కరోనావైరస్: ఇటలీలో పెరుగుతున్న భయాలు... దక్షిణ ప్రాంతాలపై కోవిడ్-19 విరుచుకుపడితే పరిస్థితి ఏంటి...

ఇటలీలో కరోనావైరస్ విజృంభించిన ఉత్తర ప్రాంతంలో కొత్త ఇన్ఫెక్షన్లు, మరణాల సంఖ్య ఒక్కసారిగా తగ్గింది. కానీ, ఇప్పుడు దేశ దక్షిణ ప్రాంతాల్లో వైరస్ చెలరేగొచ్చన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.

ఉత్తర ప్రాంతమైన లాంబార్డీ ఆ దేశంలో కరోనావైరస్‌కు కేంద్రంగా ఉంది. ఇప్పుడు అక్కడ నమోదవుతున్న గణాంకాలు కాస్త ఊరటనిస్తున్నాయి.

కానీ, దక్షిణ ప్రాంతాల్లో మరణాల సంఖ్య పెరుగుతోంది. వైద్య వసతుల కొరత రావొచ్చని ఇక్కడి వాళ్లు భయపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో పేదరికం ఎక్కువ.

ఇటలీలో 74వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 7,500కు పైగా మంది మరణించారు.

బుధవారం దేశంలో కొత్త ఇన్ఫెక్షన్లు 7.5 శాతం పెరిగాయి. ఇక్కడ కరోనావైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి పెరుగుదల రేటు ఇంత తక్కువగా నమోదవ్వడం ఇదే తొలిసారి.

యూరప్‌లోని దేశాల్లోకెల్లా ఇటలీపై కరోనావైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. రెండు వారాలుగా ఈ దేశం లాక్‌డౌన్‌లో ఉంది. జనం ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం సూచించింది.

ప్రస్తుత గణాంకాలు ‘ప్రోత్సాహకరంగా’ ఉన్నాయని, కానీ దుర్దశ ఇప్పుడే ముగిసిందనుకోవడం తొందరపాటు అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) యూరప్ రీజనల్ డైరెక్టర్ హన్స్ క్లూగ్ అన్నారు.

దక్షిణ ప్రాంతంలో ఏం జరుగుతోంది?

వ్యాధి వ్యాప్తి, మరణాలు తక్కువగానే ఉన్నాయి.

కానీ, నాప్లెస్ నగరం ఉన్న కాంపానియా, రోమ్ నగరం ఉన్న లాజియో ప్రాంతాల్లోని పరిస్థితులు భయపెడుతున్నాయి. ఉత్తర ప్రాంతంతో పోలిస్తే ఇక్కడ వైద్య వసతులు చాలా తక్కువ. ఇప్పటివరకూ కాంపానియాలో 74 మంది, లాజియోలో 95 మంది చనిపోయారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వెంటిలేటర్లను, ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన ఇతర సామగ్రిని అందించలేదని ఫిర్యాదు చేస్తూ కాంపానియా ప్రాంత అధ్యక్షుడు విన్సెంజో డీ లుకా ప్రధాని గియుసెప్పే కోంటెకు బహిరంగ లేఖ రాశారు.

‘‘లాంబార్డీ విషాదం ఇప్పుడు దక్షిణాది విషాదంగా మారే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇన్ఫెక్షన్లు భారీగా విజృంభించే దశలో మనం ఉన్నాం. దాన్ని మనం తట్టుకోలేకపోవచ్చు’’ అని ఆయన అన్నారు.

గురువారం కోంటె ఇటలీ సెనేట్‌లో ప్రసంగింంచారు. కరోనావైరస్ అత్యవసర పరిస్థితి తర్వాత యూరప్ పెద్ద ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవాల్సి రావొచ్చని, దాన్ని ఎదుర్కొనేందుకు అసాధారణ, భారీ చర్యలు అవసరమని వ్యాఖ్యానించారు.

ఈ చర్యలతో ఇటలీ ఈ తరంలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కోంటె సుమారు రూ.2లక్షల కోట్ల విలువైన రెండో ఉద్దీపన ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు.

యూరప్‌లోని మిగతా దేశాల్లో...

యూరప్‌లో ఇటలీ తర్వాత కరోనావైరస్ ప్రభావం అత్యధికంగా ఉన్న స్పెయిన్‌లో ఈ వారంలో తొలిసారి మరణాల సంఖ్య తగ్గినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో కరోనావైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య 4,089కు చేరుకుందని, ఇందులో గడిచిన 24 గంటల్లో మరణించినవారు 655 మంది అని గురువారం తెలిపింది.

బుధవారం నాటికి ఆ దేశం కరోనావైరస్ మరణాల సంఖ్యలో చైనాను దాటేసింది. మరోవైపు రోజువారీ కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్య గురువారం అత్యధికంగా 8,500 మార్కును దాటింది. దేశవ్యాప్తంగా మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 56 వేలను దాటింది.

వృద్ధులుండే నర్సింగ్ హోమ్‌లపై కరోనావైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇలాంటి నర్సింగ్ హోమ్‌ల్లో 397కిపైగా మరణాలు నమోదయ్యాయని క్యాడెన్ సెర్ రేడియో నెట్‌వర్క్ తెలిపింది.

దేశంలో ప్రజల కదలికలపై విధించిన ఆంక్షలను ఏప్రిల్ 12 వరకు కొనసాగిస్తూ స్పెయిన్ పార్లమెంటు గురువారం ఉదయం నిర్ణయం తీసుకుంది.

వైరస్‌ను ఎదుర్కొనేందుకు తమ ముందున్న ఏకైక మార్గం సామాజిక దూరం పాటించడమేనని స్పెయిన్ ప్రధాని పెట్రో సాంచెజ్ అన్నారు.

మరోవైపు రష్యా శుక్రవారం నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేస్తామని ప్రకటించింది. శనివారం నుంచి మాస్కోలో ఔషధ, నిత్యావసరాల దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటాయని తెలిపింది.

ఫ్రాన్స్‌లో కరోనావైరస్ మరణాల సంఖ్య 1300 దాటింది. దేశంలో విధించిన 15 రోజుల లాక్‌డౌన్‌ను ఇంకా పొడిగించవచ్చని ప్రభుత్వ ప్రతినిధి వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)