కరోనావైరస్: మృతుల సంఖ్యలు చైనాను దాటేసిన భారత్.. దక్షిణ కొరియాలో మళ్లీ పాఠశాలల మూసివేత

కరోనావైరస్ కేసులు హఠాత్తుగా పెరగడంతో దక్షిణకొరియాలో కొన్నిరోజుల క్రితం తెరిచిన 200 స్కూళ్లు మూతపడ్డాయి.

గత 24 గంటల్లో దక్షిణకొరియాలో 56 వరకూ కొత్త కేసులు నమోదయ్యాయి. రెండు నెలల క్రితం నమోదైన 79 కేసుల కంటే ఇది తక్కువే. కానీ జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి బయటపడడంతో అధికారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

కొత్తగా నమోదైన వాటిలో ఎక్కువ కేసులు సియోల్‌కు దగ్గరగా ఉన్న బుచాన్‌లోని ఒక పంపిణీ కేంద్రంలోనే బయటపడ్డాయి.

ఈ గిడ్డంగిని దేశంలోని అతిపెద్ద ఈ కామర్స్ సంస్థ కుపాంగ్ నడుపుతోంది. ఈ గోడౌన్‌లో వైరస్‌ను అదుపు చేసేందుకు కఠిన జాగ్రత్తలను పాటించడం లేదని అధికారులు చెప్పారు.

అందులో పనిచేస్తున్న కార్మికుల బూట్లు, బట్టలపైన కూడా కోవిడ్-19 వైరస్ జాడలు గుర్తించినట్లు వైద్య శాఖ అధికారులు చెప్పారు. ఆ కేంద్రంలో పనిచేస్తున్న వేలాది కార్మికులను ట్రాక్ చేసి గుర్తించిన వైద్య సిబ్బంది, వారికి పరీక్షలు చేయగలిగారు. మరో రెండు వారాలపాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పంపిణీ కేంద్రాల్లో కోవిడ్ పరీక్షలు చేయనున్నారు.

కరోనావైరస్ వ్యాపించవచ్చనే భయంతో బుచాన్‌లో ఇటీవలే తెరిచిన 251 స్కూళ్లను మూసివేశారు. కరోనాకు భయపడి ఇక్కడ కొన్ని వందల స్కూళ్లను ఎప్పటినుంచో మూసివేసే ఉన్నారు.

సియోల్‌లో ఒక విద్యార్థిని కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. అతడి తల్లి కూపాంగ్ గిడ్డంగిలోనే పనిచేస్తున్నారు. కొత్తగా కరోనా కేసులు బయటపడడంతో వైద్య శాఖ అధికారులు మళ్లీ కొన్ని ఆంక్షలు విధించారు. మరో రెండు వారాలు కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు.

సియోల్, చుట్టుపక్కల నగరాల్లో పబ్లిక్ పార్కులు, మ్యూజియంలు మూసివేశారు. వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఒకే చోట ఎక్కువ మంది గుమిగూడవద్దని మరోసారి ప్రజలను కోరారు.

దక్షిణకొరియాలో కరోనావైరస్ కోసం ఇప్పటివరకూ లాక్‌డౌన్ విధించలేదు. దాని బదులు దేశంలో విస్తృత ట్రాకింగ్ టెస్టింగ్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక్కడ సామాజిక దూరం నిబంధనలను చాలావరకూ స్వచ్ఛందంగానే పాటిస్తారు. ఇప్పుడు మరోసారి దీనిని పాటించాలని ప్రజలకు ఎమోషనల్‌గా కోరారు.

అధికారులు తమ సందేశంలో “ఈ జాగ్రత్తలు మన పిల్లలు మళ్లీ బడికి వెళ్లేలా చేస్తాయి. వారి చదువుకు ఎలాంటి అంతరాయం లేకుండా చేస్తాయి. వీటికి కట్టుబడి ఉందాం” అన్నారు. గతంలో ఫలితం ఇచ్చిన ఈ చర్యలు మళ్లీ పనిచేస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

భారత్‌లో 4,706 కోవిడ్ మరణాలు

కరోనావైరస్ పాజిటివ్ కేసులు, మరణాలు భారత్‌లో పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం భారత్‌లో మరణాల సంఖ్య చైనాను దాటేసింది.

గత 24 గంటల్లో దేశంలో 7,466 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకే రోజు నమోదైన కేసుల్లో ఈ సంఖ్య అత్యధికం అని ఆరోగ్య శాఖ చెప్పింది. భారత్‌లో కోవిడ్-19 వల్ల చనిపోయిన వారి సంఖ్య 4,706కు పెరిగింది.తాజా గణాంకాల ప్రకారం భారత్ ఈ మహమ్మారి వల్ల మరణించిన వారి సంఖ్య చైనాను దాటింది. చైనాలో అధికారిక గణాంకాల ప్రకారం కోవిడ్-19 వల్ల 4,638 మంది చనిపోయారు.భారత్‌లో ఇప్పటివరకూ 1,65,799 కరోనా కేసులు నమోదయ్యాయి. కేసుల విషయంలో భారత్ చైనాను గత వారమే దాటేసింది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం భారత్‌లో ఇప్పుడు 89,987 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 71,105 మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారు.మహారాష్ట్రలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇక్కడ మొత్తం 59,546 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఈ మహమ్మారి వల్ల 1982 మంది చనిపోయారు. మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు తమిళనాడు(19,372), దిల్లీ(16,281), గుజరాత్(15,562), రాజస్థాన్(8067)లో నమోదయ్యాయి. కొన్నిరోజుల క్రితం గుజరాత్ మూడోస్థానంలో ఉండగా, ఈ వారం అత్యధిక కేసులు నమోదవడంతో దిల్లీ ఆ స్థానంలోకి చేరుకుంది. రాజధాని పరిధిలో ఒకే రోజు 1024 కొత్త కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకూ ఇదే అత్యధికం అని దిల్లీ ఆరోగ్య శాఖ గురువారం చెప్పింది.దిల్లీలో కోవిడ్-19 వల్ల ఇప్పటివరకూ 316 మంది చనిపోయారు. ఇక్కడ 8470 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

సింగపూర్ ట్రావెల్ బబుల్స్

ఇటు సింగపూర్ అధికారులు కోవిడ్19 అదుపులో ఉన్న దేశాలతో కలిసి ‘ట్రావెల్ బబుల్స్’ లేదా ‘గ్రీన్ లేన్స్’ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు.

“చాలా దేశాలతో దీనిపై చర్చిస్తున్నాం. కొన్ని చాలా అడ్వాన్స్ దశలో ఉంటే మా లాంటి కొన్ని దేశాలు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి” అని సింగపూర్ జాతీయాభివృద్ధి మంత్రి లారెన్స్ వాంగ్ చెప్పారు.

ఇందులో భాగంగా ప్రయాణించే ముందు ప్రయాణికులు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇందులో స్పష్టమైన ప్రొటోకాల్ ఉంటుంది. దాని ప్రకారం ఒక దేశం నుంచి సింగపూర్ వచ్చే లేదా ఇక్కడ నుంచి వేరే దేశాలకు వెళ్లే ఏ ప్రయాణికుడికి అయినా పరీక్షలు చేయడం జరుగుతుంది.. వారు కరోనా నుంచి విముక్తి పొందారు అని తెలిసిన తర్వాతే, అతడి ‘అవసరమైన ప్రయాణం’ తిరిగి ప్రారంభమవుతుంది” అన్నారు.

వారు వీటిని ‘ప్రయాణాలు’, ‘పర్యటకం’ అనడానికి బదులు ‘అవసరమైన ప్రయాణం’ అనే పదం ఉపయోగించారు.

ఒక్క సింగపూర్‌కు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు ప్రజలు మళ్లీ మామూలుగా ప్రయాణించడం కొనసాగాలంటే చాలాకాలం పడుతుంది అని వాంగ్ చెప్పారు.

జపాన్‌లో కొత్త కేసులు నమోదు

జపాన్‌లో అత్యవసర స్థితిని ఎత్తివేసిన తర్వాత దేశంలో మెల్లమెల్లగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

ఫుకువోకాలోని కిటాక్యూషూ నగరంలో వారాంతం నుంచి 22 కొత్త కేసులు నమోదయ్యాయి. అవి మిగతా ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక రెస్పాన్స్ టీంను అక్కడకు పంపింది.

దేశవ్యాప్తంగా విధించిన అత్యవసర స్థితిని ప్రధాని షింజో అబే ఎత్తివేశారు. దీంతో గవర్నర్లు సోమవారం తమ ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేయాల్సి వచ్చింది. కానీ, ఫుకువోకా ప్రాంతీయ అధికారులు మాత్రం మే 14న అక్కడి అత్యవస స్థితిని ఎత్తివేశారు.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)