You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కజకిస్తాన్‌లో అల్లర్లు ఎందుకు చెలరేగాయి, రష్యా ఎందుకు రంగంలోకి దిగింది?
కజకిస్తాన్ ఇప్పుడు అల్లర్లతో అట్టుడుకుతోంది. మైనస్ డిగ్రీల టెంపరేచర్‌లలో కూడా మధ్యాసియాలోని ఈ మాజీ సోవియట్ దేశం నిరసనలతో రగిలిపోతోంది.
ఈ పరిస్థితుల్లో ఆ దేశం రష్యా సైనిక సహాయాన్ని కోరడంపై అమెరికా విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటొని బ్లింకెన్, కజకిస్తాన్ ప్రభుత్వం సొంతంగా తన సమస్యలను పరిష్కరించుకోగలదని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనకారులు కనిపిస్తే, ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే కాల్పుు జరపాలని భద్రతా బలగాలను ఆదేశించారు ఆ దేశాధ్యక్షుడు కసీమ్ జోమార్ట్ టోకయేవ్.
దేశ ప్రధాన నగరం అల్మాటీలో చెలరేగిన అల్లర్లను అణచివేసే ప్రయత్నంలో 26 మంది ప్రదర్శనకారులను కాల్చి చంపామని ప్రభుత్వ బలగాలు చెబుతున్నాయి. మరోవైపు 18 మంది భద్రతా అధికారులు కూడా ఈ ఘర్షణల్లో చనిపోయారని, వందల మంది గాయపడ్డారని అంటున్నారు.
ఈ ఘర్షణలు మొదలవడానికి కారణం - ఇంధన ధరల పెంపు. ఎల్‌పీజీ ధరలపై సబ్సిడీని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వాటి ధరలు రెండింతలయ్యాయి. దాంతో ప్రజలు వీధుల్లోకి వచ్చారు.
కజక్ ప్రజాగ్రహానికి తక్షణ కారణం ఇదే అయినా, లోతైన అసలు కారణాలు వేరే ఉన్నాయి. అవేంటో తెలుసునే ప్రయత్నం చేద్దాం.
కజకిస్తాన్ ఎక్కడుంది? ఈ దేశం ప్రత్యేకతలేంటి?
కజకిస్తాన్ చాలా పెద్ద దేశం. మధ్య ఆసియాలో ఉండే ఈ దేశం వైశాల్యం... పశ్చిమ యూరప్ అంత ఉంటుంది. రష్యా, చైనాలు దీనికి పొరుగు దేశాలు.
ఎక్కువ భాగం ఎత్తయిన పర్వతాలతో, స్టెప్పీలని పిలిచే విశాలమైన గడ్డి మైదానాలతో నిండి ఉండే ఈ దేశ జనాభా కోటి 9 లక్షలు మాత్రమే.
మునుపటి సోవియట్ యూనియన్ నుంచి 1991లో విడిపోయాక కజకిస్తాన్ ఓ స్వతంత్ర దేశంగా అవతరించింది.
ప్రపంచంలో చమురు నిల్వలు భారీగా ఉన్న కొద్ది దేశాల్లో కజకిస్తాన్ ఒకటి. ఇది రోజూ 16 లక్షల బ్యారెల్స్ చమురును ఉత్పత్తి చేస్తుంది. దాంతో ఈ దేశం బిలియన్ల డాలర్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించగలిగింది.
అయితే, దేశంలో ఇంత విలువైన సంపద ఉన్నప్పటికీ దాని ఫలాలు కింది వరకూ చేరలేదు. దాంతో ఇక్కడ తలసరి సగటు ఆదాయం ఏడాదికి 3,385 డాలర్లు అంటే, 2,51,750 రూపాయలకన్నా తక్కువగానే ఉంది.
సోవియట్ యూనియన్ నుంచి విడిపోయాక ఈ దేశాన్ని ప్రెసిడెంట్ నూర్‌సుల్తాన్ నజర్బయేవ్ 18 ఏళ్ల పాటు పాలించారు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో మాజీ మెంబర్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయనకు బలమైన సంబంధాలున్నాయి.
అస్తానాలో కొత్త రాజధానిని నిర్మించిన నజర్బయేవ్... దానికి తన గౌరవార్థం నూర్-సుల్తాన్ అని పేరు కూడా పెట్టుకున్నారు. 2019లో ఆయన గద్దె దిగటంతో ప్రస్తుత అధ్యక్షుడు కసీమ్ జోమార్ట్ టోకయేవ్ అధికారం చేపట్టారు.
ఈ దేశంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించడం చట్టవిరుద్ధం. గతంలో ఎప్పుడు నిరసన ప్రదర్శనలు జరిగినా వాటిని ఆ దేశ భద్రతా బలగాలు చాలా కఠినంగా అణచివేశాయి.
కజకిస్తాన్‌లో అసలేం జరిగింది?
జానావోజెన్ అనే పట్టణంలో జనవరి 2న ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. చమురు ఉత్పత్తికి పేరు గాంచిన ఈ పట్టణంలో పదేళ్ల కింద కూడా ప్రదర్శనకారులకు, పోలీసులకు మధ్య భయంకరమైన ఘర్షణలు జరిగాయి. నిరసన ప్రదర్శనలు జానావోజెన్ నుంచి క్రమంగా దేశమంతా వ్యాపించాయి.
అల్మాటీలో శాంతిభద్రతలను కాపాడే క్రమంలో అల్లరిమూకలను కాల్చి చంపామని భద్రతా బలగాలు చెబుతున్నాయి. ప్రదర్శనకారులు నగరంలోని పోలీసు స్టేషన్లను కబ్జా చేసుకోవడానికి ప్రయత్నించారన్నది పోలీసుల ఆరోపణ.
ఘర్షణలల్లో 18 మంది భద్రతా సిబ్బంది మరణించారని, 353 మంది గాయపడ్డారని శుక్రవారంనాడు పోలీసులు ప్రకటించారు.
దేశవ్యాప్తంగా, ఘర్షణల్లో వెయ్యి మందికి పైగా గాయపడ్డారని, 400 మందికి ఆస్పత్రుల్లో వైద్యం చేస్తున్నారని, పదుల సంఖ్యలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్నారని వార్తా కథనాలు చెబుతున్నాయి.
అల్లర్లు ఎలా మొదలయ్యాయి?
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్.. అంటే ఎల్‌పీజీపైన ప్రభుత్వం సబ్సిడీని ఎత్తేయడంతో ప్రదర్శనలు మొదల్యయాయి. మిగతా ఇంధనాలకన్నా దీని ధర తక్కువ కావడం వల్ల చాలా మంది కజాక్ ప్రజలు తమ కార్లను ఎల్‌పీజీకి కన్వర్ట్ చేసుకున్నారు.
అయితే, ఎల్‌పీజీపైన సబ్సిడీలను కొనసాగించలేమని ప్రభుత్వం ప్రకటించింది. దాంతో దాని ధర దాదాపు రెండింతలైంది.
కానీ, ప్రజాగ్రహానికి ఇదొక్కటే కారణం కాదని స్పష్టమవుతోంది. నిరసన ప్రదర్శనల్లో ఇచ్చిన నినాదాల్లో కొందరు నజర్బయేవ్ పేరును ఎత్తుకున్నారు. ఆయన కాంస్య విగ్రహాన్ని కూల్చే ప్రయత్నం కూడా చేశారు. .
నిజానికి అధ్యక్ష పదవి నుంచి తొలగిపోయిన తర్వాత కూడా నజర్బయేవ్ ప్రస్తుత ప్రభుత్వంలో బలమైన స్థానంలోనే కొనసాగుతున్నారు. ఆయన కజాకిస్తాన్ సెక్యూరిటీ కౌన్సిల్ అధిపతిగా ఉన్నారు.
కొందరు విశ్లేషకులు చెబుతున్న ప్రకారం, తన కూతురు దారిగాను భవిష్యత్ దేశాధినేతగా తీర్చిదిద్దేందుకు నజర్బయేవ్ అవసరమైన సన్నాహాలు కూడా చేస్తున్నారు. అయితే, ప్రదర్శనకారులను శాంతింపజేసేందుకు తాజాగా నజర్బయేవ్‌ను ఆ పదవిలోంచి తొలగించారు.
కజాకిస్తాన్‌లో రష్యా ఎలా అడుగుపెట్టగలిగింది?
దేశంలో స్థిరత్వాన్ని నెలకొల్పడంలో సాయం కావాలని కజాక్ ప్రెసిడెంట్ కోరిన వెంటనే రష్యన్ పారాట్రూపర్లు కజకిస్తాన్‌లో వాలిపోయారు.
నిజానికి సార్వభౌమాధికారం గల ఒక దేశపు అంతర్గత వ్యవహారాల్లో మరొక దేశం జోక్యం చేసుకోగూడదు. కానీ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ (సీఎస్‌టీఓ) అందుకు వీలు కల్పిస్తుంది. .
సీఎస్‌టీఓ అనేది కొన్ని దేశాల సమూహం. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక ఏర్పడ్డ ఈ గ్రూపులో రష్యా, కజకిస్తాన్, బెలారుస్, తజికిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, ఆర్మేనియా సభ్యదేశాలుగా ఉన్నాయి.
ప్రస్తుతం సీఎస్‌టీఓ అధ్యక్ష స్థానంలో ఉన్న ఆర్మేనియా.. అల్మాటీలో జరిగిన అల్లర్లను 'విదేశాల్లో శిక్షణ తీసుకున్న కొన్ని బందిపోటు ముఠాలు పాల్పడ్డ దురాక్రమణ'గా అభివర్ణించింది.
కజకిస్తాన్‌లోని గ్యాస్ పైప్‌లైన్లు, రష్యన్ మిలిటరీ స్థావరాలు, బైకనూర్‌లోని రష్యన్ స్పేస్ స్టేషన్‌లలో ముందు నుంచే మోహరించి ఉన్న తన సైనిక బలగాలను మరింత పెంచుకోవాలని రష్యా ప్రయత్నిస్తోంది.
ముందున్న మార్గమేంటి?
మొత్తానికి, ఈ నిరసన ప్రదర్శనతో కజాక్ ప్రభుత్వం ఓ మెట్టు దిగి వచ్చినట్లే కనిపిస్తోంది. ఎల్‌పీజీపైన సబ్సిడీ ఎత్తివేత నిర్ణయాన్ని అది పక్కనపెట్టింది. ఆరు నెలల్లోగా అన్ని రకాల వాహన ఇంధనాల ధరల్ని నియంత్రిస్తామనే ఆదేశాలు కూడా జారీ చేసింది కజాక్ ప్రభుత్వం.
మంత్రులు రాజీనామా చేశారు. ద్రవ్యోల్బణాన్ని..అంటే అధిక ధరలను అదుపు చేయాలన్న కీలక కర్తవ్యాన్ని నెరవేర్చడంలో తమ ప్రభుత్వం విఫలమైందని ప్రెసిడెంట్ కసీమ్ జోమార్ట్ టోకయేవ్ అంగీకరించారు. అలీఖాన్ స్మాయిలోవ్‌ను కార్యనిర్వాహక ప్రధానిగా నియమించారు టోకయేవ్.
మరోవైపు...కజాక్ అధికారులు సంయమనం పాటించాలని, నిరసనకారులను శాంతియుత ప్రదర్శనలు నిర్వహించేందుకు అనుమతించాలని అమెరికా కోరింది.
ఇవి కూడా చదవండి:
- ప్రధాన మంత్రి భద్రత ఎలా ఉంటుంది? పంజాబ్ పర్యటనలో పొరపాటు ఎలా జరిగింది?
- హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన ఉత్తర కొరియా
- అమరావతి: క్యాపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ వ్యవహారం మళ్లీ ఎందుకు ముందుకొచ్చింది?
- కాలిఫోర్నియాలో వేర్వేరు సంవత్సరాల్లో జన్మించిన కవలలు
- సింధుతాయి సప్కాల్: అనాథల అమ్మ ఇక లేరు... చేతిని ముంగిస కొరికేస్తున్నా ఆమె ఓ కాగితం కోసం ఎందుకంత పోరాటం చేశారు?
- మనిషి, మొసళ్ల మధ్య మనుగడ పోరాటం
- కొంపముంచిన అలెక్సా, పదేళ్ల చిన్నారికి ప్రమాదకరమైన చాలెంజ్
- గోవాలో క్రిస్టియానో రొనాల్డో విగ్రహ ఏర్పాటుపై వివాదం
- అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామిని భూమిపైకి తెచ్చేందుకు డబ్బుల్లేక ప్రభుత్వం అక్కడే ఉంచేసింది
- WAN-IFRA ‘సౌత్ ఏసియా డిజిటల్ మీడియా అవార్డ్స్’లో బీబీసీకి 4 పురస్కారాలు
- స్పైడర్ మ్యాన్ జోరుకు అల్లు అర్జున్ పుష్ప, రణ్వీర్ సింగ్ 83 తగ్గక తప్పలేదా? బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సినిమా కలెక్షన్ల జోరుకు కారణాలేంటి?
- మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?.. ‘24 గంటల్లో డబ్బు రెట్టింపు.. 50 వేలు పెట్టుబడి పెడితే ఆరు లక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)