కరోనావైరస్ లాక్‌డౌన్: నెలల తరబడి సముద్రంలో నౌకలపై చిక్కుకుపోయిన మెరైన్ సిబ్బంది ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?

    • రచయిత, హౌవార్డ్ ముస్టో, శ్యామ్‌ ప్రాఫిట్ట్‌
    • హోదా, బీబీసీ బిజినెస్‌ రిపోర్టర్స్

ప్రపంచవ్యాప్తంగా నావికులు తమ నౌకల్లో నెలల తరబడి చిక్కుకుపోయారు. కరోనా కారణంగా సిబ్బంది మార్పిడి లేకపోవడం, తీరంలో దిగేందుకు అనుమతులు లేకపోవడంతో వారు నానా కష్టాలు పడుతున్నారు.

జీతాలు ఇస్తుండటం, కొందరికి అదనపు పేమెంట్స్‌ లభిస్తుండటంతో వాళ్లు విశ్రాంతి కూడా లేకుండా, ఒక్కోసారి రోజుకు 12గంటల చొప్పున వారమంతా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్చి నుంచి సిబ్బంది మార్పిడికి అవకాశం లేకుండాపోయింది. వారిని తీరంలో విశ్రాంతికి కూడా అనుమతించడం లేదు. దీంతో మూడు నెలలపాటు సాగే డ్యూటీ కాంట్రాక్టు రెట్టింపయ్యింది.

గతంలో రిలీఫ్‌ సిబ్బందికి ఆరోగ్యం బాగా లేకపోవడం, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కాంట్రాక్టు పొడిగించాల్సి వచ్చేది. అయితే ఈ మధ్యకాలంలో అలాంటి పరిణామం ఎదురు కాలేదని, ఇది మాత్రం ఒక అంతులేని కథలా కనిపిస్తోందని అంటున్నారు కొందరు నావికులు.

''మేం ఇక్కడ చిక్కుకుపోయాం. మాకు ఏం చేయాలో తోచడం లేదు'' అన్నారు ఒక ట్యాంకర్‌ ఓడకు చెందిన అధికారి.

''తమ దేశం ఏం నిర్ణయిస్తుందోనని అంతా ఎదురు చూస్తున్నారు. వీళ్లందరినీ వాళ్లవాళ్ల దేశాల్లోకి రానిచ్చినప్పుడు వారు తమ ఇళ్లకు వెళ్లగలుగుతారు'' అన్నారు ఆ అధికారి.

ఓడ మీద ఎంతకాలం ఉండగలుగుతారన్నది సమస్య కాదు. ఎంతకాలం ఉండాలో తెలియకపోవడమే నావికులకు పెద్ద సమస్యగా మారింది.

''ఒక్కోసారి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాం. ఇది మా మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతోంది. ఏం జరుగుతుందో తెలికపోవడం మనిషికి పిచ్చెక్కిస్తుంది'' అని ఆయన అన్నారు.

కంటెయినర్‌ ఓడలు, ట్యాంకర్‌ షిప్పులు, ఇతర నౌకల మీద పని చేసే అనేకమంది సిబ్బందిని బీబీసీ ఇంటర్వ్యూ చేసింది. తమ యాజమన్యాల అనుమతి లేదు కాబట్టి వారిలో చాలామంది తమ పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు.

వాస్తవానికి షిప్పింగ్‌ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా కష్టతరమైన పరిశ్రమ. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురయ్యే రంగం. గతంలో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కారణంగా ఇబ్బందులు పడ్డ ఈ నౌకారంగం, ఇప్పుడు కరోనా వైరస్‌ కారణంగా సమస్యలు ఎదుర్కొంటోంది.

ఈ పోటీ ప్రపంచంలో నిలకదొక్కుకునేందుకు ఖర్చులు తగ్గించుకుంటూ, యాజమాన్యాలు పెద్ద ఓడల నుంచి చిన్న ఓడలకు మారాయి. కొద్దిమంది సిబ్బందితో పని కానిస్తున్నాయి. కొన్నిదశాబ్దాలుగా ఈ ట్రెండ్ నడుస్తోంది.

ఒక ఆయిల్‌ కంటెయినర్‌షిప్ ఆఫీసర్‌ మూడు నెలల కాంట్టాక్టు కుదుర్చుకున్నాడు. ఇప్పుడు ఆరు నెలలయింది. ఇప్పటికిప్పుడు ఇంటికి వెళ్లినా, కరోనా భయం కారణంగా నెలపాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందే.

''మనకు సోకిందా లేదా అన్న విషయంలో భయపడాలి. మనకు సోకకపోయినా, మన ప్రియమైన వాళ్లకు మనం అంటించకుండా జాగ్రత్తపడాలి'' అన్నారు ఆ అధికారి.

క్వారంటైన్‌ సంగతి పక్కనపెడితే... అసలు నౌకలను పోర్టులోకి రానివ్వడం లేదు. ఒకవేళ అనుమతించినా, డ్యూటీ దిగినా, ఇంటికి వెళ్లేందుకు అతనికి విమానాలు, ఇతర రవాణా సౌకర్యాలు ఉండాలి.

ముందుగా అనుకున్న విమానం రద్దయితే అతను తిరిగి తన నౌకలోకి వెళ్లాల్సిందే. కంపెనీ ఏమాత్రం పట్టించుకోదు.

ఒక సంఘటనలో ఒక ఆఫీసరు తన డ్యూటీ దిగేలోగానే అతని వీసాను రద్దు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో అతను తీరంలో ఉన్న తన కుటుంబాన్ని చూడకుండానే సముద్రంలోకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు ఆ అధికారి.

తమ డ్యూటీ దిగేనాటికి చాలామంది ఓడ అధికారులు మూడు నుంచి ఐదు నెలలపాటు షిప్‌ మీద ఉంటారు. అదే మొత్తంలో వాళ్లు ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటారు. కానీ కొందరు జూనియర్‌ సిబ్బంది 9 నెలలపాటు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వారికి అంత విశ్రాంతి దొరకదు.

వివిధ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా కాంట్రాక్టులు ఎప్పుడు ముగుస్తాయో తెలియని పరిస్థితి. తీరంలో విశ్రాంతి తీసుకోవడంపై బ్యాన్ ఉండటంతో పరిస్థితి మరీ ఇబ్బందికరంగా మారిందని ఓ అధికారి అన్నారు.

''మాలో స్థైర్యం సన్నగిల్లుతోంది. బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తెలియని ఆందోళన, విసుగు ఏర్పడుతోంది'' అని అన్నారు ఆ అధికారి. ''ఒకేచోట ఎక్కువగంటలు పని చేయాల్సి రావడం ఇబ్బందికరమే. ప్రతి ఒక్కరిలో చిరాకు అనేది ఉంటుంది. అందరూ ఇంటికి వెళ్లాలనే ఆతృతలో ఉంటారు. దీంతో చిన్నచిన్న పొరపాట్లు చేస్తుంటారు. మేం ఇలాంటి సమస్యల నుంచి బయటపడానికి ఒకరినొకరం సహాయం చేసుకుంటున్నాం'' అని ఆ అధికారి తెలిపారు.

చాలారోజులు ఒకేచోట కలిసి పనిచేయడం వల్ల కొత్తగా అనుబంధాలు ఏర్పడతాయి. అలాగని ఎక్కువకాలం ఇక్కడే ఉండలేమంటారు ఆ అధికారి. తీరంలో ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం దొరకదు. కనీసం మద్యం కూడా అందదు. షిప్‌ ఖాళీగా ఉంటుంది.

''ప్రతిరోజూ ఏదో కలుగులో గడిపినట్లుగా ఉంటుంది'' అంటారాయన. ఆయన నడిపే ఓడ అనేకచోట్ల ఆగుతుంది. అంటే బయటి ప్రపంచాన్నిచూడటానికి చాలా అవకాశాలుంటాయి. కానీ చాలా ఆసియా దేశాల పోర్టులు ప్రతి స్టాప్‌కు మధ్య రెండువారాల గడువుండాలని నిబంధనల పెట్టాయి. ఇలా చేస్తే సిబ్బందిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే తెలిసిపోతుంది. అంటే కొన్ని వారాలపాటు ఆయన షిప్ నుంచి కదిలే పరిస్థితి ఉండదన్నమాట.

సిబ్బందిలో ఎక్కువమంది జూనియర్లు ఉంటే వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక సర్వెంట్ సంవత్సరమంతా షిప్పులో గడపాలి. ఏరోజుకారోజు పొద్దున్నే లేచి సిబ్బందికి వంట చేసి పెట్టాలి.

ఓడ నిర్వహణలో లాక్‌డౌన్‌ వల్ల ఎలాంటి మినహాయింపులు దొరకలేదు. ఎవరి పనులు వాళ్లు చేయాల్సిందే. నేవిగేషన్‌ నుంచి ఫైర్‌సేఫ్టి, లైఫ్‌బోట్ల మెయింటెనెన్స్ వరకు అన్నీ జరిగిపోవాల్సిందే. సిబ్బంది వ్యక్తిగత అవసరాల కోసం ఆ అధికారి కంపెనీ 1,000 డాలర్లు (సుమారు రూ.75 వేల) సొమ్మును ఇచ్చింది. కానీ షిప్‌స్టోర్‌ యాజమాన్యం చార్జిలు పెంచడంతో అవి టూత్‌ పేస్టులు, సబ్బులు, బ్లేళ్లు కొనుక్కోడానికే సరిపోయింది. సొమ్మును పెంచాలన్న అభ్యర్ధనకు యజమాని స్పందించలేదు.

ఎక్కువమంది సిబ్బంది తమ యజమానుల నుంచి సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వాలు చేయగలిగింది ఏమీ లేదని వారి ఉద్దేశం. ''ఎంతోమంది హాలిడే మేకర్స్‌ తిరిగి స్వదేశానికి తిరిగి రావడం నేను చూశాను. కానీ నావికులకు ఇది సాధ్యం కాదు'' అని ఒక కంటెయినర్‌ షిప్‌ ఆఫీసర్‌ చెప్పారు.

చాలామంది మెరైనర్లు తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామన్న భావనలో ఉంటారు. యూకేలో 95శాతం ఎగుమతులు, దిగుమతులు సముద్రాల మీదుగానే నడుస్తుంటాయి. కానీ దీని గురించి ప్రభుత్వాలు పెద్దగా శ్రద్ధ వహించవని అన్నారు ఆ అధికారి.

''దీన్నే సీ బ్లైండ్‌నెస్‌ అంటారు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

మెరైన్‌ సిబ్బందికి ఏర్పాటు చేసిన రక్షణ చర్యలు బాగానే ఉన్నాయి. కొన్ని పోర్టులు ముందుగానే ఈ ఏర్పాట్లు చేశాయి. కానీ ఈ ఎదురు చూపులు ఎన్నాళ్లన్నదే అర్ధం కావడం లేదు.

పోర్టులు తెరిచేదాకా రికార్డెడ్ సినిమాలు, టీవీలు చూడటం, అందీ అందని ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌ పొందే ప్రయత్నం చేస్తున్నారు.

''చాలామంది సిబ్బంది తన క్యాబిన్లలో కూర్చుని ఫోన్లలో చూసిన సినిమాలే మళ్లీ మళ్లీ చూస్తున్నారు. వాళ్లు అంతకన్నా చేయగలిగింది కూడా ఏమీ లేదు'' అన్నారు ఆ ఓ అధికారి.

అదృష్టం ఏంటంటే వారికి జీతాలు అందుతున్నాయి. సముద్ర సర్వే ఓడలో పనిచేసే మాట్ బర్టన్‌ అనే అధికారినే తీసుకుంటే, ఆయన షిప్పులో ఉంటేనే జీతం పొందుతారు. 32 సంవత్సరాలు ఆయన మెరైనర్‌గా పని చేస్తున్నారు. మిగిలిన సిబ్బందికి భిన్నంగా, ఆయన షిప్పు ఎక్కకపోతే జీతం రాదు.

''నిజంగా నేనిక్కడ జీతం కోసమే ఉంటున్నట్లుంది'' అన్నారు బర్టన్‌. ''నేను తరచూ ఓడలో చిక్కుకుపోతుంటాను. ఏడాదికి మూడు నాలుగుసార్లు ఇలా జరుగుతుంటుంది. రెండునెలల్లో చేయాల్సిన పనిని నేను నాలుగు నెలలు చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి నా స్థానంలో రావాల్సిన వ్యక్తి రాడు. ఆ స్థానంలో పని చేయడానికి వారి దగ్గర ఎవరూ ఉండరు'' అని చెప్పుకొచ్చాడు బర్టన్‌.

ఇది చిన్న విషయం కాదు. రెండు నెలల పనికి నాలుగు నెలలు ఉండాల్సి రావడం నిజంగా పెద్ద విషయమేనంటారు ఆయన.

''చాలామంది రిలీఫ్ సిబ్బందికి వీసాలు రద్దు కావడం, ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉద్యోగులు తిరిగి తమ ఇళ్లకు వెళ్లడంతో నేను యూకే షిప్‌లలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేయడానికి అప్లై చేశాను'' అని చెప్పారు బర్టన్‌.

కానీ ప్రస్తుతం అతను చేయడానికేమీ లేదు. ''ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నాను. సరిహద్దులు తెరిచి, అంతా పనిలో పడేదాకా నేను ఎదురు చూడాలి'' అని అన్నారు బర్టన్‌.

ఇక క్రూయిజ్‌ నౌకలది మరో కథ.

అంటార్కిటిక్‌ క్రూయిజ్‌లోని ఒక గైడ్‌ చెప్పినదాని ప్రకారం, కాంట్రాక్టు ముగియడంతో నౌకలోని సిబ్బందికి జీతాల్లో భారీ కోతలు విధించారు.

క్యానరీ ఐలాండ్‌కు చేరే వరకు వారు ఎక్కడికీ వెళ్లడానికి వీలులేని పరిస్థితి. వాళ్లు ముందుగా చేసుకున్న ఒప్పందంకంటే నెల రోజులు ఆలస్యంగా వారు తమ ప్రాంతాలకు చేరుకున్నారు. వారి నౌక తన యాత్ర ముగించుకుని తిరిగి వస్తూ, మార్గమధ్యంలో మరికొన్ని నౌకలకు సంబంధించిన సిబ్బందిని కూడా తమతోపాటు తీసుకొచ్చారు. ఆ నౌకల్లో ఒకదానిలో కరోనా వ్యాధిగ్రస్తులు కూడా ఉన్నారు.

సముద్రంలో చిక్కుకున్న తమతమ నౌకల్లో సిబ్బందికి ఎలా సహాయపడుతున్నారో చెప్పాల్సిందిగా ప్రపంచంలోని ఏడు సుప్రసిద్ధ కంటెయినర్‌, ట్యాంకర్ నౌకల కంపెనీలను బీబీసీ కోరింది.

అయితే కేవలం ఎంఎస్‌సి మెడిటెర్రేనియన్‌ షిప్పింగ్‌ కంపెనీ ఒక్కటే స్పందించింది. పోర్టులు తెరుస్తున్నారని, ఉద్యోగుల మార్పుకు అవకాశం ఏర్పడిందని ఆ సంస్థ చెప్పింది.

''కార్గోనౌకలకు సంబంధించి కొన్ని నౌకాశ్రయాలు ఉద్యోగుల మార్పిడికి కొద్దివారాలుగా అవకాశం కల్పిస్తున్నాయి. సముద్రంపై పని చేసే ఉద్యోగుల సమస్యలు గుర్తించి, వారికోసం చొరవ తీసుకున్నందుకు ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్‌ సంస్థ, మరికొన్ని ప్రభుత్వాలకు కృతజ్జతలు చెప్పాలి'' అన్నది ఆ సంస్థ.

నౌకలు నిరంతరాయంగా నడపడంలో ఉద్యోగుల ప్రొఫెషనలిజం, నిబద్దత, సేవాభావాన్ని ఓరియంట్ ఓవర్సీస్‌ కంటెయినర్‌ లైన్‌ సంస్థ ప్రశంసించింది.

''వారి భద్రత కోసం, మెరుగైన సమాచార వ్యవస్థ నిర్వహణ కోసం మేం త్వరలో మా విధానాల్లో మరిన్ని మార్పులు తీసుకువస్తాం'' అని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు.

ఈ ఆర్టికల్‌ రాయడంలో సహకరించిన ఉద్యోగుల్లో ఎవరూ ఈ రెండు సంస్థల ఉద్యోగులు కాదు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)