You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కిమ్ జోంగ్ ఉన్: హైపర్ సోనిక్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా బుధవారం హైపర్‌సోనిక్ మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించిందని అక్కడి మీడియా నివేదిక పేర్కొంది.
''అది, 700కి.మీ దూరంలోని లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించిందని'' అని కేసీఎన్‌ఏ తెలిపింది.
హైపర్‌సోనిక్ మిసైల్ పరీక్ష జరిగినట్లు కథనాలు రావడం ఇది రెండోసారి. రాడార్‌కు దొరక్కుండా లక్ష్యం దిశగా వెళ్లడంలో బాలిస్టిక్స్ మిసైల్స్ కన్నా హైపర్‌సోనిక్ క్షిపణులు మెరుగ్గా ఉంటాయి.
ప్యాంగ్యాంగ్ రక్షణను మరింత పటిష్టం చేస్తానని గతంలోనే ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రతిజ్ఞ చేశారు. ఆ చర్యల్లో భాగంగానే తాజా పరీక్షను నిర్వహించారు.
కొరియా ద్వీపకల్పంలో పెరుగుతోన్న అస్థిర సైనిక పరిస్థితుల కారణంగా ప్యాంగ్యాంగ్, తన రక్షణ రంగ సామర్థ్యాలను పటిష్టం చేసుకునే ప్రక్రియను కొనసాగిస్తుందని నూతన సంవత్సర ప్రసంగంలో కిమ్ అన్నారు.
ఉత్తర కొరియా గతేడాది పలు రకాల క్షిపణులను పరీక్షించింది.
హైపర్‌సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తోన్న దేశాల జాబితాలో యునైటెడ్ స్టేట్స్, చైనా దేశాలతో పాటు ఉత్తర కొరియా కూడా చేరింది.
ఉత్తర కొరియా తాజా ప్రయోగాన్ని తొలుత జపనీస్ కోస్ట్ గార్డ్ గుర్తించింది. ఆ తర్వాత సియోల్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
''బుధవారం నాటి పరీక్షలో హైపర్‌సోనిక్ గ్లైడింగ్ వార్‌హెడ్, దాని రాకెట్ బూస్టర్ నుంచి విడిపోయి... 700 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఢీకొట్టింది. లక్ష్యాన్ని ఢీ కొట్టడానికి ముందు అది 120 కి.మీ పాటు పక్కాగా వ్యూహాన్ని పాటించింది'' అని కేసీఎన్‌ఏ పేర్కొంది.
ఫ్లైట్ కంట్రోల్‌తో పాటు శీతాకాలంలో మిసైల్ పనిచేసే సామర్థ్యాలను కూడా ఈ పరీక్షలో ధ్రువీకరించారని కేసీఎన్‌ఏ పేర్కొంది.
బాలిస్టిక్ క్షిపణుల కన్నా హైపర్‌సోనిక్ క్షిపణులు తక్కువ ఎత్తులో ఎగురుతూ లక్ష్యం వైపుకు దూసుకెళ్తాయి. ధ్వని కంటే ఐదురెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి గంటకు 6200కి.మీ వేగంతో వెళ్తాయి.
'' ఇటీవల సెప్టెంబర్‌లో పరీక్షించిన హసాంగ్-8 అనే క్షిపణి, హైపర్‌సోనిక్ మిసైల్ కాదు. కానీ కొన్ని ఒకే తరహా లక్షణాలను కలిగి ఉంది'' అని వార్తా సంస్థ రాయిటర్స్‌తో కార్నిగో ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌లోని న్యూక్లియర్ పాలసీ ప్రోగ్రామ్‌కు చెందిన అంకిత్ పాండా అన్నారు.
2021 అక్టోబర్‌లో ప్యాంగ్యాంగ్‌లో జరిగిన రక్షణ రంగ ఎగ్జిబిషన్‌లో ఈ కొత్త మిసైల్‌ను తొలిసారిగా ప్రవేశపెట్టారు.
కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో ఉత్తర కొరియా ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య తాజా ప్రయోగం జరిగింది.
''దేశం జీవన్మరణ పోరాటాన్ని ఎదుర్కొంటోంది. దేశాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను పెంచడమే కొత్త ఏడాది లక్ష్యాలు' అని సంవత్సరాంతపు సమావేశంలో కిమ్ పేర్కొన్నారు.
అయినప్పటికీ, ఆయుధ సంపత్తి కార్యక్రమంలో ఉత్తర కొరియా వెనక్కి తగ్గడం లేదు. స్వీయ రక్షణ కోసం ఇది అత్యవసరమని భావిస్తోంది.
అణ్వాయుధాలకు స్వస్తి పలకాలని ఉత్తర కొరియాకు అమెరికా ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. అమెరికా, ఉత్తర కొరియా మధ్య సంబంధాలు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- సింధుతాయి సప్కాల్: అనాథల అమ్మ ఇక లేరు... చేతిని ముంగిస కొరికేస్తున్నా ఆమె ఓ కాగితం కోసం ఎందుకంత పోరాటం చేశారు?
- 2022లో తొలి క్షిపణి ప్రయోగం చేపట్టిన ఉత్తర కొరియా
- ఒమిక్రాన్: తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోజులో కేసులు రెట్టింపు, మూడో వేవ్ మొదలైందా
- తెలంగాణ: జీఓ 317 ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- జేపీ నడ్డా విమర్శలపై కేటీఆర్: 'అవును, కేసీఆర్ ఏటీఎం... అన్నదాతలకు తోడుండే మెషీన్'
- ఆర్ఆర్ఆర్కు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దు -హైకోర్టులో పిల్ : ప్రెస్ రివ్యూ
- మోదీ ప్రభుత్వ చర్యలతో ఎన్జీఓలు ఇరకాటంలో పడ్డాయా, ఆరెస్సెస్ అనుబంధ సంస్థలను కూడా ఎందుకు వదల్లేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)