కపూర్ అన్నారు.

పోక్సో చట్టాన్ని అమలు చేయడంలో పోలీసుల పాత్ర చాలా ముఖ్యమని అనంత్ అస్థానా కూడా అభిప్రాయపడ్డారు.

"బాధితురాలు మైనర్ అని చెబితే పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేస్తారు. కాదు అని చెప్తే ఐపీసీ సెక్షన్ కింద కేసు దాఖలు చేస్తారు. కోర్టులో విచారణ తరువాత, బాధితురాలు మైనర్ అని నిరూపణ అయితే అప్పుడు పోక్సో జతచేస్తారు" అని అనంత్ వివరించారు.

తాజా గణాంకాలు ఇంకేం చెబుతున్నాయి?

మధ్యప్రదేశ్ (3,512 కేసులు), మహారాష్ట్ర (3,480 కేసులు), తమిళనాడు (3,435 కేసులు), ఉత్తరప్రదేశ్ (2,747 కేసులు), కర్ణాటక (2,090 కేసులు), గుజరాత్ (2,060 కేసులు) రాష్ట్రాల్లో పోక్సో కింద నమోదైన కేసులు అత్యధికంగా ఉన్నాయి.

పోక్సో చట్టం కింద ఒక్క అత్యాచారం కేసు కూడా నమోదు కాని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి. గోవా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్, లద్దాఖ్‌లలో ఒక్క పోక్సో కేసు కూడా నమోదు కాలేదు.

అయితే, ఈ రాష్ట్రాలలో ఐపీసీ సెక్షన్ 376 కింద అనేక అత్యాచార కేసులు నమోదయ్యాయి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాజస్థాన్‌లో పోక్సో కేసు ఒక్కటీ లేదుగానీ ఐపీసీ సెక్షన్ 376 కింద నమోదైన కేసులు (6,337) అత్యధికంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)