అంతరిక్షంలో శాటిలైట్‌ను పేల్చేసిన రష్యా.. కాప్స్యూల్స్‌లోకి వెళ్లి దాక్కున్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ సిబ్బంది

రష్యా తాజాగా యాంటీ-శాటిలైట్ క్షిపణిని పరీక్షించింది. దాని ద్వారా తన సొంత శాటిలైట్ ఒకదానిని పేల్చివేసింది. ఆ శాటిలైట్ శకలాల కారణంగా.. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లోని సిబ్బంది కాప్స్యూల్స్‌లోకి వెళ్లి దాక్కోవాల్సి వచ్చింది.

దీంతో రష్యా క్షిపణి పరీక్ష ప్రమాదకరమైనదని, నిర్లక్షపూరితమైనదని.. ఐఎస్ఎస్‌లోని సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టిందని అమెరికా ఖండించింది.

ఐఎస్ఎస్‌లో ప్రస్తుతం ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వారిలో నలుగురు అమెరికన్లు కాగా, ఒకరు జర్మన్, ఇద్దరు రష్యన్లు ఉన్నారు.

ఈ అంతరిక్ష కేంద్రం 420 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో తిరుగుతుంటుంది.

‘‘ఈ రోజు ఉదయం రష్యన్ ఫెడరేషన్ నిర్లక్ష్యపూరితంగా విధ్వంసకర శాటిలైట్ పరీక్షను నిర్వహించింది. తన సొంత శాటిలైట్ ఒక దాని మీద నేరుగా దాడిచేసే యాంటీ-శాటిలైట్ మిసైల్‌ను ప్రయోగించింది’’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ ఒక సమావేశంలో పేర్కొన్నారు.

‘‘ఈ పరీక్ష వల్ల ఇప్పటివరకూ.. ఆచూకీ తెలుసుకోగల 1,500 ముక్కల శకలాలను, వేలాది చిన్నపాటి శకలాలను సృష్టించింది. అంతరిక్ష కక్ష్యలో తిరుగుతున్న ఇవన్నీ అన్ని దేశాల ప్రయోజనాలకూ ముప్పు తెస్తాయి’’ అని ఆయన చెప్పారు.

నాసా అధిపతి బిల్ నెల్సన్.. ఈ ఘటన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

‘‘మానవ అంతరిక్షయానంలో సుదీర్ఘమైన, ఘనమైన చరిత్ర గల రష్యా.. ఐఎస్ఎస్‌లో ఉన్న అమెరికా, అంతర్జాతీయ భాగస్వామ్య అంతరిక్షయాత్రికులనే కాదు.. తన సొంత వ్యోమగాములను కూడా ప్రమాదంలోకి నెట్టటం ఊహకందనిది. చైనా స్పేస్ స్టేషన్‌లో ఉన్న చైనా టాయికోనాట్లను కూడా ప్రమాదంలోకి నెట్టింది’’ అని ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు.

అయితే.. ఈ సంఘటనను రష్యా అంతరిక్ష సంస్థ రాస్కోస్మోస్ తేలికగా తీసివేసింది.

‘‘ఆ వస్తువు కక్ష్య.. ఐఎస్ఎస్ కక్ష్యకు దూరంగా జరిగిపోయింది. ఐఎస్ఎస్‌లోని సిబ్బంది ప్రామాణిక విధానాల ప్రకారం స్పేస్‌క్రాఫ్ట్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ స్టేషన్ గ్రీన్ జోన్‌లో ఉంది’’ అని రాస్కోస్మోస్ ట్వీట్ చేసింది.

పేల్చివేతతో బయటకు వెలువడిన శకలాలు ఎలాంటి ప్రమాదం లేకుండా సాగిపోయాయి. కానీ ఆ శకలాల మూలం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.

రష్యా 1982లో ప్రయోగించిన గూఢచర్య శాటిలైట్ కాస్మోస్-1408 నుంచి ఈ శకలాలు వెలువడినట్లు కనిపిస్తోంది. టన్నుకు పైగా బరువుండే ఈ శాటిలైట్ చాలా ఏళ్లుగా పనిచేయటం లేదు.

ఈ శాటిలైట్ ఉండాల్సిన స్థానంలో అనేక శకలాలు ఉన్నట్లుగా.. న్యూజిలాండ్‌లోని తమ రాడార్ వ్యవస్థ గుర్తించిందని అంతరిక్ష వ్యర్థాల జాడను తెలుసుకునే లియోల్యాబ్స్ అనే కంపెనీ చెప్పింది.

రష్యా చర్య ‘ప్రమాదకరం, బాధ్యతారహితం’ అని ప్రైస్ అభివర్ణించారు. అంతరిక్షంలో ఆయుధాలను మోహరించటానికి తాను వ్యతిరేకమనే రష్యా వాదన బూటకమని ఈ ఘటన చాటిచెప్తోందన్నారు.

‘‘వారి బాధ్యతారహిత చర్య మీద ప్రతిస్పందించటానికి అమెరికా తన భాగస్వాములు, మిత్రులతో కలిసి పనిచేస్తుంది’’ అని చెప్పారు.

అంతరిక్ష భద్రత, సుస్థిరత పట్ల పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించినట్లు ఈ క్షిపణి పరీక్ష చెప్తోందని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలెస్ వ్యాఖ్యానించారు.

‘‘ఈ పరీక్ష వల్ల విడుదలైన వ్యర్థాలు కక్ష్యలో కొనసాగుతూ.. మున్ముందు శాటిలైట్లకు, మానవ అంతరిక్ష ప్రయాణాలకు ప్రమాదంగా మారతాయి’’ అని ఆయన పేర్కొన్నారు.

ఓ రకమైన పిచ్చితనం

బీబీసీ సైన్స్ కరెస్పాండెంట్జొనాథన్ ఆమోస్ విశ్లేషణ

శాటిలైట్ విధ్వంసక క్షిపణులను ఓ రకమైన పిచ్చితనంగా పరిగణించకుండా ఉండటం కష్టం.

తీవ్ర పేలుడుతో విడుదలయ్యే వ్యర్థాల పరిధిని నియంత్రించటం అసాధ్యం. వేలాది ముక్కలు పుట్టుకొస్తాయి. కొన్ని భూమి మీదకు దూసుకొస్తాయి. వాటివల్ల ప్రమాదం ఉండదు. కానీ చాలా శకలాలు మరింత ఎత్తుకు కూడా వెళతాయి. అవి భవిష్యత్తులో అంతరిక్ష కార్యకలాపాలకు ఆటంకాలుగా మారుతాయి. ఈ పరీక్షను నిర్వహించిన దేశాల అంతరిక్ష కార్యకలాపాలకు సైతం అవి ఇబ్బంది కలిగిస్తాయి.

అంతరిక్ష కక్ష్యలో తిరుగుతున్న తమ స్పేస్ స్టేషన్‌ను.. ఈ పరీక్ష వల్ల విడుదలైన వ్యర్థాలు ఢీకొట్టే అవకాశం ఉండటంతో.. ఐఎస్ఎస్‌లోని రష్యా వ్యోమగాములు సోమవారం ఉదయం తమ సోయజ్ కాప్స్యూల్‌లో తలదాచుకున్నపుడు ఏం ఆలోచిస్తూ ఉండి ఉంటారు?

అంతరిక్ష వ్యర్థాలనేవి వేగంగా విషమిస్తున్న పరిస్థితి. మన పైన ఆకాశంలో 64 ఏళ్లుగా కొనసాగిస్తున్న కార్యకలాపాల వల్ల.. ఒక సెంటీమీటరు నుంచి 10 సెంటీమీటర్ల వరకూ పరిమాణం గల దాదాపు పది లక్షల వస్తువులు అంతరిక్షంలో భూమిచుట్టూ ఎలాంటి నియంత్రణ లేకుండా తిరుగుతున్నాయి.

వీటిలో ఏ ఒక్కటైనా.. కీలకమైన వాతావరణ ఉపగ్రహం లేదా సమాచార శాటిలైట్ వంటి వాటిని తాకితే వాటి పని అయిపోయినట్లే. అంతరిక్ష పర్యావరణాన్ని ప్రపంచ దేశాలు శుభ్రం చేయాలి కానీ.. మరింతగా కలుషితం చేయకూడదు.

శాటిలైట్లను నేల నుంచి పేల్చివేయగల సామర్థ్యం.. అమెరికా, రష్యా, చైనా, ఇండియా సహా అనేక దేశాలకు ఉంది.

ఇటువంటి క్షిపణులను పరీక్షించటం అరుదు. కానీ అలాంటి పరీక్ష ఎప్పుడు జరిగినా అన్నివైపుల నుంచీ ఖండనలు వస్తాయి. ఎందుకంటే ఆ పరీక్షలు.. ప్రతి ఒక్కరి అంతరిక్ష పర్యావరణాన్నీ కలుషితం చేస్తాయి.

చైనా.. కాలం చెల్లిన తన వాతావరణ శాటిలైట్ ఒక దానిని 2007లో ధ్వంసం చేసింది. దానివల్ల ఆచూకీ తెలుసుకోగల వ్యర్థాలు 2,000 పైగా పుట్టుకొచ్చాయి. ఈ పదార్థాలు.. చైనా సహా అనేక దేశాల అంతరిక్ష కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నాయి.

ఇటువంటి వ్యర్థాలు అంతరిక్షంలో ఎంత వేగంగా తిరుగుతుంటాయంటే.. ఐఎస్ఎస్ మాడ్యూళ్లకు ఇవి చాలా సులభంగా రంధ్రాలు చేయగలవు.

ఈ ప్రమాదం పొంచివున్నపుడు ముందు జాగ్రత్తచర్యల్లో భాగంగా.. స్పేస్ స్టేషన్ మాడ్యూళ్ల మధ్య గల హ్యాచెస్‌ను మూసివేయటం, అందులోని సిబ్బంది తాము అక్కడికి రావటానికి ఉపయోగించిన కాప్స్యూళ్లలోకి వెళ్లిపోవటం చేస్తారు. ఈ వాహనాలు.. అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవటానికి ‘లైఫ్‌బోట్లు’గా ఉపయోగపడతాయని ఎల్లప్పుడూ ఐఎస్ఎస్‌కే అంటిపెట్టుకుని ఉంటాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)