ఎవరెస్ట్ ఎత్తు ఎంత? చైనా ఎందుకు మళ్లీ లెక్కిస్తోంది? 4 మీటర్ల తేడా ఎందుకు వచ్చింది?

    • రచయిత, నవీన్ సింగ్ ఖడ్కా
    • హోదా, పర్యావరణ ప్రతినిధి, బీబీసీ వరల్డ్ సర్వీస్

ఎవరెస్ట్ శిఖరం ఎత్తును మరోసారి కొలిచేందుకు చైనాకు చెందిన సర్వేయర్ల బృందం ఎవరెస్ట్ అధిరోహిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి తలెత్తిన తర్వాత ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తున్న తొలి బృందం ఇదే.

ప్రస్తుతం ఆ బృందం శిఖరంపై ఉన్నట్టు చైనా సెంట్రల్ టెలివిజన్ ప్రసారం చేస్తున్న దృశ్యాల ద్వారా తెలుస్తోంది.

కోవిడ్-19 నేపథ్యంలో ఈ సీజన్లో చైనా కేవలం తమ దేశస్థులకు మాత్రమే ఎవరెస్ట్ ప్రయాణానికి అనుమతించింది. అటు నేపాల్ అన్ని రకాల పర్వతారోహణ కార్యక్రమాలను రద్దు చేసింది. అంటే ఈ ఏడాది ఎవరెస్ట్‌ను అధిరోహించే వారిలో విదేశీయులు లేనట్టే.

ఎవరెస్ట్ అటు నేపాల్-ఇటు చైనా సరిహద్దుల్లో ఉంది. రెండు వైపుల నుంచి శిఖరాన్ని ఎక్కవచ్చు.

బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత అంటే 2గంటల10 నిమిషాల సమయంలో 8,300 మీటర్ల ఎత్తులో ఉన్న క్యాంప్ నుంచి అధిరోహకుల బృందం తమ ప్రయాణాన్ని ప్రారంభించిందని చైనాకి చెందిన షిన్హువా వార్తా సంస్థ తెలిపింది.

అనేక వాతావరణ అననుకూల పరిస్థితుల మధ్య గత ఏప్రిల్ నెలలో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది ఈ బృందం.

“వాతావరణ పరిస్థితుల్లో అనిశ్చితి, తగినంతగా ఆక్సిజన్ లేని కారణంగా వారి బృందంలోని ఇద్దరు సర్వేయర్లు మధ్యలోనే తిరుగు ముఖం పట్టారని కూడా షిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది.

చైనీయులు మాత్రమే ఎవరెస్ట్ శిఖర ప్రయాణం చెయ్యడం చాలా అరుదైన సందర్భం అని పర్వాతహకుల రికార్డులను ఎప్పటికప్పుడు నమోదు చేసే పరిశీలకులు వ్యాఖ్యానించారు.

“1960లో కేవలం చైనీయులు మాత్రమే ఎవరెస్ట్‌ను చేరుకోగలిగారు. భారతీయులు ప్రయత్నించినప్పటికీ విఫలమయ్యారు” అని హిమాలయ అధిరోహుకుల వివరాలను భద్రపరిచే సంస్థకు చెందిన రిచర్డ్ శాల్సిబరీ అన్నారు.

క్వారంటైన్ తప్పనిసరి కావడం, అలాగే లాక్ డౌన్ కారణంగా టిబెట్‌కు వచ్చే విమాన సర్వీసులన్నీ రద్దు కావడంతో ఈ ఏడాది ఎటువంటి పర్వతారోహణ కార్యక్రమాలను ఏర్పాటు చేయలేకపోయామని పశ్చిమ దేశాలకు చెందిన పర్వాతారోహక నిర్వహాక సంస్థలు తెలిపాయి.

ఎవరెస్ట్ ఎత్తు మళ్లీ కొలుస్తున్నారు

ఈ సారి చైనా పర్వతారోహకులు చేస్తున్న యాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వారు ఎవరెస్ట్ ఎత్తును మరోసారి కొలుస్తున్నారు.

2005లో చైనా చేపట్టిన కొలతల ప్రకారం ఎవరెస్ట్ ఎత్తు దానిపై కప్పబడిన మంచుతో కలిపి 8,844.43 మీటర్లు.

అయితే నేపాల్ మాత్రం ఎవరెస్ట్ ఎత్తు 8,848 మీటర్లనే చెబుతోంది. బ్రిటిష్ కాలంలో సర్వే ఆఫ్ ఇండియా నిర్ణయించిన ఎత్తునే ఆ దేశం ఇప్పటికీ ప్రామాణికంగా తీసుకుంటోంది.

2015లో సంభవించిన భూకంపం హిమాలయాలపై ఏ మేరకు ప్రభావం చూపిందన్న విషయాన్ని ఇంకా పరిశీలించాల్సి ఉంది.

బహుశా శిఖరంపై మంచుతో కప్ప బడి ఉన్న ప్రాంతం కొంత మేర కుంగి ఉండవచ్చని కొందరు భౌగోళిక శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

భూకంపం కారణంగా ఎవరెస్ట్ శిఖరానికి 200 అడుగులు దిగువ భాగాన ఉండే హిల్లరీ స్టెప్ కనుమరుగైపోయిందని కొంత మంది పర్వతారోహకులు చెబుతున్నారు. కానీ నేపాల్ ప్రభుత్వం మాత్రం అటువంటిదేమీ లేదని చెబుతోంది.

2017లోనే నేపాల్ ప్రయత్నాలు

నేపాల్ ప్రభుత్వం 2107లో అంతర్జాతీయ సంస్థల సాయంతో ఎవరెస్ట్ శిఖరం ఎత్తును గణించే ప్రయత్నాలను మొదలుపెట్టింది.

సంప్రదాయ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దాదాపు సమాచారం మొత్తాన్ని సేకరించింది.

“ఇక చివరిగా చేయాల్సిన పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి” అని నేపాల్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సర్వే విభాగానికి చెందిన అధికార ప్రతినిధి దామోదర్ ధకల్ బీబీసికి చెప్పారు.

“ఓ అంతర్జాతీయ వర్క్ షాపును ఏర్పాటు చేసి అందులో ఆ వివరాలను ప్రజలకు వెల్లడించాలన్నది మా ఆలోచన. కానీ కోవిడ్-19 వల్ల విధించిన లాక్ డౌన్ కారణంగా ఆ ప్రక్రియ ఆలస్యమవుతోంది” అని ఆయన తెలిపారు.

గత ఏడాది అక్టోబర్లో చైనా అధ్యక్షుడు నేపాల్ పర్యటించిన సందర్భంలో తమ రెండు దేశాలు కలిసి ఆ వివరాలను వెల్లడిస్తామని ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.

ఒక వేళ వేర్వేరుగా ఫలితాలొచ్చిన పక్షంలో రెండు దేశాలు కలిసి ఒక ఒప్పందానికి ఎలా వస్తాయన్న విషయంలో ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు.

చైనా ఇప్పటి వరకు రెండు సార్లు అంటే 1975, 2005లో ఎవరెస్ట్ ఎత్తును కొలిచింది.

1975లో ఎవరెస్ట్ అధిరోహించిన బృందంలో ఓ మహిళ కూడా ఉన్నారు. చైనా తరపున ఆ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళగా ఆమె రికార్డులకెక్కారు.

హిమాలయన్ డేటాబేస్ అందించిన వివరాల ప్రకారం 2005లో శిఖర ప్రయాణం చేసిన చైనా సర్వేయర్ల బృందం శిఖరంపై జీపీఎస్‌ను ఏర్పాటు చేసింది.

అయితే ఈ సారి చైనా సర్వేయర్ల బృందం అమెరికాకు చెందిన జీపీఎస్‌కు బదులు తన సొంత నేవిగేషన్ వ్యవస్థ బైదుని వినియోగిస్తోంది. ఈ వ్యవస్థను ఉపయోగించడం ద్వారా శిఖరంపై ఎంత లోతులో మంచు ఉంది? అక్కడ వాతావరణ పరిస్థితులు, వాయు వేగం తదితర వివరాలను కూడా గణించడం వల్ల శిఖరాన్ని కాపాడుకునేందుకు అవి సాయపడతాయని షిన్హూవా వార్తా సంస్థ తెలిపింది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)