You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కోవిడ్-19 ఎఫెక్ట్ : నలుగురితో కలిసిపోవడం ఎలా? మనం మళ్లీ ఈ పాఠాలు నేర్చుకోవాలా
- రచయిత, క్రిస్టైన్ రో
- హోదా, బీబీసీ వర్క్ లైఫ్
కోవిడ్ కారణంగా మన సామాజిక సంబంధాలలో పెను మార్పులు వచ్చాయి. ఇప్పుడు వాటిని తిరిగి గాడిన పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. కానీ, అది ఎలా అన్నదే అసలు ప్రశ్న.
పాడ్‌కాస్ట్ డైరక్టర్‌గా పని చేస్తున్న డేనియల్ లావెరీ కరోనా సమయంలో చాలామందికి సలహాలు, సూచనలు ఇస్తూ గడిపారు. కానీ అప్పుడప్పుడు మాత్రమే తన ఆందోళనను, భయాలను ఇతరులతో షేర్ చేసుకునేవారు.
కోవిడ్ కారణంగా ఏర్పడిన ఒంటరి జీవితం, తదనంతర పరిస్థితులకు ఆందోళన చెందుతున్న ఓ విద్యార్ధితో ఆయన ఇటీవల మాట్లాడారు. ఈ సందర్భంగా తన భావాలను ఆయన ఆ విద్యార్ధితో పంచుకున్నారు.
మనుషుల మధ్య ఉన్నట్లు ఊహించుకోవడం చాలా కష్టమైన వ్యవహారంగా మారిందన్నారాయన. “ఓ పెద్ద గదిలో, మాస్కులు లేని అనేకమంది ప్రజల మధ్య నిలబడి ఉండటం అనే ఆలోచన వచ్చినప్పుడు, ఈ రోజు కోసమే కదా నేను ఎదురు చూస్తున్నది అనిపిస్తుంది” అని అన్నారాయన.
మనలో చాలామంది ఆలోచనలు దాదాపు ఇలాగే ఉన్నాయి. ప్రజలంతా బలవంతంగా విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏడాదిపాటు భౌతికంగా కలుసుకునే అవకాశం కలగలేదు.
దీంతో ఒకరినొకరు కలుసుకోవడం అనే ఊహే చాలామందికి భయంకరంగా మారింది. పరిస్థితి ఎంతగా మారిందంటే.. పక్కవాడిని ఎలా పలకరించాలి, ఎలా కలిసి కూర్చోవాలి లాంటివన్నీ మళ్లీ నేర్చుకోవాలని అనిపించేలా తయారైంది.
ఆఖరికి కలలు కూడా కరోనా మహమ్మారి కారణంగా పీడకలలుగా మారిపోయి నిద్రలేని రాత్రులను మిగుల్చుతున్నాయి.
మరి కరోనా వెళ్లిపోయి, పరిస్థితులు చక్కబడినప్పుడు మనం ఇవన్నీ నిజంగానే నేర్చుకోవడం మొదలు పెట్టాలా? సామాజిక బంధాలను ఏర్పరుచుకోవడంలో తిరిగి ట్రైనింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందా?
అదృష్టం ఏంటంటే దీనికి మరీ ఎక్కువ శ్రమ అక్కర్లేదు. కోవిడ్-19 ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాలను పరిశీలించినప్పుడు పరిస్థితులు మామూలుగా మారడానికి ఎక్కువకాలం పట్టదని అర్ధమవుతుంది.
అయితే, కొన్ని ఒడిదొడుకులైతే ఉంటాయి, దానికి అంతా ప్రిపేర్ కావాలి.
బందిఖానాలో మెదడు
లాక్‌డౌన్ కారణంగా మన మనసులు బందిఖానాలో ఇరుక్కుని, తుప్పు పట్టిపోయినట్లుగా మారాయని చాలామంది భావిస్తున్నమాట నిజం. లాక్‌డౌన్ రెండు రూపాలలో మనిషి మెదడుపై ప్రభావం చూపింది.
ఉదాహరణకు మెదడులో ప్రాసెసింగ్ సెంటర్‌లా పని చేసే ‘అమిగ్దలా’ అనే ప్రాంతం సమాజంతో తక్కువ సంబంధాలు ఉన్న వ్యక్తులలో చాలా చిన్నగా ఉంటుంది.
తీవ్రమైన ఒంటరితనం, ఒత్తిడిలాంటివి మెదడులో సామాజిక సంబంధాలకు సంబంధించిన హార్మోన్‌లపై ప్రభావం చూపుతాయి.
ఇది ఒక్కోసారి డిప్రెషన్‌కు కూడా దారి తీయవచ్చు. అంటే ఒంటరితనంలో గడిపిన వ్యక్తులు ఒక్కోసారి మతిస్థిమితాన్ని కోల్పోవడమే కాక, నెగెటివ్ ఆలోచనల్లోకి కూడా వెళ్లే అవకాశం ఉంది.
ఇక దీర్ఘకాలిక ఒంటరితనం జ్ఞాపక శక్తిని తగ్గించి, అంతకు ముందు వాడిన పదజాలం కూడా గుర్తుకురాని పరిస్థితిని తెస్తుంది.
మీకేదైనా ఒక పదం నాలుక మీద ఆడుతూ, బైటికి రావడంలేదంటే మీ మీద కోవిడ్-19 లాక్‌డౌన్ ప్రభావం పడిందని అర్ధం.
మనుషుల్లాంటి సంఘజీవులు తమ మెదడు సవ్యంగా పని చేయాలంటే సామాజిక సంబంధాలను నిత్యం కొనసాగించాల్సిన అవసరం ఉంది.
“నా మటుకు నేను ఎక్కువసేపు మా ఆవిడతోనే మాట్లాడుతుంటాను. అందులోనూ ఎక్కువగా ఒకే రకం మాటలు ఉంటాయి. అదే ఎవరైనా ఫ్రెండ్‌తో సంభాషించాలంటే చిన్నపాటి వణుకు మొదలవుతోంది. ఇంతకు ముందు మాట్లాడిన మాటలేవీ గుర్తుకు రావడం లేదు. అంటే మనుషులు అందరితో కలిసిపోయే అవకాశం ఏర్పడిన తర్వాత కూడా పదజాలం కోసం వెతుక్కునే పరిస్థితి వస్తుందన్నమాట.” అని ఈ కథనం రచయిత వెల్లడించారు.
అయితే ఇది వ్యక్తులకు, వ్యక్తులకు మధ్య మారుతుంటుంది. ఆర్ధిక పరిస్థితుల ప్రభావం కూడా ఉంటుంది. ఉద్యోగం కోల్పోయి, డబ్బులేక, ఆరోగ్యం సరిగా లేక, లాక్‌డౌన్ కాలమంతా ఒక చిన్న ఇంటిలో గడిపిన వ్యక్తి మాట తీరుకు, బాగా డబ్బుండి, పెద్ద ఇంటిలో గడిపిన ధనవంతుడి మాట తీరుకు మధ్య కచ్చితంగా తేడా ఉంటుంది.
కానీ జ్ఞాపకశక్తితో సంబంధం ఉన్న మెదడు అవయవాలలో మార్పులు తీసుకురావడం అంత సులభం కాదంటారు శాంటియాగోలోని యూనివర్సిడాడ్ మేయర్‌లో బయాలజిస్టుగా పని చేస్తున్న డేనియలా రివేరా.
లాక్‌డౌన్ ప్రభావంతో మెదడులోని కొన్ని భాగాలు కుచించుకుపోవడం వల్ల జ్ఞాపకశక్తిపై దాని ప్రభావం పడి, అది కొన్ని సంవత్సరాల వరకు కొనసాగుతుందని, మనుషులు సాటివారితో మమేకమయ్యే గుణంపై కూడా దాని ప్రభావం ఉంటుందని రివేరా అన్నారు.
అయితే ఇది మెదడులో మార్పులకు సంబంధించిన వ్యవహారమొక్కటే కాదు. ఇతరులతో మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మనుషులు చాలా ఒత్తిడికి గురవుతారని నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్ అనంతర పరిస్థితుల్లాంటి కొత్త వాతావరణంలో ఎదుటి వారిని ఎలా పలకరించాలో తెలియకపోవడం, షేక్‌హ్యాండ్ లేకుండా, ఆలింగనం చేసుకోకుండా ఎలా ఆప్యాయతను వ్యక్తం చేయాలో అర్ధంకాకపోవడం, మాట్లాడటానికి సబ్జెక్టు దొరక్కపోవడంలాంటి పరిణామాలతో తాము ఒత్తిడికి గురవుతున్నామని సైకాలజిస్టులకు చాలామంది చెప్పుకుంటున్నారు.
ఇక సోషల్ యాంగ్జయిటీ డిజార్డర్‌లాంటి సమస్యలు ఉన్న మనుషులపై ఇది మరింత ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
లాక్‌డౌన్ ప్రభావం చిన్నపిల్లలపై కూడా ఎక్కువగానే ఉంటుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. మెదడు ఎదుగుతున్న దశలో వారికి సమాజంతో సంబంధాలు తెగిపోవడంవల్ల ఎదుటి వారి నుంచి నేర్చుకోవాల్సిన చాలా విషయాలు వారికి దూరమవుతాయని చెబుతున్నారు.
ఒక్కోసారి దీర్ఘకాల ఒంటరితనం వల్ల పిల్లల్లో సోషల్ ఫోబియా ఏర్పడే అవకాశం కూడా ఉందని డేనియలా రివేరా అన్నారు. అసహనం, హైపర్‌యాక్టివిటీ, యాంగ్జయిటీలాంటి లక్షణాలు కూడా కొందరిలో ఏర్పడే అవకాశం ఉందని రివేరా చెప్పారు.
దీని నుంచి బయట పడటం ఎలా ?
లాక్‌డౌన్ పరిస్థితుల ప్రభావం ఒక్కొక్క సమాజం మీద ఒక్కొక్క రకంగా ఉంది. అయితే అందరిలో సమానంగా కనిపించే లక్షణాలు కూడా కొన్ని ఉన్నాయి.
“ఎదురుపడిన పరిచయస్తుడితో దూరదూరంగా నిలబడి మాట్లాడాల్సిన పరిస్థితి భయంకరమైన అనుభవం. షేక్‌హ్యాండ్‌కు బదులు మోచేతులు కలపడం హెలో చెప్పడానికి సరికొత్త చర్యగా మారింది.” అన్నారు ఈక్వెడార్‌లో ట్రావెల్ కంపెనీ నడుపుతున్న ఆండ్రీ రోబల్స్.
మాస్కులు ధరిస్తూ అందరితో కలిసిపోవడమే ఇప్పుడున్న మార్గమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మాస్కులు ధరించిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయని, ఇప్పుడవి కొత్త కాదు కాబట్టి వాటిని ధరించి మామూలు మనుషులైపోవడమే మార్గమని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో సైకాలజిస్టుగా పని చేస్తున్న రోగర్ హో వ్యాఖ్యానించారు.
అయితే పరిమిత సంఖ్యలో ఇతరులతో కలవడం కొంత వరకు ఉపయోగపడుతుందని, అటు శారీరకంగా, మానసికంగా కొంత రిలాక్సింగ్‌గా ఉంటుందని మరికొందరు అభిప్రాయాపడ్డారు.
సర్దుకుపోక తప్పదు
లాక్‌డౌన్ అనంతర పరిణామాలను ఎదుర్కోవడంలో కొంత ఓపిక అవసరమని అమెరికాలోని ‘నేషనల్ సోషల్ యాంగ్జయిటీ సెంటర్’ నిపుణులు అన్నారు. “ మనలో చాలామంది కొంతకాలంపాటు విచిత్రంగానే కనిపిస్తారు. భరించాలి.” అని అంటున్నారు నిపుణులు.
వ్యాక్సినేషన్ ప్రక్రియ నడుస్తున్నా, అది చాలా నెమ్మదిగా సాగుతోందని, అది ముగిసే వరకు కాస్త సర్దుకుపోక తప్పదని నిపుణులు చెబుతున్నారు.
లాక్‌డౌన్ తర్వాత ఎదుటి వ్యక్తులతో కలవడానికి ఇబ్బందులు పడుతూ, సోషల్ యాంగ్జయిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నవారికి జరుగుతున్న చికిత్సలో అనేక కొత్తవిధానాలు అవలంబిస్తున్నారు నిపుణులు.
వీరిలో కొందరికి ఎక్స్‌పోజర్ థెరపీ ఇస్తుండగా, మరికొందరికి సోషల్ మీడియా ద్వారా ఇతరులతో మమేకమయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి కేవలం మానసిక చికిత్సే కాక, సైక్లింగ్‌లాంటి ఫిజికల్ ఎక్సర్‌సైజులు, వర్చువల్ కాఫీషాప్, బ్రెయిన్ గేమ్స్‌లాంటి కార్యక్రమాల ద్వారా మెదడుకు చురుకుదనం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు నిపుణులు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: గాడిద మాంసం తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా.. ఏపీలో ఎందుకంత గిరాకీ పెరుగుతోంది
- మోటేరా స్టేడియం.. అపూర్వమైన ప్రపంచ రికార్డులకు వేదిక
- నరసరావుపేట అనూష హత్య: నిందితుడు పోలీసు కస్టడీలో ఉన్నాడా... పరారీలో ఉన్నాడా?
- సద్దాం హుస్సేన్ కూతురు రగద్: 'నా భర్తను మా నాన్నే చంపించారు'
- దేశద్రోహ చట్టం: అసమ్మతిని అణచివేయడానికి ప్రయోగిస్తున్న అస్త్రం
- గ్యాంగ్ రేప్ నిందితుడు పోలీసులకు దొరక్కుండా 22 ఏళ్లు ఎలా తప్పించుకు తిరిగాడు?
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
- ‘‘నెలలో 15 రోజులు దేవతలా వుంటుంది...మిగిలిన సగం మాత్రం రాక్షసిలా చేస్తుంది...’’: పీఎంఎస్ అంటే ఏమిటి?
- ‘‘నా శరీరం, అవయవాలను మరణానంతరం దానం చేస్తానంటే, నాకు పిచ్చి పట్టిందేమో అనుకున్నారు’’
- మీ ఇష్టాలు ఏంటో నిజంగా మీకు తెలుసా? ఈ విషయంలో మీరు సులభంగా మోసపోతారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)