You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోవిడ్ 19 ఆంక్షలపై యూరోపియన్ దేశాల్లో తిరగబడుతున్న జనాలు.. రెచ్చగొడుతున్న 3 అంశాలు..
- రచయిత, రాచెల్ షారియర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కరోనా వైరస్ ఆంక్షలకు వ్యతిరేకంగా గతవారం జరిగిన ప్రదర్శనలు, హింసాత్మక ఘటనలు మర్చిపోక ముందే, ఈ వారాంతంలో ఆస్ట్రియా, నెదర్లాండ్స్‌లలో మరిన్ని కోవిడ్ నిరసనలకు ఆందోళనకారులు సిద్ధమవుతున్నారు.
ఇటు సోషల్ మీడియాలో, అటు వీధుల్లో జరుగుతున్న నిరసనలు, ఆందోళనలు, ఆవేశాలు ప్రజల ఉమ్మడి అభిప్రాయంగా కనిపిస్తూ, రాజకీయ నిర్ణయాలను ప్రశ్నిస్తున్నాయి.
నిరసనలలో పాల్గొనే వారి ద్వారా తప్పుడు వార్తలు, సమాచారం కూడా విపరీతంగా ప్రచారమవుతున్నాయి. అనేక కుట్ర సిద్ధాంతాలు కూడా వినిపిస్తున్నాయి.
కోవిడ్ నిబంధనలను ప్రజలపై రుద్దుతున్నారని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో వ్యాక్సీన్‌ల ద్వారా విషప్రయోగం జరుగుతోందన్న మాట దగ్గర్నుంచి దేశం నియంతృత్వంలోకి వెళ్లిపోతోందనే వరకు అనేక అనుమానాలు షేర్ అవుతున్నాయి.
ప్రధానంగా మూడు అంశాలు ఆందోళనకారులను విపరీతంగా రెచ్చగొడుతున్నాయి.
1. రాజకీయ అభిప్రాయాలు
ఆస్ట్రియా పార్లమెంటులో మూడో అతిపెద్ద రాజకీయ విభాగం ‘ఆస్ట్రియన్ ఫ్రీడమ్ పార్టీ’ కోవిడ్ ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వ్యాక్సినేషన్‌కు, జన్యు ప్రయోగాలకు లంకె పెడుతూ ఆ పార్టీ నాయకుడు నిరాధారమైన ఆరోపణలు చేయడంతో, అభిమానులు వీధుల్లో ఆందోళలను ఉధృతం చేశారు.
కొత్తగా ఏర్పడిన ‘ఫండమెంటల్ రైట్స్ పార్టీ’ కూడా కోవిడ్ నిబంధనలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ఆంక్షలను డిక్టేటర్‌షిప్ (నియంతృత్వం) వైపు వేస్తున్న అడుగులుగా ఆ పార్టీ అభివర్ణించింది. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను నాజీ హిట్లర్ నిర్ణయాలతో పోల్చింది.
ఆస్ట్రియాలో ఇటీవల జరిగిన అనేక కోవిడ్ వ్యతిరేక నిరసన ప్రదర్శనలకు ఆ పార్టీ నాయకత్వం వహించింది.
అయితే, ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడంలో ముందున్నది కేవలం రైటిస్టు గ్రూపులు మాత్రమే కాదు, వామపక్షాలు కూడా ఉన్నాయని బీబీసీ మానిటరింగ్ పరిశీలనలో తేలింది.
అంతర్జాతీయ ట్రిప్‌లకు అవసరమైన ట్రావెల్ పాస్‌లు, నెగెటివ్ రిపోర్టులను తప్పనిసరి చేయడం వెనక కార్పొరేట్ సంస్థల పాత్ర ఉందన్న నిరాధారపూరిత ఆరోపణలను లెఫ్టిస్ట్ మీడియా సంస్థలు పదే పదే ప్రచారం చేశాయి.
2. ప్రభుత్వంపై అపనమ్మకం
ఆస్ట్రియాలో ప్రజలకు కోవిడ్ వ్యాక్సీన్ మీద నమ్మకం కలగకపోవడానికి, ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజలకున్న అపనమ్మకం కూడా ఒక కారణమని ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో తేలింది.
2020, 2021 సంవత్సరాలలో ఆస్ట్రియా, క్రొయేషియా ప్రభుత్వాల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ కారణంగానే ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఆందోళనలు చోటు చేసుకున్నట్లు యూరోపియన్ యూనియన్ ఆధ్వరంలో జరిగిన ఓ సర్వే తేల్చింది.
రష్యాలో అనుమతి లేని వీధి నిరసనలపై నిషేధం ఉండటంతో అక్కడ రోడ్ల పై ఆందోళనలు కనిపించడం లేదు. కానీ, ఆన్‌లైన్‌లో మాత్రం ప్రభుత్వంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
టీకా పాస్‌పోర్ట్‌ను ప్రవేశపెట్టడంపై సోషల్ మీడియాలో తీవ్రంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం, అధికార యంత్రాంగంపై ప్రజలకు ఉన్న అపనమ్మకం కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని మాస్కోలోని బీబీసీ రష్యన్ సర్వీస్ ప్రతినిధి ఓల్గా డియాకోనోవా వెల్లడించారు.
యూరప్‌లోని అన్ని దేశాలకన్నా రష్యాలో తక్కువగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతోంది.
గతవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో ఆందోళనకారులు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ 'ఇది ఫాసిజం', 'నరమేధం' అన్న ప్లకార్డులను ప్రదర్శించారు.
ప్రభుత్వం తమ ప్రాథమిక హక్కులలో జోక్యం చేసుకుంటోందని వివిధ యూరోపియన్ దేశాలలోని నిరసనకారులు చాలామంది ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల ధోరణి ఇటీవలి కాలంలో బలవంతంగా అధికారంలోకి వచ్చిన నేతలున్న దేశాల్లో ఎక్కువగా కనిపిస్తోంది.
అయితే, వీరి ఆందోళనను కొంత వరకు అర్ధం చేసుకోవచ్చని అంటూనే, ఈ ఉద్యమాలలో పాల్గొంటున్న వారిలో చాలామంది నిజమైన నిరసనకారులుకారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
జర్మన్ థింక్ ట్యాంక్ 'సెంటర్ ఫర్ మానిటరింగ్, అనాలిసిస్ అండ్ స్ట్రాటజీ' కి చెందిన మిరో డిట్రిచ్ ఇలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
''నిరసనకారులను, వారిని సమీకరించిన వారిని చూస్తే, వీరంతా నిజమైన నిరసనకారులు కాదన్న విషయం అర్ధమవుతుంది. వీరంతా తప్పుడు కుట్ర సిద్ధాంతాలను నమ్మి ఆవేశంతో వీధుల్లోకి వచ్చినవారు, లేదంటే రైటిస్ట్ ఉద్యమకారులు'' అని మిరో డిట్రిచ్ అన్నారు.
3. తప్పుదోవ పట్టించే ఆన్‌లైన్ సమాచారం
తప్పనిసరి టీకాలు, వ్యాక్సినేషన్‌లో వివక్షలాంటి అంశాలపై ఆన్‌లైన్‌లో అనేక తప్పుడు వార్తలు ప్రచారమవుతున్నాయి. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే సమాచారం విపరీతంగా వ్యాపిస్తోంది.
అంతర్జాతీయ కుట్రలో భాగంగా టీకాలలో విషం కలిపారని ఒక డచ్ గ్రూప్ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. టీకాల వల్ల ఫలితమే ఉండదంటూ ఆస్ట్రియాలోని కొన్ని గ్రూపులు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశాయి.
ఆసుపత్రిలో చేరే పరిస్థితి రాకుండా, మరణం అవకాశాలను తగ్గించడంలో టీకాల పాత్ర గణనీయంగా ఉన్నట్లు అనేక అధ్యయనాలు వెల్లడించాయి.
వాస్తవానికి ఏ వ్యాక్సీన్, మెడిసిన్ కూడా ప్రమాదరహితం కాదు. కోవిడ్ కారణంగా కలిగే నష్టంతో పోలిస్తే, టీకాల వల్ల ఏర్పడే నష్టం చాలాస్వల్పం.
కానీ, కొన్ని ఈయూ దేశాలలోని సోషల్ మీడియా పోస్ట్‌లు మాత్రం వ్యాక్సీన్ అత్యంత ప్రమాకరమైందని ప్రచారం చేస్తూ, వైరస్ వల్ల కలిగే ప్రమాదాన్ని తక్కువ చేస్తున్నాయి.
''ఆయా దేశాల్లో ఆంక్షల కారణంగా నిస్పృహలో, అసహనంతో ఉన్నవారు అనేకమంది ఉన్నారు. వారు ఇలాంటి ప్రచారానికి దిగుతుండవచ్చు'' అని రీసెర్చర్ సియారన్ ఓకానర్ అన్నారు.
ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం, అతివాదాన్ని పరిశీలించే 'ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ డైలాగ్' లో సియారన్ ఓకానర్ పరిశోధకుడిగా పని చేస్తున్నారు.
"కానీ ఈ రకమైన సంఘటనలు, గ్రూపులు, ఉద్యమాలతో ప్రమాదం ఏంటంటే అవి చివరకు ఉగ్రవాదం, తీవ్రవాదం వైపు మళ్లుతాయి. ఎందుకంటే వారంతా తప్పుడు సమాచారం, తప్పుదారి పట్టించే వాదనలు, కుట్ర సిద్ధాంతాలపై మాత్రమే ఆధారపడుతున్నారు" అన్నారు ఓకానర్
అదనపు సమాచారం: మారియాన స్ప్రింగ్
ఇవి కూడా చదవండి:
- దక్షిణాఫ్రికా వేరియంట్: సరిహద్దులు మూసేస్తున్న దేశాలు.. విమాన ప్రయాణాలపై ఆంక్షలు
- ఆంధ్రప్రదేశ్‌కు దత్తతగా వచ్చిన బిడ్డను తిరిగి కేరళ ఎందుకు తీసుకెళ్లారు... అసలేంటీ వివాదం?
- రాయలసీమలో 50 ఏళ్లలో ఎన్నడూ చూడని విపత్తు, నష్టం అంచనా రూ.6వేల కోట్లకు పైనే, అసలేం జరిగింది?
- 26/11 ముంబయి దాడులు: పాకిస్తాన్లో ఈ కేసు దర్యాప్తు ఎంతవరకూ వచ్చింది?
- క్రిప్టోకరెన్సీలో రూ.70 లక్షల పెట్టుబడులు, ఆత్మహత్య: ‘నేనిలా చేస్తానని కలలో కూడా ఊహించలేదు..’
- క్రిప్టోకరెన్సీ చట్టం గురించి ఎందుకింత గందరగోళం? కీలక ప్రశ్నలు... సమాధానాలు
- 1993 చిలకలూరుపేట బస్సు దహనం, 23 మంది మృతి.. దోషులకు ఉరిశిక్ష ఎందుకు రద్దు చేశారంటే..
- ఉద్దానం కిడ్నీ బాధితులు: ‘ఎంతకాలం రాసుంటే అంతకాలం బతుకుతా, అప్పులు చేసి చావడమెందుకు?’
- ఆందోళన రేకెత్తిస్తున్న అత్యంత ప్రమాదకరమైన కొత్త కరోనా వేరియంట్ B.1.1.529
- ‘పోలీసులకు తెలియకుండా అడుగు కూడా బయట పెట్టలేని పరిస్థితి ఉంది.. ’
- కడప జిల్లాలో వరదలు: ‘మా కళ్లెదుటే కొందరు కొట్టుకుపోయారు.. మా బంధువుల ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)