కరోనావైరస్: శవపేటికలతో నిండిన ఇటలీ.. మరణించిన వారికి అంతిమ సంస్కారాలనూ దూరం చేసిన కోవిడ్-19

    • రచయిత, సోఫియా బెట్టిజ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రియతములు ఎవరైనా చనిపోతే, వారికి చివరిగా కన్నీటి వీడ్కోలు పలకడం మనకు చాలా ముఖ్యం. కానీ కరోనావైరస్ ఇటలీ ప్రజలకు ఆ చివరిచూపు కూడా లేకుండా చేసింది.

మృతులకు ఇచ్చే చివరి గౌరవాన్ని కూడా లాగేసుకున్న కోవిడ్-19, సజీవంగా ఉన్న వారి కుటుంబ సభ్యులను మరింత విషాదంలో ముంచేస్తోంది.

"ఈ మహమ్మారి రెండు సార్లు చంపింది" అని మిలాన్‌లో శవాలను ఖననం చేసే ఆండ్రియా సెరటా అన్నారు.

"మొదట ఇది చనిపోయే ముందు మనల్ని మన ప్రియమైనవారి నుంచి దూరంగా ఒంటరిని చేస్తుంది. తర్వాత అది మన దగ్గరకు ఎవరూ రాకుండా చేస్తుంది" అన్నారు.

"కుటుంబాలు సర్వనాశనం అయ్యాయి, దానిని అంగీకరించడం చాలా కష్టంగా ఉంది" అంటారు.

ఒంటరితనంలోనే మరణం

కోవిడ్-19 బాధితులు చాలామంది స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరూ దగ్గర లేని సమయంలో ఆస్పత్రిలోని ఐసొలేషన్‌లోనే చనిపోతున్నారు.

వైరస్ మరణానంతరం కూడా ఇతరులకు సోకుతుందని, బట్టలపై కూడా కొన్ని గంటలపాటు అది సజీవంగా ఉంటుందని డాక్టర్లు చెబుతుండడంతో బాధితుల మృతదేహాలను తక్షణం సీల్ చేసేస్తున్నారు.

"వారిని కనీసం చివరి సారైనా చూడనీయండి అని ఎన్నో కుటుంబాలు మమ్మల్ని ప్రాధేయ పడుతుంటాయి. కానీ అది సాధ్యం కాదు" అని క్రిమోనాలో శవాలు తీసుకెళ్లే మాసిమో మాంకస్ట్రోప్పా చెప్పారు.

మృతులను వారికి ఇష్టమైన, అందమైన బట్టలతో ఖననం చేయడం జరగదు. ఆ బట్టలకు బదులు వారి శరీరంపై ఆస్పత్రిలో అందరికీ వేసే గౌను ఉంటుంది.

అయినప్పటికీ, మాంకస్ట్రోప్పా తను చేయగలిగిన వాటిని చేస్తున్నారు.

"మేం వారి కుటుంబాలు ఇచ్చిన బట్టలను, అంటే, మృతదేహం పైన చొక్కా, కింద స్కర్ట్, ప్యాంట్ లాంటివి కప్పుతూ ఉంటాం" అన్నారు.

మమ్మల్ని నమ్మడం తప్ప వేరే దారి లేదు

ఎప్పుడూ చూడని ఇలాంటి పరిస్థితుల్లో శవాలు మోస్తున్న వారంతా, హఠాత్తుగా వారి కుటుంబ సభ్యులు,స్నేహితులు, అంత్యక్రియలు నిర్వహించే ప్రీస్ట్ పాత్రలను భర్తీ చేస్తుంటారు.

"ఎందుకంటే, ఆ పరిస్థితుల్లో వైరస్ వల్ల చనిపోయిన వారి బంధువులు కూడా తరచూ క్వారంటైన్‌లోనే ఉంటుంటారు. వారి బాధ్యతలన్నీ మేమే తీసుకుంటాం" అంటారు సెరాటో

"మేం మృతులు ఉన్న శవపేటికల ఫొటోలను వారి కుటుంబ సభ్యులకు పంపిస్తాం. తర్వాత హాస్పిటల్ నుంచి మృతదేహాన్ని తీసుకుని వాటిని ఖననం లేదా దహనం చేస్తాం. వారికి మమ్మల్ని నమ్మడం తప్ప వేరే దారి లేదు" అన్నారు.

సెరాటోకు అత్యంత కష్టంగా అనిపించే విషయం ఒకటుంది. విషాదంలో ఉన్న కుటుంబ సభ్యుల బాధ తీర్చలేకపోవడం, వారు అడిగిన అన్నింటినీ చేయలేకపోవడం. అంత్యక్రియల్లో మృతదేహానికి ఏమేం చేయాలో వారు చెబుతుంటారు. కానీ అవి చేయలేకపోతున్న అతడి మనసులో వారు చెప్పిన ప్రతి ఒక్కటీ అలాగే గుర్తుండిపోయాయి.

"మనం వాటికి బట్టలు వేయలేం. వారి జుట్టు దువ్వలేం. మేకప్ వేసి, వారిని అందంగా కనిపించేలా చేయలేం.. అది చాలా బాధగా ఉంటుంది" అన్నారు.

శవాలను తీసుకెళ్లే విధులు

సెరాటో గత 30 ఏళ్లుగా మృతదేహాలు తీసుకెళ్లే పనిచేస్తున్నారు. ఇది ఆయనకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చింది.

విషాదంలో ఉన్న మృతులు కుటుంబ సభ్యులకు చాలా చాలా ముఖ్యమైన చిన్న చిన్న విషయాలు ఉంటాయి అని ఆయన భావిస్తున్నారు.

"చివరిసారి వారి బుగ్గమీద నిమరడం, వారి చేయి పట్టుకోవడం, దీర్ఘనిద్రలో ఉన్నవారికి కన్నీటి వీడ్కోలు పలకడం లాంటివన్నీ చేయలేకపోయామే అనే బాధ వారికి ఉంటుంది" అన్నారు.

వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత సమయంలో శవాలను తీసుకెళ్లే వీరు, మృతుడి కుటుంబ సభ్యులను తలుపులకు ఇవతలివైపు నుంచే కలవాల్సి ఉంటుంది.

అప్పటికీ, బంధువులు మృతదేహంతోపాటూ ఖననం చేసేలా అతడి చేతికి ఏవైనా రాసిన పేపర్లు, కుటుంబ వస్తువులు, చిత్రాలు, కవితలను అందంచాలని ప్రయత్నిస్తుంటారు.

వ్యక్తిగత వస్తువులను మృతదేహంతోపాటూ ఇప్పుడు ఖననం చేయడం చట్టవిరుద్ధం. వ్యాధి వ్యాపించకుండా తీసుకున్న కఠిన చర్యల్లో ఇది ఒకటి.

ఇళ్లలో ఎవరైనా చనిపోతే, శవాలు తీసుకెళ్లే వారిని ఇప్పటికీ లోపలికి అనుమతిస్తున్నారు. కానీ వారు పూర్తిగా ప్రొటెక్టివ్ గేర్, అంటే కళ్లజోడు, మాస్క్, గ్లోవ్స్, కోట్ వేసుకుని ఉండాలి.

కానీ, శవాలు తీసుకెళ్లేవారు చాలామంది ఇప్పుడు సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. కొందరు అయితే తమ వ్యాపారాలు మూసేయాల్సి వచ్చింది. మృతులను తీసుకెళ్లే సమయంలో వేసుకోడానికి తగినన్ని మాస్కులు, గ్లోవ్స్ లభించకపోవడం వీరికి ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది.

"మా దగ్గర మరో వారం పాటు పని చేసేందుకు సరిపోయే ప్రొటెక్టివ్ గేర్ మాత్రమే ఉంది. అవి కూడా అయిపోతే.. మేం ఈ పని చేయడం కుదరదు. దేశంలో అంత్యక్రియలు నిర్వహించే అతిపెద్ద హోమ్స్ లో ఇది ఒకటి. మిగతావారు ఈ కొరతను ఎలా ఎదుర్కుంటున్నారో ఊహించలేకపోతున్నా" అని సెరాటో అన్నారు.

అంత్యక్రియలపై నిషేధం

వైరస్ వ్యాపించకుండా ఒక అత్యవసర జాతీయ చట్టం ద్వారా ఇటలీలో అంత్యక్రియలను నిషేధించారు. బలమైన రోమన్ కాథలిక్ విలువలు పాటించే ఈ దేశంలో ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందెప్పుడూ రాలేదు.

ఆండ్రియా రోజుకు కనీసం ఒక శవాన్ని ఖననం చేస్తుంటారు. అక్కడ మృతులకు చివరిసారి వీడ్కోలు పలకడానికి బంధువుల్లో ఒక్కరు కూడా కనిపించరు. ఎందుకంటే అందరూ క్వారంటైన్‌లో ఉంటారు.

"ఖననం చేసేటప్పుడు అక్కడ ఒకరిద్దరిని అనుమతిస్తారు. అంతే.. అక్కడ ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడరు. నాకు వీలున్నప్పుడు అలా జరగకుండా చూస్తా" అని మాస్సిమో చెబుతున్నారు.

మాస్సిమో శవపేటికను కార్లో పెట్టుకుని చర్చికి వెళ్తారు. డిక్కీ తెరిచి ప్రీస్టును మృతుడికి దీవెనలు అందించాలని అడుగుతారు. అది ఎప్పుడూ సెకన్లలో పూర్తవుతుంది. ఎందుకంటే తర్వాత మృతదేహం వారి కోసం ఎదురుచూస్తుంటుంది.

శవపేటికలతో నిండిన దేశం

మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో ఇటలీలోని మార్చురీలన్నీ నిండిపోతున్నాయి.

ఇప్పటివరకూ(మార్చి 23) కరోనావైరస్‌ వల్ల దేశంలో 6 వేల మందికి పైగా మరణించారు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఇది అత్యధికం.

"క్రిమోనాలో మా అంత్యక్రియల హోమ్ బయట క్యూ కట్టారు. ఇది దాదాపు ఒక సూపర్ మార్కెట్‌లో ఉన్నట్టుంది" అని ఆండ్రియా చెప్పారు.

ఉత్తర ఇటలీలోని ఆస్పత్రుల్లో మార్చురీలన్నీ నిండిపోయాయి. క్రిమోనా హాస్పిటల్‌లో ఉన్న చిన్న చర్చి ఒక గిడ్డంగిలా మారిపోయింది అని మాంకస్ట్రోప్పా చెప్పారు. మిగతా చర్చిల్లో కూడా శవపేటికలను పేర్చేస్తున్నారు.

ఇటలీలో అత్యధిక కరోనా కేసులు నమోదైన బెర్గామోలో సైన్యం రంగంలోకి దిగింది. నగరంలోని స్మశానాలన్నీ ఇప్పుడు నిండిపోయాయి.

గత వారం ఒక రాత్రి 70కు పైగా శవపేటికలను తీసుకుని ఆర్మీ కాన్వాయ్ నిశ్శబ్దంగా వెళ్తున్న దృశ్యం చాలామందిని కలచివేసింది.

అందులో ఉన్న మృతదేహాలను పక్కనే ఉన్న నగరంలో ఖననం చేయడానికి తీసుకెళ్లారు.

మహమ్మారి మొదలైనప్పటి నుంచి బయటికొచ్చిన కొన్ని ఫొటోలు అందరికీ షాక్ ఇచ్చాయి.

శవాలు మోసినా గుర్తింపు లేదు

ఇటలీ ఎప్పుడూ ఎదుర్కోని అత్యంత కఠిన సమయంలో రక్షకులుగా, హీరోలుగా నిలిచారని దేశవ్యాప్తంగా ఉన్న డాక్టర్లు, నర్సులను కీర్తిస్తున్నారు. కానీ, వైరస్ వచ్చిన మృతదేహాల మోసుకెళ్తూ, వాటికి అంత్యక్రియలు చేస్తున్నవారికి తగిన గుర్తింపు లభించడే లేదు.

చాలా మంది మమ్మల్ని మృతదేహాలను రవాణా చేస్తున్నవారుగానే చూస్తున్నారని మాస్సిమో నవ్వుతూ చెబుతారు.

"చాలా మంది ఇటలీప్రజలు, మేం చేస్తున్న పనిని పురాణాల్లో పాతాళంలో ఉండే భయంకరమైన పడవ మనిషి కేరన్‌లా చూస్తున్నారు. ఆయన అప్పుడే చనిపోయిన వారి ఆత్మలను మృతుల ప్రపంచం, జీవు ప్రపంచాన్ని వేరు చేసే నది దాటిస్తూ ఉంటాడు. చాలా మంది దృష్టిలో ఇది కృతజ్ఞత అవసరం లేని, వారు ఊహించలేని ఒక పని. కానీ, మాకు తెలిసిందల్లా, మృతులను గౌరవించడమే.. అని నేను మీకు చెప్పగలను" అన్నారు.

#Andratuttobene - "అన్నీ సర్దుకుంటాయి" అనే హాష్‌టాగ్ ప్రస్తుతం ఇంధ్రదనస్సు ఎమోజీతో ఇటలీలో ట్రెండ్ అవుతోంది.

కానీ, ప్రస్తుతానికి కనుచూపుమేరలో ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అందరూ దానికోసం ప్రార్థిస్తున్నప్పటికీ.. ఇక్కడి పరిస్థితులు మళ్లీ ఎప్పుడు కుదుటపడతాయో ఎవరికీ తెలీడం లేదు.

చిత్రాలు - జిల్లాడస్టమాల్చి

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)