కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ హక్కులు వదులుకోవాలన్న భారత్ ప్రతిపాదనకు మద్దతు తెలిపిన అమెరికా

కరోనా టీకా

ఫొటో సోర్స్, Reuters

కరోనా వ్యాక్సీన్లు భారీగా తయారు చేయడానికి కంపెనీలు వాటి మేధా సంపత్తి హక్కులు (పేటెంట్లను) వదులుకునేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ చూపుతున్న చొరవను అమెరికా సమర్థించింది.

భారత్, దక్షిణాఫ్రికా దేశాలు మొదట ఈ ప్రతిపాదన చేశాయి. ఇది జరిగితే, తాము ప్రపంచవ్యాప్తంగా టీకా ఉత్పత్తిని పెంచగలమని చెప్పాయి.

కానీ, టీకాపై పేటెంట్లు మినహాయింపు వల్ల ఆశించిన ప్రభావం ఉండకపోవచ్చని ఔషధ తయారీదారులు అంటున్నారు.

"అసాధారణ సమయంలో అసాధారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది" అని అమెరికా వాణిజ్య ప్రతినిధి కేథరీన్ టాయ్ అన్నారు.

ఈ విషయంలో ఏకాభిప్రాయానికి రావడానికి డబ్ల్యుటీఓకు సమయం పడుతుందని ఆమె హెచ్చరించారు.

వ్యాక్సీన్లకు పేటెంట్స్ ఉండకూడదని వాదిస్తున్న 60 దేశాల గ్రూప్‌లో భారత్, దక్షిణాఫ్రికా తమ గళం గట్టిగా వినిపిస్తున్నాయి.

అయితే, ట్రంప్ అధికారంలో గత అమెరికా పాలకుల నుంచి, బ్రిటన్, ఈయూ నుంచి ఈ బృందానికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

కానీ, ట్రంప్ తర్వాత అధ్యక్షుడైన జో బైడెన్ మరో దారిలో ముందుకు వెళ్తున్నారు. 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే ఈ పేటెంట్ల మినహాయింపును సమర్థించిన ఆయన, బుధవారం దానికి మద్దతిస్తున్నట్లు పునరుద్ఘాటించారు.

ఈ చర్యను కోవిడ్-19తో జరుగుతున్న పోరాటంలో ఒక 'చిరస్మరణీయ క్షణం'గా ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ వర్ణించారు.

జో బైడెన్

ఫొటో సోర్స్, Reuters

మేధా సంపత్తి హక్కుల మినహాయింపు అంటే...

పేటెంట్ల మినహాయింపునకు ఆమోదం లభిస్తే, వ్యాక్సీన్ ఉత్పత్తి వేగం పెంచడానికి, ఆర్థికంగా వెనుకబడిన దేశాలకు మరింత తక్కువ ధరకు టీకాలు అందించడానికి వీలవుతుందని మద్దతుదారులు అంటున్నారు.

పేటెంట్లు, మిగతా మేధా సంపత్తిని కాపాడుకోడానికి చాలా దేశాల్లో ఉన్న నిబంధనలు టీకాలు, మహమ్మారిని అడ్డుకోడానికి అవసరమైన మిగతా పరికరాల ఉత్పత్తికి అవరోధంగా నిలుస్తున్నాయని చాలా అభివృద్ధి చెందుతున్న దేశాలు వాదిస్తున్నాయి.

ఫార్మా కంపెనీల మేధా సంపత్తిని ఉపయోగించి, టీకాలు ఉత్పత్తి చేయడానికి అభివృద్ధి చెందిన దేశాలకు సాయం అందేలా భారత్, దక్షిణాఫ్రికా చేసిన ఈ ప్రతిపాదనపై డబ్ల్యుటీవో చర్చించకుండా అమెరికా ఇంతకు ముందు అడ్డుకుంది.

పేటెంట్ల మినహాయింపు జరిగేలా అమెరికా ఇప్పుడు డబ్ల్యుటీఓతో చర్చలు ప్రారంభిస్తుందని టాయ్ చెప్పారు. అయితే, డబ్ల్యుటీఓ నిర్ణయం తీసుకోడానికి మొత్తం 164 మంది సభ్యుల ఏకాభిప్రాయం అవసరం కావడంతో దీనికి ఇంకాస్త సమయం పట్టచ్చు

Presentational grey line

అద్భుత క్షణం

ఫైజల్ ఇస్లామ్, ఎకనామిక్స్ ఎడిటర్ విశ్లేషణ

ఇది నిజంగా ఒక అద్భుతమైన క్షణం

"మహమ్మారి సమయంలో కోవిడ్-19 టీకా తయారీదారులు సొంతం చేసుకున్న పేటెంట్లను వదులుకోవడాన్ని వైట్ హౌస్ సమర్థిస్తుందని" అమెరికా వాణిజ్య ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు.

ఎన్జీవోలు, అమెరికా సభల్లోని కొందరు డెమాక్రాట్లు, భారత్, దక్షిణాఫ్రికా లాంటి కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు దీని గురించి చెబుతున్నాయి.

ఫార్మా కంపెనీలు పేటెంట్లు వదులుకోవడం గురించి జెనీవాలోని డబ్ల్యుటీఓ చర్చలు జరపకుండా ఇటీవల మార్చిలో అమెరికా, బ్రిటన్, ఈయూ అడ్డుకున్నాయి.

గత నెలలో ప్రముఖ ఫార్మా కంపెనీలన్నీ ఈ అంశాన్ని బ్రిటన్ వాణిజ్య మంత్రి లిజ్ ట్రస్‌ దగ్గర లేవనెత్తడం కూడా కాథెరీన్ టాయ్ గమనించారు.

"టీకా తయారీదారులు ప్రపంచానికి వాటిని సరఫరా చేయడంలో విఫలమయ్యారని. ఆ పరిజ్ఞానాన్ని అవి బదిలీ చేయాల్సి ఉంటుంది" అని డబ్ల్యుటీఓ చీఫ్ ఎంగోజీ ఒకాంజో వేలా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇక్కడ పేటెంట్లు అడ్డంకి కాదని, వాటి తయారీ సామర్థ్యమే పెద్ద అవరోధంగా మారిందని ఔషధ కంపెనీలు చెబుతున్నాయి. కానీ భారత్, దక్షిణాఫ్రికా దానికి ఒప్పుకోవడం లేదు.

దక్షిణాప్రికా అధ్యక్షుడు సిరిల్ రాంఫోసా దీనిని 'టీకా వర్ణవివక్ష'గా నిందించారు. తమ దేశంలో, దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో టీకా ఉత్పత్తి వేగాన్ని పెంచవచ్చని చెప్పారు.

అమెరికా తాజా నిర్ణయం డబ్ల్యుటీలోని బలాబలాల్లో పేటెంట్ల మినహాయింపు వైపు మొగ్గు వచ్చేలా చేసింది.

టీకా తయారీ పేటెంట్లు

ఫొటో సోర్స్, Getty Images

ప్రతిస్పందన ఎలా ఉంది

అమెరికాది 'చరిత్రాత్మక' నిర్ణయమని, కోవిడ్-19తో జరిగే పోరాటంలో ఇది ఒక 'చిరస్మరణీయ క్షణం' అని డబ్ల్యుహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ గెబ్రియేసస్ వర్ణించారు.

కానీ, దీనికి వ్యతిరేకంగా గళమెత్తిన ఫార్మా కంపెనీలు పేటెంట్లు తమకు అడ్డంకి కాదని, ఈ చర్యలు ఆవిష్కరణలనే తుడిచిపెట్టవచ్చని హెచ్చరించాయి.

అంతర్జాతీయ ఔషధ తయారీదారుల సమాఖ్య, సంఘాలు ఈ చర్యలు తమను నిరాశకు గురిచేశాయని చెప్పాయి.

"పేటెంట్లు వదులుకోవడం అనేది సంక్లిష్టమైన సమస్యకు ఒక సింపుల్ పరిష్కారం మాత్రమే, కానీ, అది ఒక తప్పు సమాధానం" అని జెనీవాలోని ఒక గ్రూప్ భావించింది.

"ఏ ఆవిష్కరణలు, ఆర్థిక పెట్టుబడులతో ఫార్మా కంపెనీలు కోవిడ్-19 టీకా తయారీని సుసాధ్యం చేశాయో, ఇది ఆ ఆస్తులనే స్వాధీనం చేసుకోవడం లాంటిది" అని జాన్స్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ, సీనియర్ స్కాలర్ డాక్టర్ అమేష్ అడాల్జా రాయిటర్స్‌తో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)