You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చంద్రపూర్ టు ఎవరెస్ట్ వయా భువనగిరి కోట
మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన ఐదుగురు టీనేజర్లు మే నెలలో ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి వచ్చారు. వారి పది నెలల ప్రస్థానంపై జైదీప్ హార్దికర్ కథనం..
''మేం నిజంగా ఎవరెస్టును అధిరోహించామని నమ్మడానికి అప్పుడప్పుడూ నన్ను నేనే గిల్లుకుంటాను.'''
ఇవి మే 16న ఎవరెస్టు శిఖరంపై భారతదేశం జెండాను ఎగరేసిన 18 ఏళ్ల మనీషా ధ్రువె మాటలు.
''ఎవరెస్టును అధిరోహించినప్పుడు నా కళ్లెదుట నా తల్లిదండ్రులు, తోబుట్టువులు, మా గ్రామం, మా అడవులు, మా పాఠశాల, ఉపాధ్యాయులు, స్నేహితులు, నేను తీసుకున్న శిక్షణ అన్నీ ఒక్క క్షణం నా కళ్లెదుట కదలాడాయి'' అన్నారామె.
మహారాష్ట్రలో వెనుకబడిన చంద్రపూర్ జిల్లా నుంచి ఎవరెస్టును అధిరోహించిన ఐదుగురు సభ్యుల బృందంలో ఆమె ఒకరు.
నిజానికి ఎవరెస్టును పది మంది అధిరోహించాల్సి ఉన్నా వారిలో ఐదుగురు - మనీషా, ఉమాకాంత్, పరమాశ్ ఆలె, వికాస్ సోయం, కవిదాస్ కట్మోడెలు మాత్రం పర్వతారోహణలో విజయవంతమయ్యారు.
దాదాపు 8,848 మీటర్లు (29,029 అడుగులు) ఎత్తున్న ఎవరెస్టును అధిరోహించే ప్రయత్నంలో ఇప్పటివరకు సుమారు 200 మంది మరణించారు.
దాన్ని అధిరోహించే శిక్షణను పూర్తి చేయడానికే కొన్ని నెలల సమయం పడుతుంది. వీళ్లు ఐదుగురికీ అవినాశ్ దియోస్కర్ శిక్షణ ఇచ్చారు.
వీళ్లందరికీ 13 ఏళ్ల వయసులోనే ఎవరెస్టును అధిరోహించిన తెలంగాణకు చెందిన మాలావత్ పూర్ణ ప్రేరణ.
ఈ ఐదుగురిలో 19 ఏళ్ల వికాస్ 21,000 అడుగులను రెండుసార్లు అధిరోహించారు.
బేస్ క్యాంప్ నుంచి బయలుదేరాక తన స్నేహితుడు జబ్బు పడడంతో వికాస్ అతణ్ని తిరిగి కింద వదిలి రావాల్సి వచ్చింది. అయినా పట్టువదలకుండా రెండోసారి మళ్లీ అంత ఎత్తునూ అధిరోహించారు.
ఇతర పర్వతారోహకుల్లాగే వీళ్లు కూడా నేపాల్ వైపు నుంచి ఎవరెస్టును అధిరోహించారు. ఈ సీజన్‌లో మొత్తం 300 మందికి ఎవరెస్టును అధిరోహించడానికి అనుమతి లభించింది. వారిలో వీళ్లు ఐదుగురూ ఉన్నారు.
నిజానికి ఎవరెస్టును అధిరోహించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే అదృష్టవశాత్తూ జిల్లా సీనియర్ అధికారి అశుతోష్ సలీల్ ఈ గిరిజన టీనేజర్లు ఎవరెస్టు అధిరోహించడానికి ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు. దీంతో ప్రభుత్వం వారికి అవసరమైన 4 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
మొదట చంద్రపూర్ జిల్లా నుంచి 47 మంది విద్యార్థులను ఎంపిక చేయగా, కేవలం 10 మంది మాత్రమే 10 నెలల కఠిన శిక్షణను పూర్తి చేయగలిగారు.
ఈ పది మందీ మొదట తెలంగాణలోని భువనగిరి కోటలో పర్వతారోహణ శిక్షణ పొందారు. ఆ తర్వాత డార్జిలింగ్‌లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పూర్తి చేసుకున్నారు.
''నేను బాల్యంలో మేకలను కాస్తూ ఎన్నో కొండలను ఎక్కేవాణ్ని. అందువల్ల, ఆ శిక్షణ నాకు పెద్దగా కష్టం అనిపించలేదు'' అన్నారు కవిదాస్.
కొద్ది సేపట్లో ఎవరెస్టు శిఖరాగ్రం చేరతారనగా.. ఒక మృతదేహం మనీషా కంటపడింది. దాన్ని తల్చుకుంటే ఇప్పటికీ తన ఒళ్లు జలదరిస్తుందని ఆమె తెలిపారు.
అయితే దానిపై దృష్టి పెట్టకుండా పైకి వెళుతూనే ఉండమని ఆమె షెర్పా ఆజ్ఞాపించాడు.
శిక్షణ పొందిన పది మందిలో కేవలం ఐదుగురు మాత్రమే ఎవరెస్టును అధిరోహించగలిగారు. నలుగురు మార్గమధ్యంలోనే జబ్బుపడి విరమించుకోగా, మరో పర్వతారోహకురాలు ఇందు తన తోటి పర్వతారోహకుడు జబ్బు పడడంతో తన షెర్పాతో సహా కిందికి దిగిపోవాల్సి వచ్చింది.
పర్వతాన్ని అధిరోహించలేకపోయినా ఇందుతో పాటు మిగతా నలుగురికీ మహారాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలను, అధిరోహించిన వారికి 25 లక్షల రూపాయలను బహుకరించింది.
కవిదాస్, పరమేశ్‌లు ఆ డబ్బుతో తమ ఇళ్లను బాగు చేయించుకుని, పొలాల్లో బావులను తవ్వించుకోవాలని భావిస్తున్నారు. ఉమాకాంత్ తన గ్రామంలో పిల్లలు ఆడుకోవడానికి ఒక గ్రౌండ్‌ను ఏర్పాటు చేయాలని, మనీషా వాటిని తన పై చదువులకు ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.
భవిష్యత్తులో సాధ్యమైతే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాలనేది వారి ఆశయం.
ఇవికూడా చదవండి
- శ్రీలంకలో దొరికిన ఈ అస్థిపంజరాలు ఎవరివి?
- ‘హెరాయిన్ ప్యాకెట్లను ఎప్పుడు, ఎక్కడ పడేలా విసరాలో వారికి బాగా తెలుసు’
- చింపాంజీల నుంచి నేతలు నేర్చుకోవాల్సిన 5 విషయాలు
- నేపాల్: ఈసారి ఎవరెస్టు అధిరోహకుల్లో మహిళలే ఎక్కువ!
- ఈయన 22వ సారి ఎవరెస్ట్ ఎక్కబోతున్నారు!
- లోయలో పడిపోయి ఆరు రోజులు తిండీ, నీళ్లు లేకుండా బతికింది..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)