యుక్రెయిన్ సంక్షోభం: రష్యాకు చైనా సైనికంగా, ఆర్థికంగా ఎలాంటి సాయం చేయగలదు

యుక్రెయిన్‌లో యుద్ధం తీవ్రమవటంతో పాటు.. అంతర్జాతీయ ఆర్థిక ఆంక్షలు ఇబ్బంది పెడుతుండటంతో రష్యా ఇప్పుడు మిత్రపక్షాల కోసం వెదుకుతోంది.

యుక్రెయిన్ సంక్షోభం నుంచి చైనా దౌత్యపరంగా దూరంగా ఉంటోంది. రష్యా సైనికదాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి చేసిన తీర్మానంపై ఓటు వేయకుండా పక్కకు తప్పుకుంది.

ఒకవేళ రష్యాకు సాయం చేయాలని చైనా నిర్ణయించుకున్నట్లయితే.. సైనికంగా, ఆర్థికంగా చైనా ఎంత మేరకు సాయం చేయగలదు?

చైనా డ్రోన్ల మీద రష్యా ఆసక్తి

యుక్రెయిన్ మీద తన దండయాత్రకు మద్దతుగా సైనిక పరికరాలను అందించాలని చైనాను రష్యా కోరినట్లు అమెరికా అధికారులను ఉటంకిస్తూ మీడియాలో కథనాలు వచ్చాయి.

ఇది నిజంకాదని, ఆ కథనాలు తప్పుడు ప్రచారంలో భాగమని చైనా అంటోంది.

నిజానికి చైనా తన సాయుధ బలగాలను ఆధునికీకరించటానికి ఇటీవలి కాలంలో రష్యా సైనిక పరికరాల మీదే భారీగా ఆధారపడింది.

1989 తియానాన్మెన్ స్క్వేర్ ఘటన నేపథ్యంలో చైనాకు ఆయుధాల సరఫరా మీద అమెరికా, యూరప్ దేశాలు నిషేధం విధించటంతో చైనా మిలటరీ ఆధునికీకరణ అవసరాల కోసం రష్యా వైపు చూడాల్సి వచ్చింది.

2017 నుంచి 2021 మధ్య చైనా దిగుమతి చేసుకున్న మొత్తం ఆయుధాల్లో దాదాపు 80 శాతం రష్యా నుంచే తెచ్చుకుందని ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) గణాంకాలు చెప్తున్నాయి.

అలాగే.. రష్యా నుంచి అత్యధికంగా ఆయుధాలు కొంటున్న దేశాల్లో చైనాది రెండో స్థానం. రష్యా నుంచి ఎగుమతయ్యే ఆయుధాల్లో 21 శాతం చైనా కొనుగోలు చేస్తోంది.

అయితే చైనా తన ఆయుధ ఉత్పత్తి సామర్థ్యాలను క్రమంగా విస్తరించుకుంటోంది. ఇప్పుడు ఆయుధాల ఎగుమతుల్లో చైనా నాలుగో స్థానంలో నిలిచింది.

‘‘చైనా ఆయుధాలు ఇప్పుడు మరింత ఆధునికమవుతున్నాయి. ఉదాహరణకు చైనా డ్రోన్ల మీద రష్యా చాలా ఆసక్తి చూపిస్తుండవచ్చు’’ అని సిప్రి ప్రతినిధి సీమోన్ వీజ్‌మన్ పేర్కొన్నారు.

కానీ చైనా డ్రోన్లను రష్యా కొనుగోలు చేసినట్లు ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలూ కనిపించలేదని ఆయన చెప్పారు.

రష్యా నుంచే కాదు, యుక్రెయిన్ నుంచి కూడా ఆయుధాలను కొనుగోలు చేస్తోంది చైనా. సిప్రి లెక్కల ప్రకారం.. యుక్రెయిన్ ఆయుధ ఎగుమతుల్లో దాదాపు 40 శాతం (2017-2021) చైనాకే వెళుతున్నాయి.

రష్యాకు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి

రష్యా, చైనాల మధ్య వాణిజ్యం ఇటీవలి సంవత్సరాల్లో స్థిరంగా పెరుగుతోంది.

2021 సంవత్సరంలో రష్యా మొత్తం వాణిజ్యంలో చైనా వాటా దాదాపు 18 శాతం - సుమారు 14,700 కోట్ల డాలర్లుగా ఉంది.

వింటర్ ఒలింపిక్స్ కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫిబ్రవరిలో బీజింగ్‌లో పర్యటించినపుడు.. తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2024 కల్లా 25,000 కోట్లకు పెంచుతామని రెండు దేశాలూ ప్రకటించాయి.

చైనా ఎక్కువగా గోధుమలు, బార్లీ వంటి ధాన్యాలను దిగుమతి చేసుకుంటుంది. వాటిని ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో రష్యా ఒకటి. కాబట్టి రష్యా నుంచి ఎక్కువగా చైనా ఈ ధాన్యాలను దిగుమతి చేసుకుంటోంది.

అయితే.. జబ్బుల ఆందోళనలు ఉండటం వల్ల రష్యా నుంచి గోధుమలు, బార్లీ దిగుమతులపై చైనా ఇటీవలి వరకూ పరిమితులు విధించింది. కానీ.. యుక్రెయిన్ మీద రష్యా దాడి మొదలైన రోజునే ఈ పరిమితులను చైనా ఎత్తేసింది.

ఇదిలావుంటే.. అనేక దేశాల సమాహారమైన యూరోపియన్ యూనియన్ రష్యాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2021లో ఈయూ, రష్యాల మధ్య జరిగిన మొత్తం వాణిజ్యం.. చైనా, రష్యాల మధ్య వాణిజ్యం కన్నా దాదాపు రెట్టింపు స్థాయిలో ఉంది.

అది ఇప్పుడు మారటం మొదలుకావచ్చు.

‘‘ఆంక్షల నేపథ్యంలో ఈయూ-రష్యా వాణిజ్యం సన్నగిల్లటం తప్పదు. ప్రస్తుత సంక్షోభం.. ఈయూలో అంతర్గతంగా తమ దిగుమతులకు బహుముఖ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం మీద మరింత దృష్టి కేంద్రీకరించేలా చేసింది’’ అని వాణిజ్య ఆర్థికవేత్త డాక్టర్ రెబెకా హార్డింగ్.

రష్యా నుంచి చైనా మరింత ఎక్కువ ఇంధనం కొనగలదా?

రష్యా ఉత్పత్తి చేసే చమురు, గ్యాస్, బొగ్గులకు ప్రపంచంలోని అతి పెద్ద మార్కెట్లలో చైనా ఒకటి.

యుక్రెయిన్ మీద రష్యా దండయాత్రకు కేవలం వారం రోజుల ముందు.. రష్యా నుంచి 2,000 కోట్ల డాలర్లకు పైగా విలువైన బొగ్గును చైనా కొనుగోలు చేసేలా కొత్తగా ఒప్పందం కుదిరింది.

అలాగే.. చైనాకు రష్యా చమురు, గ్యాస్ సరఫరా చేయటానికి సంబంధించి దాదాపు 11,750 కోట్ల డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను కూడా పుతిన్ ఇటీవల ప్రకటించారు.

అయితే.. ఇప్పటివరకూ రష్యా నుంచి ఇంధనాలను కొనుగోలు చేసే అతి పెద్ద మార్కెట్ ఈయూగానే ఉంది. ఈయూ దేశాలు ఉపయోగించే గ్యాస్‌లో 40 శాతం, చమురులో 26 శాతం రష్యానే సరఫరా చేస్తోంది.

‘‘చైనాకు రష్యా నుంచి చమురు, గ్యాస్ ఎగుమతులు గత ఐదేళ్లుగా ఏటా 9 శాతం చొప్పున పెరుగుతున్నాయి. ఇది చాలా వేగవంతమైన పెరుగుదలే. అయినాసరే.. రష్యా చమురుకు ఈయూ మార్కెట్‌తో పోలిస్తే చైనా మార్కెట్ సగమే ఉంటుంది’’ అని వివరించారు డాక్టర్ హార్డింగ్.

రష్యా, చైనా వాణిజ్యానికి ఆంక్షల దెబ్బ

రష్యాతో ‘సాధారణ వాణిజ్య సహకారం’ కొనసాగిస్తానని చైనా చెప్తోంది.

అయితే.. స్విఫ్ట్ ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్ నుంచి కొన్ని రష్యా బ్యాంకులను నిషేధించటంతో దీనికి సమస్యలు ఎదురయ్యాయి. ఇతర ప్రాంతాల కంపెనీల లాగానే.. చైనాలోని కంపెనీలు కూడా ఇప్పటికే రష్యా నుంచి కొనుగోళ్లను తగ్గించేశాయి. వాణిజ్య సంస్థలు నిధులు సమకూర్చటం కష్టం కావటం దీనికి కారణం.

చైనా, రష్యాలు రెండు ఇటీవలి సంవత్సరాల్లో ప్రత్యామ్నాయ చెల్లింపు పద్ధతుల వైపు వెళ్లటానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.

రష్యాకు తన సొంత ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఫైనాన్షియల్ మెసేజెస్ (ఎస్‌టీఎఫ్ఎమ్) ఉండగా, చైనాకు తనదైన క్రాస్-బోర్డర్ ఇంటర్‌బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ (సీఐపీఎస్) ఉంది. ఈ రెండు వ్యవస్థలూ తమ తమ దేశాల కరెన్సీల్లో పనిచేస్తాయి. కానీ.. అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థలో ఆర్థిక లావాదేవాలల్లో స్విఫ్ట్‌ పైచేయి కొనసాగుతోంది.

ప్రస్తుతం రష్యా, చైనాల మధ్య వాణిజ్యంలో కేవలం 17 శాతం (2014లో ఇది కేవలం 3.1 శాతంగా ఉండేది) మాత్రమే చైనా కరెన్సీ యువాన్‌లో జరుగుతోందని రష్యా అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ మీడియా కథనాలు చెప్తున్నాయి.

ఇరు దేశాల మధ్య ఇంధన వాణిజ్యం ఇప్పటికే ప్రధానంగా అమెరికా డాలర్లలోనే సాగుతోంది.

రష్యా నుంచి గ్యాస్ అధికంగా దిగుమతి చేసుకునే జర్మనీ.. యుక్రెయిన్ మీద రష్యా దండయాత్రకు ప్రతిస్పందనగా నార్డ్ స్ట్రీమ్ 2 గ్యాస్ పైప్‌లైన్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

రష్యా, చైనాల మధ్య గ్యాస్ సరఫరా కోసం చేపట్టిన కొత్త పైప్‌లైన్ (పవర్ ఆఫ్ సైబీరియా 2) సామర్థ్యం.. నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్‌తో పోలిస్తే కేవలం ఐదో వంతు మాత్రమే ఉంటుందని ఒక విశ్లేషణ చెప్తోంది.

సైబీరియా నుంచి వెళ్లే ఈ కొత్త పైప్‌లైన్ ఎప్పటికి ప్రారంభమవుతుందో కూడా స్పష్టత లేదు.

గ్రీన్‌హౌస్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను చేరుకోవటానికి.. చైనా దీర్ఘకాలంలో రష్యా నుంచి గ్యాస్ దిగుమతులను పెంచుకోవటానికి, బొగ్గు మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవటానికి ప్రయత్నించవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)