కరోనావైరస్‌: క్లోరోక్విన్‌తో కోవిడ్-19 నయమైపోతుందా? ఈ మలేరియా మందు మీద డోనల్డ్ ట్రంప్ ఎందుకు దృష్టి పెట్టారు?

    • రచయిత, రియాలిటీ చెక్ టీమ్
    • హోదా, బీబీసీ న్యూస్

మలేరియా చికిత్స కోసం ఉపయోగించే ఒక ఔషధాన్ని.. కొత్త కరోనావైరస్‌ వ్యాధికి చికిత్స కోసం ఉపయోగించటానికి అమెరికా ఆమోదించినట్లు ఆ దేశాధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పకొచ్చారు.

మలేరియా వ్యాధికి చికిత్స కోసం ఉపయోగించే మందుల్లో అందరికీ తెలిసిన చాలా పాత మందు క్లోరోక్విన్.

మరైతే ట్రంప్ చెప్పిన మాట నిజమా? క్లోరోక్విన్ ప్రభావవంతంగా పనిచేస్తుందా?

క్లోరోక్విన్ అనే మందు చాలా దశాబ్దాలుగా వినియోగంలో ఉంది. అయితే.. ఆఫ్రికాలో ఇప్పుడు ఈ మందును పెద్దగా వాడటం లేదు. దానికి కారణం.. మలేరియా పరాన్నజీవులు క్లోరోక్విన్‌ను తట్టుకోగలిగే సామర్థ్యం సంతరించుకోవటమే.

ఈ మందు వినియోగాన్ని తగ్గించటానికి కొన్ని దేశాలు నిర్దిష్ట నిబంధనలు కూడా అమలులోకి తెచ్చాయి. కానీ.. ప్రైవేటు రంగ ఔషధాల మార్కెట్ క్రియాశీలంగా ఉన్న దేశాల్లో ఈ మందును విరివిగానే వినియోగిస్తున్నారు. విస్తృతంగానే విక్రయిస్తున్నారు.

ముఖ్యంగా నైజీరియాలో ఇదే పరిస్థితి ఉంది. ఆ దేశంలో క్లోరోక్విన్ కోసం డిమాండ్ చాలా అధికంగా ఉంది, దానివల్ల మందుల షాపుల్లో కొరత కూడా తలెత్తుతోంది, అందుకు ట్రంప్ ప్రకటన కూడా ఒక కారణమని కొన్ని కథనాలు చెప్తున్నాయి.

‘‘కరోనావైరస్‌ చికిత్సకు క్లోరోక్విన్‌ను ఆమోదించలేదు’’

ట్రంప్ రోజువారీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనావైరస్‌కు చికిత్స చేయటానికి క్లోరోక్విన్‌ను ఉపయోగించవచ్చునని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదించినట్లు చెప్పుకొచ్చారు. అమెరికాలో ఔషధాలకు అనుమతులు ఇచ్చే సంస్థ ఎఫ్‌డీఏ.

''ఈ మందును తక్షణమే అందుబాటులో ఉండేలా మేం చేయబోతున్నాం. ఈ విషయంలో ఎఫ్‌డీఏ అద్భుతంగా స్పందించింది. అమోద ప్రక్రియను పూర్తిచేసింది. ఈ మందును ఆమోదించింది'' అని ఆయన పేర్కొన్నారు.

మరింత స్పష్టత కోసం.. మలేరియాతో పాటు ఆర్థ్రరైటిస్ వ్యాధులకు చికిత్స చేయటానికి క్లోరోక్విన్‌ను వాడవచ్చునని ఎఫ్‌డీఏ ఆమోదించింది. కానీ.. కొత్త కరోనావైరస్ వల్ల వచ్చే కోవిడ్-19 వ్యాధికి చికిత్స కోసం కానీ, ఆ వ్యాధిని నివారించటానికి కానీ ఈ మందును ఉపయోగించటానికి ఆమోదం లేదని ఎఫ్‌డీఏ స్పష్టంచేసింది.

''కోవిడ్-19 వ్యాధికి చికిత్స చేయటానికి కానీ, ఆ వ్యాధి రాకుండా నివారించటానికి కానీ ఎఫ్‌డీఏ ఆమోదించిన చికిత్సలు కానీ, మందులు కానీ ఏవీ లేవు'' అని తేల్చిచెప్పింది.

అయితే.. కోవిడ్-19 చికిత్సలో క్లోరోక్విన్ ఎంత ప్రభావవంతంగా ఉంటుందనేది చూడటానికి అధ్యయనాలు జరుగుతున్నాయని ఎఫ్‌డీఏ తెలిపింది.

ఈ మందు మీద పరిశోధనల కోసం పెద్ద ఎత్తున క్లినికల్ ప్రయోగాలు ఏర్పాటు చేయాలని ట్రంప్ నిర్దేశించినట్లు కూడా ఆ సంస్థ చెప్తోంది.

అంతర్జాతీయంగా పరిశోధనలు ఎలా ఉన్నాయి?

కరోనావైరస్ రోగులకు చికిత్స కోసం జరుగుతున్న అన్వేషణలో క్లరోక్విన్ మీద దృష్టి పెట్టటంలో ఆశ్చర్యం లేదు.

ఇది బాగా తెలిసిన మందు. చౌక, ఉత్పత్తి చేయటం సులభం. మలేరియా రోగులకు చికిత్సలో.. వారి జ్వరాన్ని, వాపును తగ్గించటానికి ఈ మందును వాడారు.

''ప్రయోగశాలల్లో అధ్యయనం చేస్తున్నపుడు కరోనావైరస్‌ను క్లోరోక్విన్ అడ్డుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇది కాస్త సాయపడుతున్నట్లు కనిపిస్తోందని డాక్టర్లు కూడా ప్రస్తావిస్తున్నారు'' అని బీబీసీ హెల్త్ కరస్పాండెంట్ జేమ్స్ గళగర్ చెప్పారు.

కానీ.. నిజమైన రోగుల మీద ఈ మందు ఎలా ప్రభావం చూపుతుందనేది తెలుసుకోవటానికి చాలా కీలకమైన పూర్తిస్థాయి క్లినికల్ పరీక్షలేవీ జరగలేదు. అయితే చైనా, అమెరికా, బ్రిటన్, స్పెయిన్‌లలో ఈ పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.

ఈ మందు సమర్థత మీద ఇప్పటివరకూ నిర్దిష్టమైన ఆధారాలు లేవని, చికిత్స కోసం జరుగుతున్న ప్రయోగాల్లో దీనిని కూడా పరీక్షిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది.

అయితే.. క్లోరోక్విన్ మీద ఇప్పటికే ఆసక్తి పెరుగుతోంది.

గూగుల్ ట్రెండ్స్ సమాచారం ప్రకారం.. క్లోరోక్విన్ కోసం సెర్చి చేయటం గత వారంలో విపరీతంగా పెరిగింది. దీనిపై పరిశోధన గురించి పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ ట్వీట్ చేసినపుడు కొంత కలకలం రేగింది.

నైజీరియాలో విపరీతంగా కొనుగోళ్లు

నైజీరియాలో చర్చిలు, మసీదులు, స్కూళ్లు అన్నిచోట్లా అందరి నోటా కరోనావైరస్ మాట వినిపిస్తోందని లాగోస్‌లోని బీబీసీ పిడ్జిన్ ప్రతినిధి డానియల్ సిమెనివోరిమా చెప్పారు.

నైజీరియాలో మలేరియా చికిత్సకు క్లోరోక్విన్ వినియోగించరాదంటూ 2005లోనే నిషేధించినప్పటికీ.. చాలా మంది ప్రజలు ఇప్పటికీ ఈ ఔషధం ఉన్న మాత్రలను వినియోగిస్తూనే ఉన్నారు.

కరోనావైరస్ చికిత్సకు క్లోరోక్విన్ ఉపయోగంపై చైనాలో ఫిబ్రవరిలో నిర్వహించిన ఒక అధ్యయనం.. ఇప్పటికే లాగోస్‌లో చర్చనీయాంశంగా మారింది. దీంతో జనం క్లోరోక్విన్‌ను కొని దాచుకుంటున్నారు.

కరోనావైరస్‌ చికిత్సకు క్లోరోక్విన్‌ ఆమోదించారని ట్రంప్ ప్రస్తావించటంతో.. నైజీరియాలోని మందుల దుకాణాల్లో క్లోరోక్విన్ మొత్తం అమ్ముడైపోయింది.

కానీ.. ఆ మందు ఉపయోగించటం ఆపేయాలని నైజీరియన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రజలకు సూచించింది.

''#COVID19ను నియంత్రించటానికి, చికిత్స చేయటానికి క్లోరోక్విన్‌ను వాడవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించలేదు'' అని చెప్పింది.

జనం సొంతంగా మందులు వాడవద్దని చెప్తూ ఎన్‌సీడీసీ ప్రచారం ప్రారంభించింది.

జనం తమ భద్రత కోసం పూర్తి సమాచారం తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇది తీవ్ర దుష్పరిణామాలకు దారితీస్తోందని డానియెల్ పేర్కొన్నారు.

లాగోస్‌లో జనం అధికమోతాదులో క్లోరోక్విన్ తీసుకోవటం వల్ల విషప్రభావాలకు లోనవటం పెరుగుతోందని వార్తలు వస్తున్నాయి.

రిపోర్టింగ్: జాక్ గుడ్‌మన్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)