కరోనావైరస్: కోలుకున్నవారి మానసిక ఆరోగ్యం - ఇటలీలో మరో అత్యవసర పరిస్థితి

    • రచయిత, మార్తా బెల్లింగ్రేరీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘కోవిడ్ రోగులు ఆస్పత్రిలోకి అడుగుపెట్టినపుడు.. ఇక అంతా ముగిసిపోతుందని భావించటం మొదలుపెడతారు’’ అని చెప్పారు సైకాలజిస్ట్ తొమాసో స్పెరాంజా.

ఆయన ఆస్పత్రి రోమ్‌లోని స్పలాంజానీ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్ ఇన్‌స్టిట్యూట్‌.. ఇటలీలో 32,000 మందికి ప్రాణాలను బలితీసుకున్న కరోనావైరస్ క్రైసిస్ మీద పోరాటానికి సారథ్యం వహిస్తోంది.

కానీ.. కోవిడ్-19 విజృంభణ మొదలైనప్పటి నుంచీ దానికి సమాంతరంగా అదే వ్యాధితో ముడిపడివున్న మరో అత్యవసర పరిస్థితిని కూడా ఈ ఆస్పత్రి చవిచూస్తోంది.

చనిపోతామనే భయం, ఆందోళన, కుంగుబాటు, కోపం, భయభ్రాంతులు, నిద్రలేమి, న్యూనతాభావం ఇప్పుడు సాధారణ లక్షణాలుగా మారాయి. సాధారణంగా ప్రకృతి విపత్తులు, యుద్ధాల నుంచి ప్రాణాలతో బయటపడిన వారి మీద ప్రభావం చూపేవి ఇవి.

‘‘రోగులను అత్యవసరంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చాల్సిన అవసరం లేకపోతే.. వారి భయాలను పోగొట్టటానికి మొదటి థెరపీ సెషన్ నిర్వహిస్తాం. ఆశావహంగా మార్చటానికి ప్రయత్నిస్తాం. వారు ఒంటరిగా లేరని చెప్తాం. ఆస్పత్రి సిబ్బంది మీద నమ్మకం ఉంచాలని ప్రోత్సహిస్తాం. వారి ప్రాణాలను కాపాడటానికి వైద్య సిబ్బంది శాయశక్తులా కృషి చేస్తారని భరోసా ఇస్తాం’’ అని డాక్టర్ స్పెరాంజా వివరించారు.

కోవిడ్-19 రోగులతో సైకాలజిస్టుల బృందం నిత్యం మాట్లాడుతూ ఉంటుంది.

‘‘కొన్నిసార్లు రోగి కన్నా వారి కుటుంబం ఎక్కువగా బాధ పడుతుంటుంది. వాళ్లు సందర్శించటానికి రాలేరు. కేవలం నిరీక్షించటం మాత్రమే చేయగలరు. వారికి వివరాలు చెప్పటానికి మేం ఫోన్ చేస్తుంటాం. సాధ్యమైతే వీడియో కాల్స్ ద్వారా వారి ఆత్మీయులతో మాట్లాడిస్తుంటాం. ఇదంతా ఉద్వేగపరమైన అలసట కలిగిస్తుంది. మేం వారికి మంచి స్నేహితులుగా మారతాం’’ అని ఆయన చెప్పారు.

ప్రభుత్వ, ప్రైవేటు, సేవా రంగాలకు చెందిన సైకాలజిస్టులు కలిసి.. ఈ మానసిక ఆరోగ్య అత్యవసర పరిస్థితిలో తమ సహాయాన్ని ఉచితంగా అందించటానికి ముందుకు వచ్చారు.

ఈ సంక్షోభంలో లాంబార్డీ ముందు వరుసలో ఉంది. ఇటలీ మరణాల్లో సగం ఈ ప్రాంతంలోనే సంభవించాయి.

డామియానో రిజ్జీ ఆయన బృందం మిలాన్ దక్షిణ ప్రాంతంలోని పావియాలో గల సాన్ మాటియో ఆస్పత్రిలో పనిచేస్తారు.

‘‘ఇన్సెంటివ్ కేర్ యూనిట్‌లో డాక్టర్లు, నర్సులు, పేషెంట్లకు మద్దతుగా 15 మందితో కూడిన మా సైకాలజిస్టుల బృందం పనిచేస్తోంది’’ అని ఆయన బీబీసీకి చెప్పారు.

ఆయన ఫౌండేషన్ సోలిటీర్ గ్రూప్ వ్యవస్థాపకుడు. ‘‘మాకు అత్యంత కష్టమైన పని.. మాకు వ్యక్తిగతంగా తెలియని రోగుల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, వారి ఆత్మీయులు చనిపోయారని చెప్పటం’’ అని పేర్కొన్నారు. ఒక్కోసారి రోజుకు పది సార్లు ఇలాంటి ఫోన్లు చేయాల్సి వస్తుంది.

రోగులతో పాటు డాక్టర్లు, నర్సులు కూడా దోషభావనతో ఉండటం వీరు చూస్తున్నారు. డాక్టర్లు, నర్సుల్లో ఒత్తిడి శాశ్వతంగా మారుతోందని, వాస్తవంతో సంబంధం లేనట్లుగా అయిపోతున్నారని డాక్టర్ రిజ్జీ తెలిపారు.

వాళ్లు చేయగలిగినదంతా చేశారని, వందలాది మంది ప్రాణాలను కాపాడారని వారికి భరోసా కల్పించటానికి సైకాలజిస్టులు పనిచేస్తున్నారు. ‘‘మా వృత్తి – వైద్య వృత్తిలో ఉండే పరిమితుల గురించి మేం వారికి గుర్తుచేస్తాం. యుద్ధం కొనసాగిస్తామని చెప్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.

ఒక్కోసారి ఒక కుటుంబానికి చెందిన పలువురు సభ్యులు ఒకే ఆస్పత్రిలో చావుతో పోరాడుతుంటారు. ఇది రోగులకు వేరేరకమైన అపరాధభావన కలిగిస్తుంది.

‘‘ఇద్దరిలో ఒకరు చనిపోతే.. మరొకరు వైరస్ తమ ప్రాణాలు తీసుకుని తమ వారిని వదిలివేయాల్సిందని మాతో అంటుంటారు’’ అని డాక్టర్ రిజ్జీ తెలిపారు.

కోలుకున్న వారిలో ఆగ్రహం, ఇతర భావోద్వేగాలను తగ్గించటం సైకాలజిస్టుల బృందం లక్ష్యం. మేయర్, స్థానిక సంస్థలు, చర్చి ఫాదర్ వంటి వారితో వీరిని అనుసంధానం చేస్తూ మద్దతునిచ్చే వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.

‘‘చెప్పాలంటే బాధాకరమే కానీ.. మేం ఇక్కడ యుద్ధ మనస్తత్వశాస్త్రాన్ని అమలు చేస్తున్నాం’’ అని ఆయన వెల్లడించారు.

ఇక తన సహచరులు సైతం.. తమకు కూడా వైరస్ సోకుతుందోమోనని, దానిని తమ కుటుంబ సభ్యులకు కూడా అంటిస్తామేమోనని తీవ్రంగా భయపడుతుంటారని ఆయన చెప్పారు.

వీరు దాదాపుగా ఫోన్ ద్వారా, వీడియో కాల్ ద్వారా పని చేస్తుంటారు. ఇన్‌పెక్షన్ భయం వల్ల ఆస్పత్రుల లోపలికి చాలా అరుదుగా మాత్రమే వెళ్తుంటారు.

శోకాన్ని ఎదుర్కోవటం

ఇంత భారీ స్థాయిలో మరణాలను తట్టుకోవటం, ఇంత మంది జనం శోకాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో.. మానసిక సంక్షోభంలో మద్దతు అందించటానికి.. ఆరోగ్య మంత్రిత్వశాఖ ఏప్రిల్ చివరిలో ఒక ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ప్రారంభించింది.

శరణార్థుల కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థ మెడిటరేనియాకు చెందిన సైకోథెరపిస్ట్ ఫ్రాన్సెస్కో కపూటో ఒక హాట్‌లైన్ ప్రారంభించారు.

మొదట్లో జనం స్పష్టమైన సమాచారం కోసం వచ్చేవారు. ఆ తర్వాత ఆత్మీయులను కోల్పోయి కుంగిపోయి సహాయం కోసం ఫోన్ చేసేవారు. ఒక ఉదంతంలో ఒక మహిళ తండ్రి 40 ఏళ్లుగా తన జీవితం పంచుకున్న భాగస్వామిని కోల్పోయారు.

‘‘ఆమె తన తండ్రి గురించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు’’ అని కపూటో చెప్పారు. ఆమె తల్లి ఇంట్లోనే చనిపోయారు. ఆమె తండ్రి రాత్రంతా ఒంటరిగానే తన భార్య దగ్గర ఉన్నారు.

‘‘ఆమె బాధను వినటానికి సిద్ధంగా ఉన్న ఒక హృదయం ఆమెకు అవసరమైంది. ఆమె తండ్రి ఒంటరిగా మిగిలారనే ఆలోచనే భరించలేకపోయారు’’ అని తెలిపారు. తన తండ్రికి వీడియో కాల్ చేసి మాట్లాడాలని, సమయానికి తింటున్నారా, తాగుతున్నారా వాకబు చేయాలని కపూటో ఆమెకు సూచించారు.

ఇప్పటివరకూ.. కోవిడ్-19తో చనిపోయిన వారి అంత్యక్రియలకు వారి కుటుంబ సభ్యులు హాజరవటానికి అనుమతించలేదు. ఇప్పుడు అది మారుతోంది. ఓ 15 మంది వరకూ బంధువుల హాజరయ్యేందుకు అనుమతిస్తున్నారు.

ఆస్పత్రి వెలుపల జీవితానికి సిద్ధం చేయటం

మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం ఒక విషయమైతే.. దేశ వ్యాప్తంగా 2,26,699 కేసులు నమోదవటం మరొక విషయం.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారిలో చాలా మందికి తాము ఎదుర్కొన్న మానసిక వేదన నుంచి బయటపడటం చాలా కష్టంగా మారింది.

రోగులు తిరిగి ఇళ్లకు వెళ్లిన తర్వాత కూడా వారితో సంప్రదింపులు కొనసాగిస్తూ ఉండటానికి స్పాలాంజాని ఆస్పత్రి ప్రయత్నిస్తూ ఉంటుందని తొమాసో తెలిపారు.

‘‘ఇంటికి వెళ్లినందువల్ల వారికి కొంత ఊరట లభిస్తుంది. కానీ కుటుంబ సభ్యులను కలవటానికి వీలులేదు. ఇంకా ఐసొలేషన్‌లోనే ఉండాల్సి ఉంటుంది. ఒంటరిగా ఉండటం వల్ల ఆస్పత్రిలో అనుభవించిన మనోవేదనను వారు మళ్లీ ఎదుర్కొంటారు’’ అని ఆయన వివరించారు.

రోగులు ఆస్పత్రి నుంచి వెళ్లటానికి ముందు.. సైకాలజిస్టులు వారిని బయట జీవితం కోసం సంసిద్ధం చేస్తారు.

‘‘ఆహారం ఎవరు తెచ్చిస్తారు, వారు అనుసరించాల్సిన థెరపీ ఏమిటి వంటి విషయాలు వారికి తెలియజేస్తాం. సరిగ్గా నిద్రపోతున్నారా అనేది చూస్తుంటాం. మళ్లీ వేదన తిరగబెడితే శాంతింపజేయటానికి ప్రయత్నిస్తాం. కుటుంబ సభ్యులతో కూడా మేం మాట్లాడతాం. మద్దతుగా ఉండే ఒక చిన్న సంకేతం కూడా వారి వేదనను తగ్గిస్తుంది’’ అని డాక్టర్ తొమాసో చెప్పారు.

ఆస్పత్రి సిబ్బంది సైతం నిరంతర పని, మానసిక ఉద్వేగాలతో తీవ్ర ఒత్తిడికి లోనుకాకుండా వారి సంక్షేమాన్ని కూడా ఆయన చూసుకోవాల్సి ఉంటుంది.

అయితే రోగులే స్వయంగా ఆశాదీపాలుగా కనిపిస్తుంటారు.

ఓ 75 ఏళ్ల వ్యక్తి ఆస్పత్రిలో అడుగుపెడుతూనే తీవ్ర భయాందోళనలతో బెంబేలెత్తిపోయారు. కానీ డాక్టర్ తొమాసోతో మాట్లాడిన తర్వాత ఆయన వైఖరి మారింది.

ఈ వైరస్ తనను చంపబోదని ఆయన నిర్ణయించుకున్నారు. తన మనవడు పుట్టే వరకూ వేచివుంటానని తీర్మానించుకున్నారు.

‘‘నేను ఇక్కడి నుంచి బయటపడతాను. ఈ సరికొత్త వింత ప్రపంచంలోకి నా మనవడిని నేను ఆహ్వానించాలి’’ అని కృతనిశ్చయం చేసుకున్నారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యలు, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)